
ఎగ్జిబిషన్ మైదానంలో మగ్గంపై చీరను నేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
42 శాతం రిజర్వేషన్లను ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నాలు
అఖిలభారత పద్మశాలి మహాసభలో సీఎం రేవంత్‌రెడ్డి
అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపితే మోదీ మెడపై కత్తి పెట్టినట్లే.. బీసీ రిజర్వేషన్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది
మా సర్వే తప్పని ఏవిధంగా చెబుతున్నారో పక్కా ఆధారాలతో రావాలన్నాం.. మా సవాల్ స్వీకరించకుండా బీజేపీ, బీఆర్‌ఎస్ తప్పించుకుంటున్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలు ఎదగకుండా, వారికి 42 శాతం రిజర్వేషన్లు అందకుండా ఆదిలోనే అడ్డుకునే కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే అన్ని విధాలా అభివృద్ధి చెందుతారని.. దానితో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని పేర్కొన్నారు. దీనివల్లే ఆయా పార్టీల నేతలు లేనిపోని అపోహలు సృష్టించి బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలను బీసీలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన 17వ అఖిల భారత పద్మశాలి, 8వ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో సమాచారమంతా అధికారికంగా సేకరించినదే. ఇంటి యజమాని ధ్రువీకరణ కూడా తీసుకున్నాం. ఈ సర్వేలో బీసీల జనాభా 56.33 శాతం ఉన్నట్టు తేలింది. గతంలో కేసీఆర్ హయాంలో చేసిన సర్వేలో బీసీల జనాభా 51శాతమే లెక్కించారు. ఇప్పుడు 5.33 శాతం పెరిగింది. కేసీఆర్ సర్వేలో అగ్రకులాల జనాభా శాతం 21శాతం ఉన్నట్టు చెబితే.. మా సర్వేలో 15.28 శాతమేనని తేలింది. ప్రతి కోణంలో సర్వే చేసి గణాంకాలను క్రోడీకరించాం.
అసెంబ్లీలో బిల్లు పెడతాం..: బీసీలకు ఇచ్చిన హామీలో భాగంగా 42శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. త్వరలో అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తాం. పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన వెంటనే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి ఇవ్వడమంటే మోదీ మెడ మీద కత్తిపెట్టినట్టే. కచ్చితంగా మన డిమాండ్‌ను ఆమోదించాల్సిందే.
బీసీల కోసం ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వస్తే వారు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతారనే భయం ప్రతిపక్ష పార్టీలకు పట్టుకుంది. బీసీలు ఎదిగితే బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. అందుకే బీసీ రిజర్వేషన్లను ఆ రెండు పార్టీలు ఆదిలోనే అడ్డుకునే కుట్ర చేస్తున్నాయి. ఈ పరిస్థితులను బీసీలంతా గుర్తించాలి.
నన్ను ఎప్పుడైనా కలవచ్చు..: తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యాను. ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా కర్తవ్యం. అందుకోసం 24గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వంలో సీఎంను కలవాలంటే పెద్ద సాహసంగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఎప్పుడైనా నన్ను కలవచ్చు. మీ సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చి.. వాటిని పరిష్కరింపజేసుకునే బాధ్యత మీదే. తెలంగాణ సాధన కోసం పోరాడిన పద్మశాలి ముద్దు బిడ్డ కొండాలక్ష్మణ్ బాపూజీని పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాగానే.. కేంద్రంతో మాట్లాడి ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేశాం. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడతాం. టైగర్ నరేంద్రకు యూపీఏ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇస్తే... ధృతరాష్ట్రుడి కౌగిలి మాదిరిగా కేసీఆర్ ఆయనను ఖతం చేశారు. కులవృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన చీరలను మహిళలు కట్టుకోలేదు. అవి పొలాల దగ్గర కట్టడానికే పనికి వచ్చాయి.
అందుకే అధికారంలోకి వచ్చాక బతుకమ్మ చీరల పంపిణీ ఆపివేశాం. మహిళా సంఘాల్లోని వారికి మంచి చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. రూ.600 కోట్ల విలువైన 1.30 కోట్ల చీరల ఆర్డర్లను నేతన్నలకు ఇస్తున్నాం. తెలంగాణ పద్మశాలీలు ఇతర రాష్ట్రాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రూ.కోటితో షోలాపూర్‌లో పద్మశాలీల ఆత్మగౌరవాన్ని నిలిపేలా మార్కండేయ భవనం నిర్మించేందుకు సహకరిస్తాం..’’ అని సీఎం రేవంత్ వెల్లడించారు.
చేనేత కార్మికులకు రుణమాఫీ అమలు చేస్తున్నాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో చేనేత కార్మికులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ బడ్జెట్‌లోనే వారి రుణాలను మాఫీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ప్రజల కష్టాలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. పద్మశాలీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు వినూత్న పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు.
మగ్గంపై చీర నేసిన సీఎం
సీఎం రేవంత్ తొలుత ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. అక్కడ సిద్ధం చేసిన చేనేత మగ్గంపై చీర నేశారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ కేడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొ రేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, వరంగల్ మేయర్ గుండు సుధా రాణి, అఖిలభారత పద్మశాలి సంఘం, తెలంగాణ పద్మశాలి సంఘం ప్రతినిధులు అంబటి శ్రీనివాస్, మురళీధర్, గడ్డం జగన్నా థం, కన్నెగట్ల స్వామి, టీపీసీసీ చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరి శ్రీనివాస్, మచ్చ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment