Kodepaka Kumara Swamy
-
బీసీల గణనతోనే.. బీసీ కోటా సాధ్యం!
స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలును రాజ్యాంగంలోని లోపాలను చూపిస్తూ కోర్టులు అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కానప్పుడు, 42 శాతం అమలు సాధ్యం కాదనే విషయం వారికి తెలియక కాదు. ఓట్ల కోసం ఆ విధంగా వాగ్దానం చేశారు.కేంద్ర ప్రభుత్వం 1993/ 94లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కనీస భాగస్వామ్యం కల్పించాలనే ముఖ్యోద్దేశంతో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243ని చేర్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వారి జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు ఒకటిలో మూడో వంతును, వెనుకబడిన పౌరులకు (బీసీలకు) మాత్రం నిర్దిష్టమైన కోటాను నిర్ధారించకుండా వీటిని ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో బీసీ కోటా అమలు ట్రిపుల్ ట్రస్ట్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించింది.అందులో (1) బీసీ కోటా అమలుకు ప్రత్యేకంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. (2) అట్టి బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీయాలి. (3) మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, అందులో ఎస్సీ, ఎస్టీ వారికి జనాభా దామాషా పద్ధతిలో పోగా మిగిలిన కోటాను బీసీలకు అమలు చెయ్యాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2022లో మరో సంచలనా త్మకమైన తీర్పును వెలువరిస్తూ సురేష్ మహజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్ని కలను ప్రతి ఐదు సంవత్సరాలకు తూచా తప్పకుండా నిర్వహించాలనీ, బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజ ర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనీ ఆదేశించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1994 నుండి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2010లో స్థానిక సంస్థల బీసీ కోటాపై తీర్పు వెలువరించిన తర్వాత మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో భాగంగా బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించాలని 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వన్ని ఆదేశించింది. ఆ తీర్పుపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తీసు కొని యధావిధిగా బీసీ రిజర్వేష న్లను 34 శాతం అమలు చేసింది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ లెక్కలు లేకుండా ఎన్నిక లకు వెళ్ళినట్లయితే 24 శాతం రిజర్వేషన్లు కూడా దక్కే అవ కాశం లేదు. ఎవరైనా ఎన్నికల ప్రకటనను సవాల్ చేసినట్ల యితే, బీసీ గణాంకాలు శాస్త్రీయబద్ధంగా లెక్కించనందున బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా సాధారణ పరిపా లన శాఖ సమన్వయంతో కులగణన చేసి, ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలి.– కోడెపాక కుమార స్వామి, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, మొబైల్: 94909 59625 -
ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?
ఓబీసీ కులాల వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2017 అక్టోబర్ 2న జస్టిస్ రోహిణి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల జాతీయ కమీషన్ను ఆర్టికల్ 340 ప్రకారం ఏర్పాటు చేసింది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఓబీసీ) కోటాలో విద్యా, ఉద్యో గాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2640 కులాలను వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి ఈ కమిషన్కు మొదట 12 వారాల గడువు ఇచ్చింది ప్రభుత్వం. ఆ గడువును ఇప్పటికి 13 సార్లు పొడిగించి చివరగా నివేదిక సమర్పించడానికి 2023 జనవరి 31 చివరి తేదీగా నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాలు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. అందువల్ల రాజకీయంగా నష్టపోతామనే భయంతో బీజేపీ ప్రభుత్వం ఓబీసీలను వర్గీకరించే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజ ర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలను పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఏ ఓబీసీ కులం అయితే జనసంఖ్య అధికంగా కలిగి సామాజికంగా, విద్యా పరంగా, ఆర్థికంగా బలంగా ఉంటుందో ఆకులం వారు.. వారి జనాభాకు మించి రిజర్వేషన్లు అనుభవించడం జరుగుతోంది. గత సంవత్సరం మార్చిలో కొన్ని పత్రికలకు లీకులు వదిలారు. వీటి ప్రకారం... ఓబీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏమేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జన సంఖ్యను పరిగణలోకి తీసుకొని జస్టిస్ రోహిణి కమీషన్ ఓబీసీలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించింది. గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్– బీలో 534 కులాలకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటా యించిది. అయితే ఈ లీకుల్లో నిజమెంతో తెలియదు. 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే, ఓబీసీలో బాగా వెనుకబడిన కొన్ని కులాలకైనా న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్ నివేదికపై తీర్పులో సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. బీసీ రిజర్వేషన్లను వర్గీకరించకుండా అమలు చేయడం వలన వీరిలో ఐక్యత లోపించింది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థలైన పంచాయతీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 1994 నుండి బీసీలకు ఉమ్మడిగా అమలుపరుస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించారు. అయినప్పటికీ బీసీ కులాలు ఉద్యమాలు చేయడం లేదు. ఇందుకు ప్రధాన కారణం 110కి పైగా బీసీ కులాలు రాజకీయ రిజర్వేషన్లు పొందలేదు, వారికి చెందని రిజర్వేషన్ల కోసం వారు ఎందుకు కొట్లాడుతారు? ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ఓబీసీల వర్గీకరణపై నియమించిన జస్టిస్ రోహిణి కమిషన్ నివేదిక సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఓబీసీల వర్గీకరణ వల్ల అత్యంత వెనుకబాటుకు గురైన కులాలవారూ ప్రయోజనం పొందడానికి మార్గం సుగమం అవుతుంది. (క్లిక్ చేయండి: విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?) - కోడెపాక కుమార స్వామి సామాజిక విశ్లేషకులు -
విచారణ ఖైదీల వెతలు తీరేదెన్నడు?
దేశంలోని 1350 జైళ్లలో ప్రస్తుతం సుమారు 6 లక్షల 10 వేల మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది నిందితులు విచారణ ఖైదీలుగా జైళ్లలో మగ్గుతున్నారు. వీరి స్వేచ్ఛగా జీవించే రాజ్యాంగ హక్కును దృష్టిలో పెట్టుకొని ఇటీవల సుప్రీంకోర్టు ‘సతేందర్ కుమార్ అంతిల్ వర్సెస్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ (సీబీఐ) కేసు తీర్పులో పలు ఆదేశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసింది. నిందితులకు, విచారణలో ఉన్న ఖైదీలకు బెయిల్ జారీ చేసే విధానాన్ని సరళతరం చేసే ప్రత్యేక చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఆదేశించింది. అలాగే పోలీసు అధికారులు ఏదైనా నేరం జరిగినప్పుడు నిందితులను గుర్తించి వారిని అరెస్టు చేసే క్రమంలో సీఆర్పీసీలో తెల్పిన సెక్షన్ 41, 41ఏలోని నిబంధనలను తు.చ. తప్పకుండా పాటిస్తూ, గతంలో సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ కేసు తీర్పులో తెల్పిన నిబంధనలను పాటించాలని పేర్కొంది. జైలు జీవితం గడుపుతున్న విచారణ ఖైదీలు, వారు చేసిన నేరా నికి విధించే శిక్షా సమయంలో 50 శాతం పూర్తి చేసిన వారిని దేశవ్యాప్తంగా ఉన్న మేజిస్ట్రేట్ కోర్టులు, హైకోర్టులు వారి బెయిల్ దరఖాస్తులను పరిశీలించి ఇతర న్యాయపరమైన నిబంధనలను పరిగణలోకి తీసుకొని తగు ఆదేశాల ద్వారా వారికి రెండు వారాల్లో బెయిల్ మంజూరు చెయ్యాలని ఆదేశించింది. అదేవిధంగా యాంటిసిపేటరీ బెయిళ్లకు సంబంధించిన నిందితుల దరఖాస్తులను కూడా పరిశీలించి ఆరు వారాల్లో తగు ఆదేశాలను జారీ చేయాలని సూచించింది. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పోలీసు వ్యవస్థలోనే జరుగుతున్నవని గుర్తించి, అనేక సందర్భాల్లో ప్రతిష్ఠాత్మకమైన తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. 2015లో ‘డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్’ కేసు తీర్పులో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన నేరాలు పోలీస్ స్టేషన్లలోనే జరుగుతున్నట్లు గుర్తించి, దేశంలోని అన్ని పోలీస్ ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అంతకుముందు 2014లో ‘అర్నేశ్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్’ కేసు తీర్పులో... ఏడు సంవత్సరాల వరకు శిక్షపడే అన్ని నేరాలకు సంబంధించిన నిందితులను ఉన్నట్లుండి అరెస్టు చేసి జైలుకు పంపకూడదని ఆదేశించింది. ఒకవేళ అలాంటి కేసుల్లో నిందితులను అరెస్టు చేయాలంటే అందుకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలని ఆదే శించింది. సంబంధిత పోలీస్ అధికారులు సదరు కోర్టుతీర్పు నిబంధనలను అతిక్రమించినట్లయితే కోర్టుధిక్కార నేరం కింద వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలని హైకోర్టులను ఆదే శించింది. కోర్టుల్లో కేసుల విచారణకు ఎక్కువ కాలం పట్టడం వల్ల నేరం చేసినవారూ, అమాయకులూ కూడా అన్యాయానికి గురవుతున్నారు. అందుకు కారణం ప్రభుత్వాలు దేశ జనాభాకు తగ్గట్లుగా కోర్టులు ఏర్పాటు చేయకపోవడం, న్యాయమూర్తులను నియమించకపోవడం. అలాగే పోలీసు వ్యవస్థ, కేసుల నమోదు ప్రక్రియ, కోర్టుల్లో విచారణ వంటివాటిపై ప్రాథమిక అవగాహన కల్పించే పాఠ్యాంశాలు విద్యలో భాగం కాకపోవడమూ మరోకారణం. అందుకే ప్రభుత్వాలు తక్షణం ఈ దిశలో చర్యలు తీసుకుని పౌరుల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడాలి. (క్లిక్: ‘నడమంత్రపు’ ఎన్నికలకు సన్నాహాలా!) - కోడెపాక కుమారస్వామి సామాజిక కార్యకర్త -
కులరహిత సమాజం కోసం...
ఎడ్మండ్ బర్క్ అనే ఐరిష్ తత్వవేత్త ‘నిజమైన మతమే సమాజానికీ, మానవీయ ప్రభుత్వానికీ పునాది’ అని పేర్కొన్నాడు. ఉదాహరణకు చైనాలో కమ్యూనిజం విజయం సాధించడానికి బుద్ధిజం కారణమని చెప్పవచ్చు. హిందూ దేశంగా ప్రసిద్ధిగాంచిన భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినప్పటికీ కుల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలా సామాజిక సంబంధాల్లో మార్పు లేకుండా ఉండటానికి హిందూ ఆధ్యాత్మిక వ్యవస్థే కారణం. ఎందుకంటే కులాలు జన్మించినవే హిందూ మతానికి చెందిన శాస్త్రాల నుండి కనుక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పౌరులకు రాజ్యాంగబద్ధంగా సమస్త హక్కులను కల్పించి కుల నిర్మూలన, సమ సమాజ స్థాపనే రాజ్యాంగం లక్ష్యంగా నిర్ధారించారు. ఆర్థిక, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో సంస్కరణలు చేయడం వల్ల మాత్రమే సమాజంలో మార్పు తేలేం. మతంతో సంబంధం లేని సామాజిక సంస్కరణలు తేవడం వలన సమాజంలో కొంత మార్పును మాత్రమే తేగలం. అదే మతంతో ముడిపడి ఉన్న సంస్కరణలైతే అత్యధిక మార్పులు తేవచ్చు. అయితే ఇందుకోసం మత సంస్కరణ జరగాలి. మత సంస్కరణలు చెయ్యలేని సందర్భంలో మతంతో ముడిపడి ఉన్న సమస్యలను రాజ్యాంగ సవరణల ద్వారా అధిగమించవచ్చు. ఫలితంగా సామాజిక దొంతర మారే అవకాశం లభిస్తుంది. రాజ్యాంగ సవరణలు ద్వారా అమెరికా, దక్షిణ ఆఫ్రికా దేశాల్లో మన కుల వ్యవస్థను పోలిన జాతి వివక్షను నిషేధించడాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసు కోవాలి. దక్షిణాఫ్రికాలో 1948లో అక్కడి నేషనల్ పార్టీ వారు తెలుపు–నలుపు ప్రజల మధ్య జాతి వివక్షను చట్టబద్ధమైనదిగా మార్చారు. అయితే ఆ సమయంలో ప్రభుత్వం అమలు చేసిన విధానానికి మద్దతు పలు కుతూ కొంతమంది క్రైస్తవులు బైబిల్ను దుర్వినియో గించారు. దేవుడు అందరినీ సమానంగా సృష్టించాడు అని బైబిలు చెప్పినప్పటికీ కొందరు శ్వేత జాతి మత పెద్దలు వారి ఆధిపత్యాన్ని కొనసాగించడానికి ఇలా చేశారు. అయితే అక్కడి ప్రభుత్వం మత సంస్కరణలు చేయలేని పరిస్థితుల్లో 1994లో రాజ్యాంగ సవరణల ద్వారా సమాజంలో వర్ణవివక్ష లేని సమాజాన్ని స్థాపించింది. అమెరికాలో కూడా 1865లో 13వ రాజ్యాంగ సవరణ ద్వారా జాతి ఆధారిత బానిసత్వాన్ని తొల గించి అందరూ సమానులే అని నిర్ధారించి తద నంతరం అనేక సవరణల ద్వారా సమ సమాజాన్ని స్థాపించారు. (క్లిక్: సామాన్య శూద్రుడికి సెయింట్హుడ్) దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లవుతున్నా, పరువు హత్యల పేరున కులాంతర వివాహం చేసుకున్న దంపతులను హత్య చేస్తున్నారు. ఇలాంటి హత్యలు దేశంలో మానవ జాతికే కళంకం తెస్తున్నాయి. ఇలాంటి తరుణంలో... మన దేశంలో హిందూ మతంలో సంస్కరణలు, హిందూ మత గ్రంథాల సవరణలు సాధ్యమయ్యేపని కాదు. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యంగ పీఠిక, అధికరణల మేరకూ; సుప్రీంకోర్టు 2011లో కె.కె. భాస్కరన్ వర్సెస్ స్టేట్ అఫ్ తమిళనాడు, నందిని సుందర్ వర్సెస్ స్టేట్ అఫ్ ఛత్తీస్గఢ్ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ప్రకారం... దేశంలో పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కల్పించాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి. తద్వారా రాజ్యాంగంలో ‘ఆర్టికల్ 17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. అది సాధ్యం కానిపక్షంలో ‘కులాంతర వివాహాల పరిరక్షణ’ చట్టాన్ని ఏర్పాటు చేసి పక డ్బందీగా అమలు చెయ్యాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి విద్యార్థులకు దేశాన్ని పీడిస్తున్న కుల సమస్యను నిర్మూలించడానికి తగు విధానాలను నేర్పించాలి. లేనట్లయితే రాజ్యాంగ లక్ష్యమైన కులరహిత సమాజాన్ని స్థాపించడం అసాధ్యం. (క్లిక్: మతాలు కాదు... మనిషే ప్రధానం) - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
పరువు హత్యలు మానవతకు అవమానం!
దేశంలో రాజ్యాంగం అమలు లోకి వచ్చి 71 వసంతాలు గడిచిపోయాయి. భారత రాజ్యాంగం పౌరులందరికీ కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానత్వం, సమ న్యాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ వివక్ష లేని సౌభ్రాతృత్వాన్ని ప్రసాదించింది. అందులో భాగంగా ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛతో స్వతంత్రంగా జీవించే హక్కును కల్పించింది, ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధించింది. దేశం కుల రహిత సమాజంగా రూపాంతరం చెంది పౌరుల మధ్య సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు తొలగించడం రాజ్యాంగ అంతిమ లక్ష్యం. ఇవే అంశాలను సుప్రీంకోర్టు 2011లో ‘కేకే భాస్కరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు’, ‘నందిని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్’ కేసుల తీర్పుల్లో స్పష్టంగా తెలియజేసింది. పురాతన ఆచార సంప్రదాయాలు మానవాళిని అభివృద్ధి పథంలో నడిపించేలా ఉండాలి. కానీ, సంప్రదాయాల చుట్టూ అవివేకంగా పరిభ్రమించేలా ఉండకూడదు. నానాటికీ పరువు హత్యల పేరుపై కులాంతర వివాహాలు చేసుకున్న వారినీ, చేసుకోవడానికి సిద్ధమైన వారినీ, వారి కుటుంబ సభ్యులనూ హత్యలు చేయడం లేదా దాడులు చేయడం ఎక్కువవుతోంది. ముఖ్యంగా నయా క్షత్రియ కులాలు, దళిత – బహుజన కులాల మధ్య జరుగుతున్న ప్రేమ వివాహాల సంఖ్య కంటే రెట్టింపు సంఖ్యలో హత్యలు/దాడులు జరుగుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 1936లో కులాంతర వివాహాలతోనే కుల నిర్మూలన సాధ్యమని చెప్పిన సంగతిని అందరూ గుర్తుపెట్టకోవాలి. కేంద్ర ప్రభుత్వం 2013లో ‘లా’ కమిషన్ ఇచ్చిన 242వ నివేదిక ఆధారంగా... ప్రేమ వివాహితుల హత్యల నివారణకు చట్టాన్ని ప్రతిపాదించింది. సదరు చట్టంపై రాష్ట్ర ప్రభుత్వాల నుండి సూచనలు, సలహాలను స్వీకరించే పనిలో ఉన్నారు. కుల అహంకార హత్యల కట్టడికి ప్రత్యేక చట్టం లేని కారణంగా ప్రస్తుతం ఐపీసీ సెక్షన్ 300 ప్రకారం హత్యకేసు నమోదు చేస్తుండడంతో... దోషులు బెయిల్ పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. (చదవండి: వివక్షను బయటి నుంచి చూస్తే ఎలా?) సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనాలు 2018లో ‘శక్తి వాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’, 2021లో ‘హరి వర్సెస్ స్టేట్ అఫ్ ఉత్తర ప్రదేశ్’ కేసుల తీర్పుల్లో కుల అహంకార హత్యల నివారణ, విచారణకు సంబంధించి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాయి. దేశంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగిన హత్యలను జిల్లాల వారీగా లెక్కించడంతోపాటూ ఆయా జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి నివారణ చర్యలు చేపట్టాలి. ప్రతి జిల్లాలో 24 గంటల హెల్ప్లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. కులాంతర/ మతాంతర వివాహ జంటలను గుర్తించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణలను కల్పించాలి. అధికారుల నిర్లక్ష్యంతో హత్యలు జరిగినట్లయితే సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి అనేవి ఇందులో ముఖ్యమైనవి. (చదవండి: నేరస్థుల గుర్తింపు బిల్లుపై చర్చ ఏది?) రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ప్రకారం అంటరాని తనం నిషేధితమయ్యింది కనుక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సామాజిక భద్రత కల్పనలో భాగంగా 1989లో అత్యాచార నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా కులనిర్మూలన జరగాలన్నా, కుల అహంకారంతో చేస్తున్న పరువు హత్యలను కట్టడి చేయాలన్నా రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ ‘17ఏ’ను చేర్చి కుల వ్యవస్థను నిషేధించాలి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలూ ప్రధాన అంశంగా తీసుకోవాలి. అలాగే అన్ని మతాలకు సంబంధించిన పెద్దలు ముందుకువచ్చి పరువు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలి. అప్పుడే ఈ అమానవీయ హత్యాకాండకు తెరపడుతుంది. - కోడెపాక కుమారస్వామి సామాజిక విశ్లేషకులు -
వారూ, వీరూ ఎదుర్కొనే పీడన ఒక్కటే!
వేల ఏళ్లుగా నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అనేక కులాలు వివ క్షకు గురవుతూ వస్తున్న నేప థ్యంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం... 1935 ప్రత్యేక చట్టాన్ని అనుసరించి 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించింది. అంతకుముందు వీరిని డిప్రెస్డ్ తరగతులుగా పరి గణించేవారు. భారత రాజ్యాంగం ఆర్టికల్స్ 341, 342 ద్వారా రాష్ట్రపతి షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల జాబితాలను ప్రకటిస్తారు. ఒక కులాన్ని షెడ్యూల్డ్ కులంగా గుర్తించాలంటే సామాజిక, విద్యా, ఆర్థిక వెనుక బాటులతో పాటుగా అస్పృశ్యతను అనుభవిస్తూ ఉండాలి. షెడ్యూల్డ్ తెగగా గుర్తించాలంటే సంబంధిత తెగ ప్రత్యేక భాష, ప్రత్యేక ఆచారాలు కలిగి... అడవుల్లో వంశపారంపర్య వృత్తితో జీవిస్తూ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం 105వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 342ఏను సవరిస్తూ... కేంద్ర ఓబీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలంటే కేంద్రానికీ, రాష్ట్ర బీసీ జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలంటే ఆయా రాష్ట్రాలకూ అధికా రాలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 1950లో, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా దేశంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జాబితాను విడుదల చేస్తూ, ఉత్తర్వులోని 3వ పేరాలో షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించిన వారందరూ తప్పనిసరిగా హిందూమతంలో కొనసాగాలని నిబంధన పెట్టింది. అదే పంజాబ్ రాష్ట్రంలోని రాందాసి, కాబీర్ పంథి, మజాబి, సిక్లిగర్ కులాలు మాత్రం సిక్కుమతంలో కొనసాగవచ్చని తెలి పింది. తదనంతరం 1990లో రాష్ట్రపతి ఉత్తర్వులను సవ రణ చేస్తూ షెడ్యూల్డ్ కులాల వారు తప్పనిసరిగా హిందూ లేదా సిక్కు లేదా బౌద్ధమతంలో కొనసాగాలని నిబం ధన పెట్టారు. ఒకవేళ ఇతర మతంలోనికి మారితే షెడ్యూల్డ్ కులం హోదాను కోల్పోయి ఓబీసీగా గుర్తింపు పొందుతారు. 1956లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా దేశంలో ఎస్టీ జాబితాను ప్రకటించారు. వీరికి ఎలాంటి మత నిబంధనలు లేవు. కేంద్ర ప్రభుత్వం 1975లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం... ఎవరైనా షెడ్యూల్డ్ కులానికి చెందినవారు ఇతర మతాలు... అనగా క్రైస్తవ లేదా ముస్లిం మతం లేదా జైనమతంలోకి మారిన వారికి ఎస్సీలకు కల్పిస్తున్న ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు. అదే విధంగా కొంత కాలం తర్వాత వారి పూర్వమతం అయిన హిందూ/ సిక్కు/బౌద్ధ మతానికి మారితే వారికి షెడ్యూల్డ్ కుల హోదా, రిజర్వేషన్లు పొందే వెసులుబాటు కల్పించారు. దేశంలో దళిత క్రైస్తవులు తమను షెడ్యూల్డ్ కులా లుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవానికి మనదేశంలో మతం మారినంత మాత్రాన సామాజిక అసమానతలు, అంటరానితనం పోవడం లేదు. ఎందు కంటే దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు. ఈ మతంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థ పోలేదు. దేశ వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై వేలసంఖ్యలో అత్యా చారాలు జరుగుతున్నాయి. సామాజిక భద్రతలో భాగంగా, వీరు అత్యాచార నిరోధక చట్టాన్ని వినియో గించుకునే అవకాశం లేకుండా పోతోంది. పూర్వం షెడ్యూల్డ్ కులాలవారికి హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం లేదు, కావున వారు ప్రత్యామ్నాయంగా ఇతర మతాల్లోకి మారడం సహజంగానే చూడాలి. భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు మతం మారితే షెడ్యూల్డ్ కులాల హోదా, రిజ ర్వేషన్లు కోల్పోతారని పేర్కొనే ఎలాంటి నిబంధనలు లేవు. కేవలం రాష్ట్రపతి ఉత్తర్వులలో మాత్రమే నిబంధన పెట్టారు. మొదట హిందూమతంలో కొనసాగాలని చెప్పారు. తరువాత సవరించిన సిక్కు లేదా బౌద్ధ మతా లలో కొనసాగవచ్చని తెలిపారు. అందుకే దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవులు రాష్ట్రపతి ఉత్తర్వు–1950లోని 3వ పేరాను సవరించి వారికి షెడ్యూల్డ్ కులాల హోదాను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకొని వీరికి న్యాయం చెయ్యాలి. వ్యాసకర్త: కోడెపాక కుమారస్వామి జాతీయ అధ్యక్షులు, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం -
హింసించడం పోలీసుల డ్యూటీ కాదు!
దేశంలో పోలీసు కస్టడీలో నిందితులపై హింసా, ఇతర వేధింపులు ఇప్పటికీ కొనసాగుతున్నాయనీ, మానవ హక్కులకు ముప్పు ఎక్కువగా మన పోలీస్ స్టేషన్లలోనే ఉంటోందనీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ పలు సందర్భాల్లో అన్నారు. వాస్తవానికి పోలీసు ఠాణాల్లో నిందితులు చిత్రహింసలకు గురవుతున్నా, దెబ్బలకు తట్టుకోలేక మరణిస్తే తప్ప ఆ నేరం వెలుగులోకి రావడం లేదు. పోలీసు అధికారులు తప్పుడు కేసుల్లో అమాయకుల్ని ఇరికించి, గాయపరచడానికి ఉద్దేశపూర్వకంగా తప్పుడు పత్రాలను తయారు చేసినట్లయితే, భారతీయ శిక్షా స్మృతి, సెక్షన్ 167 ప్రకారం అతను శిక్షార్హుడు. నిందితుడిని అరెస్టు చేసి, నేరాన్ని చేసినట్లు ఒప్పుకోమని హింసించినా, భారతీయ సాక్ష్య చట్టం, 1872లోని సెక్షన్ 25, 26 ప్రకారం అటువంటి నేరాంగీకరణలు కోర్టుల్లో చెల్లవు. (చదవండి: ఆ వారసత్వం నేటికీ రేపటికీ అవసరమే!) మానసికంగా, శారీరకంగా నిందితులను గాయాల పాలు చేసి రిమాండుకు పంపేటప్పుడు జడ్జీ దగ్గర వాస్తవాలు చెప్పనివ్వకుండా కొట్టలేదు, తిట్టలేదు అని చెప్పించే పోలీసు వ్యవస్థలో మనం బతుకుతున్నాం. చాలామంది పోలీసులు ప్రజలను కొట్టడం వారి డ్యూటీలో భాగంగా భావిస్తు న్నారు. సుప్రీంకోర్టు 2006లో ప్రకాశ్ సింగ్ వర్సెస్ యూనియన్ అఫ్ ఇండియా కేసు తీర్పులో సూచిం చినట్లు జిల్లా, రాష్ట్ర స్థాయి ‘పోలీసు కంప్లయింట్ అథారిటీ’లను ఏర్పాటు చేసి పోలీసుల నేరాలను తగ్గించాలి. తెలంగాణ హైకోర్టు ఆదేశానుసారం జూన్ 2021లో సదరు అథారిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు జీవో నం.1093ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. (జైభీమ్: నాటి పోరాటం గుర్తొచ్చింది!) ఈ ఏడాది తెలంగాణలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో మరియమ్మ కస్టోడియల్ మరణం జరిగింది. ఈ లాకప్ డెత్ కేసులో ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుండి తొలగించారు. కానీ వీరికి జైలు శిక్ష పడుతుందా? అదేరోజు సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలో దొంగతనం చేశాడనే అనుమానంతో వీరశేఖర్ అనే గిరిజనుడిని పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. భారత దేశంలో ప్రతి పౌరుడికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన మానవ హక్కుల గురించీ, సీఆర్పీసీ, ఐపీసీ చట్టాల గురించీ కనీస అవగాహన అవసరం. పాఠశాలల్లో ప్రాథమిక, ఉన్నత విద్యలో పాఠాల రూపంలో బోధించాలి. తెలంగాణాలో ఫ్రెండ్లీ పోలీసులు అని చెబుతున్న ప్రభుత్వం, కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారుల వరకు మానవ హక్కులపై ప్రతియేటా శిక్షణ తర గతులు నిర్వహించాలి. ఖాకీ డ్రెస్సుల్లో ఉద్యోగం చేస్తున్న నేరగాళ్ళను గుర్తించి, ఉద్యోగాల నుండి తొలగించాలి. తక్షణం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పోలీస్ కంప్లయింట్ అథారిటీలను ఏర్పాటు చేయాలి. - కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త సామాజిక కార్యకర్త -
మరోసారి అటకెక్కిన ఓబీసీ కులగణన
బ్రిటిష్ పాలనలో జనాభా లెక్కల్లో ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు, ఆంగ్లో ఇండి యన్స్, ముస్లి మేతరుల (హిందు వులు) లెక్కలు తీసేవారు. 1872 నుండి జనాభా లెక్కలలో ఆయా కులాల గణాంకాలను 1931,1932 వరకు లెక్కించింది. శూద్ర కులాల సామాజిక, ఆర్థిక, విద్య, సాంస్కృతిక అంశాలు తెలిస్తే తప్ప దేశ అభివృద్ధి సాధ్యం కాదని గుర్తిం చింది. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించిన అనంతరం 1951 నుండి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తు న్నారు. ఇందులో స్త్రీలు, పురుషులు, పిల్లలు, మతంతో పాటుగా షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) లెక్కలను తీస్తున్నారు. కానీ దేశ జనాభాలో యాభై శాతం పైగా జీవిస్తున్న వెనుకబడిన తరగతుల (బీసీ/ఓబీసీ) లెక్కలు తీయడం లేదు. మొదటి జాతీయ బీసీ కమిషన్ మొదలుకొని, అన్ని రాష్ట్రా లలో నేటి వరకు నియమించిన బీసీ కమిషన్లు అన్నీ ఓబీసీ కులగణన చేయాలని సూచించాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేక సందర్భాలలో వెనుకబడిన తరగతుల లెక్కలను తేల్చా లని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించాయి. 