Kolkata Doctor Case: క్రైం సీన్‌నే మార్చేశారు | CBI status report on Kolkata rape murder: Crime scene altered and doctor family misled | Sakshi
Sakshi News home page

Kolkata Doctor Case: క్రైం సీన్‌నే మార్చేశారు

Published Fri, Aug 23 2024 4:17 AM | Last Updated on Fri, Aug 23 2024 8:56 AM

CBI status report on Kolkata rape murder: Crime scene altered and doctor family misled

కోల్‌కతా దారుణం వెనక విస్తుపోయే నిజాలు 

 సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో సీబీఐ

వైద్యురాలిపై హత్యాచారాన్ని కప్పిపెట్టజూశారు 

గ్యాంగ్‌ రేప్‌కు ఆధారాల్లేవన్న దర్యాప్తు సంస్థ 

పోస్టుమార్టం, అంత్యక్రియలయ్యాక ఎఫ్‌ఐఆరా? 

పోలీసుల దర్యాప్తు ఆద్యంతం లోపభూయిష్టం 

30 ఏళ్లలో ఎన్నడూ చూడలేదు: ధర్మాసనం 

వైద్యుల భద్రతకు వారం రోజుల్లోగా చర్యలు 

కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ధర్మాసనం ఆదేశం

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్‌జీ కర్‌ ప్రభుత్వాసుపత్రి, వైద్య కళాశాలలో వైద్యురాలి హత్యాచారోదంతంపై తమ దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్టు సీబీఐ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ‘‘ఈ పాశవిక చర్యను కప్పిపుచ్చి ఆత్మహత్యగా చిత్రించేందుకు స్థానిక పోలీసులు తీవ్రంగా ప్రయతి్నంచారు. అందులో భాగంగా మేం దర్యాప్తు బాధ్యతలు స్వీకరించే నాటికి ఏకంగా క్రైం సీన్‌నే సమూలంగా మార్చేశారు.

ఈ కారణంగా దర్యాప్తు తమకో పెను సవాలుగా మారింది’’ అంటూ నివేదించింది. ‘‘తొలుత వైద్యురాలి ఆరోగ్యం బాగా లేదంటూ ఆస్పత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆమె తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వాళ్లు ఆస్పత్రికి చేరుకున్నాక ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. హతురాలి అంత్యక్రియలు పూర్తయ్యాక తీరుబడిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు’’ అని పేర్కొంది. ‘అంతేకాదు, ఆగస్టు 9న ఉదయం స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఆస్పత్రి వైద్యులు ఫోన్‌ చేసి వైద్యురాలు అపస్మారక స్థితిలో ఉందని సమాచారమిచ్చారు. నిజానికి ఆమె అప్పటికే చనిపోయింది’’ అని తెలిపింది. 

ప్రిన్సిపల్‌ వెనక ఎవరున్నట్టు: సీజేఐ 
కోల్‌కతా దారుణాన్ని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పార్డీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుమోటోగా విచారణకు స్వీకరించడం తెలిసిందే. ధర్మాసనం ఆదేశం మేరకు ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన అంశాలతో దర్యాప్తు పురోగతిపై గురువారం సీబీఐ స్థాయీ నివేదిక సమరి్పంచింది. బెంగాల్‌ సర్కారు కూడా ఓ నివేదిక సమరి్పంచింది. ఈ కేసులో కోల్‌కతా పోలీసుల దర్యాప్తు అత్యంత లోపభూయిష్టమంటూ జస్టిస్‌ పార్డీవాలా ఈ సందర్భంగా మండిపడ్డారు. ‘‘సాయంత్రం 6.10 నుంచి 7.10 మధ్య పోస్టుమార్టం జరిపారు. అంటే అది అసహజ మరణమని అప్పటికే రూఢీ అయినట్టే. కానీ అర్ధరాత్రి కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడం చాలా ఆశ్చర్యకరం.

గత 30 ఏళ్లలో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’’ అంటూ ఆయన తూర్పారబట్టారు. అర్ధరాత్రి పోస్టుమార్టం తర్వాత గానీ క్రైం సీన్‌ను పోలీసులు అ«దీనంలోకి తీసుకోలేదంటూ సీజేఐ ఆక్షేపించారు. అసహజ మరణమని పొద్దున్నే తేలినా ఎందుకంత ఆలస్యం చేయాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. ఎఫ్‌ఐఆర్‌ దాఖలులో కోల్‌కతా పోలీసుల అసాధారణ జాప్యం అత్యంత తీవ్రమైన అంశమంటూ దుయ్యబట్టారు. ‘‘14 గంటలు ఆలస్యంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమా?! ఘోరం గురించి ఉదయమే తెలిసినా, సాయంత్రానికల్లా పోస్టుమార్టం చేసినా రాత్రి 11.30 దాకా పోలీసులకు సమాచారమే ఇవ్వలేదు. నిజానికి విషయం తెలియగానే నేరుగా ఆస్పత్రికి వచ్చి ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యేలా చూడటం ప్రిన్సిపల్‌ కనీస బాధ్యత.

ఈ విషయంలో ఆయన ఎందుకు జాప్యం చేసినట్టు? అసలాయన ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు? దాని వెనక కారణాలేమిటి? విమర్శల తీవ్రతకు ఎట్టకేలకు ప్రిన్సిపల్‌ రాజీనామా చేస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించకపోగా ఆయన్ను సింపుల్‌గా మరో వైద్య కాలేజీకి బదిలీ చేసింది’’ అంటూ సీజేఐ ఆక్షేపించారు. దీనంతటినీ ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి తొలి ఎంట్రీ నమోదు చేసిన పోలీసు అధికారి తదుపరి విచారణకు తమ ఎదుట హాజరై ఎంట్రీ నమోదు సమయం తదితర వివరాలన్నింటినీ నేరుగా వెల్లడించాలని ఆదేశించారు.

ఈ ఉదంతాన్ని రాజకీయం చేయొద్దని పారీ్టలకు సీజేఐ సూచించారు. హతురాలి జననాంగంలో 150 జీఎం పరిమాణంలో వీర్యం ఉందన్న సీబీఐ తరఫు న్యాయవాది వాదనను తప్పుబట్టారు. సోషల్‌ మీడియా వార్తల ఆధారంగా వాదనలు విని్పంచొద్దంటూ మందలించారు. గ్యాంగ్‌ రేప్‌ జరగలేదని, ఇది కేవలం ఒక్కరి పనేనని ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో తేలిందని, డీఎన్‌ఏ నివేదిక కూడా దీన్నే ధ్రువీకరిస్తోందని సీబీఐ పేర్కొన్నట్టు సమాచారం!

మెహతా వర్సెస్‌ సిబల్‌
పశి్చమ బెంగాల్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించారు. ఆయనకు, సీబీఐ తరఫున వాదనలు విన్పించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు మధ్య సాగిన వాడీ వేడి వాదనలు కోర్టు హాలును వేడెక్కించాయి. ఎఫ్‌ఐఆర్‌ దాఖలులో చోటుచేసుకున్న లోటుపాట్లను తాను వివరిస్తుంటే సిబల్‌ హేళనగా నవ్వుతున్నారంటూ ఒక దశలో మెహతా తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘ఒక అమాయకురాలు అత్యంత హృదయ విదారక పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయింది. కనీసం నవ్వకుండా ఉండటం సంస్కారం’’ అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యలు చేశారు.

వైద్యులు పట్టుబట్టినందుకే వీడియో 
జరిగిన దారుణం గురించి తెలిసినా మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఘోష్‌ వెంటనే ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ సొలిసిటర్‌ జనరల్‌ మెహతా తప్పుబట్టారు. హతురాలి తండ్రి ఎంతగా డిమాండ్‌ చేసినా అంత్యక్రియల అనంతరం రాత్రి 11.45 గంటలకు గానీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకపోవడం చాలా దారుణమని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ‘‘పోస్టుమార్టాన్ని వీడియో తీయాల్సిందేనని వైద్యురాలి సహచరులు, సీనియర్‌ డాక్టర్లు పట్టుబట్టారు. లేదంటే ఆ ఆధారాలు కూడా మిగిలేవి కాదు’’ అన్నారు. వీటిని సిబల్‌ ఖండించారు. సీబీఐ నివేదికను బురదజల్లే యత్నంగా అభివర్ణించగా మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. నిజాలను కప్పిపెట్టేందుకు చల్లిన బురదను తొలగించేందుకే సీబీఐ ప్రయతి్నస్తోందన్నారు.

నేనూ ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నా: సీజేఐ 
వైద్యుల సమస్యల గురించి ప్రస్తావిస్తూ సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తన కుటుంబీకుల్లో ఒకరికి చికిత్స సందర్భంగా స్వయంగా ధర్మాసుపత్రిలో నేలపై పడుకున్నానని చెప్పారు. వైద్యులు దారుణమైన పరిస్థితుల నడుమ పని చేస్తున్నారంటూ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వాళ్లకు కనీస మౌలిక వసతులు కూడా అందుబాటులో లేవు. 36 గంటలు, అంతకుమించి నిరంతరాయంగా పని చేయాల్సి వస్తోంది. ఇది అత్యంత అమానవీయం.

అంతసేపు పని చేసి పూర్తిగా అలసిపోయిన స్థితిలో ఎవరన్నా వేధించినా అడ్డుకుని స్వీయరక్షణ చేసుకునే స్థితిలో కూడా ఉండరు! ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయని వైద్యులు దయచేసి అర్థం చేసుకోవాలి’’ అని పేర్కొన్నారు. న్యాయం, ఔషధాలు అందడంలో జాప్యం జరగరాదన్నారు. సమ్మె విరమించి విధులకు వెళ్లాల్సిందిగా వైద్యులను మరోసారి అభ్యర్థించారు. ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆస్పత్రి వర్గాలు తమను వేధిస్తున్నాయని నాగ్‌పూర్‌ ఎయిమ్స్‌ వైద్యులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దాంతో వైద్యుల శాంతియుత నిరసనలపై బలప్రయోగానికి దిగొద్దని, విధుల్లో చేరాక ప్రతీకార చర్యలేవీ తీసుకోవద్దని సీజేఐ ఆదేశించారు.

సలహాల కోసం పోర్టల్‌
‘‘దేశవ్యాప్తంగా వైద్యుల భద్రత కోసం కేంద్ర, రాష్ట్రాలు వారం లోపు చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో, డీజీపీలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సంప్రదింపులు జరపాలి’’ అంటూ సీజేఐ ఆదేశాలు జారీ చేశారు. ‘‘వైద్యుల భద్రత తదితరాలపై సలహాల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ ఓ పోర్టల్‌ను అందుబాటులోకి తేవాలి. సలహాలు, సూచనలను నేషనల్‌ టాస్‌్కఫోర్స్‌ పరిగణనలోకి తీసుకుని వైద్యుల భద్రతపై నేషనల్‌ ప్రొటోకాల్‌ను రూపొందించాలి’’ అంటూ పలు నిర్దేశాలు జారీ చేశారు. విచారణను సెపె్టంబర్‌ 5కు వాయిదా వేశారు.

మాజీ ప్రిన్సిపల్‌కు లై డిటెక్టర్‌ టెస్టు మరో నలుగురు వైద్యులకు కూడా
వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన ఆర్‌జీ కర్‌ ప్రభుత్వాసుపత్రి, మెడికల్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ సందీప్‌ ఘోష్‌తో పాటు మరో హతురాలి సహచరులైన నలుగురు వైద్యులకు కూడా లై డిటెక్టర్‌ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు గురు వారం అనుమతి జారీ చేసింది. మరోవైపు అమానుషంగా ప్రవర్తించడం ఘోష్‌కు అలవాటని ఆయన ఇరుగుపొరుగు చెబుతున్నారు. సిజేరియన్‌ అయిన రెండు వారాలకే భార్యను ఆయన దారుణంగా కొట్టారంటూ 12 ఏళ్ల నాటి ఉదంతాన్ని గుర్తు చేస్తూ వారు చెప్పుకొచ్చారు.

రేప్‌కు కఠిన చట్టాలు తెండి
మోదీకి మమతా బెనర్జీ లేఖ
కోల్‌కతా: మానభంగానికి పాల్పడేవారికి అతి తీవ్రమైన శిక్షలను విధించేలా కేంద్రం కఠిన చట్టాలను రూపొందించాలని డిమాండ్‌ చేస్తూ పశి్చమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆర్‌.జి.కర్‌ ఆసుపత్రిలో పీటీ ట్రైనీ డాక్టర్‌ పాశవిక హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబుకుతున్న నేపథ్యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి ఈ లేఖను సంధించారు. ‘దేవవ్యాప్తంగా ప్రతిరోజూ రేప్‌లు జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాలను బట్టి ప్రతిరోజూ భారత్‌లో 90 రేప్‌లు జరుగుతున్నాయి. వీటిలో చాలాకేసుల్లో బాధితులు హత్యకు గురవుతున్నారు. 

ఈ పరంపర భీతి గొల్పుతోంది. దేశం, సమాజం విశ్వాసాన్ని, అంతరాత్మను కుదిపేస్తోంది. ఈ ఘోరాలకు ముగింపు పలకడం మన విధి. అప్పుడే మహిళలు సురక్షితంగా, భద్రంగా ఉన్నామని భావిస్తారు. ఇలాంటి ఆందోళకరమైన, సున్నితమైన అంశాన్ని సమగ్రంగా పరిశీలించాలి. అత్యంత కఠినమైన కేంద్ర చట్టాన్ని తేవాలి. రేపిస్టులకు అతి తీవ్రమైన శిక్షలు విధించాలి’ అని మమత లేఖలో కోరారు.

రేప్‌ కేసుల విచారణ వేగంగా జరగాలంటే ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరగాలంటే కేసు విచారణ 15 రోజుల్లోగా పూర్తి కావాలని మమత అన్నారు. వైద్యురాలి హత్యాచారం కేసులో మమత సర్కారు వ్యవహరించిన శైలిని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మమత తీవ్ర విమర్శలను, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.  

డాక్టర్ల సమ్మె విరమణ ప్రకటించిన ఫైమా
న్యూఢిల్లీ: కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌ హత్యాచారంపై ఆందోళనకు దిగిన డాక్టర్లు 11 రోజులుగా తాము చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సుప్రీంకోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆలిండియా మెడికల్‌ అసోసియేషన్‌ (ఫైమా) వెల్లడించింది. డాక్టర్లు సమ్మె విరమించాలని, తిరిగి విధులకు హాజరయ్యే వారిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలుండవి సుప్రీంకోర్టు గురువారం హామీ ఇచి్చంది. ’భారత ప్రధాన న్యాయమూర్తి నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించాం.

ఆసుపత్రుల్లో భద్రత పెంచడం, డాక్టర్లకు రక్షణపై మా వినతులను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నాం. ఐక్యతతో చట్టపరంగా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఫైమా ‘ఎక్స్‌’లో వెల్లడించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఎయిమ్స్‌ ఢిల్లీ, ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్, లేడీ హార్డింగ్‌ మెడికల్‌ కాలేజీ, ఇందిరాగాంధీ హాస్పిటల్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ సమ్మెను విరమిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. బెంగాల్‌లో మాత్రం సమ్మె విరమించేది లేదని వైద్యులు, వైద్య సిబ్బంది ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement