కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ ఆర్జీ కార్ ఆస్పత్రి (RG Kar Case) ట్రైనీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో సీల్దా కోర్టు (sealdah court ) సోమవారం మధ్యాహ్నం (జనవరి 20) తుది తీర్పును వెలువరించింది. నిందితుడు సంజయ్ రాయ్ (sanjay roy)కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.
తీర్పు వెలువరించే సమయంలో నిందితుడు సంజయ్ రాయ్ ‘నేను అమాయకుడిని, కావాలనే నన్ను ఈ కేసులో ఇరికించారంటూ’ కోర్టుకు తెలిపారు. సంజయ్ రాయ్ వాదనల్ని సీల్దా కోర్టు అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ ఖండించారు. నిందితుడికి జీవిత ఖైదు విధించారు.
తీర్పు సమయంలో వైద్యురాలి కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ సైతం వైద్యురాలి కేసు ఆరుదైన కేసుల్లో అరుదైన కేసు కేటగిరి కిందకు వస్తుందని, సమాజంపై ప్రజల్లో విశ్వాసం నెలకొల్పేందుకు నిందితుడు రాయ్‌కు మరణిశిక్ష విధించాలని కోరింది.
సీబీఐ వాదనపై సీల్దా కోర్టు సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ స్పందించారు. ‘ఈ కేసు అరుదైన కేటగిరీ కిందకు రాదు. అతనికి (సంజయ్ రాయ్‌కు) జీవిత ఖైదుతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
సీల్దా కోర్టు తీర్పుపై అభయ తల్లిదండ్రులు కోర్టు హాలులో ఆందోళన చేపట్టారు. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. తమ కుమార్తె కేసులో న్యాయం జరిగే వరకు కోర్టులను ఆశ్రయిస్తామని కన్నీటి పర్యంతరమవుతున్నారు.
ఉరితీయండి
గత నెల డిసెంబర్‌లో కోల్‌కతాను వణికించిన జూనియర్ డాక్టర్ హత్యోదంతంలో నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్షను సమర్థించే సాక్ష్యాలను సీబీఐ (cbi) సీల్దా సెషన్స్ కోర్టుకు అందించింది. తాము చేపట్టిన దర్యాప్తు ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌కు మరణశిక్ష విధించాలని సీబీఐ తన వాదనలు ముగింపు సమయంలో కోర్టుకు తెలిపింది. అందుకు బలమైన బయోలాజికల్ శాంపిల్స్, సీసీటీవీ ఫుటేజీ అనాలసిస్, 50 మంది సాక్షుల వాంగ్మూలాలే సాక్ష్యమని చెప్పింది.
అంతేకాదు, నిందితుడు వైద్యురాలిపై జరిగిన దారుణంలో ఏకైక నిందితుడు సంజయ్ రాయేనని స్పష్టం చేసింది. బాధితురాలిపై జరిగింది భయంకరమైన నేరమని, అత్యాచారం-హత్య అరుదైన నేరంగా పరిగణించింది. దర్యాప్తులో సేకరించిన ఆధారాల ఆధారంగా సంజయ్ రాయ్‌కి ఉరిశిక్షే సరైందని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.
సంజయ్ రాయ్ నిర్దోషి
సీబీఐ వాదనల ముగిసిన అనంతరం సంజయ్ రాయ్ తరుఫు లాయర్ సౌరవ్ బంద్యోపాధ్యాయ తన వాదనల్ని వినిపించారు. తన క్లయింట్ సంజయ్ రాయ్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను చిత్రీకరించి, ఆపై అతన్ని ఇరికించారని కోర్టుకు తెలిపారు.
ఆ రోజు రాత్రి ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో ఏం జరిగిందంటే
గతేడాది ఆగస్ట్‌లో కోల్‌కతా ఆర్‌జీకర్ మెడికల్ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న జూనియర్ వైద్యురాలపై దారుణం జరిగింది. రాత్రి ఆస్పత్రిలో విధులు నిర్వహించిన ఆమె ఉదయానికి ఆసుపత్రి సెమినార్ హాలులో అర్ధనగ్న స్థితిలో శవమై కనిపించారు. ఈ దుర్ఘటనపై పోలీసుల్లో అలసత్వం భయటపడడం, ఘటన జరిగిన ప్రదేశంలో కీలక ఆధారాలు అదృశ్యం కావడం వంటి పరిణాలతో దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి
దీంతో కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులతో పాటు పలువురు పెట్టుకున్న పిటిషన్లపై కల్‌కత్తా హైకోర్టు విచారణ చేపట్టింది. కోల్‌కతా పోలీసుల దర్యాప్తుపై పెదవి విరిచింది. రోజు గడుస్తున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదంటూ విచారణను సీబీఐకి బదలాయించింది.
తాజాగా, సీల్దా కోర్టు సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించడంపై కోల్‌కతా వ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. నిందితుడికి ఉరిశిక్ష విధించాలని ఆందోళన కారులు తమ నిరసనల్ని తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment