ఢిల్లీ : కోల్‌కతా హత్యాచార ఘటనపై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతుంది. విచారణ సందర్భంగా సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొదటి నుంచి జూనియర్ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం జరిగిందనే అనుమానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో సీబీఐ స్టేటస్ రిపోర్ట్ అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జూనియర్ వైద్యురాలిది సామూహిక అత్యాచారం కాకపోవచ్చు అని సీబీఐ తన స్టేటస్ రిపోర్ట్‌లో పేర్కొన్నట్లు సమాచారం. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగట్టినట్లు సుప్రీంకు సీబీఐ ఇచ్చిన నివేదికలో తేలినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఫోరెన్సిక్, డీఎన్‌ఏ నివేదికలు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి అని సీబీఐ కోర్టుకు తెలిపింది. హాస్పిటల్‌లో సంజయ్ రాయ్ కదలికలు సీసీటీల్లో రికార్డ్ అయ్యాయన్న సీబీఐ.. కేసును అన్నీ కోణాల్లో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సీబీఐ స్టేటస్ రిపోర్ట్‌లో వెల్లడించింది.
అయితే ఈ దారుణ ఘటనలో ఒక్కరి ప్రమేయం మాత్రమే ఉందా.. లేక సామూహిక అత్యాచారమా అనే కోణంలో సీబీఐ తన దర్యాప్తును ఇంకా కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను స్వతంత్ర నిపుణులకు పంపిన తర్వాత తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ ఆస్పత్రిలో
ఆగస్ట్ 9న కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన 31 జూనియర్ డాక్టర్‌పై నిందితుడు సంజయ్ రాయ్ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే బాధితురాలిపై నిందితుడు సంజయ్ రాయ్ అఘాయిత్యానికి పాల్పడినా..ఆస్పత్రి సిబ్బంది బాధితురాలి తల్లిదండ్రులకు ఆత్మహత్య చేసుకుందని ఫోన్ చేయడం, ఘటన జరిగిన స్థలాన్ని భద్రపరచుకుండా మరమ్మత్తులు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కేసు తప్పుదోవ పట్టించేందుకు సాక్ష్యాల్ని నాశనం చేస్తున్నారని ఆందోళనలు మొదలయ్యాయి. దీనికితోడు అదే ఆస్పత్రి ఎదుట వేలాది మంది ఆందోళన కారులు గుమిగూడడం భద్రతపై అనేక అనుమానాలు తలెత్తాయి.
అయితే ఆర్‌జీకార్ ఆస్పత్రి కేసులో ప్రభుత్వం తీరుపై అనుమానం వ్యక్తమయ్యాయి. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమకు న్యాయం చేయాలని కోరుతూ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు.. ఆస్పత్రిలో ఘోరం జరుగుతున్నా ఎవరికి తెలియకపోవడం, అప్పటి ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్ రెండ్రోజుల తర్వాత రాజీనామా చేసి.. మరో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్‌గా ఛార్జ్ తీసుకోవడం వంటి అంశాలను కోల్‌కతా హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కేసును సీబీఐకి అప్పగించింది. సందీష్ ఘోష్‌ను విచారించాలని సూచించింది.
దీంతో సందీష్ ఘోష్‌ను సీబీఐ అధికారులు విచారించగా.. పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అది నుంచి సందీష్ ఘోష్ అక్రమార్జనకు పాల్పడేవారని, ఆస్పత్రి మార్చురి వార్డ్‌లో శవాలతో వ్యాపారం చేసేవారని, నిబంధనల్ని ఉల్లంఘించి ఆస్పత్రి కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేవారనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
ఆర్‌జీకార్ దారుణంపై సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుండగానే వైద్యురాలిపై లైంగికదాడి, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆగస్ట్ 20న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారధ్యంలోని బెంచ్ విచారించింది.
విచారణ సందర్భంగా ఆగస్ట్ 22లోపు కోల్‌కతా హత్యాచార ఘటనకు సంబంధించిన ఇప్పటిదాకా జరిపిన దర్యాప్తు స్టేటస్‌ను అందించాలని సీబీఐకి,ఆర్‌జీకార్ ఆస్పత్రి విధ్వంసానికి సంబంధించిన నివేదికను సమర్పించాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. దీంతో ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ తమ స్టేటస్ రిపోర్ట్‌లను కోర్టుకు అందించాయి. వాటిపై విచారణ చేపట్టిన కోర్టు వైద్యుల భద్రతపై ఆసుపత్రులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ టాస్క్ ఫోర్స్ కమిటీ ముందు వైద్యులు తమ భద్రతకు సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చేలా పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 5కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment