
భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి పొన్నం, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి
ఆ రోజు త్వరలోనే వస్తుంది: సీఎం రేవంత్
చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రూ.535 కోట్లతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
ఈ నిర్మాణాలను స్వయంగా తానే పర్యవేక్షిస్తానని వెల్లడి
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రోజు త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మహిళలు అంటే వంటింటి కుందేళ్లు కాదని, వారు వ్యాపారవేత్తలుగా రాణించేలా కృషి చేస్తామని తెలిపారు. రూ.535 కోట్లతో చేపడుతున్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రసంగించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మహిళలను వ్యాపారవేత్తలను చేస్తాం..
‘‘మీ అన్నగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని అమలు చేశాం. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించాం. చట్టసభల్లో మహిళలు అడుగుపెడతారు. అసెంబ్లీలో 33శాతం సీట్లు మహిళలకు వచ్చే రోజు వస్తుంది. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదు. వారు వ్యాపారవేత్తలుగా రాణించేలా కృషి చేస్తాం. అదానీ, అంబానీలతో మహిళలు పోటీపడేలా కార్యాచరణ తీసుకుంటున్నాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు పెట్టుకోవడం తెలంగాణకు గొప్పకీర్తి అని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఈ యూనివర్సిటీ భవనాలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.
నిర్మాణాన్ని నేనే పర్యవేక్షిస్తా..
రెండున్నరేళ్లలో మహిళా యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్తికావాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిధులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తనదని, తాను స్వయంగా నిర్మాణ పర్యవేక్షణ చేస్తానని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు చదువుల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలతో ఈ యూనివర్సిటీ పోటీపడాలని.. మహిళల కోసం రిజర్వేషన్లు తెచ్చిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ కలలను నిజం చేయాలని పిలుపునిచ్చారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధికరించండి: అసదుద్దీన్
పాఠశాలలు, కాలేజీల్లో ముస్లిం విద్యారి్థనులు తక్కువగా ఉన్నారని, వారి సంఖ్య పెరగాల్సి ఉందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధికరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్‌రెడ్డి డైనమిక్ సీఎం అని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతోపాటు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment