ఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్‌జీ కార్ ఆస్పత్రి జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై రేపు (ఆగస్ట్22న) సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.ఈ దుర్ఘటనకు సంబంధించిన దర్యాప్తు పురోగతిపై ఆగస్టు 22 లోపు స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని, సీబీఐకి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.దీంతో రేపు సుప్రీం కోర్టులో ఏం జరగనుందో ఉత్కంఠగా మారింది.
ఆర్‌జీ కార్ ఘటన యావద్ దేశాన్ని షాక్‌కి గురిచేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం జరగాలని డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. ఈ తరుణంలో కేసును విచారిస్తున్న సీబీఐ ఈ కేసులో ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్/లై డిటెక్టర్‌పరీక్ష నిర్వహించేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ దారుణం చోటుచేసుకున్న ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌కు కూడా నిజ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ యోచిస్తోంది. దర్యాప్తులో సందీష్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
వ్యభిచార గృహాలకు సంజయ్ రాయ్
మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ బాధితురాలిపై హత్యాచారానికి ఒడిగట్టేముందు కోల్‌కతాలోని రెండు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు సమాచారం. ఘటన జరిగిన ఆగస్టు 8న రాత్రి పూట అప్పటికే మద్యం తాగిన రాయ్ రాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రికే చెందిన మరో సివిక్ వాలంటీర్‌తో కలిసి కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలకు వెళ్లినట్లు కోల్‌కతా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 3.50 గంటల సమయంలో రాయ్ ఆర్‌జీకార్ ఆసుపత్రికి చేరుకున్నాడు. 4.03 గంటల సమయంలో అత్యవసర విభాగంలోకి ప్రవేశించాడు. అనంతరం మూడో అంతస్తులో ఉన్న సెమినార్ గదిలోకి వెళ్లాడు. అక్కడ నిద్రిస్తున్న జూనియర్ డాక్టర్‌పై దారుణానికి ఒడిగట్టాడు.
ఈ దారుణం వెలుగులోకి రావడం, హత్యాచారాన్ని ఆత్మహత్య అంటూ బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేయడం, సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ఆగస్టు 20న విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు సీజేఐ డీ.వై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా,మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారించింది.
విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలోని త్రిసభ్య ధర్మాసనం.. బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్యం,పోలీసుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్లు, ఆస్పత్రుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మూడు వారాల్లోగా మధ్యంతర నివేదికను, రెండు నెలల్లో తుది నివేదికను సమర్పించాలని నేషనల్ టాస్క్ ఫోర్స్ (ఎన్‌టిఎఫ్)కి ఆదేశించింది.
మాజీ ప్రిన్సిపల్ తీరుపై అనుమానాలు
ఆగస్టు 9న వెలుగులోకి వచ్చిన కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో డాక్టర్ హత్యాచార ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత కాలేజీ ప్రిన్సిపల్‌గా ఉన్న డాక్టర్ సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. ఆ తర్వాత కొద్ది గంటల వ్యవధిలోనే కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఈ నియామకం వివాదాస్పదం కావడంతో కలకత్తా హైకోర్టు స్పందించింది. సందీప్ ఘోష్ సుదీర్ఘ సెలవులో ఉండాలని ఆదేశించింది. మృతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేట్టిన కోల్‌కతా హైకోర్టు ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ విచారణలో సందీష్ ఘోష్ పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. దీనికి తోడు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవకతవకలు, మార్చురీలో శవాలతో వ్యాపారం చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వరుస పరిణామలతో ఆగస్ట్ 22న సుప్రీం కోర్టు ఈ సంచనలనాత్మక కేసులో ఎలాంటి తీర్పును వెలువరిస్తోందనని యావద్ దేశం ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment