rice varieties
-
నైస్.. రైస్! రుచికరంగా.. కొత్తదనంగా..!
ఉదయాన్నే పాఠశాలకు వెళ్లే పిల్లలకు, ఉద్యోగ, వ్యాపార కార్యకలాపాలకు సిద్ధమయ్యే పెద్దవారికి లంచ్ బాక్సు కట్టడానికి ఇంట్లో రోజూ హడావుడి కనిపిస్తుంది. తక్కువ సమయంలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నానికి భోజనం, బ్రేక్ సమయంలో స్నాక్స్ అన్నీ సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సమయంలో ఆహారంలో కొద్దిగా ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా బాక్సు అలాగే తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. నిత్యం రొటీన్ క్యారేజీ కడితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ నేపథ్యంలో అటు పిల్లలు ఇష్టపడేలా.. ఇటు పోషకాలు అధికంగా ఉండేలా.. ఆహార నిపుణుల సూచనలతో కొన్ని రెసిపీలు మీ కోసం.. – సాక్షి, సిటీబ్యూరోవంటింట్లో టమాటా రైస్, ఎగ్ రైస్, జీరా రైస్, పుదీనా రైస్, పెరుగన్నం, అప్పుడప్పుడు వెజ్, నాన్‌వెజ్ ఫ్రైడ్ రైస్ వంటివి తెలిసిన వంటకాలు. అలాగే ఆరోగ్యం అందించే కరివేపాకు రైస్, ఉల్లి రైస్, కాలిఫ్లవర్ రైస్ వంటివి కూడా ట్రై చేయండి. తయారీకి తక్కువ సమయం, తినడానికి రుచికరంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారుల లంచ్ బాక్సుకు ఉపయోగకరంగా ఉంటాయి.కరివేపాకు అన్నం..జీర్ణశక్తిని పెంపొందించడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. అందుకే తరతరాలుగా అన్ని వంటల్లో కొంచెమైనా కరివేపాకు వేస్తారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయినా పిల్లలు, పెద్దల్లో కొంత మంది మాత్రం కరివేపాకులు కనిపిస్తే తీసి పక్కన పడేస్తారు. అటువంటి వారికోసం కరివేపాకు రైస్ చేసి పెడితే చకచకా తినేస్తారు. కరివేపాకుల వల్ల కలిగే లాభాలన్నీ వారికి అందుతాయి. వంట వేగంగా అయిపోతుంది.– బియ్యం కడిగి, నీటిని వడపట్టి పక్కన పెట్టుకోవాలి.– స్టవ్‌పై పాత్ర పెట్టి టీస్పూను నూనె, ఒకటిన్నర కప్పు కరివేపాకు ముక్కలు, కొబ్బరి తురుము కలిపి ఒక నిమిషం వేయించాలి.– చల్లారిన తరువాత మిక్సీలో రుబ్బుకోవాలి. మరో పాత్రలో నూనె, లవంగాలు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి ముక్కలు, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్టు వేయించాలి. – అప్పటికే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేయాలి. అందులో కరివేపాకు పేస్ట్, ఉప్పు, నిమ్మరసం వేసి కలపాలి.– బియ్యం పలుగ్గా ఉడికిన తరువాత సిమ్‌లో కొద్దిసేపు ఉంచాలి. అంతే కరివేపాకు అన్నం రెడీ.కాలిఫ్లవర్ రైస్..కాలిఫ్లవర్ ఆరోగ్యానికి మంచిది. కూరలు, ఫ్రై చేయడానికి, వెజ్ మంచూరియా వంటి వంటకాల్లో వాడుతుంటారు. కాలిఫ్లవర్ రైస్ ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా చేయండి..– బియ్యం 80 శాతం ఉడికించి పక్కన పెట్టుకోవాలి.– మరో పాత్రలో తరిగిన కాలిఫ్లవర్ ముక్కలను ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.– అనంతరం నీటిని వడగట్టి ముక్కల్ని ఆరబెట్టుకోవాలి.– జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, పచి్చమిర్చి, బఠాణీలు వేసి తాలింపు సిద్ధం చేసుకోవాలి.– అందులో కాలిఫ్లవర్ ముక్కలు వేసి, గరం మసాలా కలపాలి.– వేగిన తరువాత ఉడకబెట్టిన అన్నం వేసి, అవసరమైనంత ఉప్పు వేసి కలపాలి.– అన్నం పూర్తిగా ఉడికే వరకూ చూసుకోవాలి. చివరిగా కొత్తిమీర వేసుకుంటే కాలిఫ్లవర్ రైస్ సిద్ధమైనట్లే.ఉల్లి రైస్..ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని నానుడి. ఆరోగ్యపరంగా ఉల్లికి అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. కూరలు, ఇతర రెసిపీలు తయారీలోనే కాదు, ఉల్లి రైస్‌ని ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇది చూడండి.– ఉల్లిని మనకు నచ్చిన రీతిలో (నిలువుగా, అడ్డంగా) ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. బియ్యం కడిగి ఉంచుకోవాలి.– పొయ్యిపై పాత్ర పెట్టి నూనె వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శెనగపప్పు వేయించాలి.– కరివేపాకులు వేసి వేగాక, తరిగిన ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి, యాలుకలు, లవంగాలు వేసి వేయించాలి.– తరువాత కడిగి సిద్ధం చేసుకున్న బియ్యం వేసి బాగా కలపాలి.– అవసరమైనంత ఉప్పు వేసుకోవాలి. అన్నం ఉడికిన తరువాత దించితే సరిపోతుంది.ఇవి చదవండి: ఈ వాస్తు చిత్రలేఖనం.. ఇప్పుడొక ట్రెండ్! -
సాప్ట్వేర్ కొలువు వదిలి దేశీ వరి వంగడాలను సంరక్షిస్తున్న యువ ఇంజనీర్
ఆయనో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. బిట్స్ పిలానీలో మాస్టర్ డిగ్రీ చదివారు. ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఐదేళ్లు పనిచేశారు. స్వతహాగా రచయిత కావడంతో సాఫ్ట్వేర్ కొలువు వదిలి సృజనాత్మక రంగంలో అడుగుపెట్టారు. ఇంకా ఏదో చేయాలన్న తపన.. సరిగ్గా అదే సమయంలో కేరళకు చెందిన ఎర్ర బియ్యం (నవార)లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయారు. ఇలాంటి పురాతన ధాన్యపు సిరులపై అధ్యయనంకోసం 8 రాష్ట్రాల్లో పర్యటించారు. 251 పురాతన వరి రకాలను సేకరించారు. వాటిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని ప్రతినబూనారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఆయనే నందం రఘువీర్. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఈయన గడిచిన నాలుగేళ్లుగా పురాతన విత్తనాలను సంరక్షించే కృషిలో నిమగ్నమయ్యారు. వాటిని యువ రైతులకు అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీ విత్తన బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తనతో కలిసొచ్చే రైతులతో తొలిదశలో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేయబోతున్నారు. దేశీ వంగడాల విశిష్టతను వివరించే పుస్తక రచన చేస్తున్నారు. పురాతన విత్తన సంపదను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలన్న సంకల్పంతో ఉద్యమిస్తున్న రఘువీర్ ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... పోషక విలువలతో పాటు 14 శాతానికి పైగా ఫైబర్ కలిగిన ‘నవార’ బియ్యం తిన్న తర్వాత నా ఆలోచన మారింది. అసలు ఇలా ఎన్ని రకాల పురాతన వరి రకాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో నాలుగేళ్ల క్రితం తొలి అడుగు వేశా. తమిళనాడు, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటించాను. ఎక్కువ భాగం ఆదివాసీల నుంచి విత్తనాలు సేకరించాను. వాటిని ఎలా దాచుకోవాలి. ఎలా సంరక్షించాలి. ఎలా సాగు చేయాలో వారి దగ్గర నేర్చుకున్నా. నా పర్యటనలో పురాతన వరి విత్తన సంరక్షణోద్యమ పితామహుడు డాక్టర్ దేవల్దేవ్ (ఒడిషా) వద్ద నెల రోజుల పాటు శిక్షణ పొందా. ఈయన వద్ద ప్రపంచంలో మరెక్కడా లేని 1500కు పైగా వంగడాలున్నాయి. దేశీ వంగడాల పరిరక్షణకు కృషి చేస్తున్న డాక్టర్ వందనా శివను కలిసాను. పురాతన వంగడాలపై విశిష్ట కృషి చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.హెచ్.రిచారియా నుంచి సేకరించిన విత్తనాలతో డెహ్రాడూన్ సమీపంలో 50 ఎకరాల్లో ‘నవధాన్య’ పేరిట విత్తన పరిరక్షణకు నడుం బిగించారు. ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 251 దేశీ వరి రకాల సేకరణ ఇప్పటి వరకు 251 రకాల అత్యంత పురాతనమైన వరి విత్తనాలను సేకరించాను. వీటిలో భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కల్గిన వంగడాలు 10కి పైగా ఉన్నాయి. పెనమలూరులో 1.3 ఎకరాల్లో ఈ విత్తనాల సంరక్షణ చేస్తున్నా. ఇప్పటి వరకు 48 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాను. నేను నేర్చుకున్న విషయాలను పుస్తక రూపంలో తెచ్చే పనిలో ఉన్నా. ఇందులో పురాతన వరి రకాలు, వాటి వివరాలు,æ గొప్పదనం, చరిత్ర, ఔషధ గుణాలు, వంటకాలు వంటి వివరాలుంటాయి. ఈ ఏడాది 8 జిల్లాలలో విత్తన నిధులను ఏర్పాటు చేస్తున్నా. గిరిజన ప్రాంతమైన పెదబయలు మండలంలో దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తున్నా. రూ. 50 వేల నికరాదాయం ప్రకతి వ్యవసాయంలో పురాతన వరి రకాలను సాగు చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎకరాలో ఖర్చులు పోను 50 వేలు నికర లాభం పొందవచ్చు.« ధాన్యాన్ని 4 నెలల పాటు నిల్వ చేసి.. బియ్యంగా మార్చి అమ్మగలిగితే దీనికి రెట్టింపు ఆదాయం ఆర్జించొచ్చు. తగిన జాగ్రత్తలతో విత్తనంగా అమ్మితే చక్కని ఆదాయం పొందవచ్చు. దేశీ వరి విత్తనోత్పత్తిలో మెలకువలు తక్కువ స్థలంలో ఎక్కవ రకాలు పండించాలనుకుంటే ఖచ్చితంగా రకానికి రకానికి మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి. మధ్యలో గుడ్డ కట్టాలి. ఒకేసారి పుష్పించకుండా ఉండేలా నాటుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా దేశవాళీ వరి సంరక్షణ పేరిట ఒక ఎకరంలో 100 రకాలు సాగు చేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు, చీడపీడలను తట్టుకునే లక్షణాలు, సువాసనలను కోల్పోతాయి. కేంద్రం భౌగోళిక గుర్తింపునిచ్చిన వాటిలో ప్రధానంగా నవార, పాలకడ్ మిట్ట, పొక్కలి, వాయనాడ్ గంధకసాల, కాలానమక్, కైపాడ్, జోహా, అజారా ఘణసాల్, అంబెమొహర్, తులైపాంజ్, గోవిందో బోగ్, కటార్ని, చౌకోహ, సీరగ సాంబ రకాలు ఉన్నాయి. ఎర్ర బియ్యంలో 100 రకాలు, నల్ల బియ్యంలో 20 రకాలకు పైగా మన దేశంలోనే ఉన్నాయి. ఎకరాకు 13 నుంచి 30 బస్తాల దిగుబడినిచ్చే పురాతన రకాలున్నాయి. మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువే. 70 నుంచి 240 రోజుల్లో పండే పురాతన వరి రకాలు నా దగ్గర ఉన్నాయి. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి దేశీ వరి వంగడాల ప్రత్యేకతలు నవర: రెడ్ రైస్ (ఎర్ర బియ్యం). కేరళకి చెందిన ఈ రకానికి 2007లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. ఒక రోజు నాన బెట్టి, ఒక గంటసేపు ఉడికించాలి. అత్యంత బలవర్ధకమైన బియ్యమిది. డయాబెటిక్ వారికి అత్యంత సురక్షితమైన ఆహారం. పాలక్కడ్ మట్ట: కేరళకు చెందిన మరో ఎర్ర బియ్యపు రకం. చోళ రాజులు తినేవారట. ముంపును తట్టుకునే పంట ఇది. ఇడ్లీ తరహా వంటలకు అనుకూలం. పోక్కలి: ఉప్పు నీటిలో పెరిగే రకం. కేరళలో ఎర్నాకుళం, త్రిస్సూర్ పరిసరాల్లో సాగు చేస్తారు. ఇది కూడా ఎర్ర బియ్యమే. వరి పొలంలో చేపలను పెంచే సమీకృత వ్యవసాయానికి ఇది అనుకూలం. ఇందులో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. అధిక శక్తినిస్తుంది. సముద్రవేటకు వెళ్లే జాలర్లు ఎక్కువగా వాడుతుంటారు. వయనాడు గంధకశాల: కేరళలోని వయనాడు కొండల మీద పెరిగే సుగంధ భరితమైన రకమిది. ఈనికSదశలో మంచి సువాసన వెదజల్లుతుంది. పూర్వం పండుగల వేళ ప్రసాదాల తయారీకి ఉపయోగించేవారు. ఆదివాసీలు నేటికీ అధికంగా పండిస్తున్నారు. కాలానమక్: అత్యంత సువాసన కల్గిన తెల్ల వరి రకమిది. ధాన్యపు పొట్టు నల్లగా ఉంటుంది. బియ్యం తెల్లగా ఉంటుంది. క్రీ.పూ. 600 ఏళ్ల నాటి రకం ఇది. గౌతమ బుద్ధుని కాలంలోనూ పండించినట్టు చారిత్రక ఆధారాలున్నాయట. కపిలవస్తు (నేపాల్), ఉత్తరప్రదేశ్‌లలో నేటికీ సాగులో ఉంది. చకావో: మణిపూర్ బ్లాక్ రైస్ అని దీనికి పేరు. పంట కాలం 120 రోజులు. ఔషధ విలువలు కల్గిన నల్ల బియ్యం. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ అధికం. మార్కెట్లో ఈ రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. పాయసం తరహా వంటకాలకు బాగా అనువైనది. ప్రతి రైతూ పండించుకొని తినాలి! నేను ప్రతి రైతునూ కోరుకునేది ఒక్కటే. తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా తన కోసం పోషకాలు, ఔషధ విలువలు కలిగిన పంటలు పండించుకోవాలి. పురాతన వరి, కూరగాయలు, దుంప రకాలS విత్తనాలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. అధిక దిగుబడి మాయలో పడిపోకుండా ప్రతీ రైతు పురాతన వరి విత్తనాలను సేకరించి తాము తినడానికి పండించుకోవాలి. విత్తనాన్ని సంరక్షించు కోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరు. ముందుగా మనం మారి, ఆ తర్వాత పది మందికీ చెబితే ఖచ్చితంగా పది మందైనా మన బాటలోకి వస్తారు. ఈ స్ఫూర్తితో నేను ఈ ఉద్యమంలో ముందుకెళ్తున్నాను. – నందం రఘువీర్ (70138 20099), దేశీ వంగడాల సంరక్షకుడిగా మారిన యువ ఇంజనీర్, పెనమలూరు, కృష్ణా జిల్లా -
కలర్ 'రైస్'.. పోషకాలు 'నైస్'
చింతలూరి సన్నాలు.. తెల్లని బియ్యం రకాలు. సైజు చిన్నగా ఉండే వాటిని చిట్టిముత్యాలు అంటున్నారు. నలుపు రంగులో ఉంటే బ్లాక్ బర్మా.. డెహ్రడూన్ బ్లాక్, కాలాభట్టి అని పిలుస్తున్నారు. ఎర్ర రంగులో ఉంటే రక్తశాలి అని పిలుచుకుంటున్నారు. ఇంకా నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి అనే దేశీయ వరి రకాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ రంగుల బియ్యాలు సంపూర్ణ పోషకాలనిస్తూ యాంటీ యాక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉంటాయని చెబుతున్నారు. క్యాన్సర్‌ను నిరోధించే గుణం వీటికి ఉందని కూడా ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం: బ్లాక్ బర్మా.. డెహ్రాడూన్ బ్లాక్.. కాలాభట్టి.. రక్తశాలి.. నారాయణ కామిని.. కూజీ పటాలియా.. ఇంద్రాణి.. రత్నచోడి.. చిట్టిముత్యాలు. ఈ పేర్లు ఇప్పుడు తారకమంత్రంగా మారాయి. దేశీయ వరి రకాలుగా పండిస్తున్న ఈ రంగుల బియ్యం తింటే వైద్యుని అవసరం ఉండదట. మనిషిని నిలువునా కుంగదీసే మధుమేహానికి ఈ బియ్యంతో చెక్ పెట్టవచ్చు. మోకాళ్లు, కీళ్ల నొప్పులకు చరమగీతం పాడవచ్చు. ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ వంటివి శరీరానికి అందడంతోపాటు, రక్తపుష్టికి ఈ బియ్యమే రాచమార్గంగా చెబుతున్నారు. జీరో ఫార్మింగ్ (పెట్టుబడిలేని వ్యవసాయం)ను రైతులు అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం దేశీయ వరి రకాలను పండించే దిశగా రైతులను కార్యోన్ముఖులను చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ సంఘ నిర్వాహక ప్రకృతి విభాగం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పైన పేర్కొన్న రకాల వరిని పండించే విస్తీర్ణం 300 ఎకరాలకు పైగా చేరింది. కలర్ రైస్ లాభాలు అదుర్స్.. పోషకాలు బోనస్ అన్నట్టుగా సాగుతున్న ఈ సేద్యం వైపు పలువురు ఆకర్షితులవుతున్నారు. పంటను బియ్యంగా మార్చి మార్కెట్‌ను అందిపుచ్చుకుంటున్నారు. పురాతన రకాలివి వరిలో పురాతన కాలం నాటి దేశీయ రకాలు దాదాపుగా మూలనపడ్డాయి. అధిక దిగుబడులనిచ్చే ఆధునిక వంగడాల వైపు రైతులు మళ్లడంతో దేశీయ రకాలు కనుమరుగయ్యాయి. ప్రకృతి వ్యవసాయం పుణ్యమా అని కొందరు అభ్యుదయ రైతుల కృషితో పురాతన వరి రకాలు ఊపిరి పోసుకుంటున్నాయి. వినియోగదారులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ.. రైతులను రారాజుగా మారుస్తున్నాయి. సుఖవంతమైన జీవితం, తగ్గిన వ్యాయామం నేపథ్యంలో శరీరం రోగాలకు ఆలవాలంగా మారింది. ఈ పరిస్థితుల్లో పెట్టుబడితో పనిలేని ప్రకృతి వ్యవసాయం (జీరో ఫార్మింగ్) పేరిట తిరిగి దేశీయ వరి రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవన్నీ పోషకాలను అందిస్తూ యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ రకాలను తింటే జీర్ణవ్యవస్థకు ఇబ్బంది ఉండదని ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రకాలు మేలు జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను రైతులు పండిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ రకాల్లో పిండి పదార్థం తక్కువగా, పీచుపదార్థం అధికంగా ఉండటంతో జీర్ణం బాగుంటుంది. ఈ రకాల్లో గ్లైసమిక్ యాసిడ్ ఇండెక్స్ ఎక్కువ. యాంథోసైనిన్ అమినో ఆమ్లాల కారణంగా బియ్యంపై రంగుల పొరలు ఏర్పడతాయి. నల్ల బియ్యం రకంలో వరి కంకులు కూడా నల్లగా ఉంటాయి. ఈ రకం బియ్యం తినడం వల్ల ఐరన్, జింక్, కాల్షియం, కాపర్ అందుతాయి. పోషకాలు ఎక్కువ. మ«ధుమేహ రోగులకు ఈ రకం మేలు చేస్తుంది. యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ కారకాలుగా కూడా ఈ బియ్యం ఉపయోగపడతాయి. రక్తపుష్టికి రక్తశాలి రకం, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నివారణకు నారాయణ కామిని రకాల బియ్యం వినియోగిస్తే మేలు. జిల్లాలో 300 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ రకాలు సాగవుతున్నాయి. – నూకరాజు, జిల్లా అధికారి, ప్రకృతి వ్యవసాయ విభాగం ఎకరాకు రూ.90 వేల ఆదాయం జీరో ఫార్మింగ్‌తో దేశీయ వరి రకాలను పండించడం వల్ల ఎకరాకు రూ.90 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరాకు అన్నిరకాల ఖర్చులు కలిసి రూ.18 వేలు అవుతుంది. ఎకరాకు 18 బస్తాల దిగుబడి వస్తుంది. బస్తా ధర రూ.6 వేల వరకు ఉంది. మొత్తం వచ్చే ఆదాయం రూ.1.08లక్షలు కాగా ఖర్చులు పోను రూ.90 వేలు మిగులుతుంది. ఆన్లైన్ మార్కెట్‌ను అందిపుచ్చుకుంటే మరింతగా ఆదాయం పొందవచ్చు. 120 రోజుల్లో కోతకు వచ్చే దేశీయ రకాలు పండించడానికి ఘన జీవామృతం, జీవామృతం, వేపపిండి, ఆముదం పిండి, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం, పంచగవ్య వాడతాను. పచ్చిమిర్చి, వెల్లుల్లి, పొగాకు, శీతాఫలం ఆకులు, కానుగ, జిల్లేడు, వేప, ఆవు పేడ, ఆవు నెయ్యి, అరటి పండ్లు, ఆవు పెరుగు, కల్లు వంటివి ఈ పంట కోసం వినియోగిస్తాం. ఏడాదిగా సాగు చేస్తున్నాం. ఆదాయం బాగుంది. మండలంలో కొన్నిచోట్ల ఈ దేశీయ వరి రకాలను కొందరు సాగు చేస్తున్నారు. ఈ రకాల బియ్యం కిలో మార్కెట్ డిమాండ్ ఆధారంగా రూ.120 నుంచి రూ.200 ధర పలుకుతున్నాయి. – మరిడి నాగకృష్ణ, రైతు, వెంకట్రామన్నగూడెం -
నిరంతరం.. కొత్త రకం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, ప్రకృతిపై దాడి చేస్తున్న చీడ పీడలను ఎదుర్కొనే విధంగా తక్కువ పెట్టుబడులతో అత్యధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలు సృష్టించడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు సఫలీకృతం అవుతున్నారు. తరతరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ సేద్యం నుంచి సాంకేతిక సేద్యం వైపు రైతులను చైతన్య వంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): వరి సాగుకు ప్రసిద్ధిగాంచిన సింహపురి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహకారంతో సరికొత్త సీడ్స్‌తో హైస్పీడ్ దిగుబడులు సాధిస్తోంది. పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలతో