నేడు వైద్యానికి అయ్యే ఖర్చులు భారీ స్థాయిలో పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే వారి ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అవుతోంది. చికిత్స కోసం చేసే అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డ కుటుంబాలు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో ఎన్నో ఉన్నాయి. వైద్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసి డాంబిక మాటలు చెబుతూ కాలం వెళ్లదీశారు తప్పితే... పేద ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ (ఆరోగ్యశ్రీ) పథకానికి గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అలక్ష్యం వహించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది పేద ప్రజలు అత్యంత ఖరీదయిన చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కింద చేయించుకున్నారు. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుజ్జీవింపచేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కుంటుపడిన వైద్య శాఖకు చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై వైద్య భారం పడకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. అంతేగాక ప్రభుత్వం బడ్జెట్‌ను 50% పెంచింది.
2013లో సవరించిన ధరలనే కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించింది. 2017 నుంచి ధరలను సవరించాలని డాక్టర్లు డిమాండ్ చేసినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2022లో ఓ కమిటీని నియమించి చేతులు దులుపుకుంది. దీంతో కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయడానికి విముఖత చూపాయి. పేద, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కానీ, కాంగ్రెస్ 6 నెలల్లోనే సదరు కమిటీ సూచన మేరకు 1365 వైద్య చికిత్సల ధరలను 20 నుంచి 25 శాతం వరకు సవరించింది. ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు సంవత్సరానికి రూ. 600 కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. కొత్తగా 163 రకాలు ప్రొసీజర్ల స్కీమ్‌లో చేర్చడంతో ప్రొసీజర్ల స్కీమ్‌ల సంఖ్య 1835కు చేరుకుంది. ఇందులో ఖరీదయిన న్యూక్లియర్ మెడిసిన్, ఇంటెర్వెర్షనల్ రేడియాలజీ చికిత్సలను కూడా చేర్చారు.
చిన్న పట్టణాల్లో ఉన్న 30 నుంచి 50 పడకల ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయనున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం బకాయిపడ్డ రూ. 646 కోట్లను కాంగ్రెస్ విడుదల చేసి, ప్రతి నెల రూ. 70 కోట్లను ఆసుపత్రులకు విడుదల చేస్తోంది. మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చి డాక్టర్ చదవాలి అనుకునే విద్యార్థుల కల రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చనుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీల సంఖ్య 34కు పెంచడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4090కి పెరగాయి. 15 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు రూ. 390 కోట్లు కేటాయించి, 900 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఈ ఏడాది నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తూ సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా గత ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం చేసింది. తొలి 8 నెలల కాలంలోనే ఆరోగ్యశాఖలో 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసి, మరో 6,300 పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.
రాజధాని వాసులకు వైద్యం అందుబాటులో ఉండేలా గోషామహల్‌లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖానను రూ. 2 వేల కోట్లతో నిర్మించనుంది. డయాలసిస్ పేషెంట్ల కోసం గాంధీ, నిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్; ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలోని టీచింగ్ హాస్పిటళ్లలో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు; హైవేల మీద ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ ఉండేలా ఏర్పాటు చేసి... రోడ్డు ప్రమాద బాధితులను కాపాడనుంది. గాంధీ, పేట్లబుర్జు, ఎంజీఎం, నిమ్స్‌లతో సహా... అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి నూతన దంపతులకు ఖర్చు లేకుండా సంతాన సాఫల్య చికిత్సను అందించనుంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో కేన్సర్ స్క్రీనింగ్, ట్రీట్‌మెంట్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఐటీడీఏల పరిధిలోని మారుమూల తండాల్లో బైక్ అంబులెన్స్ సర్వీసులను విస్తరించి గిరిజనులకు వైద్య సేవలు అందించనుంది. వచ్చే నాలుగు ఏళ్ల పరిపాలనలో మరిన్ని మార్పులు తీసుకువచ్చి పేదలకు వైద్యసేవలు అందించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
-ఇందిరా శోభన్, వ్యాసకర్త కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు
Comments
Please login to add a commentAdd a comment