
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ సొరంగ కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్మాణం పూర్తయితే... దేవరకొండ, నకిరేకల్, నల్లగొండ, నార్కెట్‌పల్లి మండలా ల్లోని 4 లక్షల ఎకరాలకు సాగునీరొ స్తుంది. 500కు పైగా ఫ్లోరోసిస్ పీడిత గ్రామాలకు తాగునీరు వస్తుంది.అందుకే ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టాయి. అయితే గత నాలుగేళ్లకు పైగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రూఫ్ (పై స్లాబ్) నుండి భారీ నీటి జలలు (ఊటలు) వస్తున్నాయి. ఈ జల ప్రవా హాన్ని శాస్త్రీయంగా అరికట్టడంలో జరిగిన తీవ్రమైన వైఫ ల్యమే ఈ ఘోర విపత్తుకు కారణం.
ప్రమాదాన్ని అంచనా వేయడంలో రాబిన్‌సన్, జేపీకంపెనీలు; తెలంగాణ నీటిపారుదల శాఖ విఫల మయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ గత పదేళ్ల పాలనలో 11 కిలోమీటర్లు దాటి సొరంగం తవ్వలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సొరంగ నిర్మాణం కోసం భారీ ఎత్తున వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. కానీ పొంచి ఉన్న భారీ విపత్తును గుర్తించడంలో విఫలమైంది. సొరంగం పైకప్పు నిమిషానికి 5 నుండి 8 వేల లీటర్ల నీటినీ, బురదనూ కుమ్మరిస్తోంది. ప్రభుత్వానికి నీటి ఊటను శాశ్వతంగా పరిష్కరించే ఆలోచనే లేదు.
ప్రకృతి నియమాలను అర్థం చేసుకోని, ప్రకృతి నియమాలకు అనుగుణంగా నిర్మించని నిర్మాణాలు ఎంత గొప్పవైనా... ప్రకృతి వాటిని ధ్వంసం చేస్తుంది. ఇందుకు ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా నిర్మాణాలు చేసినందునే, అన్నారం– సుందిళ్ళ బ్యారేజీలలో భారీ లీకేజీ, సీపేజీలు కొనసాగుతున్నాయి. ప్రకృతి నియ మాలను అర్థం చేసుకొని నిర్మించిన నిర్మాణాలనే ప్రకృతి పరిరక్షిస్తుంది. తద్విరుద్ధమైన ఎంతటి అధునాతన నిర్మాణా న్నైనా ప్రకృతి ధ్వంసం చేస్తుంది. కాళేశ్వరం (మేడిగడ్డ) నిర్మించిన నాలుగేళ్లకే అది ఐదు అడుగుల మేర భూగర్భంలోకి ఎందుకు కుంగిపోయింది? ఎందుకు నిట్ట నిలువునా మూడున్నర అడుగుల వెడల్పుతో చెక్కలై, పునాది నుండి చీలిపోయింది? ఏడో బ్లాక్‌లోని 11 గేట్లు కూల్చి మళ్లీ నిర్మించాలని, ఇటీవలే విడుదలైన ఎన్‌డీఎస్‌ఏ తుది నివేదిక
ఎందుకు పేర్కొంది? బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునాదుల్లోంచి సిమెంట్, కెమికల్ గ్రౌటింగ్ చేసినా... భారీనీటి లీకేజీ, సీపేజీ ఎందుకు ఆగకుండా జరుగుతోంది? 14 పంపుల్లో సగం పంపులుఎందుకు బద్దలైపోయాయి? డైమండ్ డ్రిల్లింగ్‌తో, నియ మానుసారం భూగర్భ మట్టి పరీక్షలు ఎందుకు జరుపలేదు? బలహీన ఇసుక పునాదుల పైన బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? డిజైన్, ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణలకు చెందిన ఏ ప్రకృతి నియమాన్నీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించు కోలేదు. ‘కేసీఆర్ మమ్మల్ని డమ్మీలు చేశార’ని ఇంజనీర్లు ముక్తకంఠంతో పీసీ ఘోష్ కమిషన్ ముందు సాక్ష్యమి చ్చారు. కాళేశ్వరం బ్యారేజీల విపత్తు తలెత్తిందే అందువల్ల.
ఏపీలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 2027 లోపు పూర్తి చేయాలని చంద్రబాబు ప్రభుత్వం ఇంజినీర్లకు డెడ్ లైన్ విధించింది. ఎస్‌ఎల్‌బీసీ, కాళేశ్వరం (మేడిగడ్డ) విపత్తులతో పోలవరం ప్రాజెక్టుకూ సారూప్యముంది. పోలవరంలో డెడ్ లైన్ల పేరుతో బడా రాజకీయ పెద్దల జోక్యం ఎక్కువైంది. నేటి విపత్తులకు కారణమైన కాళేశ్వరం, ఎస్‌ఎల్ బీసీలో ఏ తప్పులైతే చేశారో, పోలవరం స్పిల్‌వే (గేట్ల అడుగు భాగం) పునాది నిర్మాణంలో అవే తప్పులు Výæత చంద్ర బాబు ప్రభుత్వ హయాంలో జరిగాయి. అప్పట్లో ప్రతి సోమవారం పోలవరం అంటూ మీడియా ఎదుటహంగామా చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికీ, స్థిరత్వానికీ తగిన సమయం ఇవ్వడం కన్నా ఈ హడావిడే ఎక్కువ. ఫలితంగా భారీ వరద తాకిడికి, భూగర్భంలో 460 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది.
ఎస్‌ఎల్‌బీసీ అత్యంత క్లిష్టమైన సొరంగంగా ఎందుకు మారింది? దేశంలో నిర్మించిన ఇతర రైల్వే, రోడ్డు తదితర సొరంగాలకు దీనికి మధ్య ఎలాంటి సారూప్యతలూఎందుకు లేవు? సొరంగంపై నుండి నాలుగేళ్లకు పైగా నీరు, బురద రావడం అతి సంక్లిష్టమైన వ్యవహారం. టీబీఎం తవ్వడం ప్రారంభించగానే, అప్పటికే నాలుగేళ్లుగా నిట్ట నిలువుగా కుమ్మరిస్తున్న భారీ నీటి ఊటతో షియర్ జోన్ భూ భౌగోళిక స్థితి... భారీ విపత్తుగా మారింది. అక్కడి మట్టి అంతా పూర్తిగా నీటిని నింపుకొని తేమగా మారి పెను విపత్తుకు దారితీసింది. ఏ చిన్న ఒత్తిడితో కూడిన కదలిక జరిగినా కుప్ప కూలడానికి సిద్ధమైంది. టీబీఎం మిషన్ పని ప్రారంభించడంతో, నీటి తాకిడికి గురవుతున్న ప్రాంతం భారీ కదలికలకు గురైంది. ఇది సొరంగం పైకప్పు కుప్పకూలడానికి తక్షణ ప్రేరకంగా పని చేసింది. ‘టన్నెల్ íసీస్మిక్ ప్రొడ క్షన్ సిస్టమ్’తో రాబోయే భారీ విపత్తులను గుర్తించడంలో విఫలమవ్వడం విపత్తుకు మరొక కారణం.
నీటి ప్రవాహ తాకిడికి, నాలుగు వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మిషన్ 80 మీటర్ల దూరం కొట్టుకుపోయింది. విపత్తు జరిగి పది రోజులైనా నీటి నిల్వను, ఊటను, బురదను అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. సొరంగం పైనుంచి కుమ్మరిస్తున్న ఊట నీరు, మరిన్ని భారీ విపత్తు లకు నెలవుగా మారింది. ఇది రెస్క్యూ బృందాల సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కుప్పకూలిన పైకప్పు భూభౌతిక స్థితి... షియర్ జోన్ స్వభావానికి చెందినది. ఈ ప్రాంతంలోని భూమి భారీ నీటిని తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. నీటి జలల ప్రవాహానికి ఇక్కడి మట్టి అత్యంత అనువుగా ఉంటుంది. సొరంగం కుప్పకూలిన ప్రాంతానికి ఎగువన ఉన్న భూమి ఉపరితలానికి, ఒక నిర్దిష్ట చదరపు ప్రాంతపు రిడ్జిని కలిగి ఉంటుంది. ఆ పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపు తీవ్రత బట్టి షియర్ జోన్‌లోకి చేరుకునే నీటి పరిమాణంలో హెచ్చు తగ్గులు ఆధారపడి ఉంటాయి. ఈ ప్రాంతంలోని మట్టి... వదులుగా, ఖాళీలు, సందులను కలిగి ఉంటుంది. మొత్తం మీద ఇక్కడి మట్టి తన గుండా వర్షపు తీవ్రతను బట్టి నీరు ప్రవహించడానికి అనువుగా ఉంటుంది. ఫిబ్రవరి చివర – మార్చి మొదటి వారం మధ్య... కుప్పకూలిన సొరంగ మార్గంపై నుండి నిమిషానికి 5 వేల నుండి 8 వేల లీటర్ల నీరు సొరంగంలోకి ప్రవహిస్తూ ఉంది. ఆ నీరే సొరంగంలో వివిధ ప్రాంతాల్లో 1.5 అడుగుల నుండి 2.5 అడుగుల లోతు వరకూ ఉంది. జూలై నుంచి అక్టోబర్ వరకూ భారీ వర్షాలు కురుస్తాయి. అప్పుడు నిమిషానికి సొరంగంలోకి 20 వేల నుండి లక్ష 50 వేల లీటర్ల వరకూ నీరు చేరవచ్చు. ఆ పైన భారీ నీరు నిట్ట నిలువునా సొరంగంలోకి జలపాతంలో దూకవచ్చు. ఇంత భారీ జల ప్రవాహాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ ఎలా అరికడు తుంది? వందల మీటర్ల ఎత్తు నుండి భూగర్భం గుండా మహాశక్తితో సొరంగం పైకప్పుపై విరుచుకుపడే జలపాత మది. ఇక, ఎస్‌ఎల్‌బీసీలో ఉత్తర భారతానికి చెందిన చౌక వలస కూలీలతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మందికీ తెలంగాణ ప్రభుత్వం 2–3 కోట్ల రూపాయల వరకూ పరిహారం ఇవ్వాలి. టీబీఎంతో సొరంగం తవ్వే ఉత్తర భారత కార్మి కులను... కాంట్రాక్టరు,్ల కంపెనీలు కడు హీనంగా చూస్తున్నా యని అక్కడ పనిచేస్తున్న వారి ఆవేదన వెల్లడించింది. ప్రాణ హాని ఉన్న ఈ పనికి రోజుకు 800 రూపాయల కూలీ మాత్రమే ఇస్తున్నారు. వారికి ఎలాంటి ప్రమాద బీమాలు లేవు. రక్షణలూ, చట్టబద్ధమైన పరిహారాలూ లేవు. అనేక మంది కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. ఇది అడ్డూ అదుపూ లేని దోపిడీ. అతి దుర్మార్గం. తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టబద్ధమైన హక్కులన్నీ వారికి కల్పించాలి.
-నైనాల గోవర్ధన్
వ్యాసకర్త నీటిపారుదల ప్రాజెక్టుల విశ్లేషకులు
మొబైల్ : 97013 81799
Comments
Please login to add a commentAdd a comment