బీసీల గణనతోనే.. బీసీ కోటా సాధ్యం! | Kodepaka Kumara Swamy's Comments On The Calculations Of BC Sakshi Guest Column News | Sakshi
Sakshi News home page

బీసీల గణనతోనే.. బీసీ కోటా సాధ్యం!

Published Thu, Aug 8 2024 1:40 PM | Last Updated on Thu, Aug 8 2024 1:40 PM

Kodepaka Kumara Swamy's Comments On The Calculations Of BC Sakshi Guest Column News

స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలును రాజ్యాంగంలోని లోపాలను చూపిస్తూ కోర్టులు అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కానప్పుడు, 42 శాతం అమలు సాధ్యం కాదనే విషయం వారికి తెలియక కాదు. ఓట్ల కోసం ఆ విధంగా వాగ్దానం చేశారు.

కేంద్ర ప్రభుత్వం 1993/ 94లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కనీస భాగస్వామ్యం కల్పించాలనే ముఖ్యోద్దేశంతో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్‌ 243ని చేర్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు వారి జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు ఒకటిలో మూడో వంతును, వెనుకబడిన పౌరులకు (బీసీలకు) మాత్రం నిర్దిష్టమైన కోటాను నిర్ధారించకుండా వీటిని ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా మధ్య జరిగిన కేసులో బీసీ కోటా అమలు ట్రిపుల్‌ ట్రస్ట్‌ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించింది.

అందులో (1) బీసీ కోటా అమలుకు ప్రత్యేకంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి. (2) అట్టి బీసీ కమిషన్‌ ద్వారా బీసీ లెక్కలు తీయాలి. (3) మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి  మించకుండా, అందులో ఎస్సీ, ఎస్టీ వారికి జనాభా దామాషా పద్ధతిలో పోగా మిగిలిన కోటాను బీసీలకు అమలు చెయ్యాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2022లో మరో సంచలనా త్మకమైన తీర్పును వెలువరిస్తూ సురేష్‌ మహజన్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మధ్యప్రదేశ్‌ కేసులో దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్ని కలను ప్రతి ఐదు సంవత్సరాలకు తూచా తప్పకుండా నిర్వహించాలనీ, బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజ ర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనీ ఆదేశించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో 1994 నుండి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2010లో స్థానిక సంస్థల బీసీ కోటాపై తీర్పు వెలువరించిన తర్వాత మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో భాగంగా బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించాలని 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు ప్రభుత్వన్ని ఆదేశించింది. ఆ తీర్పుపై నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తీసు కొని యధావిధిగా బీసీ రిజర్వేష న్లను 34 శాతం అమలు చేసింది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ లెక్కలు లేకుండా ఎన్నిక లకు వెళ్ళినట్లయితే 24 శాతం రిజర్వేషన్లు కూడా దక్కే అవ కాశం లేదు. ఎవరైనా ఎన్నికల ప్రకటనను సవాల్‌ చేసినట్ల యితే, బీసీ గణాంకాలు శాస్త్రీయబద్ధంగా లెక్కించనందున బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేక బీసీ కమిషన్‌ ద్వారా సాధారణ పరిపా లన శాఖ సమన్వయంతో కులగణన చేసి, ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలి.


– కోడెపాక కుమార స్వామి, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, మొబైల్‌: 94909 59625

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement