
ప్రధాని మోదీకి సీఎం మమత హెచ్చరిక
కోల్‌కతా: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ)తో తమ రాష్ట్రం అన్ని సంబంధాలను తెంచేసుకుంటుందని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీని హెచ్చరించారు. ఇటీవల రాష్ట్రంలోని దక్షిణ జిల్లాల్లో సంభవించిన ఆకస్మిక వరదలకు డీవీసీ ఏకపక్షంగా నీటిని విడుదల చేయడమే కారణమని ఆమె ఆరోపించారు. సీఎం మమత శుక్రవారం ఈ మేరకు ప్రధానికి నాలుగు పేజీల లేఖ రాశారు.
రాష్ట్రంలోని చిన్న చిన్న నదులు ప్రమాదకర స్థాయి, అంతకు మించి ప్రవహిస్తున్న విషయం తెలుపుతూ తమ అధికారులు, నీటి విడుదలను వాయిదా వేయాలంటూ లేఖ రాసినా డీవీసీ పట్టించుకోలేదని మమత ఆరోపించారు. డీవీసీ నియంత్రణలో ఉన్న మైథోన్, పంచెట్ జలాశయాల నుంచి కొద్ది గంటల వ్యవధిలోనే ఏకంగా 5 లక్షల క్యూసెక్కుల నీటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా విడుదల చేశారన్నారు. ఒక్కసారిగా భారీగా వరదలు చుట్టుముట్టడంతో పూర్బ వర్ధమాన్, పశ్చిమ బర్ధమాన్, బీర్భూమ్, బంకురా, హౌరా, హుగ్లీ, పూర్బ మేదినీపూర్, పశ్చిమ మేదినీపూర్ జిల్లాలకు చెందిన 50 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు.