కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వెంటనే విధుల్లో చేరాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించినా, ఇటు చర్యలకు బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించినా.. వైద్యులు వెనక్కి తగ్గడం లేదు.
ఈ క్రమంలో తాజాగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకొని ప్రతిష్టంభను ముగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన నాలుగు పేజీల లేఖలో..
‘‘కామాంధుడి చేతిలో బలైన మా సహోద్యోగికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము(వైద్యులు), ఆరోగ్య కార్యకర్తలు బెంగాల్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి భయం లేకుండా మా విధులు నిర్వర్తించగలం. మేము నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి మాపై బెదిరింపులు, హింసలు, ఆసుపత్రులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జోక్యం మా అందరికీ వెలుగుగా పనిచేస్తుంది. మేము ధైర్యంగా ముందుకు నడిచే మార్గాన్ని చూపుతుంది. మా చుట్టూ అలుముకున్న చీకటి నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.’ అని పేర్కొన్నారు.
చదవండి: కోల్‌కతా అభయ కేసులో కీలక మలుపు.. సీబీఐ సంచలన నిర్ణయం!
కాగా ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినప్పటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల తాజాగా వైద్యులు మంగళశారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనలు ఆపని వైద్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.
అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు బెంగాల్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తోపాటు.. వైద్యశాఖలో పలువురి ఉన్నతాధికారుల రాజీనామా కోరుతూ వైద్యులు అయిదు డిమాండ్లను దీదీ సర్కార్ ముందు ఉంచారు.
ఈ విషయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మూడుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. కానీ చర్చల భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తేనే తాము వస్తామని నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేసిన దీదీ.. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment