భారత ఉపఖండంలో పుట్టి ప్రపంచ మానవాళి కంతటికీ దుఃఖనివారణోషధి నందించిన మొట్ట మొదటి తాత్వికుడు బోధిసత్వుడు. ఆయనను గురువుగా భావించి తన జీవితాన్ని అణగారిన జాతుల అభ్యున్నతికి అంకితం చేసిన వారు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. మన దేశంలో చాలామంది రాజకీయ నాయకులు అంబేడ్కర్ పేరును తమతమ రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగించుకుంటున్నారు కానీ చిత్తశుద్ధితో ఆయన ఆశయాలను నెరవేర్చడం లేదు. ఇటువంటి సమయంలో ఐక్యరాజ్యసమితి మాత్రం ఆయన జన్మదినాన్ని ‘విశ్వశ్రేయస్సు’ దినంగా ప్రపంచమంతా జరుపుకోవాలని పిలుపు నివ్వడం మనందరికీ గర్వకారణం.
వందలాది దేశాల రాజ్యాంగాలు క్షుణ్ణంగా చదివి జీర్ణించుకొని, దేశ దేశాల చరిత్రలను అవగాహన చేసుకొని, భారతీయాత్మను ఆవహింప జేసుకొని అద్భుతమైన రాజ్యాంగాన్ని రాశారు అంబేడ్కర్. ఈ రాజ్యాంగం భిన్న మతాలూ, భాషలూ, సంస్కృతులూ కలిగిన భారతదేశాన్ని ఐక్యం చేసింది. నోరులేని వారు కూడా స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించడానికి భావప్రకటనా స్వేచ్ఛ నిచ్చింది. ప్రతి మనిషీ తనకు ఇష్టమున్న రీతిలో జీవించడానికి మతస్వేచ్ఛ నిచ్చింది. వివిధ మత విశ్వాసాలను గౌరవిస్తూనే లౌకికత్వాన్ని అనుసరించాలని నిర్దేశించింది. నిరక్షరాస్యులై విద్యా గంధానికి దూరంగా ఉన్న భారతీయులందరికీ విద్యాహక్కునిచ్చింది. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సత్సంబంధాలు ఉండేలా సమాఖ్య రాజ్యంగా భారత్‌ను ప్రకటించింది. ప్రతి రాష్ట్రం కేంద్ర సార్వభౌమత్వాన్ని అంగీకరిస్తూనే... తమతమ రాష్ట్రాలను తమదైన పద్ధతిలో అభివృద్ధి చేసుకునే స్వేచ్ఛ దీని వల్ల లభించింది.
యుగాలుగా అణచివేతకు గురైన భారతీయ మహిళకు అన్ని విధాలా అభివృద్ధి చెందే హక్కులు ప్రసాదించింది రాజ్యాంగం. వర్ణవ్యవస్థ వల్ల దేశ ప్రజల్లో ఏర్పడిన సామాజిక, ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి స్టేట్ సోషలిజం కావాలని చెప్పింది. ప్రభుత్వరంగం బలోపేతం కావాలని పేర్కొంది. అసమానతలను, అంతరాలను తగ్గించడానికి బలహీన కులాల వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను పొందుపరిచింది. ప్రభుత్వరంగ ప్రాజెక్టులను, కర్మాగారాలను, విశ్వ విద్యాలయాలను ప్రోత్సహించింది. ఎలా చూసినా భారత రాజ్యాంగం సమగ్రమైనది. అవసరమైన సవరణలు చేయడానికి వీలుకలిగింది కూడా. ఇటు వంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం సరికాదు. (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!)
కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని సరిగ్గా అమలు చేసి ఉంటే దేశంలో ఇప్పుడున్న చాలా సమస్యలు పరిష్కారమయ్యుండేవి. సామాజిక, ఆర్థిక అంతరాలు, కుల మత భావనలు ఈ స్థాయిలో ఉండేవి కావు. ఫెడరల్ స్ఫూర్తి, లౌకిక భావన, స్టేట్ సోషలిజం భావనలు పేరుకు మాత్రమే మిగిలిపోయేవి కాదు. (క్లిక్: లెక్కల్లో లేదు వాస్తవంలో ఉంది)
- డాక్టర్ కాలువ మల్లయ్య
వ్యాసకర్త సాహితీవేత్త
Comments
Please login to add a commentAdd a comment