అరవై రోజుల అద్భుతం 'నవార'! | Ancient Medicinal Navara Red Rice An Old Kerala Farm | Sakshi
Sakshi News home page

అరవై రోజుల అద్భుతం 'నవార'!

Published Wed, Feb 12 2025 10:39 AM | Last Updated on Wed, Feb 12 2025 10:51 AM

Ancient Medicinal Navara Red Rice An Old Kerala Farm

నవార.. కేరళకు చెందిన ఓ అపురూపమైన పాత పంట. 2 వేల ఏళ్ల క్రితం నుంచే సాగులో ఉన్న  అద్భుతమైన ఔషధ విలువలున్న ధాన్యపు పంట. ఆయుర్వేదంలోనూ ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకున్న విశిష్ట వంగడం నవార.  ఆహారంగా, ఔషధంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లనే ఇది ఔషధ పంటగా అంతర్జాతీయంగానూ ప్రాచుర్యం  పొందింది.  

60 రోజుల పంట
దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా కేరళ, పురాతన వ్యవసాయ వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుంది నవార. ఇది స్వల్పకాలిక పంట. విత్తిన 60 రోజుల్లోనే ధాన్యం చేతికొస్తుంది. అందుకే దీనికి ‘షస్తిక శాలి’ అనే పేరు వచ్చింది. నవార బియ్యం ఎరుపు + నలుపు రంగుల కలగలుపుతో విలక్షణంగా కనిపిస్తుంది. చర్మం, ఎముకలు, కండరాలు, జీర్ణకోశం ఆరోగ్యం కోసం ఉపయోగపడుతుందని కేరళలోని వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు.

జిఐ గుర్తింపు 
జన్యుపరంగా విశిష్ట గుణాలు కలిగి ఉన్నందున 2008లో నవార వంగడానికి కేంద్ర ప్రభుత్వం జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జిఐ) గుర్తింపునిచ్చింది. ఈ గుర్తింపు పొందిన నవార వంగడాలు రెండు. నలుపు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం ఒకటి. లేత బంగారు రంగు జీరతో ఉండే ఎర్ర బియ్యపు రకం రెండోది.  కేరళలోని కరుకమనికళంలో గల నవార రైస్‌ ఫార్మర్స్‌ సొసైటీ ఈ రెండు వంగడాలకు జిఐ గుర్తింపును పొందింది. 

ఈ రెండు రకాల నవార బియ్యానికి సహజమైన తీపి రుచి ఉంటుంది. సులువుగా జీర్ణమవుతాయి. అందువల్ల అన్ని వయసుల వారూ తినటానికి అనువుగా ఉంటాయి. సాధారణంగా నవార బియ్యాన్ని పిండి పట్టించి పాలలో కలుపుకొని తాగుతారు. దీనికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆథ్యాత్మిక ప్రాధాన్యం కూడా ఉంది. ఆలయ క్రతువుల్లోనూ వాడుతారు.

9.5% మాంసకృత్తులు.. 
నవార బియ్యం పోషకాల గని. 73% పిండి పదార్థం, 9.5% మాంసకృత్తులు, 2.5% కొవ్వు, 389 కేలరీల శక్తి ఉంటాయి. అంతేకాదు, చక్కని పీచు పదార్థానికి, యాంటీఆక్సిడెంట్ల తోపాటు జింక్, ఇనుము, కాల్షియం వంటి సూక్ష్మపోషకాలకు నిలయం. ఈ పోషకాలు కలిగి ఉన్నందునే ఆరోగ్యప్రదాయినిగా ప్రఖ్యాతి పొందింది.

ఆయుర్వేదంలో నవార
ఆయుర్వేద పంచకర్మ చికిత్సల్లో నవార బియ్యానికి అత్యంత అధిక ప్రాధాన్యం ఉంది. రక్తప్రసరణ, శ్వాసకోశ, జీర్ణవ్యవస్థలను మెరుగుపరచటంలో నవార పాత్ర ఎంతో ఉందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. 

కీళ్లనొప్పులు, కండరాల క్షీణత, కొన్ని రకాల చర్మ సమస్యలకు చేసే ఆయుర్వేద చికిత్సల్లో ఈ బియ్యాన్ని వాడుతున్నారు. నవార బియ్యంతోపాటు తౌడు, నూక, ఊక, గడ్డిని కూడా ఔషధ విలువలతో కూడిన ఆహారోత్పత్తుల తయారీలో పరిశ్రమదారులు ఉపయోగిస్తున్నారు. నవార తౌడు, ఊకలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్‌ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నవార సాగులో సవాళ్లు
నవార వంటి పాత పంటల సాగులో సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే కేరళలో రైతులు అనుసరిస్తున్నారు. ప్రకృతి వనరులతో కూడిన ఎరువులు, కషాయాలు వాడుతూ వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని కలగకుండా చూస్తున్నారు. పొలాల్లో పర్యావరణ సమతుల్యానికి మిత్ర పురుగుల పాత్ర కీలకం.

