ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలకు సిద్ధమయ్యే పెద్దవారికి లంచ్ బాక్సు కట్టడానికి ఇంట్లో రోజూ హడావుడి కనిపిస్తుంది. తక్కువ సమయంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం, బ్రేక్ సమయంలో స్నాక్స్ అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆహారంలో కొద్దిగా ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా బాక్సు అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. నిత్యం రొటీన్ క్యారేజీ కడితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో అటు పిల్లలు ఇష్టపడేలా.. ఇటు పోషకాలు అధికంగా ఉండేలా.. ఆహార నిపుణుల సూచనలతో కొన్ని రెసిపీలు మీ కోసం.. – సాక్షి, సిటీబ్యూరో
వంటింట్లో టమాటా రైస్, ఎగ్ రైస్, జీరా రైస్, పుదీనా రైస్, పెరుగన్నం, అప్పుడప్పుడు వెజ్, నాన్‌వెజ్ ఫ్రైడ్ రైస్ వంటివి తెలిసిన వంటకాలు. అలాగే ఆరోగ్యం అందించే కరివేపాకు రైస్, ఉల్లి రైస్, కాలిఫ్లవర్ రైస్ వంటివి కూడా ట్రై చేయండి. తయారీకి తక్కువ సమయం, తినడానికి రుచికరంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల లంచ్ బాక్సుకు ఉపయోగకరంగా ఉంటాయి.
కరివేపాకు అన్నం..
జీర్ణశక్తిని పెంపొందించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. అందుకే తరతరాలుగా అన్ని వంటల్లో కొంచెమైనా కరివేపాకు వేస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినా పిల్లలు, పెద్దల్లో కొంత మంది మాత్రం కరివేపాకులు కనిపిస్తే తీసి పక్కన పడేస్తారు. అటువంటి వారికోసం కరివేపాకు రైస్ చేసి పెడితే చకచకా తినేస్తారు. కరివేపాకుల వల్ల కలిగే లాభాలన్నీ వారికి అందుతాయి. వంట వేగంగా అయిపోతుంది.
– బియ్యం కడిగి, నీటిని వడపట్టి పక్కన పెట్టుకోవాలి.
– స్టవ్‌పై పాత్ర పెట్టి టీస్పూను నూనె, ఒకటిన్నర కప్పు కరివేపాకు ముక్కలు, కొబ్బరి తురుము కలిపి ఒక నిమిషం వేయించాలి.
– చల్లారిన తరువాత మిక్సీలో రుబ్బుకోవాలి. మరో పాత్రలో నూనె, లవంగాలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు వేయించాలి. – అప్పటికే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. అందులో కరివేపాకు పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.
– బియ్యం పలుగ్గా ఉడికిన తరువాత సిమ్‌లో కొద్దిసేపు ఉంచాలి. అంతే కరివేపాకు అన్నం రెడీ.
కాలిఫ్లవర్ రైస్..
కాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచిది. కూరలు, ఫ్రై చేయడానికి, వెజ్ మంచూరియా వంటి వంటకాల్లో వాడుతుంటారు. కాలిఫ్లవర్ రైస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయండి..
– బియ్యం 80 శాతం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
– మరో పాత్రలో తరిగిన కాలిఫ్లవర్ ముక్కలను ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.
– అనంతరం నీటిని వడగట్టి ముక్కల్ని ఆరబెట్టుకోవాలి.
– జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచి్చమిర్చి, బఠాణీలు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి.
– అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి, గరం మసాలా కలపాలి.
– వేగిన తరువాత ఉడకబెట్టిన అన్నం వేసి, అవసరమైనంత ఉప్పు వేసి కలపాలి.
– అన్నం పూర్తిగా ఉడికే వరకూ చూసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే కాలిఫ్లవర్ రైస్ సిద్ధమైనట్లే.
ఉల్లి రైస్..
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఆరోగ్యపరంగా ఉల్లికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కూరలు, ఇతర రెసిపీలు తయారీలోనే కాదు, ఉల్లి రైస్‌ని ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇది చూడండి.
– ఉల్లిని మనకు నచ్చిన రీతిలో (నిలువుగా, అడ్డంగా) ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బియ్యం కడిగి ఉంచుకోవాలి.
– పొయ్యిపై పాత్ర పెట్టి నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు వేయించాలి.
– కరివేపాకులు వేసి వేగాక, తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, యాలుకలు, లవంగాలు వేసి వేయించాలి.
– తరువాత కడిగి సిద్ధం చేసుకున్న బియ్యం వేసి బాగా కలపాలి.
– అవసరమైనంత ఉప్పు వేసుకోవాలి. అన్నం ఉడికిన తరువాత దించితే సరిపోతుంది.
ఇవి చదవండి: ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్!
Comments
Please login to add a commentAdd a comment