
ఉభయ తెలుగు కాష్ట్రాల్లో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల తీరు రోజురోజుకీ ఆందోళనకరంగా మారుతోంది. అధిక ఫీజులు, నకిలీ డాక్టర్లు, అనుమతులు లేని ఆస్పత్రులు - ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతూ వ్యాపార లాభాలను కాపాడుకోవడమే ధ్యేయంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో, 2,367 ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 276 ఆస్పత్రులు ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్నాయంటే, పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ అనుమతులు లేని ఆస్ప త్రుల్లో అనుభవం లేని వైద్యులు చికిత్సలు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇటీవల రోగులు మృత్యువాత పడుతున్న ఘటనలు అధికంగా నమోదవుతున్నాయి. ఇటీవల (మార్చి 29న) గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ఆస్పత్రిని సీజ్ చేయడం, ఐదుగురు నకిలీ డాక్టర్లపై కేసులు నమోదు చేయడం ఈ సమస్య లోతును సూచిస్తోంది. ఏపీ నుంచే కాక ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా హైదరాబాదుకు వైద్యం కోసం ఎందరో వస్తూ ఉండటం ఈ సందర్భంగా గమనార్హం.
ప్రజల ఆరోగ్యం వ్యాపార సరుకుగా మారిన ఈ పరిస్థితిలో, ప్రభుత్వ ఆస్పత్రుల దుఃస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉస్మానియా, గాంధీ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రద్దీకి తగ్గట్లు బెడ్‌లు, సిబ్బంది లేకపోవడంతో సేవలు అందించడం సవాల్‌గా మారింది. దీనికితోడు, వైద్య పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లకు రిఫర్ చేయడంతో పేద, మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం కోసం తెలంగాణ ఎమ్మెల్సీ కోదండరాం ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ, దానికోసం సమర్థవంతమైన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇది స్వాగతించదగిన ప్రతిపాదన. అయితే, ఈ చర్యలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, నిరంతర పర్యవేక్షణ, కఠిన చర్యలతో అమలు జరగాలి.
– ముద్దం నరసింహ స్వామి, సీనియర్ జర్నలిస్ట్