మార్కెట్‌లో స్వీట్ కార్న్ రాశులుగా పోగయి ఉన్నాయి. బలవర్ధకమే... కానీ రోజూ ఉడికించి తినాలంటే బోర్. కొంచెం వెరైటీగా ప్రయత్నం చేస్తే... పిల్లలు లంచ్‌బాక్స్‌ను ప్రేమిస్తారు... ఈవెనింగ్ స్నాక్ కోసం ఎదురుచూస్తారు.
చీజ్ బాల్స్..
కావలసినవి:
బంగాళదుంప – 150 గ్రా (పెద్దది ఒకటి);
మొక్కజొన్న గింజలు – వంద గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేతగా ఉండాలి;
చీజ్ – 50 గ్రాములు;
మిరియాల పొడి– అర టీ స్పూన్;
కొత్తిమీర తరుగు – టీ స్పూన్;
ఆరెగానో పౌడర్ – అర టీ స్పూన్;
వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్;
మైదా లేదా శనగపిండి – 4 టేబుల్ స్పూన్‌లు;
ఉప్పు – అర టీ స్పూన్ లేదా రుచికి తగినంత;
నూనె – 3 టేబుల్ స్పూన్‌లు;
తయారీ..
– బంగాళదుంపను ఉడికించి తొక్క తీసి చిదిమి పక్కన పెట్టాలి.
– మొక్కజొన్న గింజలను ఉడికించి నీటిని వంపేసి పక్క పెట్టాలి. చీజ్‌ను తురమాలి.
– ఒక పాత్రలో బంగాళదుంప, మొక్కజొన్న గింజలు, శనగపిండి, చీజ్ తురుము, వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, ఆరెగానో వేసి కలపాలి.
– రుచి చూసి అవసరమైతే మరికొంత ఉప్పు, మిరియాలపొడి కలుపుకోవచ్చు.
– గుంత పొంగనాల పెనం వేడి చేసి ఒక్కో గుంతలో పావు టీ స్పూన్ నూనె వేయాలి.
– పెనం, నూనె బాగా వేడయ్యే లోపు బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న గోళీలంత బాల్స్ చేసి పక్కన పెట్టాలి.
– నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో గోళీని ఒక్కో గుంతలో పెట్టి మూత పెట్టాలి.
– మీడియం మంట మీద ఓ నిమిషం పాటు కాలనిచ్చి మూత తీసి ప్రతి బాల్‌నీ తిరగేయాలి.
– తిరగేసిన తర్వాత మూత పెట్టకుండా రెండో వైపు కూడా ఎర్రగా కాలనిచ్చి తీయాలి.
– వేడిగా కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
గమనిక: గుంత పొంగనాల పెనం లేకపోతే మామూలు బాణలిలో నూనె వేడి చేసి చీజ్ బాల్స్‌ని ఎర్రగా ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి.
ఫ్రైడ్ రైస్..
కావలసినవి:
బాసుమతి బియ్యం – 200 గ్రాములు;
నూనె – అర టీ స్పూన్;
నీరు – 3 కప్పులు;
మొక్క జొన్న గింజలు – 300 గ్రాములు (స్వీట్ కార్న్ లేదా మామూలు మొక్కజొన్న లేత గింజలు);
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు;
ఉల్లికాడల ముక్కలు – 3 టేబుల్ స్పూన్‌లు;
సెలెరీ లేదా కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్‌లు;
క్యాప్సికమ్ తరుగు – పావు కప్పు;
మిరియాల పొడి– టీ స్పూన్;
సోయాసాస్– టేబుల్ స్పూన్;
ఉప్పు – ఒకటిన్నర టీ స్పూన్ లేదా రుచిని బట్టి;
నెయ్యి లేదా నువ్వుల నూనె – 2 టేబుల్ స్పూన్‌లు.
తయారీ..
– బియ్యాన్ని కడిగి 20 నిమిషాల సేపు నానబెట్టి నీటిని వంపేసి పక్కన పెట్టాలి.
– ఒక పాత్రలో మూడు కప్పుల నీరు పోసి వేడి చేసి మరిగేటప్పుడు అందులో పావు టీ స్పూన్ ఉప్పు, అర టీ స్పూన్ ఆయిల్, కడిగి పెట్టిన బియ్యం వేయాలి.
– అన్నం ఉడికిన తర్వాత వార్చి అన్నాన్ని ఒక పళ్లెంలో పోసి పక్కన పెట్టాలి.
– అన్నం ఉడికేలోపు మరొక స్టవ్ మీద పాత్ర పెట్టి మొక్కజొన్న గింజలను ఉడికించాలి.
– ఇప్పుడు స్టవ్ మీద వెడల్పు పాత్ర లేదా పెద్ద బాణలి పెట్టి నెయ్యి లేదా నువ్వుల నూనె వేడి చేయాలి.
– అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడల ముక్కలు వేసి దోరగా వేయించాలి.
– తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, సెలెరీ తరుగు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన మొక్కజొన్న గింజలు, సోయాసాస్ వేసి దోరగా వేయించాలి.
– అందులో మిరియాలపొడి, ఉప్పు వేసి కలిపి ఇప్పుడు అందులో సగం అన్నం వేసి అన్నం మెతుకులు నలగనంత సున్నితంగా ఒక నిమిషం పాటు వేయించాలి.
– ఇప్పుడు మిగిలిన అన్నాన్ని కూడా వేసి అంతా కలిసేటట్లు బాణలిని కదిలించి మూత పెట్టి స్టవ్ మీద నుంచి దించేయాలి.
Comments
Please login to add a commentAdd a comment