2012లో మద్రాస్ హైకోర్టు ధర్మాసనం ‘సెన్సస్ కమిషనర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆర్.కృష్ణమూర్తి’ మధ్య కేసు తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని జనాభా లెక్కలతో పాటుగా ఓబీసీ కులగణన చేయాలని సూచించింది. 2010లో జరిగిన పార్లమెంట్ సమావేశాలలో ఓబీసీ కుల గణన చేయాలని అన్ని ప్రతిపక్ష పార్టీలు, భారతీయ జనతా పార్టీతో సహా ముక్తకంఠంతో నినదించాయి. అందుకు స్పందిం చిన కేంద్ర ప్రభుత్వం 2011లో చేయబోయే జనాభా లెక్కలలో సాధ్యం కాదనీ; అప్పటికే జనాభా లెక్కలకు సంబంధించిన సామగ్రిని దేశవ్యాప్తంగా పంపించడం జరిగిందనీ; తరువాత తీయబోయే జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేస్తామనీ లోకసభ, రాజ్యసభ సాక్షిగా ప్రకటించింది. 2014లో అధికారం లోకి వచ్చిన బీజేపీ సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల జనగణన 2021లో చేపడుతామని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ వారు 2021 జనగణనకు సంబంధించిన షెడ్యూలు విడుదల చేస్తూ మొదట శాంపిల్ సర్వేకు ప్రతి రాష్ట్రంలో మూడు మండలాలను ఎంపిక చేసి మొబైల్ మరియు డేటా షీట్ ద్వారా సర్వేను 12 ఆగస్టు నుండి 30 సెప్టెంబర్ 2019 వరకు నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరించారు గానీ ఓబీసీల వివరాలను సేకరిం చలేదు. శాంపిల్ సర్వేలో చేయలేదంటే ఈసారి కూడా ఓబీసీ కులగణన చేయడం లేదని తేటతెల్లమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్లుగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 స్థానిక సంస్థలైన పంచాయితీ, మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు పరిచారు. కానీ 2019లో పంచాయతీ ఎన్నికలలో తెలంగాణ ప్రభుత్వం 50% పరిమితికి సంబంధించి కోర్టు తీర్పులను సాకుగా చూపి 34 నుండి 23 శాతానికి బీసీ రిజర్వేషన్లను కుదించారు. ఫలితంగా సుమారు 1000 సర్పంచి సీట్లను బీసీలు కోల్పోవలసి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం 2014లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం అధికారికంగా బీసీ జనాభాను కోర్టులకు సమర్పించి 34% రిజర్వేషన్ల అమలుకు ఆమోదం తీసుకోవచ్చు. కానీ అలా చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో జీవో 176 ద్వారా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34%, ఎస్సీలకు 19.08%, ఎస్టీలకు 6.77% మొత్తం వర్టికల్ రిజర్వేషన్ 60% శాతంగా కల్పించింది. ఈ రిజర్వేషన్లపై హైకోర్టు ధర్మాసనం బిర్రు ప్రతాపరెడ్డి వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ మధ్య కేసు తీర్పులో బీసీల జనాభా లెక్కలు లేవు కనుక వర్టికల్ రిజర్వేషన్ 50% దాటడానికి వీలులేదని తీర్పిచ్చింది. తప్పని పరిస్థితులలో ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను జీవో 559 ద్వారా 34% నుండి 24%కి తగ్గించింది. ఇప్పటికీ ఎన్నికలు జరగలేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2021 జనాభా లెక్కలలో ఓబీసీ గణన చేపట్టి సమసమాజానికి బాటలు వేయాలని 70 కోట్ల మంది బీసీలు ఆశిస్తున్నారు. లెక్కలు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం చేయని కారణంగా వీరికి అమలుపరుస్తున్న రిజర్వేషన్లపై అనేక న్యాయపరమైన చిక్కులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులలో ఎదుర్కోవాల్సి వస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీలకు విద్య, ఉద్యోగ తదితర రంగాలలో వారి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలంటే ఓబీసీ కులగణన తప్పనిసరి. ఇది అన్ని సమస్యలకు సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది. కోడెపాక కుమార స్వామి వ్యాసకర్త అధ్యక్షులు, జాతీయ ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘ మొబైల్ : 94909 59625