No Non Veg In Sircilla Padmashali Community For Last 30 Years - Sakshi
Sakshi News home page

ఏంటీ, పెళ్లిలో నాన్‌వెజ్‌ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!

Published Sun, Feb 5 2023 2:01 PM | Last Updated on Sun, Feb 5 2023 8:25 PM

No Non Veg In Sircilla Padmashali Community For last 30 Years - Sakshi

‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్‌లను చూసి అవాక్కయ్యారు. నాన్‌వెజ్‌ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్‌వెజ్‌ పెట్టరని, ఓన్లీ వెజ్‌ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు,  మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’

సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్‌..

మూడు దశాబ్దాలుగా
సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు.

సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి
1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు.

రిసెప్షన్‌ వేడుకల్లో వారి ఇష్టం
ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్‌ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి,  మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్‌లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు.

అందరూ తింటారు
శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ  బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. 
– కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల

చాలా ప్రాంతాల్లో..
ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్‌ వెజ్‌ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది.
– కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్‌ అధ్యక్షుడు

ఇప్పటికీ అమలవుతోంది
చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం.
– గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement