Padmashali
-
చేనేతలకు వరం జగనన్న: జింకా విజయలక్ష్మి
-
ఏంటీ, పెళ్లిలో నాన్‌వెజ్ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!
‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్లను చూసి అవాక్కయ్యారు. నాన్‌వెజ్ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్‌వెజ్ పెట్టరని, ఓన్లీ వెజ్ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు, మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’ సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు. సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి 1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు. రిసెప్షన్ వేడుకల్లో వారి ఇష్టం ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు. అందరూ తింటారు శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. – కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో.. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు ఇప్పటికీ అమలవుతోంది చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం. – గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల -
శవం.. ఏడుస్తోంది!
వందల ఏళ్ల చరిత్ర.. ద్వితీయశ్రేణి మున్సిపాలిటీ.. సుమారు లక్ష జనాభా.. అన్నింటికీ మించి రాష్ట్రమంత్రివర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు సొంత నియోజకవర్గం.. అభివృద్ధి పనుల కోసం అడగకుండానే నిధులు విడుదల చేస్తున్న వైనం.. అయినా మెజారిటీ సామాజికవర్గం పద్మశాలి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కనీసం మృతదేహాన్ని ఉంచే స్థలంలేదు.. అద్దెఇళ్లలో బతుకీడుస్తున్న నేతకార్మిక కుటుంబాలు దశాబ్దాలుగా శవాలను రోడ్డుపైనే పెట్టాల్సిన దుస్థితి నెలకొంది.. మృతదేహాన్ని తమ ఇంటి ఎదుట వేస్తే.. అరిష్టమనే మూఢనమ్మకాలతో కొందరు ఇళ్ల యజమానుల తీరు బాధిత కుటుంబాలకు తీరని విషాదం కలిగిస్తోంది. సిరిసిల్లటౌన్: జిల్లాకేంద్రంలో మెజారిటీ సామాజికవర్గం పద్మశాలి కుటుంబాలే ఉన్నాయి. వీరిలో చాలామందికి సొంతిళ్లులేవు. కుటుంబలో ఎవురైనా చనిపోతే రోడ్లే దిక్కవుతున్నాయి. తరచూ తలెత్తే ఇలాంటి ఘటనల్లోంచి బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి కేటీఆర్ ప్రత్యేక భవనం నిర్మించాలని ప్రతిపాదించారు. ఆయన సదాశయాన్ని ఆచరణలో పెట్టడంలో సంబంధిత శాఖ అధికారులు సఫలీకృతులు కాలేకపోతున్నారు. కార్మికక్షేత్రంలో సుమారు 8 వేల కుటుంబాలు అద్దెఇళ్లతోనే నెట్టుకు వస్తున్నాయి. మొత్తానికే ఇల్లులేని వారు కనీసం 3 వేల మంది ఉంటారని అంచనా ఉంది. ఇట్లాంటి వారి కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియలు పూర్తిచేసేవరకైనా ప్రత్యేక వసతి కల్పించాలని అధికారులను కోరుతున్నారు. మరికొన్ని దయనీయ ఘటనలు.. బీవైనగర్‌కు చెందిన ఠాకూర్ రవీందర్(50) నేతకార్మికుడు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా భార్య జమున అద్దె ఇంటిని ఖాళీ చేసి తల్లిగారింటికి చేరింది. భర్తను సర్కారు ఆస్పత్రిలో చేర్పించి వైద్యచికిత్సలు చేయిస్తుండగా గత శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించి చనిపోయాడు. జమున పుట్టింటి వారిక్కూడా సొంతిల్లు లేక రవీందర్ మృతదేహాన్ని తెల్లార్లూ రోడ్డుపైనే ఉంచారు. స్థానికులు చందాలు పోగేసి మరుసటి రోజు అంత్యక్రియలు జరిపించారు. నెహ్రూనగర్‌కు చెందిన దోమల రమేశ్ నేతకార్మికుడు. అప్పులు, ఆర్థిక, కుటుంబ పరిస్థితుల గురించి చెబుతూ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాసి గతేడాది డిసెంబర్ ఒకటిన ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతిల్లు లేక రమేశ్ ఖర్మకాండలు చేసేందుకు కుటుంబసభ్యులు నానాయాతన అనుభవించారు. బీవైనగర్‌కు చెందిన గాజుల అంబదాస్–భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. వీరి చదువులు, ఇంటిఅవసరాల కోసం రూ.లక్షల్లో అప్పు చేశారు. వాటిని తీర్చడానికి ఇల్లు అమ్మినా సరి పోలేదు. దీంతో రెండేళ్ల క్రితం వేములవాడ గుడి చెరువులో దూకి చనిపోయారు. వారి శవాలను సైతం రోడ్డుపైనే ఉంచి మరుసటి రోజు శ్మశాన వాటికి తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఏప్రిల్‌లో పనులుపూర్తి వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ముక్తిధామం పనులు సాంకేతిక కారణాలతో నిలిచిపోయాయి. విద్యానగర్, నెహ్రూనగర్‌లో రూ.45 లక్షలు, కొత్తచెరువు ప్రాంతంలో రూ.20 లక్షలు, జేపీనగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో ముక్తిధామాలు నిర్మిస్తాం. విద్యానగర్‌లోని శ్మశానవాటిక నిర్మాణం ఏప్రిల్‌లోగా పూర్తి చేయిస్తాం. – సామల పావని, మున్సిపల్ చైర్పర్సన్ శిలాఫలకానికే పరిమితం.. మానేరు శివారులో ముక్తిధామం నిర్మాణానికి 22 అక్టోబర్ 2002లో అప్పటి ఎంపీ విద్యాసాగర్‌రావు శకుస్థాపన చేశారు. వివిధ కారణాలతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన మున్సిపల్ పాలకవర్గం.. శ్మశానవాటి నిర్మాణానికి చర్యలు తీసుకోగా.. కోర్టు కేసులు అడ్డుగా మారాయి. శ్మశానవాటిక లేకపోవడంపై స్పందించిన మంత్రి కేటీఆర్.. సత్వరమే శ్మశానవాటిక నిర్మించాలని ప్రస్తుత పాలకవర్గాన్ని ఆదేశించారు. స్థల వివాదం సమసిపోయినా పనులు ప్రారంభంకాలేదు. ఐదు విడతలు.. రూ.2.18 కోట్లు.. పట్టణ శివారులో శ్మశానవాటికి నిర్మాణానికి నాలుగు దఫాల్లో రూ.2.18 కోట్లు మంజూరయ్యాయి. తొలివిడతలో రూ.22 లక్షల వ్య యంతో మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రహరీ, మానేరువాగువైపు రిటైనింగ్‌వాల్ నిర్మించారు. మరో దఫాలో రూ.38 లక్షలు వెచ్చించి స్టోర్ రూంలు, హాల్ కట్టించారు. తర్వాత పంచా యతీరాజ్ ద్వారా రూ.54 లక్షలు కేటాయించి నాలుగు బర్నింగ్ ప్లాట్‌ఫారమ్స్, స్టోర్ రూమ్స్, టాయిలెట్స్ తదితర పనులు చేపట్టారు. నాలుగు, ఐదు విడతలో మున్సిపల్ ఆధ్వర్యంలో రూ.1.04 కోట్లు కేటాయించి అన్నదానంహాల్, ఖర్మకాండల గదులు, అదనపు గదులు, ఆరాధన క్షేత్రాలు, గ్రీనరీ, విద్యుద్దీకరణ, ఫ్లోరింగ్, ఫౌంటేన్లు, ఆర్చీల నిర్మాణాలకు టెండర్లు పూర్తి చేశారు. కానీ, పనులు నేటికీ మొదలుకాలేదు. ఇప్పటికీ పలుసార్లు కేటాయించిన నిధుల్లో అవకతవకలు చోటుచేసుకోవడంతో పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సిరిసిల్ల సుందరయ్యనగర్‌కు చెందిన నేతకార్మికుడు నాగభూషణం ఆర్థిక ఇబ్బందులు తాళలేక నవంబర్ 7న ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆస్పత్రిలో ఉన్న శవాన్ని అద్దెఇంటికి తీసుకొచ్చేందుకు కుటుంబసభ్యులు యత్నించినా ఇంటియజమానులు నిరాకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బంధువులు.. అట్నుంచి అటే శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. సిరిసిల్ల బీవైనగర్‌కు చెందిన చిలుక నిర్మల(70) బీడీకార్మికురాలు. డిసెంబర్ ఒకటిన గుండెపోటుతో చనిపోయింది. మృతదేహాన్ని తన ఇంటిఎదుట వేయొద్దని యజమానురాలు ఆదేశించింది. చేసేదిలేక కుటుంబసభ్యులు శివనగర్ మహిళా భవన్ ఎదుట రోడ్డుపై టెంటు వేసి శవాన్ని ఉంచారు. ఆమె కూతుళ్లు లక్ష్మి, అనితకూ సొంతిళ్లులేవు.. తెల్లవార్లూ శవం వద్ద జాగరణ చేశారు.. మరుసటిరోజు స్థానికులు విరాళాలు పోగుచేసి అంత్యక్రియలు పూర్తిచేశారు. -
పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలి
– అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డీ గురుమూర్తి కర్నూలు: పద్మశాలీయులు అన్ని రంగాల్లో రాణించాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డీ గురుమూర్తి అన్నారు. స్థానిక పాతబస్టాండులో ఎస్వీసీ కళ్యాణ మండపంలో ఆదివారం పద్మశాలీ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలీయుల ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు కోటేశ్వరరావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డీ గురుమూర్తి మాట్లాడుతూ.. నేటి విద్యార్థులు స్వామి వివేకానందున్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. టెలికామ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేవీకే ప్రసాద్, ఇన్‌కమ్‌ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ సీవీ పవన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు డా.సంజీవ్‌కుమార్ మాట్లాడారు. రాయలసీమ పద్మశాలీయుల సంఘం అధ్యక్షుడు చెన్న వెంకటసుబ్బన్న, కార్యదర్శి నాగమళ్ల శంకర్, కర్నూలు నగర అధ్యక్షుడు లక్ష్మినారాయణ, పద్మశాలీ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు, కస్తూరి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బీమునిపల్లె వెంకటసుబ్బయ్య, సాయిబాబా పాల్గొన్నారు. -
పద్మశాలి టెలిఫోన్ డైరెక్టరీ ఆవిష్కరణ
నల్లగొండ టౌన్ : పద్మశాలి టెలిఫోన్ డైరెక్టరీని ఆదివారం పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సిరిప్రోలు వెంకటపతి పట్టణ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీయుల మొబైల్ నంబర్లతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించి టెలిఫోన్ డైరెక్టరీని రూపొందించడం అభినందనీయమన్నారు. డైరెక్టరీ రూపకర్త ఎస్.రమేశ్ మాట్లాడుతూ డైరెక్టరీని ఆచార్య కొండా లక్ష్మణ్‌బాపూజీకి అంకితమిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు చిలువేరు చంద్రయ్య, మిర్యాల సోమయ్య, గంజి భిక్షమయ్య, దుడుకు లక్ష్మీనారాయణ, టి.సంతోశ్, ఎం.వెంకటయ్య, ఎ.గిరీశ్, పి.వీరేశ్ పి.వెంకటయ్య పాల్గొన్నారు. -
చేనేత కార్మికుల స్థితిగతులపై సీడీ ఆవిష్కరణ
ఆత్మకూర్(నర్వ) : అమరచింతలో గురువారం మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పద్మశాలి కులస్తులు రాఖీపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. సాయంత్రం ప్రభోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన మహంకాళి శ్రీనివాసులు కాడ్గిగణేష్ సహకారంతో నిర్మించిన చేనేత బతుకులపై పాటలు పాడిన సీడీని గ్రామపెద్దల సమక్షంలో ఆవిష్కరించారు. పద్మశాలి సంఘ అభివృద్ధికి శ్రీ ఫౌండేషన్ సంస్థ నిర్వాహకుడు రూ.2 లక్షల విరాళం అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధారాణి, ఎంపీటీసీ మహంకాళి విష్ణు, ప్రముఖ గాయకుడు సాయిచంద్, గద్వాల జరీచీరల వ్యాపారి మహంకాళి శ్రీనివాసులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దేవరకొండ లచ్చన్న, కార్యదర్శి కొంగరి భాస్కర్, చిలువరి రాములు, పారుపల్లి చింతన్న, రంగు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత వృత్తిని కాపాడాలి
నల్లగొండ రూరల్ : దేశంలో వ్యవసాయరంగం తర్వాత రెండవ స్థానంలో ఉన్న అతిపెద్ద చేనేత రంగాన్ని కాపాడి ఆత్మహత్యలను నివారించాలని పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల యాదగిరి, పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నల్లగొండలోని రాంనగర్లో గాంధీ విగ్రహానికి చేనేత నూలు మాలను వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆత్మహత్యలు, వలసల నివారణ కోసం చేనేత కార్మికులకు వడ్డీలేని రుణం, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. నగదు రహిత వైద్యాన్ని కార్పొరేట్ ఆస్పత్రిలో చేయించాలని, కేజీ టూ పీజీ విద్యను వర్తింపజేయాలని, కళ్యాణలక్ష్మీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన చేనేతకు స్థానం కల్పించాలన్నారు. నేతన్న సలాం పేరుతో గంజీ శ్రీనివాస్ రూపొందించిన సీడీని ఆవిష్కరించారు. అంతకుముందు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ నేత, శ్రీశైలం, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకుడు సుధీర్ నారాయణ, వెంకన్న, సురేష్, వెంకటయ్య, గిరీష్, నీలయ్య, యాదగిరి, అంజయ్య, శ్రీనివాస్, పున్న వీరేశం తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా
సన్మానసభలో శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే భివండీ, న్యూస్‌లైన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానని శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రే పేర్కొన్నారు. తన విజయానికి సహకరించిన తెలుగువారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భివండీ (తూర్పు) నియోజకవర్గం నుంచి గెలుపొందిన రూపేష్ మాత్రేని అఖిల పద్మశాలి సమాజ్ సంస్థ మంగళవారం ఉదయం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా రూపేష్ మాత్రే మాట్లాడుతూ సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన నియోజకవర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయడాన్నే విజయంగా భావిస్తానన్నారు. తెలుగువారికి తోడుంటా వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన తెలుగు సమాజ ప్రజల కృషి ఉందన్నారు. వారికి అన్నివేళలా తోడుంటానన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటానన్నారు. అఖిల పద్మశాలి సమాజానికి కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పద్మనగర్ ప్రాంతంలో త్వరలోనే జన సంపర్క్ కార్యాలయాన్ని ప్రారంభిస్తానన్నారు. కాగా రూపేష్‌ని సన్మానించిన వారిలో అఖిల పద్మశాలి సమాజ్ అధ్యక్షుడు కముటం శంకర్, కార్యదర్శి వేముల నర్సయ్య, కోశాధికారి పాశికంటి లచ్చయ్య, మాజీ నగరాధ్యక్షుడు ఎస్. మల్లేశం, సంకు శశిధర్, కొండి మల్లేశం, భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కు చెందిన కొంతమంది పదాదికారులతో పాటు వివిధ తెలుగు సంఘాల పదాధికారులున్నారు. -
ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ ఆవిష్కరణ
భివండీ, న్యూస్‌లైన్: పద్మశాలి యువత తెలుగువారి కీర్తిని దశదిశలా చాటిందంటూ పలువురు వక్తలు కొనియాడారు. కొందరు పద్మశాలి యువకులు మొట్టమొదటిసారిగా జాతీయస్థాయిలో ఫ్యాబ్రిక్ డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీనిని శుక్రవారం సాయంత్రం శ్రీ వేంకటేశ్వర కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పద్మశాలీలకు ఇది మర్చిపోలేని రోజని, నేటి యువతరం కూడా మున్ముందు ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ను తయారుచేసి తెలుగువారి కీర్తి నలుదిశలా చాటాలని కోరారు. అనంతరం దీని రూపకర్తలు మాట్లాడుతూ తాము రూపొందించిన సాఫ్ట్వేర్ విదేశీ సాఫ్ట్వేర్ ధరతో పోలిస్తే 90 శాతం తక్కువని పేర్కొన్నారు. అత్యంత సులభమైన రీతిలోఅందరికీ అర్ధమయ్యేవిధంగా ఒకే సమయంలో ఎక్కువ నమూనాలను చూపించ వచ్చన్నారు. అనంతరం దీనిని ప్రత్యేక ప్రదర్శన ద్వారా చూపించారు. ఈ సాఫ్ట్వేర్ రూపకల్పనకు ఎంతో తాము చాలా కష్టపడ్డామని, ఇందుకు తమ తల్లిదండ్రులు, డిజైన్ మాస్టర్లు ఎలిగేటి శ్రీనివాస్, చిలుకూరి శంకర్, కనుకుంట్ల పర శురామ్, సిరిమల్ల శ్రీనివాస్, చెన్న శివ, అజయ్ మాస్టర్ లాంటి సీనియర్లు ఎంతగానో సహకరించారన్నారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసిన యువకుల తల్లిదండ్రులను అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం సుమారు 50 మందికి పైగా స్థానికులు ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేశారు. ఈ నెల 7,8,9 తేదీలలో ఇచల్కరేంజిలో జరగనున్న అంతర్జాతీయ టెక్స్టైల్ ప్రదర్శనలో ఈ సాఫ్ట్వేర్ నమూనాను ప్రదర్శించబోతున్నామని సిరిపురం సాగర్ తెలి పారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని సుమారు ఐదువందల మంది డిజైన్ మాస్టర్లతో పాటు ముంబై నుంచి నక్క మనోహర్, ఆడెపు మురళి , రఘు మాస్టర్, అశోక్ మాస్టర్, రాజేశ్, స్థానిక కార్పొరేటర్ మురళి మచ్చ, బీజేిపీ పట్టణ శాఖ కార్యదర్శి నిష్కం భైరిలు హాజరయ్యారు. మాంచెస్టర్గా పేరుగాంచిన భివండి పట్టణంలో అత్యధికంగా తెలుగు వారు టెక్స్టైల్ పరిశ్రమలు నెలకొల్పి దేశవిదేశాలకు వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. అయితే నమూనాల కోసం చేతిమగ్గంతో తయారుచేసిన వస్త్రాన్ని వ్యాపారస్తులకు చూపించేవారు. దేశ విదేశాలకు ఈ నమూనాలను పంపించేందుకు అనేక రోజుల సమయం పట్టేది. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా కొంతమంది డిజైన్ మాస్టర్లు విదేశాల నుంచి దుస్తుల డిజైనింగ్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ చాలా తక్కువ మంది వద్ద ఉంది. అయితే ఈ సాఫ్ట్వేర్ ఉన్న వారికి మాత్రమే మార్కెట్లో మంచి రాబడి ఉంటుంది. అయితే మధ్య తరగతి పరిశ్రమలవారికి ఈ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో వీరి వ్యాపారం దెబ్బతింటోంది. దీనిని దృష్టిలో ంచుకుని భివండీ పద్మశాలి టెక్స్టైల్ టెక్నీషియేషన్స్ అసోసియేషన్ (ిపీటీటీఏ) సంస్థ యాజమాన్యం ‘యాక్యురేట్ సొల్యూషన్స్ కంపెనీ’కి చెందిన పద్మశాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ సిరిపురం శ్రీనివాస్, భైరి చంద్రశేఖర్, సిరిపురం సాగర్, దీకొండ శ్రీనివాస్, గొరిట్యాల హరిష్, వేముల శ్రీనివాస్, సిరిపురం సురేష్లను దుస్తుల డిజైన్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని కోరింది. దీంతో ఈ బృందం ఆరు నెలలపాటు శ్రమించి ఈ సాఫ్ట్వేర్ ను రూపొందించింది.