Indira Shoban
-
ఆరోగ్యశ్రీతో అభయహస్తం
నేడు వైద్యానికి అయ్యే ఖర్చులు భారీ స్థాయిలో పెరిగాయి. పేద, మధ్యతరగతి ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవాలంటే వారి ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అవుతోంది. చికిత్స కోసం చేసే అప్పులు తీర్చలేక ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డ కుటుంబాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎన్నో ఉన్నాయి. వైద్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసి డాంబిక మాటలు చెబుతూ కాలం వెళ్లదీశారు తప్పితే... పేద ప్రజల ఆరోగ్య రక్షణకు చర్యలు తీసుకోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ‘రాజీవ్ ఆరోగ్యశ్రీ’ (ఆరోగ్యశ్రీ) పథకానికి గత ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా అలక్ష్యం వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతోమంది పేద ప్రజలు అత్యంత ఖరీదయిన చికిత్సలు ఆరోగ్యశ్రీ పథకం కింద చేయించుకున్నారు. మళ్లీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి భరోసా ఇస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుజ్జీవింపచేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కుంటుపడిన వైద్య శాఖకు చికిత్సలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలపై వైద్య భారం పడకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిని రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచారు. అంతేగాక ప్రభుత్వం బడ్జెట్‌ను 50% పెంచింది. 2013లో సవరించిన ధరలనే కేసీఆర్ ప్రభుత్వం ఆసుపత్రులకు చెల్లించింది. 2017 నుంచి ధరలను సవరించాలని డాక్టర్లు డిమాండ్ చేసినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 2022లో ఓ కమిటీని నియమించి చేతులు దులుపుకుంది. దీంతో కార్పొరేట్ హాస్పిటల్స్ ఆరోగ్య శ్రీ కింద చికిత్స చేయడానికి విముఖత చూపాయి. పేద, మధ్యతరగతి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. కానీ, కాంగ్రెస్ 6 నెలల్లోనే సదరు కమిటీ సూచన మేరకు 1365 వైద్య చికిత్సల ధరలను 20 నుంచి 25 శాతం వరకు సవరించింది. ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు సంవత్సరానికి రూ. 600 కోట్లకు పైగా అదనపు భారం పడుతోంది. కొత్తగా 163 రకాలు ప్రొసీజర్ల స్కీమ్‌లో చేర్చడంతో ప్రొసీజర్ల స్కీమ్‌ల సంఖ్య 1835కు చేరుకుంది. ఇందులో ఖరీదయిన న్యూక్లియర్ మెడిసిన్, ఇంటెర్వెర్షనల్ రేడియాలజీ చికిత్సలను కూడా చేర్చారు.చిన్న పట్టణాల్లో ఉన్న 30 నుంచి 50 పడకల ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేయనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బకాయిపడ్డ రూ. 646 కోట్లను కాంగ్రెస్ విడుదల చేసి, ప్రతి నెల రూ. 70 కోట్లను ఆసుపత్రులకు విడుదల చేస్తోంది. మరో 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చి డాక్టర్ చదవాలి అనుకునే విద్యార్థుల కల రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చనుంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీల సంఖ్య 34కు పెంచడంతో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 4090కి పెరగాయి. 15 నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు రూ. 390 కోట్లు కేటాయించి, 900 బీఎస్సీ నర్సింగ్ సీట్లు ఈ ఏడాది నుంచే విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తూ సుమారు వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వ దవాఖానాల్లో ఖాళీలను భర్తీ చేయకుండా గత ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యం చేసింది. తొలి 8 నెలల కాలంలోనే ఆరోగ్యశాఖలో 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేసి, మరో 6,300 పోస్టుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది.రాజధాని వాసులకు వైద్యం అందుబాటులో ఉండేలా గోషామహల్లో సుమారు 32 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఉస్మానియా దవాఖానను రూ. 2 వేల కోట్లతో నిర్మించనుంది. డయాలసిస్ పేషెంట్ల కోసం గాంధీ, నిమ్స్, ఉస్మానియా, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్; ఖమ్మం, మహబూబ్నగర్లలోని టీచింగ్ హాస్పిటళ్లలో వాస్క్యులర్ సెంటర్ల ఏర్పాటు; హైవేల మీద ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్ ఉండేలా ఏర్పాటు చేసి... రోడ్డు ప్రమాద బాధితులను కాపాడనుంది. గాంధీ, పేట్లబుర్జు, ఎంజీఎం, నిమ్స్లతో సహా... అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి నూతన దంపతులకు ఖర్చు లేకుండా సంతాన సాఫల్య చికిత్సను అందించనుంది. ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో కేన్సర్ స్క్రీనింగ్, ట్రీట్మెంట్ సెంటర్లు అందుబాటులోకి రానున్నాయి. ఐటీడీఏల పరిధిలోని మారుమూల తండాల్లో బైక్ అంబులెన్స్ సర్వీసులను విస్తరించి గిరిజనులకు వైద్య సేవలు అందించనుంది. వచ్చే నాలుగు ఏళ్ల పరిపాలనలో మరిన్ని మార్పులు తీసుకువచ్చి పేదలకు వైద్యసేవలు అందించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. -ఇందిరా శోభన్, వ్యాసకర్త కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు -
మీకు కష్టం వస్తేనే మహిళలు కనిపిస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి తొమ్మిదేళ్లు కావస్తున్నా మహిళల హక్కుల కోసం కల్వకుంట్ల కవిత ఏనాడూ గళమెత్తిన దాఖలాలు లేవని తెలంగాణ ఉద్యమకారిణి ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు కోరుతూ జంతర్ మంతర్‌లో దీక్షకు చేపడతానని కవిత చెప్పడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలుకు వెళ్లే అవకాశం ఉండడంతో అకస్మాత్తుగా మహిళలు గుర్తుకు రావడం విచిత్రంగా ఉందని ఇందిరా శోభన్ గురువారం ఇక్కడ ఓ ప్రకటనలో విమర్శించారు. మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయ డ్రామా, అధికార యావ తప్ప వేరే ఏమీ లేదని నిందించారు. జనాభాలో సగభాగమున్న మహిళలకు 33 శాతం కాకుండా 50 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని సూచించారు. -
‘కేసీఆర్ నీ మనవడిని ప్రభుత్వ హాస్టల్లో చేర్పించు’
పంజగుట్ట (హైదరాబాద్): సీఎం కేసీఆర్ మనవడిని ప్రభుత్వ హాస్టల్లో జాయిన్ చేయించాలని అప్పుడే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు వసతులు, నాణ్యమైన భోజ నం లభిస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర సెర్చ్ కమిటీ చైర్ పర్సన్ ఇందిరా శోభన్ అన్నారు. ప్రభుత్వ, గిరిజన, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఇటీవల ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురికావడాన్ని నిరసిస్తూ బుధవారం పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరా శోభన్, పార్టీ నాయకులు ప్రగతిభవన్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. ఆ నివేదికలో ఏముంది? -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ‘సామాన్యుడి’ పార్టీ!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఏయే రాష్ట్రాల్లో ఎవరెవరు అధికారాన్ని కైవసం చేసుకుంటారో మార్చి 10న వెల్లడవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల మధ్య ప్రధాన పోరు నడుస్తోంది. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌కు, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి మధ్య ప్రధాన పోటీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ కూటమి, శిరోమణి అకాలీదళ్ ఏమేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. గోవాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సత్తా చాటేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఉత్తరాఖండ్ పోలింగ్ ముగియగా.. మణిపూర్‌లో ఎన్నికలు ఫిబ్రవరి 28, మార్చి 5న జరగనున్నాయి. ఇదిలావుండగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయనుందన్న ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటితే తెలంగాణలోనూ ‘ఆప్’ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో ‘ఆప్’సోపాలు 2014 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏడు స్థానాల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, జహీరాబాద్, నల్లగొండ, వరంగల్ నుంచి పోటీ చేసిన ‘ఆప్’ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. సికింద్రాబాద్(11,184) మినహా అన్ని నియోజకవర్గాల్లోనూ పదివేల లోపు ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్‌లో ‘ఆప్’ అధికారంలోకి రావచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ పోటీకి ఆ పార్టీ సన్నద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు జోష్ నింపేనా? గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈసారి పంజాబీలు తమకే పట్టం కడతారని ‘ఆప్’ భావిస్తోంది. పంజాబ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి సానుకూల ఫలితాలు వస్తే రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అంతేకాదు 2024 లోక్‌సభ ఎన్నికల వరకు ఉత్సాహంగా పనిచేసేందుకు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ఒకవేళ ఫలితాలు ప్రతికూలంగా వస్తే ‘ఆప్’ ఎటువంటి వ్యూహం అవలంభిస్తుందో చూడాలి. నాయకత్వ సమస్య.. తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీకి బలమైన నాయకత్వం, పెద్ద సంఖ్యలో కేడర్ లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఆ పార్టీ ఉనికిలో కూడా లేదు. అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలంటే ముందుగా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అంతేకాదు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా నాయకత్వాన్ని తక్షణం తయారుచేసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ వ్యవహారాలను ఢిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి పర్యవేక్షిస్తున్నారు. ఇందిరా శోభన్, బుర్రా రాము గౌడ్ వంటి నాయకులు మాత్రమే చురుగ్గా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనీస పోటీ ఇవ్వాలంటే వీరి బలం సరిపోదు. ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ ఛరిష్మా వర్కవుట్ కావాలంటే స్థానికంగా బలమైన నాయకత్వం తయారు కావాల్సిన అవసరం ఎక్కువగా ఉంది. ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల బహుజన సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లో చేరడంతో ఆ పార్టీలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇలాంటి నాయకులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అవినీతి ముద్ర లేని మాజీ ఉన్నతాధికారులు, చురుకైన యువతను చేర్చుకునేందుకు ప్రయ్నతిస్తున్నట్టు సమాచారం. (క్లిక్: ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం.. రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు) ఢిల్లీ మోడల్ వర్కవుట్ అవుతుందా? దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో గుణాత్మక మార్పును తీసుకొచ్చింది. తాజా ఎన్నికల్లోనూ ‘ఢిల్లీ మోడల్’ను కేజ్రీవాల్ ప్రచారం చేశారు. పంజాబ్, గోవా రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పదేపదే ఇదే అంశాన్ని పస్తావించారు. అంతేకాదు పంజాబ్‌లో పోలింగ్ జరుగుతుండగానే ఢిల్లీలో 12 వేల స్మార్ట్ తరగతులను సీఎం కేజ్రీవాల్ ప్రారంభించారు. తెలంగాణలోనూ ఇదే వ్యూహంతో బరిలోకి దిగాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో సారూప్యత ఉందని ‘ఆప్’ నేతలు అంటున్నారు. రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా డ్రగ్స్, నిరుద్యోగం వంటి సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిపై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళ్లాలని ‘ఆప్’ భావిస్తోంది. (క్లిక్: తెలంగాణ బీజేపీలో అసంతృప్తి సెగలు) ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేయాలని భావిస్తున్నాం. అన్నిచోట్ల కుదరకపోతే కనీసం 40 స్థానాల్లో పోటీకి దిగుతాం. యువత, మేధావి వర్గం మా వెంటే ఉంటారని గట్టిగా నమ్ముతున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం. ఢిల్లీలో చేస్తున్నట్టుగానే నాణ్యమైన వైద్యం, ఉచిత విద్య అందిస్తాం. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తాం. పంజాబ్‌లో కచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుంది’ - ఇందిరా శోభన్ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ సెర్చ్ కమిటీ చైర్పర్సన్