nainala Govardhan
-
ఇండ్లను ఎందుకు కూల్చుతున్నారు.. మూసీ సుందరీకరణ లక్ష్యం ఏమిటి?
రాజకీయ రంగస్థలంపై మూసీ ప్రక్షాళన, పారదర్శకత లోపించి తీవ్ర వివాదాస్పద మవుతోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇండ్ల కూల్చివేతకు సంబంధించి హైడ్రాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అగ్రహం ప్రకటించింది. ‘రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏమిటని, ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడుతారని, రాజకీయ భాష్యాలు చెప్పినట్లు చేస్తే జైళ్లకు పంపు తామ’ని హెచ్చరించింది. పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారనీ, సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారనీ. ప్రభుత్వంపై, కమిషనర్ రంగనాథ్‌పై, అమీన్పూర్ తహసిల్దార్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూసీ ఆక్రమణల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎఫ్.టి.ఎల్. నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఎఫ్.టి.ఎల్ బయట ఇల్లు నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలని ఆదేశించింది.‘అసలు మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట జరుగుతున్న సుందరీకరణ లక్ష్యం ఏమిటి? మూసీ నదిని, ఆ నదిలో కలిసే వాగులను (గృహ, హోటల్, వ్యాపార, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం, మురుగునీటిని) పూర్తి (ఐరోపా ప్రమాణాల) స్థాయిలో ప్రక్షాళన (శుద్ధి) చేసి స్వచ్ఛమైన జలాలు (నది)గా మార్చే లక్ష్యం ఏమైనా ఉందా? ప్రాజెక్టు పూర్తి అయితే, అంటే ఆ మురుగు నీటిని మూసీ నదిలో కలిసే నాటికి పరిశుభ్రమైన తాగునీటిగా మార్చే ప్రక్రియ ఇందులో ఉందా? లేదా హైదరాబాద్ జంట నగరాలలోని మురుగు నీటిని శుద్ధి చేయకుండా మూసీలోకి వదిలేసి ఆ మురుగు నీటి ప్రవాహంపైనే, సుందరీకరణ చేపడతారా? ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. సమగ్రమైన ప్రాజెక్టు పూర్తిస్థాయి నివేదిక (డీపీఆర్)ను ప్రజల ముందు ఉంచాలి. ప్రజల నివాసాలకు నష్టం కలిగే ఏ ప్రాజెక్టులో నైనా ముందు పునరావాసం కల్పించే ప్రక్రియ పూర్తయిన తరువాతనే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వారి నివాసాలను చివరలో ఖాళీ చేయించే కార్యక్రమాన్ని మొదలుపెడతారు. కానీ, అందుకు భిన్నంగా సామాన్య పేద, మధ్యతరగతి ప్రజలు జీవితమంతా కష్టించి నిర్మించుకున్న ఇండ్లను ప్రాజెక్టు ప్రారంభంలోనే ఎందుకు కూల్చుతున్నారు? ఇదేనా కేసీఆర్ విధానాలకు ప్రత్యామ్నాయ ప్రజారాజ్యం?సామాన్య, మధ్యతరగతి వారికి ఒక ఇల్లు అనేది వారి మొత్తం జీవితపు కల. ఆ కల నిజం చేసుకోవడానికి జీవితంలో చాలా మూల్యం చెల్లిస్తారు. పట్టణంలో ఇల్లనే కల సాకారం కోసం సొంత ఊళ్ళలో ఉన్న పొలాలను, ఇతర ఆస్తులను అమ్ముతారు. అప్పులు తెస్తారు. అనేక కష్టాలతో వారి స్తోమతకు తగ్గ ఇల్లు నిర్మించుకుంటారు. ప్రాజెక్టు పేరుతో, పునరావాసం, ఉపాధి కల్పించకుండా ప్రభుత్వం అకస్మాత్తుగా ఆ ఇళ్లను కూల్చివేయడం ప్రజా పరిపాలన అవుతుందా?ప్రభుత్వాల, పెద్దల రియల్ ఎస్టేట్ దందాతో 10, 20 గజాల నేలపై ఇల్లు కట్టుకోవడం సామాన్య మధ్య తరగతికి ఒక గగన కుసుమంగా మారింది. అందుకే వీరు మురికి వాడలకు, దుర్గంధ నదుల పరివాహ ప్రాంతాలకు తరలు తున్నారు. చౌకగా వస్తుందని దుర్గంధపూరిత నది అంచునే స్థలం కొని, భారీ డబ్బుతో క్రమబద్ధీకరణ చేసుకొని, ఇండ్లు నిర్మించుకున్నారు. కూల్చివేతల భయంతో గుండె పోటు చావులకు, ఆత్మహత్యలకు గురవుతున్నారు. 8 నెలల నిండు గర్భిణీ అనే కనికరం లేకుండా ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గం. ఒక బాధిత కుటుంబం 25 ఏళ్లుగా మూసీ పరివాహక ప్రాంతంలోనే ఉంటూ నలుగురు కొడు కులకు పెళ్లి చేసింది. నిర్వాసితులైన వీరందరికీ ఒకే ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభించింది. ఒక్క ఇంట్లో ఇన్ని కుటుంబాలు ఎలా నివసించాలని వేదనకు గురవుతున్నారు వారు. హైడ్రాతో ప్రభుత్వానికి వచ్చిన కీర్తి, మూసి పేదల ఇళ్ల కూల్చివేతతో పాతాళంలోకి పోయింది.జల వనరులను, ప్రభుత్వ స్థలాలను, పార్కులను రక్షించవలసిందే. కానీ వాటిని ఆక్రమించి భారీ ఆస్తులుగా చేసుకున్నది సామాన్య పౌరులు కాదు. అధికారంలో ఉన్న బడాబాబులు, పెద్దలే. మూసీ నదీ గర్భంలో ఉన్న ఇళ్ల గుర్తింపునకు సంబంధించి మార్కింగ్ ప్రక్రియను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు వెళ్లడానికి ఆసక్తి చూపినా, మరికొందరు ఇండ్లను వదిలిపెట్టడానికి ససేమిరా సిద్ధంగా లేరు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆశించిన స్థానిక ప్రజలు వాటిని తమకే కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు. మూసి నిర్వాసితులు, డబుల్ బెడ్ రూమ్ సమీప ప్రజల మధ్య ఉద్రిక్తత నెలకొంది.బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అక్రమ నిర్మాణాలను గుర్తించి దాదాపు 15 వేల కుటుంబ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూములు ఇవ్వాలని 2022లోనే నిర్ణయించింది. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసి పరివాహక ప్రాంతంలో పది వేల అక్రమ నిర్మాణాలు ఉన్నాయని తేల్చారు. ఆ నిర్వాసి తులందరికీ వారి నివాసానికి, ఉపాధికి అనువైన చోట అన్ని మౌలిక వసతులతో కూడిన పునరావాస సౌకర్యాలను ప్రభుత్వం నిర్వాసితులకు కల్పించాలి. దౌర్జన్యంతో కాకుండా నిర్వాసితులను అన్ని విధాల ఒప్పించి మెప్పించి పునరావస కాలనీకి తరలించాలి.చదవండి: రిజిస్ట్రేషన్‌కు బద్ధకిస్తున్నారు.. ఆ నిబంధన మార్చాలి!శుద్ధీకరణ అంటే, మురుగు నీటిలో ఉన్న అశుద్ధ మూలకాలను, కాలుష్యాన్ని తొలగించడం. శుద్ధి చేసిన తర్వాత ఆ నీరు త్రాగడానికి అనువైన విధంగా 100% సురక్షితంగా ఉండాలి. మూసీ నది పునరుజ్జీవన ప్రాజె క్టులో నేటి ప్రభుత్వం ఆ నది మురుగు జలాలను అలా స్వచ్ఛమైన తాగునీరుగా మారుస్తుందా? దేశంలోని చాలా నగరాల్లో మురుగు నీటి శుద్ధీకరణ వ్యవస్థలు ఎన్నో ఉన్నప్పటికీ, ఎక్కడా మురుగు నీటిని స్వచ్ఛ జలాలుగా మార్చిన చరిత్ర నేటికీ లేనేలేదు. ఈ విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ తమ ప్రభుత్వ హయాంలో అంగీకరించారు. సీవరేస్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ల ద్వారా మురుగునీటి శుద్ధీకరణ 30–35% కంటే మించదనీ, తెలంగాణలోలోనే కాదు, దేశమంతా ఇదే పరిస్థితని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ పథకానికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనీ, మూసీ సుందరీకరణ ప్రాజెక్టనీ, మూసీ ప్యూరిఫికేషన్ ప్రాజెక్ట్ అనీ రకరకాల పేర్లతో మంత్రులు, అధికారులే గందరగోళం చేస్తున్నారు. మూíసీ నదిని పూర్తి స్థాయిలో ఒక ఎకలాజికల్ ప్రాజెక్టు (ఒక స్వచ్ఛమైన నది)గా తీర్చి దిద్దాలనే లక్ష్యం ఏమైనా ప్రభుత్వానికి ఉందా?చదవండి: ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ ఒక మేన్యువల్‌ను 1997లో ప్రకటించింది. ‘డిజైన్ మేన్యువల్ ఫర్ వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ ఇన్ ఇండియా’ (దేశంలోని వ్యర్థాల స్థిరీకరణ చెరువుల కోసం డిజైన్ మాన్యువల్). ఇది ప్రకటించి 27 ఏళ్ల అయింది. దీని అర్థం ఏమిటంటే... మురుగు నీటిని శుద్ధి చేయలేమని చేతులెత్తేసి, ఆ నీటిని తాగునీరులో కలవకుండా మురుగునీటిని కుంటలుగా స్థిరపరుస్తామని చెప్పడం. కోటిమంది హైదరాబాద్ నగర వాసులు వాడిన మురికి నీరు, వ్యాపార సముదాయాల వ్యర్థాలు, పరిశ్ర మలు వెదజల్లే విష పదార్థాలు మూసీ ద్వారా కృష్ణా నదిలో యధేచ్ఛగా కలుస్తున్నాయి. ఆ కలుషిత నీటినే ప్రజలు జీవజలంగా సేవిస్తున్నారు. మురుగు నీటి శుద్ధీకరణ పథ కాలకు ఎంత అందమైన పేర్లు పెట్టినా శుద్ధీకరణ వట్టిదే నని 75 ఏళ్ల దేశ చరిత్ర రుజువు చేస్తోంది. ఇది కఠిన వాస్తవం. మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొ రేషన్ లిమిటెడ్ ప్రక్షాళన ఏ రకమైనదో... డీపీఆర్‌ను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలి.- నైనాల గోవర్ధన్ తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్ -
డాలర్ ఆధిపత్యానికి బ్రిక్స్ గండి?
అక్టోబర్ 22 నుండి 24 వరకు మూడు రోజులపాటు రష్యాలోని కజాన్ పట్టణంలో బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశం జరుగనుంది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మొదలైన ఈ కూటమిలో అనేక దేశాలు చేరడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. మున్ముందు 130 దేశాలు చేరే అవకాశం ఉందని అంచనా. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటాన్ని తగ్గించే క్రమంలో ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. డాలర్‌కూ, బంగారానికీ సంబంధాన్ని తొలగించిన అమెరికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది.2024 సంవత్సర బ్రిక్స్ శిఖరాగ్ర సమావే శాలకు రష్యా అధ్యక్షత వహిస్తోంది. వివిధ దేశాల అత్యున్నత నాయకులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. బ్రిక్స్ విస్తరణ తర్వాత జరుగుతున్న కీలకమైన సమావేశం కాబట్టి, బ్రిక్స్‌లో కొత్త సభ్యులను చేర్చడంతో పాటు, బ్రిక్స్ విస్తరణ కోసం యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేయడం మీద చర్చ ప్రధానంగా ఉంటుంది. ప్రత్యామ్నాయ చెల్లింపుల వ్యవస్థ స్థాపనను ప్రోత్సహించడం, శీతోష్ణస్థితి మార్పులను ఎదుర్కోవడం, ఇంధన సహకారాన్ని పెంపొందించడం, సప్లై చైన్‌ను రక్షించడం, దేశాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉంటాయని ఒక కీలక చైనా పరిశోధకుడు వెల్లడించారు.ఎందుకీ ప్రత్యామ్నాయ వ్యవస్థ?అమెరికా డాలర్ ఆధిపత్యం కింద ప్రపంచం ఎనిమిది దశా బ్దాలుగా నలిగిపోతోంది. 1944లో బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారా ఉని కిలోకి వచ్చిన ఈ వ్యవస్థపై పశ్చిమ దేశాలు కూడా ప్రబలమైన శక్తి కలిగి ఉన్నాయి. అమెరికా ఆధిపత్యంతో పాటు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ప్రపంచం బీటలు బారింది. ప్రపంచీకరణను చైనా చక్కగా వినియోగించుకుని అమెరికా, పశ్చిమ దేశాలను వెనక్కు కొట్టింది. అమెరికా స్వదేశీ విదేశీ అప్పు, ప్రమాదకరంగా 50 ట్రిలియన్ డాలర్లకు చేరింది. మరో వైపున చైనా ప్రపంచ రెండవ ఆర్థిక శక్తిగా ఎదిగి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అద్భుతాలను నెలకొల్పుతోంది.ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థల విశ్లేషణ ప్రకారం, బైడెన్ పదవీ కాలంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా వాటా 15% కంటే తక్కువకి పడిపోయింది. 1999లో 21% కంటే ఎక్కువగా ఉన్నది, స్థిరమైన క్షీణత చూసింది. చైనా 18.76%తో పెద్ద వాటాను కలిగి ఉంది. దశాబ్దాల క్రితపు అమెరికా ఆధిపత్య ప్రపంచ క్రమం, నేటి వాస్తవాలకు తగ్గట్టుగా లేదు. సంపన్న దేశాలు, పేద దేశాలను అన్ని విధాలా అణిచివేస్తున్నాయి. ఈ కాలంలో అమెరికా 210 యుద్ధాలు చేసింది. 180 యుద్ధాలలో ప్రత్యక్షంగా పాల్గొంది. ప్రపంచ ప్రజలకు అమెరికా ఆధిపత్య కూటమిపై నమ్మకం పోయింది. అందుకే, ప్రపంచ ప్రజలందరి ప్రయోజనాలకు, సమానత్వానికి ఉపయోగపడేలా, ప్రత్యామ్నాయ ఆర్థిక, రాజకీయ, న్యాయమైన బహుళ ధ్రువ ప్రపంచ వాణిజ్య వ్యవస్థను నెలకొల్పాల్సిన, నేటి అసమాన ప్రపంచ క్రమాన్ని సమగ్రంగా సంస్కరించవలసిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్ తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో మొదలై(బ్రిక్), తర్వాత సౌత్ ఆఫ్రికాను కలుపుకొంది. అటుపై ఈజిప్ట్, ఇథియో పియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను భాగస్వామ్యం చేసుకుంది. ఇంకా అనేక దేశాలు చేరే అవకాశం ఉంది. 23 దేశాలు అధికారికంగా దరఖాస్తు పెట్టుకున్నాయి. కరేబియన్ దేశా లలో భాగమైన క్యూబా విదేశాంగ మంత్రి తాము కూడా బ్రిక్స్‌లో భాగం అవుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు లేఖ రాశారు. శ్రీలంక విదేశాంగ మంత్రి పాల్గొంటారని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు. ఒక విశ్లేషణ ప్రకారం, బ్రిక్స్‌లో 130 దేశాలు చేరే అవకాశం ఉంది. ఊపందుకున్న డీ–డాలరైజేషన్బ్రిక్స్ దేశాలు 65 శాతం లావాదేవీలను తమ దేశీయ కరెన్సీలలో జరుపుతున్నాయి. ఈ ధోరణి వేగంగా పెరుగుతూ, ఆధిపత్య దేశాల ఆంక్షలకు, భూ భౌగోళిక ఉద్రిక్తతలకు దారితీస్తోంది. రష్యా ఆర్థిక మంత్రి జాతీయ కరెన్సీలు, రష్యా రూబుల్‌ను బ్రిక్స్‌లో ఉపయోగిస్తు న్నామన్నారు. పశ్చిమ దేశాల ఆర్థిక వ్యవస్థ పైన ఆధారపడటం తగ్గించే క్రమంలో చరిత్రలో ఎన్నడూ లేని ఒక గణనీయమైన మార్పు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది.బ్రిక్స్ తర్వాత, మరో కూటమి ‘కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్’ (సీఐఎస్) కూడా డీ–డాలరైజేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, మాల్దోవా, రష్యా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి తమ జాతీయ కరెన్సీలతో 85% సరిహద్దు లావాదేవీలను జరిపింది. వాణిజ్యంలో అమెరికా డాలర్‌ను ఉపయోగించడం నిలిపివేసింది. సీఐఎస్ దేశాల మధ్య పరస్పర వాణిజ్యం స్థానిక కరెన్సీలలో జరగడంతో, డాలర్ ఉపయోగం 85% తగ్గిపోయిందని బ్రిక్స్, సీఐఎస్ రూపకర్తల్లో కీలకమైన రష్యా ప్రకటించింది. శాశ్వతంగా అమెరికా డాలర్ పైన ఆధారపడటం తగ్గిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. రష్యా చైనాల మధ్య గత ఏడాది జరిగిన 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంలో డాలర్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, యువాన్ రూబుల్‌లలో కొనసాగించాయి.ఉక్రెయిన్, రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు చెందిన 300 బిలియన్ డాలర్లకు పైగా కరెన్సీని అమెరికా ప్రపంచ బ్యాంకింగ్ నెట్వర్క్ ‘షిఫ్ట్’ స్తంభింపజేసింది. ఇరాన్, వెనిజువేలా, ఉత్తర కొరియా, అఫ్గానిస్తాన్ లాంటి అనేక దేశాల డాలర్ల డబ్బును అమెరికా భారీగా స్తంభింపజేసింది. ఇది వేగంగా డీ–డాలరైజేషన్‌కు దోహదం చేసింది. డాలర్ నుంచి గ్లోబల్ సౌత్ దూరంగా వెళ్ళింది. ఈ దేశాల మధ్య స్థానిక కరెన్సీ మార్పిడి బాగా పెరిగింది. రూబుల్‌ను ‘రబుల్’ (నిర్వీర్యం) చేస్తామంటూ రష్యాపై బైడెన్ విధించిన ఆంక్షలు బెడిసి కొట్టాయి. అమెరికా 1971లో నిక్సన్ కాలంలో డాలర్‌కూ బంగారానికీ మధ్య సంబంధాన్ని తొలగించింది. వాస్తవ ఉత్పత్తితో సంబంధం లేకుండా‘డాలర్ కరెన్సీ’ని పిచ్చి కాగితాల వలె ముద్రించింది. అమె రికాకు భిన్నంగా బంగారం మద్దతు గల ట్రేడింగ్ కరెన్సీతో పాటు, మల్టీ కరెన్సీ ఫ్లాట్ ఫామ్‌ను బ్రిక్స్ ఆవిష్కరించే అవకాశం ఉంది. ‘అట్లాంటిక్ కౌన్సిల్’ ‘డాలర్ డామినెన్స్’ మీటర్ ప్రకారం, అమెరికా డాలర్ నిలువలలో బ్రిక్స్ దేశాల వాటా గణనీయంగా తగ్గి పోయింది. ‘స్విఫ్ట్’ (ప్రపంచవ్యాప్త అంతర్‌బ్యాంకుల ఆర్థిక టెలీ కమ్యూనికేషన్స్ వ్యవస్థ)కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ చెల్లింపుల వ్యవస్థ కట్టుదిట్టంగా రూపొందింది. బ్రిక్స్ చైనా కేంద్రంగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ ‘సీబీడీసీ’ ఏర్పాటు చేసింది. ఈ డిజిటల్ కరెన్సీతో ఇప్పటికే 60 దేశాల కేంద్ర బ్యాంకుల మధ్య అంతర్జాతీయ స్థాయిలో రిహార్సల్స్ జరిగాయనీ, మరిన్ని దేశాల మధ్య జరుగుతున్నాయనీ వివిధ అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి.ఇండియా దారి?ఇజ్రాయిల్– పాలస్తీనా–హెజ్‌బొల్లా్ల(లెబనాన్) యుద్ధం వల్ల ముడి చమురు ధరల పెరుగుదల, విదేశీ నిధులు చైనాకు తరలిపోవడం, విదేశీ బ్యాంకుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరగడం వంటి కారణాలతో రూపాయి భారీగా పతనమైంది. రూపాయి మారకపు విలువ చరిత్రలో మొట్టమొదటిసారి అమెరికా డాలర్‌తో అత్యంత దిగువ స్థాయికి అంటే 84.08 రూపాయలకు పడి పోయింది. మంద గమనంలో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు చైనా ప్రకటించిన ద్రవ్య ఆర్థిక చర్యల తర్వాత విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు ‘ఇండియా స్టాక్స్ విక్రయించండి, చైనా స్టాక్స్ కొనండి’ అనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. చైనా స్టాక్‌లు చౌకగా ఉండటం వల్ల ఇండియా డబ్బంతా చైనాకు తరలిపోతోంది.ప్రపంచ కరెన్సీగా ఉన్న డాలర్ అమెరికా ప్రయోజనాలకూ, ఇతర దేశాలపై భారీ ఆంక్షలుకూ పనికివచ్చింది తప్ప, మరే సమానత్వ ప్రయోజనమూ డాలర్లో లేదు. కాబట్టి బ్రిక్స్ కూటమితో కలిసి, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయ విధానాలను, కరెన్సీని ఆవిష్కరించడం తప్ప, భారత్ బాగుకు మరో దారి లేదు.నైనాల గోవర్ధన్ వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి కన్వీనర్మొబైల్: 97013 81799 -
దొంగ చేతిలో వాటర్ గ్రిడ్ తాళం
సందర్భం ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నీటి సరఫరా పనుల్లో ఏ ప్రమాణాలనూ వాప్కోస్ పాటించలేదు. అలాంటి వాప్కోస్ను తెలంగాణకు శాశ్వతంగా సాగు, తాగునీటిని అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్యవేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? వాటర్ అండ్ పవర్ కన్సె ల్టెన్సీ (వాప్కోస్) తెలంగాణలో అత్యంత వివాదాస్పద మైన సంస్థగా ప్రజలముందు నిలుస్తోంది. కార్పొరేట్ దోపిడీ లీలలు ప్రజలు పోరాడి సాధిం చుకున్న తెలంగాణలో వెలుగు చూడటమే కలవరపెడుతోం ది. వైఎస్ హయాంలో వాప్ కోస్ డీపీఆర్ ఆధారంగానే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టును చేపట్టగా 9 వేల కోట్ల పనులయ్యాయి. తెలంగా ణకు ఎనలేని మేలు చేసే ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణా నికి తుమ్మిడి హెట్టి అన్ని విధాల అనువైనదని ఆనాడు వాప్కోస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం వాప్కోస్ గత డిజైన్లోనే 1,500 కోట్ల పనులు చేసిందనేది గమనిం చాలి. ప్రాణహితపై వాప్కోస్ ఇచ్చిన నివేదికను ఆ సంస్థే తలకిందులు చేసి, కాళేశ్వరం-మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చి వేల కోట్ల దుర్వినియోగం చేసి, నిర్మించిన భారీ కాలువలు నిరుపయోగమయ్యాయి. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా, రైతు సంఘాలు, విశ్రాంత ఇంజనీర్లు, వారి సంఘాలు, మేధావులు, ప్రజలందరు ఈ రీడిజైన్‌ను వ్యతిరేకించి ఉద్యమిస్తూనే ఉన్నాయి. వ్యాప్కోస్ మేడిగడ్డ సర్వేకు అనేక కోట్ల ఫీజు తీసుకొని, లైడార్ లేజర్ సర్వే చేసి, కాళేశ్వరం నుండి ఎల్లంపెల్లికి కాల్వ, సొరంగానికి 150 క్రాసింగ్‌లు, అడ్డంకులున్నాయని, అసాధ్యమని తేల్చి, ప్రతిపాదించిన ప్రభుత్వమే ఈ రీడిజైనింగును రద్దు చేసింది. ఎల్లంపెల్లి నుండి దారిలో ఉన్న జిల్లాలు, హైద రాబాద్‌కు నీరందించే పథకంలో వాప్కోస్ చేస్తున్న ఘోరమైన తప్పులపై మెట్రో వాటర్ వర్క్స్ దుమ్మెత్తి పోసింది. వాప్కోస్ ఏ ఒక్క తప్పును సరిదిద్దుకోకపోగా, జవాబిచ్చే బాధ్యతనూ విస్మరించింది. 'మౌలానా అబ్దుల్ కలాం హైదరాబాద్ సుజల స్రవంతి' గోదావరి తాగునీటి పథకం దశ-1తో ఎల్లంపెల్లి నుండి హైదరాబాద్‌కు నీళ్లు తరలించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పథకంపై సర్వేకు వాప్కోస్ను నియ మించారు. ఈ పథకం అకౌంట్స్ జనరల్ 17.11.2012న వాప్కోస్ తప్పులపై షోకాజ్ నోటీస్ జారీచేశారు. వాప్ కోస్ అర్హత, అనుభవం లేని ఇంజనీర్లను వినియోగిస్తుం దని. ఒక ప్యాకేజీలో ఉన్న అదే పేర్లు గల ఇంజనీర్లనే మరో ప్యాకేజీలో వినియోగిస్తుందని నిర్దిష్టంగా వాప్ కోస్‌ను ఆ లేఖలో తీవ్రంగా మందలించింది. మెట్రో వాటర్‌వర్క్స్ డీజీఎం వాప్కోస్ ప్రాజెక్టు డెరైక్టర్‌కు రాసిన మరో లేఖలో వాప్కోస్ తప్పులను తూర్పారబట్టారు. అర్హత, ఏ మాత్రం అనుభవం లేని యువ ఇంజనీర్లను నియమిస్తున్నారు. 14 మంది సీని యర్ ఇంజనీర్లు ఉండవలసిన చోట, కేవలం ఎలాంటి అర్హత, అనుభవం లేని అప్పుడే చదువులు పూర్తి చేసు కున్న ఆరుగురు జూనియర్ ఇంజనీర్లను, సర్టిఫికెట్లు కూడా రాని ఇంజనీర్లను వాప్కోస్ కారు చౌక జీతాలు చెల్లించి కుదుర్చుకుంది. అనుభవలేమితో ప్రాజెక్టుల భవిష్యత్తునే వాప్కోస్ ప్రశ్నార్థకం చేస్తోంది. కేంద్ర నీటిశాఖ నిబంధనల ప్రకారం వ్యాప్కోస్ పనిచేస్తున్న రాష్ట్రాలలో అత్యున్నత సాంకేతిక సౌకర్యా లతో సెంట్రల్ లాబొరేటరీ ఉండాలి. అన్ని సాంకేతిక వసతులున్న మొబైల్ లాబొరేటరీ ఉండాలి. కానీ వాప్ కోస్కు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయిది పక్కకు పెడితే ఏ స్థాయి పరిశోధనా సంస్థాలేదు. ప్రమాణాలను పాతరేసిన వీరి తప్పుడు నివేదికల ఆధారంగా వేల కోట్లతో ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మిస్తే ఎన్నిచోట్ల పేలుతున్నాయో చూస్తూనే ఉన్నాం. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లయి స్కీమ్ ప్రాజెక్టు ఫేస్-1, ప్యాకేజీ-2లో ప్రాజెక్టు మేనేజర్‌గా పని చేస్తున్న పీఎస్ కాశీనాథ్ (రిటైర్డ్ సీఈ) వాప్కోస్కు, హెచ్ఎం డబ్ల్యూఎస్ఎస్బీకి తేది 3.8.2013న లేఖ రాశారు. ప్రతి ప్యాకేజీలో 14 మంది 15 సంవత్సరాలు ఆపై అర్హత, అనుభవంగల ఇంజనీర్లుండాలని, సెంట్రల్ ట్యాబ్, మొబైల్ ట్యాబ్ ఉండాలనీ, అయితే అమలు చేయవల సిన వాప్కోస్ పీడీ దీనికి విరుద్ధంగా ప్యాకేజ్-1ను ఏ మాత్రం అనుభవం లేని ఉప కాంట్రాక్టర్లకిచ్చారు. ఉప కాంట్రాక్టర్లకు ఇవ్వడం అగ్రిమెంట్ నిబంధనలకు విరు ద్ధం. జీతాలివ్వని వారిని, జీతాల గురించి దీనంగా అడ గడానికి వెళ్లిన పేద ఇంజనీర్లను, వాప్కోస్ పీడీ, నాకు మీ జీతాలతో ఎలాంటి సంబంధం లేదని బుకా యించారు. సర్వే పనులు సాగుతున్న చాలా పని స్థలాల వద్ద వాప్కోస్కు ఎక్కడా ఒక కార్యాలయం, ప్రాజెక్టు మేనే జర్ లేరు. 3, 4 గురు అనుభవంలేని ఇంజనీర్లతో కాలం వెళ్లబుచ్చుతోంది. అదే సమయంలో ప్రభుత్వాల నుండి 14 మంది సీనియర్ ఇంజనీర్ల పేర కోట్లు కాజేస్తోంది. వాప్కోస్ దోపిడీ తెలంగాణ ప్రభుత్వంలోనూ మారక పోగా మరింత పెరిగింది. క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అస్యూరెన్స్, ప్రాజెక్టు మేనేజ్మెంట్ల గురించి వాప్కోస్ లక్ష్యాలుగా చెప్పుకొంటుంది. కానీ ఈ ఏ అర్హతలు వాప్ కోస్కు లేవు. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు జరి గిన నీటి సరఫరా పనులలో పై ఏ నియమాలను, ప్రమా ణాలను వాప్కోస్ పాటించలేదు. పైగా తుంగలో తొక్కింది. ఎల్లంపెల్లి నుంచి హైదరాబాద్ వరకు నిర్మిం చిన పైపులతో నీళ్లందించినప్పుడు పాటించిన ప్రమా ణాలెంతటివనేది తేలుతుంది. అలాంటి వాప్కోస్ను తెలంగాణ జనావళికి శాశ్వతంగా ఉపయోగపడే సాగు, తాగునీరును అందించే 40 వేల కోట్ల వాటర్ గ్రిడ్ పర్య వేక్షణ కోసం నియమించడం హేతుబద్ధమైందా? ప్రమా ణాలు పాటించని, పైసలే ప్రమాణాలైన వాప్కోస్కు ఎలాంటి టెండర్లు లేకుండా తెలంగాణ వాటర్ గ్రిడ్ కన్సెల్టెన్సీగా నెలకో కోటితో ప్రభుత్వం కట్టబెట్టి నట్లు వార్తలు వస్తున్నాయి. నిజమేమిటో తెలంగాణ ప్రభు త్వమే వెల్లడించాలి. వ్యాసకర్త: తెలంగాణ జలసాధన సమితి కార్యదర్శి, నైనాల గోవర్ధన్. మొబైల్:9701381799 -
ప్రాణహిత ప్రాజెక్టు తరలింపుతో నయా నీటి దోపిడీ!
సందర్భం మనం నినదించిన తెలంగాణ గుండెకాయ నినాదాలు నేడు ఏమైనాయి? ప్రాణహిత నీళ్లు, ప్రాణహిత నది పుట్టిగిట్టిన స్థానిక జిల్లాకే చుక్క నీరు ఇవ్వకుండా కాళేశ్వరానికి బ్యారేజీ మార్చి, ప్రపంచంలోనే భారీ నీటి దోపిడీ చేసే ఈ తెలంగాణ పాలననేనా మనం కోరుకున్నది? ఇదా బంగారు తెలంగాణ? కానే కాదు. ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, నల్లగొండజిల్లా లకు సాగు, తాగునీరందించ డంతో పాటు, జంటనగరాల కు తాగునీరు, పరిశ్రమలకు నీరందించే ఉద్దేశంతో 2008 లో నిర్మాణం ప్రారంభమైన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మన జిల్లా నుంచి తరలించి కాళేశ్వరంలో ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసు కొన్నది. మన జిల్లా కౌటాల మండలం తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరంలో నిర్మించి అక్కడి నుంచి కరీంనగర్, వరంగల్ జిల్లాల మీదుగా మిగతా తెలంగాణ జిల్లాలకు నీటి మళ్లింపు జరిపే పద్ధ తిలో ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులు చేయాలని ముఖ్య మంత్రి కె.సి.ఆర్. అధికారులకు ఆదేశాలిచ్చారని అన్ని పత్రికలలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే అత్యంత వెనుకబడిన మన ఆదిలాబాద్ జిల్లాకు ప్రాణ హిత నీరు ఒక చుక్క కూడా దక్కదు. జిల్లాలోని రైతులు, ఇతర వర్గాల ప్రజలతోపాటు జిల్లా మొత్తానికి తీరని నష్టం జరుగుతోంది. దివంగత రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సమగ్ర పరిశీ లన చేశాకే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీని కౌటాల మండలం తుమ్మిడి హెట్టి గ్రామం వద్ద నిర్మించాలని నిర్ణయించి 2008లో శంకుస్థాపన చేసింది. నేడు అలా కాకుండా దాన్ని తలకిందులు చేసి, కాళేశ్వరం వద్దకు ప్రాజెక్టు నిర్మాణాన్ని మార్చాలని నూతన తెలంగాణ రాష్ట్ర సి.ఎం. కె.సి.ఆర్. నిర్ణయించడం, ‘ప్రాణహిత ఎత్తి పోతలపై వైఎస్ఆర్ హయాంలో సర్వే చేసిన వ్యాప్కో’ అనే సంస్థనే మళ్లీ సర్వేకు ఆదేశించడం క్షణాల్లో జరిగి పోయాయి. ప్రాణహిత నది పుట్టిన ఆదిలాబాద్ జిల్లాను ఎండబెట్టి, ఇక్కడి ప్రజలకు నీరందకుండా చేసేవిధంగా ప్రాజెక్టు డిజైన్‌లో మార్పులకు తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ కడితే మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతున్నది కాబట్టి కాళేశ్వరా నికి మార్చుతున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇది పూర్తిగా అసంబద్ధ వాదన. తుమ్మిడి హెట్టి (కౌటా ల)లోనే మహారాష్ట్ర ప్రాంతం ఉన్నట్లు, కాళేశ్వరంలో ఒక వైపు అసలు మహారాష్ట్రతో సంబంధమూ, పని లేనట్లు ఎందుకు ఆదిలాబాద్ జిల్లానూ, తెలంగాణ ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు? తుమ్మిడి హెట్టి వద్ద తృణమంత ఖర్చుతో పోయేది. కాళేశ్వరం వద్ద వందల వేల కోట్లయ్యే కుట్రల్లో ఆంతర్యమేమిటి? తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత నది లోయగా ఉం డి, ‘వెడల్పు అతి తక్కువగా ఉంటే, కాళేశ్వరం ప్రాంత గోదావరి నది అతి వెడల్పుగాను బల్లపరుపుగా ఉంటుం ది. అతి వెడల్పున్న చోట అతి పొడవాటి స్పిల్‌వే (గేట్లు బ్రిడ్జ్) నిర్మించాలి (బల్లపరుపుగా ఉన్న చోట నీరు ఎక్కు వగా నిలవాలంటే అతి ఎత్తుగా ప్రాజెక్టు నిర్మించవలసి ఉంటుంది. అతి ఎత్తుగా నిర్మించవలసి వచ్చినప్పుడు రెండువైపులా బల్లపరుపు భూమిలో నీరు చాలా విశాల మైన భూవిస్తీర్ణంలో అతి తక్కువ నీరు నిలిచి ఉంటుంది. దీన్ని బట్టి తుమ్మిడి హెట్టికంటే మహారాష్ట్ర ముంపు, భూమి బూచీ కాళేశ్వరం వద్దే అధికంగా ఉంటుందని అర్థమవుతోంది. తుమ్మిడి హెట్టి ఖర్చు రీత్యా, నీరు నిలిచే సామర్థ్యం రీత్యా భద్రత రీత్యా భూవైశాల్యం రీత్యా అన్ని విధాలా అత్యంత అనువైంది. కాళేశ్వరం ఖర్చు రీత్యా, నీటి సామ ర్థ్యం రీత్యా, ముంపురీత్యా, పర్యావరణ అనుమతుల రీత్యా, గోదావరి నది వెడల్పు రీత్యా, ఆధ్యాత్మక చారి త్రక కేంద్రం. కాళేశ్వరంకు తలెత్తే ప్రమాద రీత్యా అక్కడ బ్యారేజీ నిర్మాణం ఎంత మాత్రం సరైనది కాదు. ప్రాణహిత కాలువ తుమ్మిడి హెట్టి నుంచి చేవెళ్ల వరకు 1,050 కి.మీ. దూరంలో మరెక్కడా ఇన్ని కి.మీ. గ్రావిటీలో ఎత్తిపోతలు లేకుండా ప్రవహించదు. కాళేశ్వ రం వద్ద 50 మీ. పైకి నీరు ఎత్తిపోయాలి. 8.5 మెగావాట్ల చొప్పున 425 మె.వా. కరెంటు అదనంగా అవసరం అవుతుంది. నేటి ఖర్చు కంటే వేల కోట్ల ఖర్చు పెరుగు తుంది. కాళేశ్వరానికి బ్యారేజీ మార్చడం ఆదిలాబాద్ ప్రజలను సమాధి చేయడమే. 5 వేల కోట్లతో నిర్మించిన కాలువలు, భూమి, ప్రజాధనం బూడిదపాలే. ప్రకృతికి విరుద్ధంగా, ఆంధ్రపాలకులంటున్న వారికంటే ఘోరం గా, నది పుట్టిన జిల్లాను నట్టేటముంచే నీటిదోపిడీ అన్యా యాన్ని ఎదిరించాలి. ‘‘మా నీళ్లు మాకు, మా వనరులు మాకు, మా ఖని జసంపద మాకు, మా ఉద్యోగాలు మాకు, స్థానిక వన రులు ముందు స్థానిక ప్రజలకు’’. ఇదీ తెలంగాణ నినా దం. ముందు స్థానికులకు ఇచ్చాక, వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఏ వనరులైనా కేటాయించాలి. అధికారం, రాజకీయ బలం ప్రాతిపదికగా కాదు? మనం నినదిం చిన తెలంగాణ గుండెకాయ నినాదాలు నేడు ఏమై నాయి? ఎందరో అమరులై, సమస్త జనులు సంఘ ర్షించిన తెలంగాణలో నేడు జరుగుతున్నదేమిటి? మనం పోరాడిన ఆకాంక్షలు తెలంగాణ పునర్నిర్మాణంలో అమ లవుతున్నాయా? ప్రాణహిత నీళ్లు, ప్రాణహిత నది పుట్టి గిట్టిన స్థానిక జిల్లాకే చుక్క నీరు ఇవ్వకుండా (గిట్టిం చేలా), కాళేశ్వరానికి బ్యారేజీ మార్చి, ప్రపంచంలోనే భారీ నీటి దోపిడీ చేసే ఈ తెలంగాణ పాలననేనా మనం కోరుకున్నది? ఇదా బంగారు తెలంగాణ? కాదు. అత్యం త వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీ-గిరిజను లను, చివరికి అనేక జిల్లాలను సమాధి చేసే తెలంగాణే నేడు సాగుతోందా? మీరు తెలంగాణ కోసం దేనికి సం ఘర్షించారో సింహావలోకనం చేసుకుని, మరెప్పుడూ తప్పుచేయని సామాన్యుల తెలంగాణకై ముందు కెళతారని ఆశించవచ్చా? (వ్యాసకర్త ప్రాణహిత ప్రాజెక్టు రక్షణ వేదిక నాయకులు) మొబైల్: 9701381799 -
తెలంగాణ కశ్మీరం కంట ‘కన్నీరు’
సందర్భం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి రావలసిన నీటి విషయంలో గత 40 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. ఇక్కడ వందల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు వంద ఎకరాలకు నీళ్లివ్వని దుస్థితి దాపురించింది. ఆదిలాబాద్ జిల్లా అక్షరక్ర మంలో ముందున్నా, అభివృద్ధిలో అన్ని విధాలా వెనుకబడింది. దీనిని ఆదర్శ జిల్లాగా 1985లోనే నాటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్. ప్రకటించినా, ఇతర జిల్లాలతో పోల్చినప్పు డు ఇక్కడ జరిగిన అభివృద్ధి నామమాత్రం. అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, జిల్లా నుంచి మంత్రులు ఎవరైనప్ప టికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. ఏ జిల్లాకు లేని విధంగా ఒకవైపున గోదావరి, మరోవైపున ప్రాణహిత, ఇంకోవైపున పెన్‌గంగా, వార్ధానదులు ప్రవహిస్తున్నా యి. అనేక అంతరనదులు, వాగులు పారుతున్నాయి. 2013 వర్షాకాలంలో గోదావరి నది నుంచి అన్ని జిల్లాల గుండా సముద్రంలో కలిసిన నీరు మొత్తం 4,657 టీఎంసీలు. ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి, పెన్‌గంగ, ప్రాణహిత నదులగుండానే 1,500 టీఎంసీల నీరు సముద్రంలో వృథాగా కలిసింది. ప్రతిఏటా వం దల టీఎంసీల నీరు వృథాకాని కాలం ఉండదు. అతి చిన్న కడెం నది నుంచి గత 40 సంవత్సరాలలో 1,400 టీఎంసీల నీరొస్తే, 800 టీఎంసీల నీరు వృథాగా సము ద్రంలో కలిసింది. 2013లో ఈ ఒక్క నది నుంచి 50 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసింది. ఈ ఏడాది తెలంగాణ, తీవ్ర కరువు కోరల్లో చిక్కుకొంది. మూడో వంతు భూభాగానికి తడితగల లేదని ప్రభుత్వ మే అధికారికంగా ప్రకటించింది. భయంకర కరువులో కూడా పెనుగంగ, ప్రాణహిత నదుల తీవ్రమైన వరదలు రెండు మూడుసార్లు ముంచెత్తాయి. ఇన్ని నీటి వనరులు రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేవు. ఆంధ్ర పాలకుల పక్షపాతం, జిల్లా బడా నాయకుల అల సత్వం, తగిన శ్రద్ధ అవగాహన లేకపోవుట, దారుణ నిర ్లక్ష్యం వల్ల జిల్లాకు తీరని నష్టం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లాకు రావలసిన నీటి విషయంలో గత 40 ఏళ్లుగా అన్యాయం జరుగుతోంది. శ్రీరాంసాగర్ నుంచి గత 30 సంవత్సరాలలో 2,900 టీఎంసీల నీరు కాలువలకు విడుదల చేస్తే, 2,700 టీఎంసీలకు పైగా కాకతీయ కాలువకు పోతే, ఆదిలాబాద్ కాలువకు 79 టీఎంసీలు మాత్రమే వచ్చింది. నిర్మాణంలో ఉన్న ‘ఎల్లంపల్లి’లోనూ తీవ్రమైన అన్యాయం జరిగింది. ఉట్నూరు డివిజన్లో 2,43,961 ఎకరాలు సాగులో ఉండగా, సాగునీరు లభిస్తున్నది. రెండు వేల ఎకరాల కంటే తక్కువే. అనగా మొత్తం మీద సాగుకు వర్షమే ఆధారం. సాగునీరు లేక పోగా కనీసం తాగునీరు కూడా లేదు. వాగులు వంకలు చెలిమలే ఆధారం. కొన్నిచోట్ల 2 కి.మీ. నుంచి 5, 6 కి.మీ వరకు మంచినీటి కొరకు వెళ్లా ల్సిన దుస్థితి. అంతదూరం నుంచి తెచ్చినా అవి కలుషిత జలాలే. కలుషిత జలాలు తాగడం వల్ల, ప్రతి ఏడాది విషజ్వరాలు వచ్చి వందల మంది ఆదివాసీలు చనిపో తున్నారు. చివరకు బోర్ల ద్వారా చేతి పంపుల నుంచి వచ్చే భూగర్భ జలాలలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండి, ఐక్య రాజ్య సమితి నివేదిక ప్రకారం ‘ఆదిలాబాద్ ఆదివాసీ లు ఆఫ్రికా ప్రజల కంటె వెనుకబడ్డారు.’ ఆదిలాబాద్ జిల్లాకు దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెనుగంగ, తూర్పున ప్రాణహిత నదితో మూడు వైపుల నదులుంటాయి. జిల్లాలో అనేక నదులున్నాయి. జి5/ 32 నుంచి జి5/64 వరకు 33 భారీ ఉపనదులు బాసర్ నుంచి చెన్నూర్ వరకు గోదావరిలో కలిసే జి7/1 నుంచి జి7/8 పెనుగంగ నదిలో 8 భారీ ఉపనదులు కోజన్ గూడ నుంచి ఉమ్రి వరకు కలుస్తాయి. జి8/2 నుంచి జి8/5 వరకు 4 భారీ ఉపనదులు వార్దా నదిలో కలు స్తాయి. కేంద్ర ప్రభుత్వ ప్రముఖ సాధికార సంస్థ కేంద్ర జల సంఘం (సిడబ్ల్యూసీ) గుర్తించిన ప్రధాన ఉపనదు లు, జిల్లాలోని వివిధ ప్రధాన నదులలో కలుస్తాయి. వందల కోట్లతో కట్టిన ప్రాజెక్టులు వంద ఎకరాలకు నీళ్లివ్వని దుస్థితి దాపురించింది. కొమురం భీం ప్రాజెక్టు 450 కోట్లతో కట్టారు. అయినప్పటికీ నాలుగు ఎకరాలకు కూడా నీరు పారదు. 6 వేల ఎకరాలకు అందిస్తామని 35 కోట్లతో నిర్మించిన ర్యాలీ వాగు ప్రాజెక్టు 300 ఎకరాలకు కూడా నీరివ్వడం లేదు. ధనయజ్ఞంలో 30 వేల ఎకరా లకు నీరివ్వాలని 160 కోట్లతో నిర్మించిన గూడెం ఎత్తి పోతల పైపులైన్లు ట్రయల్న్‌ల్రో అవినీతి చెదలు తగిలి పేలిపోతున్నాయి. శ్రీరాంసాగర్ దక్షిణ (కాకతీయ) కాలువ 345 కి.మీ.ల మేరకు నల్గొండ వరకు పోతే. అదే నెహ్రూ శంఖుస్థాపన చేసిన చెన్నూర్ ప్రాణహిత నది వరకు వెళ్లే ‘గోదావరి ఉత్తర కాలువ’ అడుగు కూడా కదలలేదు. ‘తెలంగాణ పల్లెలకు ‘స్వర్ణయుగం, జీవధార’గా ప్రభు త్వం ప్రచారం చేస్తోన్న ‘ప్రాణహిత-చేవెళ్ల’ గురించి చెప్పుకుంటే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఈ చిట్టచివరి ప్రాజెక్టులో కూడా తీరని అన్యాయం జరుగు తోంది. 210 టీఎంసీలు ఇతర జిల్లాలకు తరలిస్తూ ముష్టి 7 టీఎంసీలు ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించారు. ప్రాణహిత ప్రాణం తొడుక్కొని గోదావరిలో ఇదే జిల్లాలో సంగమించిన జిల్లాకే తెలంగాణ ప్రభుత్వం నికర నీళ్లు నేటికీ కేటాయించలేదు. కోదండరాం మండ లానికి 600 ఎకరాలకే నీరివ్వాలనే నిర్ణయంలో వివక్ష వెల్లడవుతోంది. సాగునీటి విషయంలో జిల్లాకు గతం నుంచి జరుగుతున్న వివక్షత, అన్యాయాలకిది పరాకాష్ట. సొంత జిల్లాకు నీళ్లివ్వకుండా సుదూరం తరలించడం అన్యాయం. ఆర్భాటంగా చేపట్టిన జలయజ్ఞంలో జిల్లాకు దారు ణమైన అన్యాయం జరిగింది. ఎల్లంపల్లి మొదటి దశ నుంచి రెండో దశకు మార్చి, తర్వాత ప్రాణహిత నుంచి ఇస్తామన్నారు. జిల్లాలో చిట్టచివరి ప్రాణహిత- చేవెళ్ల- ఎల్లంపల్లి నుంచి కూడా మొండి చేయి చూపిస్తు న్నారు. ఎత్తిపోతల పథకాలలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజె క్టులో 22 లిఫ్ట్‌లు ఉపయోగించి 500 మీటర్ల ఎత్తుకు ఎగువకు నీరు తరలిస్తున్నారు. మా ప్రతి చుక్క నీరు మాకు చెందకుండా ఎగువ జిల్లాలకే 16 లక్షల 40 వేల ఎకరాలకు నీరు తరలిస్తున్నారు. మంజీర (సింగూరు) నీళ్లు మెదక్ ఎండిన బీళ్లకు మళ్లిస్తామని కేసీఆర్, హరీష్ రావు అంటున్నారు. కానీ ఆదివాసులు అధికంగా మరణి స్తున్న, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆదిలాబాద్‌కు ప్రాణహిత, గోదావరి నీళ్లు ముందు ఇవ్వాలో వద్దో సీఎం కేసీఆర్, హరీష్‌రావులు తేల్చాలి. (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకులు మొబైల్: 9701381799) -
సేకరణా...? సంపన్నులకు సంతర్పణా?
రైతు రక్షణలను పూర్తిగా రద్దు చేసిన మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టం సవరణతో రైతులను ఉద్ధరించామనడం రైతు కళ్లలో దుమ్ముకొట్టడమే. స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ల కోసం చేసిన ఈ దుర్మార్గంలో కేంద్ర, రాష్ట్ర పాలకులంతా తోడు దొంగలే. దశాబ్దాల రైతు పోరాటాల ఫలితంగా రూపొందిన ‘భూ సేకరణ చట్టం-2013’ రైతు హక్కులను పరిగణనలోకి తీసుకున్న మొట్ట మొదటి చట్టం. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలన్నీ 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల భూసేక రణ చట్టాన్నే అమలు చేశాయి. అలా కోట్లాది ఎకరాల రైతుల భూములను ‘అభివృద్ధి’ పేరిట పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పగించేశారు. లక్షల కొలదీ రైతులు, కూలీలు భూములు, బతుకు తెరు వులు కోల్పోయి, ‘పరిహారం’ పుచ్చుకునీ కట్టుబట్టలతో మిగిలారు. పట్టణాల్లో వలస కూలీలయ్యారు. మురికి వాడల్లో మగ్గుతూ, నవ కుబేరుల సేవకులయ్యారు, ఆధునిక బానిసలయ్యారు. యూపీఏ పేరిట పదేళ్లు అధి కారం వెలగబెట్టిన కాంగ్రెస్ ఎన్నికలకు ముందు 2014 ప్రారంభం నుంచి రైతుల హక్కులకు రక్షణ కల్పించే 2013 భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అది పూర్తి అమలుకు నోచుకోక ముందే, మోదీ ప్రభుత్వం రైతు హక్కులను హరించే దుర్మార్గమైన ఆర్డినెన్స్‌ను తెచ్చి, రైతాంగం బతుకులను పెట్టుబడిదారుల పాదాల ముందుంచింది. జాతీయ భద్రత, రక్షణ విభాగం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, సామాజిక మౌలిక సౌకర్యాల నిర్మాణం వంటి ఐదు లక్ష్యాల కోసం భూమిని సేకరించే టప్పుడు భూయజమానులైన రైతుల అంగీకారం, సామాజిక ప్రభావ మదింపులను 2013 చట్టం తప్పని సరి చేసింది. మోదీ సవరణ ఆర్డినెన్స్ రైతు హక్కులను పూర్తిగా హరించింది. బహుళ పంటల సాగు భూమిని కూడా రైతుల సమ్మతి లేకుండానే ఇక సేకరించవచ్చు. రైతు రక్షణలను పూర్తిగా రద్దు చేసిన మోదీ ప్రభుత్వం 13 చట్టాలను భూసేకరణ పరిధిలోకి తీసుకువచ్చి రైతులను ఉద్ధరించామనడం రైతు కళ్లలో దుమ్ము కొట్ట డమే. స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ల కొమ్ము కాసి, భూమిపై రైతు హక్కులకు నూకలు చెల్లేలా చేయడం అమానుషం. ఈ దుర్మార్గంలో కేంద్ర, రాష్ట్ర పాలకు లంతా తోడు దొంగలే. రైతు సంక్షేమ జపం చేసే రాష్ట్ర ప్రభుత్వాల్లో పశ్చిమ బెంగాల్ మమతాబెనర్జీ ప్రభుత్వం తప్ప ఏ ఒక్కటీ ఇదేమి దురన్యాయమని ప్రశ్నించలేదు. ఇక తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలైతే కావలసిన కార్యం గంధర్వులే కానిచ్చేశారనుకుంటున్నాయి. రాజధాని సాకుతో మూడు పంటలు పండే విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం బడా రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాఫియాకు కట్టబెడుతోంది. ఇక టీడీపీని దులిపేసి, బీజేపీని కడిగేసిపారేసే తెలంగాణ ముఖ్యమంత్రి, మోదీ ఆర్డినెన్స్‌పై మాత్రం నోరు విప్పలేదు. ఇది అప్పులతో ఆత్మహత్యల దారి పట్టిన అన్నదాతలను మోసగించడం కాదా? బడా పెట్టుబడిదారుల కోసం మోదీ తెచ్చిన ఆర్డి నెన్స్ అండతో తెలుగు చంద్రులిద్దరూ దేశీ, విదేశీ కంపె నీలకు అప్పనంగా భూములను అప్పగిస్తున్నారు. దామ రచర్ల బొగ్గు విద్యుత్ ప్లాంట్లకు భూములివ్వమని ఎదు రుతిరుగుతున్న ప్రజలపై కేసీఆర్ పోలీసు జులుం బడా పెట్టుబడిదారుల కొరకు కాదా? సేద్యమంటేనే పుట్టెడు దుఃఖం కాగా, అప్పుల బాధకు అరగంటకొక అన్నదాత దేశంలో ఎక్కడో ఒకచోట ఆత్మహత్య చేసుకుంటుంటే... నిజంగానే రైతులపై ప్రేమున్నవారెవరైనా మమతను ఆదర్శంగా తీసుకోవాలి. రైతులందరి కాళ్లయినా పట్టి భూముల జాతీయీకరణకు ఒప్పిస్తాం. పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారుల ఆస్తులను జాతీయం చేస్తారా? కార్పొరేట్ కోటీశ్వరులు ఆవగింజంత వదులుకోన ప్పుడు, రైతుల భూములను వారి అంగీకారం లేకుండా గుంజుకొనే అధికారం వీరికెవరిచ్చారు? ప్రజల భూము లు కావాలంటే వారి స్వేచ్ఛా సమ్మతితో, న్యాయమైన ధర చెల్లించి తీసుకోండి. శాశ్వతంగా భూమి కోల్పోయిన వారికి పరిశ్రమ లాభాల్లో ఏటా వాటా పంచండి. పరి శ్రమను మూసేస్తే భూమి తిరిగి రైతుకే దక్కేలా చేయండి. అసలు రైతు భూమిపై ఎవరికైనా లీజు హక్కే తప్ప, శాశ్వత యాజమాన్య హక్కు ఉండటానికి వీల్లేదు. మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అంటుంటే, తెలుగు చంద్రులిద్దరూ ‘మేడ్ ఇన్ తెలంగాణ’, ‘స్వర్ణాంధ్ర’ కల వరింతల్లో మునిగిపోయారు. అధిక లాభాలను కూడ గట్టుకోవడం, కారు చౌకగా ఖనిజ వనరులను కొల్ల గొట్టడం, రైతుల భూములను లాక్కోవడం భారత పాల కుల, పెట్టుబడిదారుల లక్ష్యం. కాగా ప్రపంచ మార్కెట్ కంతటికీ చైనా చౌకగా సరుకులను అందిస్తోంది. సమీప భవిష్యత్తులో విదేశీ ఎగుమతులలో చైనాతో పోటీ పడి, దానిని అధిగమించే దేశమే లేదు. చైనా పరిస్థి తులు, మన పరిస్థితులు పూర్తిగా వేరు. చైనాను చూసి మనం వాతలు పెట్టుకోరాదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘు రాం రాజన్, మోదీకి హితవు పలికారు. దేశంలో ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం మోగుతుండగానే తయారీ రంగం కుదేలైందని, మన పరిశ్రమలు దేశీయ వినిమ యం పెంపునకే తప్ప ప్రపంచ మార్కెట్‌కు అవసరమైన నాణ్యతను, చౌక ధరను సాధించడానికి పనికిరావని రాజన్ స్పష్టం చేశారు. ఇక తెలుగు చంద్రులు చైనాను అధిగమించేది ఎన్నడు? అది వారి వల్ల కాని పని గానీ, దేశ విదేశీ కంపెనీలకు కారు చౌకగా రైతుల భూములను కట్టబెట్టేయగలరు. ఎప్పుడు ఏ రైతు బతుకుకైనా ప్రమాద ఘంటికను మోగించేయగలరు! భూమి పుత్రు లారా తస్మాత్ జాగ్రత్త! రక్షణకై రణం చేయకపోతే! బతుకే మిగలనివ్వరు! (వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకులు మొబైల్ నం: 9701381799)