
ప్రజల దశాబ్దాల ఆకాంక్ష ఎస్‌ఎల్‌బీసీ
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తాగు – సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ‘శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్’ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ పనుల్లో జరిగిన ప్రమాదం అందరికీ బాధ కలిగిస్తోంది. చివరికి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీరని విషాదాన్ని మిగిల్చింది. భద్రతా చర్యల్లో డొల్లతనానికి అద్దం పట్టింది.
నల్లగొండ జిల్లా కరువు పీడిత ప్రాంతాలలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రోజుకు అరటీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 30 టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.93 కిలో మీటర్ల సొరంగం తవ్వి గ్రావిటీ ద్వారా అందించాల్సి ఉంది. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పూర్తి చేసే లోపు, నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి పుట్టంగండి, అక్కంపెల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లతో నీళ్లు అందించేందుకు ‘ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్ట్’ ప్రారంభించారు. కరెంట్ మోటార్లతో నీళ్లు ఎత్తి పోయడం వల్ల ఇది జిల్లా ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేదు. విద్యుత్ వినియోగం వల్ల అధిక వ్యయం అవుతుంది.
అందువల్ల జిల్లా ప్రజల తాగు–సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేయడమే సరైన పరిష్కారం. ఈ ప్రాజెక్టును శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా అర కిలోమీటర్ లోతున సొరంగ తవ్వకం జరుగుతోంది. ఇది పూర్తి అయితేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావితప్రాంతాల్లో తాగునీరు; సూర్యాపేట భువనగిరి ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. దీని కోసం గత రెండున్నర దశాబ్దాల నుంచి వామపక్ష పార్టీలు, ఇతర ప్రజా సంఘాలు ఉద్యమాలు చేశాయి. వామపక్ష పార్టీలు శాసనసభ లోపల, వెలుపల ఈ ప్రాజెక్టు నిర్మాణం గురించి ఆందోళనలు చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిఆంధ్రప్రదేశ్ ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో 2005 ఆగస్టు 11న పరిపాలనా అనుమతులు పొంది, అదే నెల 28న ‘జేపీ అసోసియేట్స్’ సంస్థతో ఎస్‌ఎల్‌బీసీ ఒప్పందం చేసుకుంది. మొదటి అంచనా మేరకు రూ. 2,813 కోట్ల ఖర్చు. అయితే 2017 నాటికి 3,152 కోట్ల రూపా యలకు పెంచారు. ఇప్పుడు అది 4,636.75 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు శ్రీశైలం రిజ ర్వాయర్ బ్యాక్ వాటర్స్ నుంచి ‘దోమల పెంట’ వద్ద ఇన్‌లెట్‌తో మొదలై... నాగర్ కర్నూలు జిల్లా ‘మన్నె వారి పల్లె’ వద్ద అవుట్‌లెట్‌తో... మొత్తం 49.93 కిలో మీటర్ల ప్రధాన సొరంగం ముగుస్తుంది. ఇప్పటి వరకు 34.71 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పూర్త యింది. 7.13 కిలోమీటర్ల పొడవైన రెండవసొరంగం తవ్వకం బ్లాస్టింగ్ పద్ధతిలో మొత్తం పూర్తి చేశారు. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్టు పనులు 2010 నాటికి పూర్తి కావాల్సి ఉంది. కానీ గత పాలకులు ముఖ్యంగా పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు జరి గిన పనుల విలువ రూ. 2,689.47 కోట్లు. రెండు దశాబ్దాల్లో 34.37 కిలోమీటర్ల సొరంగం తవ్వారు. 9.56 కిలోమీటర్ల సొరంగం తవ్వకం పనులు ఆగి పోయాయి.
నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు 20 ఏళ్లుగా కొనసాగడం వల్ల వ్యయ భారా నికీ, తాజా పరిణామాలకూ పాలకుల అలసత్వమే కారణం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తి చేయడానికి కొంత బడ్జెట్ కేటాయించి తిరిగి పనులకు శ్రీకారం చుట్టారు. సొరంగం లోపల పైకప్పు నుంచి నీరు, మట్టి పడుతున్నదనీ, పనులు చేయడంలో ఇబ్బంది కలుగుతున్నదనీ కార్మికులు సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి చెప్పినా, ఏమీ కాదని పని చేయాలని ఒత్తిడి చేయడంతో ఈ ప్రమాదం సంభవించింది. భద్రతా ప్రమా ణాలు, ప్రభుత్వ అజమాయిషీ సరిగా లేక సాగునీటి ప్రాజె క్టుల్లో, పరిశ్రమల్లో తరచుగా ఇలాంటి ప్రమాదాలతో నష్టం జరుగుతోంది. ఆయా సంఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంది.
టన్నెల్‌లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను రక్షించడానికి, టన్నెల్‌లో బురద నీరు, వ్యర్ధాలను తొలగించడానికి వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నప్పటికీ ఎలాంటి పురోగతీ కనిపించలేదు. ఈ ప్రమాదంపై ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథార్టీ (ఎన్డీఎస్‌ఏ) వారి నుంచి స్పందన రాలేదు. ఈ ప్రమాదం జరిగిన దోమల పెంట ప్రాంతాన్ని సీపీఎం బృందం ఫిబ్రవరి 23న సందర్శించింది. అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న రాష్ట్ర మంత్రులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సహాయక చర్యల విషయం చర్చించింది. చివరికి ఆశలన్నీ గల్లంతై కార్మికుల ప్రాణలు గాల్లో కలిసిపోయాయి. భద్రతాపరంగా తగిన సాంకేతిక చర్యలు తీసుకొని ఇప్పటిౖకైనా పనుల్లో అలసత్వం లేకుండా త్వరిత గతిని పూర్తి చేయాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలి.
-జూలకంటి రంగారెడ్డి
వ్యాసకర్త రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు,
సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ
Comments
Please login to add a commentAdd a comment