వాటిని రక్షించుకోవటం కోసం కషాయాలను మాత్రమే వాడుతున్నారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, పశువుల పేడ, పంచగవ్యలను రసాయనిక ఎరువులకు బదులు వాడుతున్నారు. బలమైన గాలులు, భారీ వర్షాలను నవార వరి పంట అంతగా తట్టుకోలేదు, పడిపోయే గుణం ఉంది. 

తీవ్రమైన మంచుతో కూడా ఇబ్బంది పడే సున్నితమైన పంట ఇది. చలిని తట్టుకోలేదు. కాండం అడుగునే వంగి పడి΄ోతుంది. కాబట్టి శీతాకాలంలో దీన్ని సాగు చేయకూడదు. ఈ కారణాల వల్ల నవార పంటకాలం 60 రోజులే అయినప్పటికీ ఏడాదికి కేవలం ఒకే పంట సాగు అవుతోంది. నవార వరి పంటను మనుషులతోనే కోయించాలి. కూలీల కొరతతో ΄ాటు అధిక ఖర్చుతో కూడిన పని కావటం వల్ల రైతులకు ఇది కూడా పెద్ద సమస్యే అవుతోంది.

నిజంగా బంగారమే!
నవార ధాన్యం దిగుబడి కూడా ఎకరానికి 300 కిలోలు మాత్రమే. ఇతర వరి రకాలతో ΄ోల్చితే చాలా తక్కువ. అయినా, దీనికి ఉన్న ప్రత్యేక ఔషధ గుణాల కోసం ఎక్కువ ధర పెట్టి ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ధర అధికంగా ఉన్నప్పటికీ నవార బియ్యానికి డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. రైతులకూ మంచి ఆదాయాన్ని సమకూర్చుతోంది. 

నవారకున్న అరుదైన ఔషధగుణాల వల్ల ‘బంగారం’ అని కూడా పేరొచ్చింది. నవార బియ్యాన్ని మీ కుటుంబం ఆహారంగా తీసుకుంటే ఎన్నెన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయి. 2 వేల సంవత్సరాల ఘన చరిత్ర గల అద్భుత వంగడాన్ని పరిరక్షించుకున్నట్లు కూడా అవుతుంది.  

షుగర్‌ నియంత్రణ...
నవార బియ్యం గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తెల్ల బియ్యంతో ΄ోల్చితే తక్కువగా ఉంటుంది. అంటే.. గ్లూకోజ్‌ను రక్తంలోకి తెల్ల బియ్యం మాదిరిగా ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇన్సులిన్‌ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది కాబట్టి షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఇది అనువైన మూలాహారం అయ్యింది. ఇందులోని పీచు వల్ల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది.  

ఎముక పుష్టి... 
కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి సూక్ష్మ పోషకాలతో కూడి ఉంటుంది కాబట్టి నవార బియ్యం తిన్న వారికి ఎముక పుష్టి కలుగుతుంది. రెగ్యులర్‌గా తినే వారికి ఎముకలు గుల్లబారటం వంటి సమస్య రాదు. బ్లడ్‌ క్లాట్‌ కావటం, మజిల్‌ కంట్రాక్షన్‌ వంటి సమస్యలను అధిగమించడానికీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

చర్మ సౌందర్యం... యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి నవార ఆహారం దోహదం చేస్తుంది. ముడతలను పోగొట్టడానికి, చర్మంలో మెరుపును పెంపొందించటానికి దోహదం చేస్తుంది. 

నవార బియ్యపు పిండిని పాలలో లేదా నీటిలో కలిపి ముఖవర్చస్సు మెరుగవడానికి, మచ్చలు పోవటానికి లేపనంగా వాడుతూ ఉంటారు. నవార బియ్యంలోని మెగ్నీషియం కండరాలను, నరాలను ఆరోగ్యవంతంగా ఉంచటానికి.. మొత్తంగా నాడీ వ్యవస్థను, కండరాల వ్యవస్థను ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోడపడుతుంది.

గుండెకు మేలు... నవార బియ్యంలోని అధిక పీచు పదార్థం కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాల్లో పూడికను నివారించడానికి తద్వారా గుండెపోటు ముప్పును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్‌ సీ ఉండటం వల్ల కణజాలానికి మరమ్మతు చేస్తే తెల్ల రక్త కణాల ఉత్పత్తికి దోహదపడటం ద్వారా నవార రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది.  

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ... ఇందులోని అధిక పీచుపదార్థం మలబద్ధకాన్ని నివారిస్తుంది. పొట్టలోని సూక్ష్మజీవరాశిని పెంపొందించడం ద్వారా జీర్ణశక్తిని పెంపొందించి, పోషకాల మెరుగైన శోషణకు, మొత్తంగా జీర్ణ వ్యవస్థ మెరుగుదలకు దోహదం చేస్తుంది.

శిశు ఆహారం... 
కేరళలో నవార బియ్యాన్ని శిశువులకు ఆహారంగా పెడుతుంటారు. నవార పిండి, అరటి పండు ఒరుగులతో కలిపి తయారు చేసే ‘అంగ్రి’ అనే వంటకాన్ని పిల్లలకు తినిపించటం కేరళవాసులకు అనాదిగా అలవాటు. డబ్బాల్లో అమ్మే ప్రాసెస్డ్‌ ఆహారం కన్నా ఇది పిల్లలకు చాలా సహజమైన, బలవర్ధకమైన ఆహారం. పిల్లలు తగినంత బరువు పెరగడానికి దోహదపడుతుంది.

కేన్సర్‌ నిరోధకం... నవార బియ్యంలో ప్రోయాంథోశ్యానిడిన్స్‌ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయ. డిఎన్‌ఎకి నష్టం కలగకుండా నివారించడటం, హానికారక ఫ్రీ రాడికల్స్‌ను నిర్వీర్యం చేయటం ద్వారా కేన్సర్‌ ముప్పును తగ్గించడానికి నవార బియ్యం ఉపకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.

రక్తహీనతకు చెక్‌... నవార బియ్యంలో పుష్కలంగా ఐరన్‌ ఉండటం వల్ల రక్తహీనతను నివారించగలదు. నిస్సత్తువ, శ్వాసలో ఇబ్బంది వంటి సమస్యలను రూపుమాపగలదు. గర్భవతులకు ఈ బియ్యం ఉపయుక్తమైనవి. పీచు, ప్రోటీన్, కాల్షియం, ఐరన్‌ వంటి సూక్ష్మపోషకాలు గర్భవతుల ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. గర్భవతులు సాధారణంగా ఎదుర్కొనే మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరించటంతో పాటు గర్భస్థ శిశువు పెరుగుదలకు చాలా ఉపయోగకరం.

నవార నారాయణన్‌!
కేరళ సంప్రదాయ ఆహారంలోనే కాదు ఆయుర్వేద వైద్యంలోనూ కీలక ΄పాత్ర పోషిస్తున్న నవార సాగుకు పాల్ఘాట్‌ ప్రాంతంలో 2 వేల ఏళ్ల చరిత్ర ఉన్నా గత 50 ఏళ్లుగా దీనికి సాగు తగ్గిపోయి, అంతరించిపోయే దశకు చేరింది. అక్కడక్కడా రైతులు సాగు చేస్తున్నారు. అయితే, ఒకే ఒక్క కుటుంబం మాత్రం నవారను గత 115 ఏళ్లుగా విడవ కుండా తమ 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో నిరంతరాయంగా సాగు చేస్తూనే ఉంది. 

అద్భుత వ్యవసాయ, సాంస్కృతిక వారసత్వ సంపద అయిన  నవారను ఈ కుటుంబం కాపాడుకుంటోంది. ఈ కుటుంబానికి చెందిన మూడో తరం రైతు పి. నారాయణన్‌ ఉన్ని ఇప్పుడు దీన్ని సాగు చేస్తున్నారు. 

నవార ఎకో ఫార్మ్‌ అని ఈయన క్షేత్రానికి పేరు పెట్టారు. ‘నవార నారాయణన్‌’గా ఆయన పేరుగాంచారు. ఆయన కృషి దేశ విదేశాల్లో మారుమోగుతూ ఉంటుంది. పరిరక్షించటంతో పాటు నవార ఫార్మర్స్‌ సొసైటీ పేరిట నవారకు జిఐ గుర్తింపు తేవటంలోనూ నారాయణన్‌ విశేష కృషి చేశారు. నవార ఉత్పత్తులను ఆయన సేంద్రియంగా పండిస్తూ దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 

న్యూఢిల్లీలోని కేంద్ర వ్యవసాయ శాఖ పరిధిలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎఆర్‌ఐ)కి చెందిన ట్రస్ట్‌ ఫర్‌ అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ (టాస్‌) నవారపై ప్రత్యేక గ్రంథాన్ని ప్రచురించింది. నారాయణన్‌ ఏర్పాటు చేసిన సొసైటీ ఆధ్వర్యంలో 2011లో నవార ఉత్సవ్‌ను నిర్వహించారు. 

నవార పునరుజ్జీవనానికి కృషి చేసిన నారాయణన్‌కు ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ప్లాంట్‌ వెరైటీస్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌అథారిటీ (పిపివి అండ్‌ ఎఫ్‌ఆర్‌ఎ) ప్రతిష్టాత్మకమైన ప్లాంట్‌ జీనోమ్‌ సేవియర్‌ కమ్యూనిటీ రికగ్నిషన్‌ పురస్కారాన్ని ప్రదానం చేసి గౌరవించింది. 

ఎకరానికి 3 క్వింటాళ్ల నవార ధాన్యాన్ని ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండిస్తున్నారు. మిల్లు పట్టిస్తే 180 కిలోల బియ్యం వస్తున్నాయి. బియ్యంతో పాటు అటుకులు, పిండిని తయారు చేసి విక్రయిస్తున్నారు. గత ఏడాది ‘టాస్‌’ ప్రచురించిన వివరాల ప్రకారం నారాయణన్‌ ఎకరానికి రూ. 1 లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారు.  
పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

(చదవండి: చర్మతత్వానికి సరిపోయే ఫేస్‌ ప్యాక్‌లు..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement