కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జీకార్ ఆస్పత్రి ఉదంతంపై సీఎం మమతా బెనర్జీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. న్యాయం చేయాల్సిన వ్యక్తే.. న్యాయం కావాలని రోడ్డెక్కడంపై పలువురు దీదీపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ తరుణంలో సీఎం మమతా బెనర్జీపై ఆర్‌జీకార్ ఆస్పత్రి బాధితురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
తమ కుమార్తె కేసు విషయంలో కోల్‌కతా పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దీదీపై నమ్మకం పోయిందన్నారు. హత్యదంతంలో నిందితుల్ని గుర్తించేందుకు సీబీఐ కనీసం ప్రయత్నిస్తోందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా తన కుమార్తె డైరీలోని ఒక పేజీని తాను సీబీఐకి అందజేశానని, అయితే అందులోని విషయాలను చర్చించేందుకు ఆయన నిరాకరించారు.
దీదీపై నమ్మకం పోయింది
న్యాయం కోసం మమతా బెనర్జీ చేస్తున్న ఆందోళనపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ.. ‘మొదట్లో నాకు ఆమెపై పూర్తి విశ్వాసం ఉండేది. కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో న్యాయం చేయాల్సిన వ్యక్తే..న్యాయం కావాలని కోరుతూ రోడ్డెక్కారు. ఈ కేసుపై బాధ్యత వహించాల్సిన ఆమె ఏమీ పట్టించుకోలేదు.
ఎందుకీ ద్వంద వైఖరి
‘మాకు న్యాయం కావాలి అని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు. కానీ అదే మాట చెబుతున్న సామాన్యులపై దాడులు చేస్తున్నారు. ఓ వైపు న్యాయం కోసం ఆందోళన చేస్తూనే.. అదే ఆందోళన చేస్తున్న సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు’ ఎందుకు ఈ ద్వంద వైఖరి’ అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ పథకాలు కన్యాశ్రీ పథకం, లక్ష్మి పథకాలన్నీ నకిలీవి. ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో, వాటిని పొందే ముందు దయచేసి మీ లక్ష్మి ఇంట్లో క్షేమంగా ఉందా? లేదా? అని చూడాలని కోరారు.
అదే మాటకు కట్టుబడి ఉన్నాం
మరోవైపు తమ కుమార్తెపై జరిగిన దాడి ఒక్కరు చేసింది కాదన్న అంశంపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. ‘మేం మొదటి నుంచి చెబుతున్నాం..మాట్లాడిన వారందరూ, ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా.. ఇలా చేయడం ఒక్కరి వల్ల సాధ్యం కాదని అంటున్నారు’. తన కుమార్తెకు భద్రత కల్పించాల్సిన వ్యక్తులు తమ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమయ్యారని విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment