సాక్షి, హైదరాబాద్: కొందరికి నాన్‌వెజ్ తప్ప వెజ్ అస్సలు రుచించదు. ఇంకొందరు ఆకు కూరలంటే ఆమడ దూరం పెడతారు. మరికొందరికి కొన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలు అంటే వారికి చిరాకు. అవి తినేందుకు కాదుకదా.. చూడ్డానికి కూడా ఇష్టపడరు. మరి శరీరానికి కావాల్సిన పోషకాలు ఎలా అందుతాయ్. ఎప్పుడూ విభిన్న రుచుల ప్రయోగాలకు కేంద్రమైన మన హైదరాబాదీ రెస్టారెంట్లు ఇలాంటి వారికోసమే వెజ్‌ను.. నాన్‌వెజ్‌ను కలిపి అందిస్తూ సరికొత్త రుచులను పంచుతున్నాయి.
వేసుకునే దుస్తులు మల్టీ పర్పస్.. ధరించే నగలు మల్టీ పర్పస్ ఉండగా తినే ఫుడ్ మాత్రం ‘మల్టీ’ అయితే తప్పేంటి అంటున్నారు. భోజన ప్రియులు కూడా ఇప్పుడు వెజ్..నాన్‌వెజ్ కలిపి వండిన వంటకాల టేస్టీతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సంస్కృతి మన ముత్తాతల కాలం నుంచి ఉన్నప్పటికీ ఏవేవో కారణాలతో రెండింటినీ విడదీసి వంటలు చేశారు. మళ్లీ ఇప్పుడిప్పుడే తిరిగి ‘వంట’పట్టించుకుంటున్నారు. అదీ నగర రెస్టారెంట్ల మధ్య నెలకొన్న పోటీ వల్లనే అని చెప్పక తప్పదు.
బొమ్మిడాలు..బెండకాయ అదుర్స్
‘గ్రీన్ చికెన్’ (చికెన్‌కు కొత్తిమీర, పుదీనా కలిపి చేసేది) పేరుకు తగ్గట్టే ఇది చూడ్డానికి పచ్చగానే ఉన్నా.. ఇందులో వాడే ఆకుకూరలతో అద్భుతమైన రుచి రావడంతో పాటు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆకు కూరలు, కూరగాయలకు జత కలిసినవి మటన్, చికెన్ మాత్రమే కాదు.. చేపలు, రొయ్యలు, పీతలు వంటివి కూడా ఉన్నాయండోయ్. బొమ్మిడాలు–బెండకాయ కాంబినేషన్‌తో చేసిన పులుసు ఇప్పుడు నగరంలో హైలెట్‌గా నిలుస్తోంది. చాలామంది బెండకాయలో జిగురు ఉంటుందని, దానిని తినేందుకు పిల్లలు కూడా అయిష్టత చూపిస్తుంటారు. అయితే, బెండకాయ మెదడు చురుకుగా పనిచేసేందుకు దోహదపడుతుందని చెప్పి మరీ తల్లిదండ్రులు తినిలా చేస్తారు. అలాంటి జిగురు బెంకాయను బొమ్మిడాలతో కలిపి చేసిన పులుసు యమ టేస్ట్‌గా ఉందంటున్నారు. ఇక మామిడికాయ–చేపల పులుసు.. పేరు చెబితే సరిపోదు.. ఒక్కసారి రుచి చూస్తే చాలు మరిచిపోలేరంటే అతిశయోక్తి కాదు. ఇక గోంగూర–రొయ్యలు టేస్ట్ ఐరన్‌కు కేరాఫ్‌గా చెప్పే వటకం.
అటు పీచు.. ఇటు ప్రొటీన్స్
కూరగాయల నుంచి పీచు పదార్థాలు అధికంగా లభ్యమవుతాయి. అయితే, ఇవి పూర్తిస్థాయిలో ప్రోటీన్స్‌ను అందించలేవు. అదే నీచు వంటకాల్లో ప్రోటీన్స్ లభ్యమవుతాయి. మానవ శరీరానికి పీచు, నీచు ద్వారా లభ్యమయ్యే ప్రోటీన్స్, కార్పొహైడ్రేట్స్ రెండూ అవసరమే. ఒకటి అమితంగా తీసుకుని మరొకటి మితంగా తీసుకుంటే కుదరదు. రెండు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందన్నది నిపుణులు చెప్పే మాట. ఈ క్రమంలో కూరగాయలతో నీచు పదార్థాలను మిక్స్ చేసి వండి వార్చేస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రకాల కూరగాయలతోనే చికెన్, మటన్, రొయ్యలు వంటి వాటిని కలిపి వండేవారు.
ఇప్పుడు దాదాపు అన్ని రకాల ఆకు కూరలతో పాటు చాలా రకాల కూరగాయలను కలిపి కంబైన్డ్ వంటలు చేసేస్తున్నారు. ఎప్పటికప్పుడు నగరవాసి సరికొత్త టేస్టీ కోరుకుంటున్న నేపథ్యంలో రెస్టారెంట్ల నిర్వాహకులు సైతం వారి ముంగిటకు సరికొత్తగా డిషెస్‌ను పరిచయం చేస్తూ వస్తున్నాయి. ఇదే క్రమంలో భోజన ప్రియుల ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో శోధించి మరీ ఆయా డిషెస్‌ను వండి వడ్డిస్తున్నారు.
చికెన్ మిర్చి
నాన్‘వెజ్’తో జత కట్టినవి ఎన్నో..
తమలపాకు–చికెన్ (తమలపాకులను పేస్ట్ లాగా చేసి చికెన్ కలిపి సూప్ లాగా చేస్తారు), చికెన్ మిర్చి బజ్జీ (మిర్చి బజ్జీని సగానికి కోసి అందులో చికెన్ ముక్కలు ఉంచుతారు), తమలపాకు కోడి పకోడీ (తమలపాకులను పేస్ట్ లాగా చేసి చికెన్‌తో కలిపి పకోడీలా వేస్తారు), ఆలూ చికెన్ కుర్మా, మునక్కాయ–కోడికూర, దోసకాయ–చికెన్, గోంగూర–చికెన్ ఆవకాయ–చికెన్, కొత్తిమీర–కోడికూర, కరివేపాకు–కోడికూర సిటీ భోజన ప్రియులు లొట్టలేసుకుని మరీ ఆరగిస్తున్నారు. ఇక మటన్ విషయానికొస్తే దోసకాయ, బీరకాయ, తోటకూర, గోంగూరలకు మటన్‌ను మిక్స్ చేసి వడ్డిస్తున్నారు. రెస్టారెంట్‌లో రుచి చూసి ఇంట్లో కూడా తయారు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
సాంబర్ రైస్– మటన్ కాబినేషన్
ఇప్పుడు సాంబార్ రైస్‌కు సైతం నాన్‌వెజ్ జోడించే కల్చర్ పెరిగింది. చికెన్–సాంబార్ రైస్, మటన్–సాంబార్, చేపల వేపుడు–సాంబార్ కాంబినేషన్లు ఇప్పుడు భోజన ప్రియుల జిహ్వాకు పనిచెబుతున్నాయి. అలాగే, రైస్ విషయానికొస్తే గోంగూర చికెన్ బిర్యానీ, గోంగూర మటన్ బిర్యానీ, గోంగూర చికెన్ రైస్ ఇప్పుడు సరికొత్త టేస్ట్‌కు కేరాఫ్‌గా మారాయనే చెప్పాలి.
రుచులు కోరుతున్నారు
నగరవాసులు ఎప్పటికప్పుడు కొత్త రుచుల కోసం ఎదురుచూస్తుంటారు. అలాగే మేం దాదాపు అన్ని రకాల కూరగాయలకు నాన్‌వెజ్‌ను మిక్స్ చేసి వడ్డిస్తున్నాం. నగరంలో ఎక్కడా చేయని డిషెస్‌ను మేం తయారు చేసి పెడతాం.
– చంద్రకాంత్, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్
ప్రోటీన్స్ పుష్కలం
ఆరోగ్య రీత్యా కూరగాయలు మంచివి అయినప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రోటీన్స్‌ను అందజేయలేవు. ఈ క్రమంలో నాన్‌వెజ్‌తో తీసుకోవడం ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. గోంగూర–చికెన్, ఎగ్–పాలకూర వంటివి. గోంగూరలో విటమిన్–సి, పాలకూర విటమిన్–ఎ లభ్యమవుతాయి. అలాగే వెజ్–నాన్‌వెజ్ మిక్సింగ్‌గా తీసుకునే క్రమంలో విటమిన్ బీ12 లోపాన్ని అధిగమించవచ్చు.
– డాక్టర్ పావని, డైటీషియన్
Comments
Please login to add a commentAdd a comment