పాటు కార్తెలు, నక్షత్రాల పేరుతో అత్యంత జన్యుపరమైన సన్న రకాల వరి విత్తనాలు సృష్టించి రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లా వాతావరణాన్నే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మంచి దిగుబడులు సాధించే విధంగా కొత్త రకం విత్తనాలను సృష్టించం ప్రత్యేకత. 28 రకాల వంగడాలు సృష్టి జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 రకాల కొత్త వరి వంగడాలను మార్కెట్లోకి తీసుకు వచ్చారు. ప్రధానంగా 1948 నుంచి కొత్త వంగడాల సృష్టిని శాస్త్రవేత్తలు ప్రారంభించారు. బీసీపీ 1, బీసీపీ 2 అనే రెండు రకాల కొత్త వంగడాలను 1948లో సృష్టించారు. బీసీపీ 3, బీసీపీ 4 రకాలను 1950లో, 1951లో బీసీపీ 5, 1965లో బీసీపీ 6, 1965లో బల్క్‌హెచ్ 9ను తయారు చేశారు. ఆ తర్వాత కొత్త మొలగొలకులు 72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తీసుకు వచ్చారు. 74 పేరుతో మరో కొత్త మొలగొలుకులు రకాన్ని 1977లో తీసుకు వచ్చారు. 1987లో పినాకిని ఎన్‌ఎల్‌ఆర్ 9672–96, 1988లో తిక్కన ఎన్‌ఎల్‌ఆర్ 27999, 1991లో సింహపురి ఎన్‌ఎల్‌ఆర్ 28600, శ్రీరంగ ఎన్‌ఎల్‌ఆర్ 28523, స్వర్ణముఖి ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను, 1996లో భరణి ఎన్‌ఎల్‌ఆర్ 30491, శ్రావణి ఎన్‌ఎల్‌ఆర్ 33359, స్వాతి ఎన్‌ఎల్‌ఆర్ 33057, పెన్నా ఎన్‌ఎల్‌ఆర్ 33365 రకాలను, 1999లో సోమశిల ఎన్‌ఎల్‌ఆర్ 33358, వేదగిరి ఎన్‌ఎల్‌ఆర్ 33641, అపూర్వ ఎన్‌ఎల్‌ఆర్ 33654 రకాలను, 2002లో పర్తివ ఎన్‌ఎల్‌ఆర్ 33892, 2006లో నెల్లూరు మసూరి ఎన్‌ఎల్‌ఆర్ 34449 2009లో, స్వేత ఎన్‌ఎల్‌ఆర్ 40024 2012లో, నెల్లూరు ధాన్యరాశి ఎన్‌ఎల్‌ఆర్ 3354, నెల్లూరు సిరి ఎన్‌ఎల్‌ఆర్ 4001, నెల్లూరు సుగంధ ఎన్‌ఎల్‌ఆర్ 40054లను 2020లో సృష్టించారు. ఈ విధంగా 28 రకాల వరి కొత్త వంగడాలను జిల్లా శాస్త్రవేత్తలు జిల్లా వాసులకు అందించారు. రైతులను చైతన్య పరుస్తూ.. జిల్లాలోని రైతులను ఎప్పకప్పుడు శాస్త్రవేత్తలు చైతన్య పరుస్తూ కొత్త వంగడాలపై అవగాహన కల్పిస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో పర్యటించడం కాకుండా, పరిశోధనా స్థానంలో రైతులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ఆ దిశగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలు ఖరీఫ్‌లో, రబీలో ఏ విధంగా వేసుకుంటే పంట సాగు బాగుంటుంది, ఎంత మోతాదులో రసాయనాలు వాడాలి అనే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని విధాలుగా చేస్తున్నాం జిల్లాలోని రైతులకు అనుగుణంగా, వారికి అవసరమయ్యే విధంగా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు అని విధాలుగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు. – వినీత, ప్రధాన శాస్త్రవేత్త అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పకప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. కొత్త వంగడాలను సృష్టించినప్పుడు రైతులు వెనకడుగు వేస్తారు. కానీ వాటిపై పూర్తి అవగాహన కల్పిస్తే మాత్రం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – జి.చంద్రశేఖర్‌రెడ్డి, చాగణం రైతు,సైదాపురం మండలం సలహాలతో ఎంతో మేలు శాస్త్రవేత్తలు, సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు ఉంటుంది. మాకు తెలిసిన పరిజ్ఞానం కన్నా, శాస్త్రవేత్తల సాంకేతి పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబటి, వారి ప్రకారం నడుచుకుంటే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. – ఎస్ సుధాకర్‌రెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట రైతు, మర్రిపాడు మండలం -
పాతపంట.. కొత్త సంబురం
జహీరాబాద్: అంతరించిపోతున్న పాతపంటల పరిరక్షణకు ఏటా మాదిరిగానే ఈసారీ పస్తాపూర్‌లోని డీడీఎస్ (డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ) ఆధ్వర్యంలో పాత పంటల జాతరను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్రాంతి పర్వదినమైన జనవరి 14న ఎడ్లబండ్లలో పాత పంటల ధాన్యంతో జాతరను సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని శంశల్లాపూర్ గ్రామంలో ప్రారంభిస్తారు. నెల తరువాత ఫిబ్రవరి 15న ఝరాసంగం మండలం మాచ్నూరులో నిర్వహించే కార్యక్రమంతో జాతర ముగుస్తుంది. పాతపంటల ప్రాధాన్యత గురించి వివరిస్తూ అంతరించిపోతున్న పంటలను పరిరక్షించుకుని పల్లె వ్యవసాయాన్ని కాపాడుకునే విధానంపై ప్రచారం నిర్వహిస్తారు. జాతరలో అందంగా అలంకరించిన 16 ఎడ్లబండ్లలో పాతపంటల ధాన్యాన్ని ప్రదర్శిస్తారు. వానాకాలం, యాసంగి కోసం విత్తనాల నిల్వలు జహీరాబాద్ ప్రాంత రైతాంగానికి ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాల కోసం ఎదురు చూడకుండా అవసరమైన విత్తనాలను ముందే నిల్వ చేసి ఉంచుతారు. రైతులు తాము పండించిన పంట చేతికందగానే పంటలోని నాణ్యమైన ధాన్యాన్ని విత్తనం కోసం సేకరించి పెడతారు. ఆ విత్తనాన్ని ఈత ఆకులతో చేసిన బుట్టల్లో పోసి పైభాగంలో మట్టి, పేడ కలిపి మూసివేస్తారు. విత్తనం ధాన్యంలో వేపాకు, బూడిద, పురుగు పట్టకుం డా మందు కలుపుతారు. విత్తనాలు నాటే సమయం రాగానే వాటిని బయటకు తీస్తారు. నియోజకవర్గంలోని దాదాపు 68 గ్రామాల్లో మహిళ లు విత్తన బ్యాంకులను ఏర్పాటు చేసుకున్నారు. డీడీఎస్ ఆధ్వర్యంలో విత్తన బ్యాంకులను నిర్వహిస్తున్నారు. ఈ విత్తనాలు సుమారు 10 వేల ఎకరాలకుపైగా సాగు చేసేందుకు ఉపయోగపడు తాయి. రైతులు 20 నుంచి 30 రకాల విత్తనాలను అందుబాటులో పెట్టుకుంటారు. -
ఖరీఫ్‌కు ఐదు కొత్త వరి వంగడాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో సాగు చేసేందుకు ఐదు కొత్త వరి వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. రాష్ట్ర పరిశోధనా కేంద్రాల నుంచి ఇటీవల కాలంలో 13 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలో సాగు చేసేందుకు ఆరు రకాలు మాత్రమే పనికొస్తాయని అంచనా వేసినట్టు విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఏఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో పనికొచ్చేవి ఐదు ► రాష్ట్ర పరిధిలో పండించేందుకు ఐదు వరి వంగడాలతోపాటు ఒకటి జొన్న వంగడం. ► వరికి సంబంధించిన ఐదు రకాల్లో ఎంటీయూ–1224 (మార్టేరు సాంబ), ఎంటీయూ–1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ–1210 (సుజాత), బీపీటీ–2595 (తేజ), ఎన్‌ఎల్‌ఆర్–3354 (నెల్లూరు ధాన్యరాశి) ఉన్నాయి. ► జొన్నకు సంబంధించి వీఆర్–988 (సువర్ణ ముఖి) కొత్త వంగడం విడుదలైంది. ► దేశ పరిధిలో విడుదల చేసిన వాటిలో వరికి సంబంధించి ఎంటీయూ–1223 (వర్ష), ఎంటీయూ–1239 (శ్రావణి).. గోగు పంటకు సంబంధించి ఏఎంయూ–8, ఏఎంయూ–9 (ఆదిత్య), జొన్నకు సంబంధించి వీఆర్–929 (వేగవతి), సజ్జకు సంబంధించి ఏబీవీ–04, పత్తికి సంబంధించి ఎల్‌డీహెచ్‌పీ ఉన్నాయి. ► ఈ ఖరీఫ్‌లో కృష్ణా జోన్‌లోని రైతులు ఎంటీయూ–1061 (ఇంద్ర), బీపీటీ–5204, 2270 (భావపురి సన్నాలు), ఎంటీయూ–1075 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224 ఎంటీయూ–1262 కూడా సాగు చేసుకోవచ్చు. ► గోదావరి జోన్‌లోని రైతులు స్వర్ణ, ఇంద్ర, ఎంటీయూ–1064, పీఎల్ఏ–1100, కొత్తగా విడుదలైన ఎంటీయూ–1262, 1224 రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ► ఉత్తర కోస్తా రైతులు స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు, బీపీటీ–5204, ఎంటీయూ–1075, శ్రీధృతితో పాటు కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224, ఎంటీయూ–1210 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. ► దక్షిణ మండలంలో (సౌత్ జోన్) ఎన్‌ఎల్‌ఆర్–3354, 33892తో పాటు కొత్తదైన ఎన్‌ఎల్‌ఆర్–4001, ఎంటీయూ–1224 అనువైనవి. ► తక్కువ వర్షపాత ప్రాంతాల్లో బీపీటీ–5204, ఎన్‌డీఎల్‌ఆర్–7, 8తో పాటు కొత్తవైన ఎంటీయూ–1224, బీపీటీ–2782 రకాలను సాగు చేసుకోవచ్చు. ► గిరిజన మండలాలలో స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ–1153, 1156 అనువైనవి. ► ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఎల్ఏ–1100, ఎంటీయూ–1064 (అమర), ఎంటీయూ–1140 (భీమ) అనువైనవిగా సిఫార్సు చేశారు. చౌడు ప్రాంతాల్లో ఎంటీయూ–061తో పాటు కొత్తగా విడుదలైన ఎంసీఎం–100 వేసుకోవచ్చు. ► నాణ్యమైన విత్తనం కోసం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నది. ► స్వయంగా రైతులు తయారు చేసుకున్న విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ► విత్తనం సంచి లేబుల్ మీద కనీసం 80 శాతం మొలక శాతం వుందో లేదో చూసుకోవాలి. -
ఈ వరి.. సువాసనల సిరి
* తూర్పుగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కొత్త వరి వంగడాల సాగు * సువాసనలు వెదజల్లుతున్న సెంటెడ్ హైబ్రిడ్ రకం వరి పిఠాపురం: ఆ పొలంలో అడుగు పెడితే చాలు.. అత్తరులాంటి సువాసనలు నాసికారంధ్రాలకు సోకుతాయి. అయితే అది పూలతోటనుకుంటే.. పొరపాటే. అది.. వరి చేను. వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సరికొత్త రకం సెంటెడ్ హైబ్రిడ్ రకం వరి ఇలా ఘుమఘుమలను వెదజల్లుతోంది. విజృంభిస్తున్న తెగుళ్లను, నీటి కొరతను, వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ వినూత్న వంగడాలను సాగు చేయిస్తోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కొత్త వరి వంగడాలతో ‘చిరు సంచుల’ ప్రదర్శన క్షేత్రాలను(కేవలం రెండు కేజీల విత్తనాలతో సాగు చేస్తున్నందున వీటికా పేరుపెట్టారు) ఏర్పాటు చేసింది. వాటిలో సెంటెడ్ హైబ్రిడ్(ఎన్‌ఎల్‌ఆర్ 40054) రకం వరిని సాగు చేసిన పొలాలు సువాసనలు వెదజల్లుతూ రైతుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రకం విత్తనాలతో సాగుచేసిన వరి మంచి వాసనతోపాటు రుచి కలిగి.. బలవర్థకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెల్లూరు, మార్టేరు వరి పరిశోధన కేంద్రాల్లో వీటిని అభివృద్ధి చేసినట్టు వారు తెలిపారు. ప్రయోగాత్మకంగా సాగు.. పరిమళం వెదజల్లే ఎన్‌ఎల్‌ఆర్ 40054 రకంతోపాటు తెగుళ్లను తట్టుకునే బీపీటీ 2615, ఎంటీవీ 1187, ఎన్‌ఎల్‌ఆర్ 3217 రకాలను కూడా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ఏడీఏ పద్మశ్రీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో 89 చిరుసంచుల ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కోదానికి రెండు కేజీల చొప్పున నాలుగు రకాల కొత్త వంగడాల్ని రైతులకు అందజేసి సాగు చేయిస్తున్నామని చెప్పారు. ఇలా మూడేళ్లపాటు ఖరీఫ్, రబీల్లో ఆరు విడతలుగా సాగు చేయించి ఫలితాలనుబట్టి రైతులకు పూర్తిస్థాయి సాగుకు వంగడాలను అందిస్తామని తెలిపారు. ఈ రబీలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన అన్నిరకాలూ ఎలాంటి తెగుళ్లూ సోకకుండా ఏపుగా పెరిగి కంకులు తయారయ్యే స్థితిలో ఉన్నాయన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్లోనూ వీటిని సాగు చేసి ఫలితాలు చూస్తామన్నారు.