సేకరణా...? సంపన్నులకు సంతర్పణా? | Collection ...? Santarpana the rich? | Sakshi
Sakshi News home page

సేకరణా...? సంపన్నులకు సంతర్పణా?

Published Tue, Feb 10 2015 12:32 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

నైనాల గోవర్ధన్ - Sakshi

నైనాల గోవర్ధన్

రైతు రక్షణలను పూర్తిగా రద్దు చేసిన మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టం సవరణతో రైతులను ఉద్ధరించామనడం రైతు కళ్లలో దుమ్ముకొట్టడమే. స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ల కోసం చేసిన ఈ దుర్మార్గంలో కేంద్ర, రాష్ట్ర పాలకులంతా తోడు దొంగలే.
 
దశాబ్దాల రైతు పోరాటాల ఫలితంగా రూపొందిన ‘భూ సేకరణ చట్టం-2013’ రైతు హక్కులను పరిగణనలోకి తీసుకున్న మొట్ట మొదటి చట్టం. స్వాతంత్య్రానంతర ప్రభుత్వాలన్నీ 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల భూసేక రణ చట్టాన్నే అమలు చేశాయి. అలా కోట్లాది ఎకరాల రైతుల భూములను ‘అభివృద్ధి’ పేరిట పెట్టుబడిదారులకు కారుచౌకగా అప్పగించేశారు. లక్షల కొలదీ రైతులు, కూలీలు భూములు, బతుకు తెరు వులు కోల్పోయి, ‘పరిహారం’ పుచ్చుకునీ కట్టుబట్టలతో మిగిలారు.

పట్టణాల్లో వలస కూలీలయ్యారు. మురికి వాడల్లో మగ్గుతూ, నవ కుబేరుల సేవకులయ్యారు, ఆధునిక బానిసలయ్యారు. యూపీఏ పేరిట పదేళ్లు అధి కారం వెలగబెట్టిన కాంగ్రెస్ ఎన్నికలకు ముందు 2014 ప్రారంభం నుంచి రైతుల హక్కులకు రక్షణ కల్పించే 2013 భూసేకరణ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. అది పూర్తి అమలుకు నోచుకోక ముందే, మోదీ ప్రభుత్వం రైతు హక్కులను హరించే దుర్మార్గమైన ఆర్డినెన్స్‌ను తెచ్చి, రైతాంగం బతుకులను పెట్టుబడిదారుల పాదాల ముందుంచింది.
 
జాతీయ భద్రత, రక్షణ విభాగం, గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక కారిడార్లు, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం, సామాజిక మౌలిక సౌకర్యాల నిర్మాణం వంటి ఐదు లక్ష్యాల కోసం భూమిని సేకరించే టప్పుడు భూయజమానులైన రైతుల అంగీకారం, సామాజిక ప్రభావ మదింపులను 2013 చట్టం తప్పని సరి చేసింది. మోదీ సవరణ ఆర్డినెన్స్ రైతు హక్కులను పూర్తిగా హరించింది. బహుళ పంటల సాగు భూమిని కూడా రైతుల సమ్మతి లేకుండానే ఇక సేకరించవచ్చు. రైతు రక్షణలను పూర్తిగా రద్దు చేసిన మోదీ ప్రభుత్వం 13 చట్టాలను భూసేకరణ పరిధిలోకి తీసుకువచ్చి రైతులను ఉద్ధరించామనడం రైతు కళ్లలో దుమ్ము కొట్ట డమే. స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ల కొమ్ము కాసి, భూమిపై రైతు హక్కులకు నూకలు చెల్లేలా చేయడం అమానుషం. ఈ దుర్మార్గంలో కేంద్ర, రాష్ట్ర పాలకు లంతా తోడు దొంగలే.

రైతు సంక్షేమ జపం చేసే రాష్ట్ర ప్రభుత్వాల్లో పశ్చిమ బెంగాల్ మమతాబెనర్జీ ప్రభుత్వం తప్ప ఏ ఒక్కటీ ఇదేమి దురన్యాయమని ప్రశ్నించలేదు. ఇక తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలైతే కావలసిన కార్యం గంధర్వులే కానిచ్చేశారనుకుంటున్నాయి. రాజధాని సాకుతో మూడు పంటలు పండే విలువైన భూములను చంద్రబాబు ప్రభుత్వం బడా రియల్ ఎస్టేట్ పెట్టుబడి మాఫియాకు కట్టబెడుతోంది.

ఇక టీడీపీని దులిపేసి, బీజేపీని కడిగేసిపారేసే తెలంగాణ ముఖ్యమంత్రి, మోదీ ఆర్డినెన్స్‌పై మాత్రం నోరు విప్పలేదు. ఇది అప్పులతో ఆత్మహత్యల దారి పట్టిన అన్నదాతలను మోసగించడం కాదా? బడా పెట్టుబడిదారుల కోసం మోదీ తెచ్చిన ఆర్డి నెన్స్ అండతో తెలుగు చంద్రులిద్దరూ దేశీ, విదేశీ కంపె నీలకు అప్పనంగా భూములను అప్పగిస్తున్నారు. దామ రచర్ల బొగ్గు విద్యుత్ ప్లాంట్లకు భూములివ్వమని ఎదు రుతిరుగుతున్న ప్రజలపై కేసీఆర్ పోలీసు జులుం బడా పెట్టుబడిదారుల కొరకు కాదా? సేద్యమంటేనే పుట్టెడు దుఃఖం కాగా, అప్పుల బాధకు అరగంటకొక అన్నదాత దేశంలో ఎక్కడో ఒకచోట ఆత్మహత్య చేసుకుంటుంటే... నిజంగానే రైతులపై ప్రేమున్నవారెవరైనా మమతను ఆదర్శంగా తీసుకోవాలి.

రైతులందరి కాళ్లయినా పట్టి భూముల జాతీయీకరణకు ఒప్పిస్తాం. పారిశ్రామిక వేత్తల, పెట్టుబడిదారుల ఆస్తులను జాతీయం చేస్తారా? కార్పొరేట్ కోటీశ్వరులు ఆవగింజంత వదులుకోన ప్పుడు, రైతుల భూములను వారి అంగీకారం లేకుండా గుంజుకొనే అధికారం వీరికెవరిచ్చారు? ప్రజల భూము లు కావాలంటే వారి స్వేచ్ఛా సమ్మతితో, న్యాయమైన ధర చెల్లించి తీసుకోండి. శాశ్వతంగా భూమి కోల్పోయిన వారికి పరిశ్రమ లాభాల్లో ఏటా వాటా పంచండి. పరి శ్రమను మూసేస్తే భూమి తిరిగి రైతుకే దక్కేలా చేయండి. అసలు రైతు భూమిపై ఎవరికైనా లీజు హక్కే తప్ప, శాశ్వత యాజమాన్య హక్కు ఉండటానికి వీల్లేదు.
 
మోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ అంటుంటే, తెలుగు చంద్రులిద్దరూ ‘మేడ్ ఇన్ తెలంగాణ’, ‘స్వర్ణాంధ్ర’ కల వరింతల్లో మునిగిపోయారు. అధిక లాభాలను కూడ గట్టుకోవడం, కారు చౌకగా ఖనిజ వనరులను కొల్ల గొట్టడం, రైతుల భూములను లాక్కోవడం భారత పాల కుల, పెట్టుబడిదారుల లక్ష్యం. కాగా ప్రపంచ మార్కెట్ కంతటికీ చైనా చౌకగా సరుకులను అందిస్తోంది. సమీప భవిష్యత్తులో విదేశీ ఎగుమతులలో చైనాతో పోటీ పడి, దానిని అధిగమించే దేశమే లేదు. చైనా పరిస్థి తులు, మన పరిస్థితులు పూర్తిగా వేరు. చైనాను చూసి మనం వాతలు పెట్టుకోరాదని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘు రాం రాజన్, మోదీకి హితవు పలికారు.

దేశంలో ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం మోగుతుండగానే తయారీ రంగం కుదేలైందని, మన పరిశ్రమలు దేశీయ వినిమ యం పెంపునకే తప్ప ప్రపంచ మార్కెట్‌కు అవసరమైన నాణ్యతను, చౌక ధరను సాధించడానికి పనికిరావని రాజన్ స్పష్టం చేశారు. ఇక తెలుగు చంద్రులు చైనాను అధిగమించేది ఎన్నడు? అది వారి వల్ల కాని పని గానీ, దేశ విదేశీ కంపెనీలకు కారు చౌకగా రైతుల భూములను కట్టబెట్టేయగలరు. ఎప్పుడు ఏ రైతు బతుకుకైనా ప్రమాద ఘంటికను మోగించేయగలరు! భూమి పుత్రు లారా తస్మాత్ జాగ్రత్త! రక్షణకై రణం చేయకపోతే! బతుకే మిగలనివ్వరు!

(వ్యాసకర్త తెలంగాణ జలసాధన సమితి నాయకులు మొబైల్ నం: 9701381799)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement