ఈ వరి.. సువాసనల సిరి | cultivation of a new rice varieties Practically in east godhavari district | Sakshi
Sakshi News home page

ఈ వరి.. సువాసనల సిరి

Published Thu, Mar 10 2016 3:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఈ వరి.. సువాసనల సిరి - Sakshi

ఈ వరి.. సువాసనల సిరి

* తూర్పుగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా కొత్త వరి వంగడాల సాగు
* సువాసనలు వెదజల్లుతున్న సెంటెడ్ హైబ్రిడ్ రకం వరి


 పిఠాపురం: ఆ పొలంలో అడుగు పెడితే చాలు.. అత్తరులాంటి సువాసనలు నాసికారంధ్రాలకు సోకుతాయి. అయితే అది పూలతోటనుకుంటే.. పొరపాటే. అది.. వరి చేను. వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన సరికొత్త రకం సెంటెడ్ హైబ్రిడ్ రకం వరి ఇలా ఘుమఘుమలను వెదజల్లుతోంది. విజృంభిస్తున్న తెగుళ్లను, నీటి కొరతను, వాతావరణ మార్పులను తట్టుకుని అధిక దిగుబడులు సాధించేందుకు వీలుగా వ్యవసాయ శాఖ వినూత్న వంగడాలను సాగు చేయిస్తోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో కొత్త వరి వంగడాలతో ‘చిరు సంచుల’ ప్రదర్శన క్షేత్రాలను(కేవలం రెండు కేజీల విత్తనాలతో సాగు చేస్తున్నందున వీటికా పేరుపెట్టారు) ఏర్పాటు చేసింది. వాటిలో సెంటెడ్ హైబ్రిడ్(ఎన్‌ఎల్‌ఆర్ 40054) రకం వరిని సాగు చేసిన పొలాలు సువాసనలు వెదజల్లుతూ రైతుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రకం విత్తనాలతో సాగుచేసిన వరి మంచి వాసనతోపాటు రుచి కలిగి.. బలవర్థకంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెల్లూరు, మార్టేరు వరి పరిశోధన కేంద్రాల్లో వీటిని అభివృద్ధి చేసినట్టు వారు తెలిపారు.
 
 ప్రయోగాత్మకంగా సాగు..
 పరిమళం వెదజల్లే ఎన్‌ఎల్‌ఆర్ 40054 రకంతోపాటు తెగుళ్లను తట్టుకునే బీపీటీ 2615, ఎంటీవీ 1187, ఎన్‌ఎల్‌ఆర్ 3217 రకాలను కూడా ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ ఏడీఏ పద్మశ్రీ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో 89 చిరుసంచుల ప్రదర్శన క్షేత్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కోదానికి రెండు కేజీల చొప్పున నాలుగు రకాల కొత్త వంగడాల్ని రైతులకు అందజేసి సాగు చేయిస్తున్నామని చెప్పారు. ఇలా మూడేళ్లపాటు ఖరీఫ్, రబీల్లో ఆరు విడతలుగా సాగు చేయించి ఫలితాలనుబట్టి రైతులకు పూర్తిస్థాయి సాగుకు వంగడాలను అందిస్తామని తెలిపారు. ఈ రబీలో ప్రయోగాత్మకంగా సాగుచేసిన అన్నిరకాలూ ఎలాంటి తెగుళ్లూ సోకకుండా ఏపుగా పెరిగి కంకులు తయారయ్యే స్థితిలో ఉన్నాయన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌లోనూ వీటిని సాగు చేసి ఫలితాలు చూస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement