కొర్రమీను చేపలు తింటున్నారా?తస్మాత్‌ జాగ్రత్త! క్యాన్సర్‌ ముప్పు | Sagubadi: Do You Know Why Catfish Has Banned | Sakshi
Sakshi News home page

Catfish Banned: సుప్రీంకోర్టు నిషేధించిన కొర్రమీను డూప్లికేట్‌.. తిన్నారా? అంతే సంగతి!

Published Tue, Aug 29 2023 10:45 AM | Last Updated on Tue, Aug 29 2023 1:25 PM

Sagubadi: Do You Know Why Catfish Has Banned - Sakshi

నిషిద్ధ ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌లను మన ప్రజలు ఇష్టంగా తినే కొర్రమీను చేపలుగా చూపి అక్రమంగా విక్రయిస్తున్న వారిపై, తరలిస్తున్న వారిపై మత్స్యశాఖ అధికారులు కేసులు పెడుతున్న సందర్భాలు అడపాదడపా మనం చూస్తున్నాం. అయితే, ఈ ఆఫ్రికన్‌/ అమెరికన్‌ క్యాట్‌ఫిష్‌లపై ఎందుకు నిషేధం విధించారు? ఇవి చేపల జీవవైవిధ్యానికి ఏ విధంగా విధ్వంసకరంగా పరిణమిస్తున్నాయి?

ఇవి మన చేపల రైతులు, మత్స్యకారుల ఆదాయానికి గండికొట్టే ముప్పు పొంచి ఉందా? వీటిని అరికట్టే మార్గాలేమిటి?.. ఇటువంటి ప్రశ్నలకు సికింద్రాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులర్‌ అండ్‌ మోలెక్యులర్‌ బయాలజీ (సిఎస్‌ఐఆర్‌–సిసిఎంబి) సీనియర్‌ ప్రధాన శాస్త్రవేత్త డా. జి.ఉమాపతి సమాధానాలు.. ‘సాక్షి సాగుబడి’  పాఠకుల కోసం ఆయన మాటల్లోనే...

కొరమీనుకు డూప్లికేట్ వచ్చి పడింది. ఏదీ కొర్రమీనో.. ఏదీ దాని డూప్లికేటో తెలియకుండా కొనేస్తున్నారు కొందరు. సాధారణంగా చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. చేపలు నీటిలో ఉండే నాటు..చిన్న చిన్న చేపల్ని పెద్ద చేపలు తిని పెరుగుతాయి. కానీ క్యాట్ ఫిష్‌లు మాత్రం అలా కాదు. కుళ్లిపోయిన జీవరాశుల కళేబరాలు..కుళ్లిన వ్యర్థాలు తిని భారీగా పెరిగిపోతాయి. అంతేకాదు క్యాట్ ఫిష్‌లు పెంచే చెరువుల్లో ప్రమాదవశాత్తు ఏమైనా జంతువులు గానీ దిగితే వాటిని కూడా క్యాట్ ఫిష్‌లు స్వాహా చేసేస్తాయి. దొరికితే మనుషుల్ని కూడా చంపి తినేస్తాయి. అంటే క్యాట్ ఫిష్‌లు ఓ రకమైన రాకాసి చేపలు అని చెప్పుకోవచ్చు. ఈ క్యాట్ ఫిష్‌లు మంచినీటిలోనే కాదు మురుగునీరు..ఆఖరికి డ్రైనేజీ నీటిలో కూడా పెరుగుతాయి.



మన దేశపు నీటి వనరుల్లోకి చొరబడిన అమెరికన్, ఆఫ్రికన్‌ కాట్‌ ఫిష్‌ల వంటి విదేశీ జాతి చేపలు స్థానిక చేపల జాతుల మనుగడకు, జీవవైవిధ్యానికి, చేపల రైతులు/ మత్స్యకారుల జీవనోపాధికి గొడ్డలిపెట్టుగా పరిణమించాయి. ఈ విదేశీ చేపలు మన చెరువుల్లో, కాలువల్లో, వాగులు, వంకలు, సరస్సులు, నదుల్లోకి చేరిపోయి తమ సంతతిని ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటున్నాయి. సాధారణంగా అమెరికన్, ఆఫ్రికన్‌ కాట్‌ ఫిష్‌లు విపరీతమైన మాంసాహారులు కాబట్టి, అవి మన చేపల గుడ్లు, చేపపిల్లలతో పాటు ఇతరత్రా జలచరాలను ఈ బకాసుర కాట్‌ఫిష్‌లే ఆరగించేస్తుంటాయి. ఆ విధంగా స్థానిక చేపల సంతతి బాగా తగ్గిపోతోంది. ఒక్కోసారి ఇవి పూర్తిగా అంతరించిపోయే ముప్పు కూడా ఉంది. అమెరికన్‌ / ఆఫ్రికన్‌ క్యాట్‌ఫిష్‌ల తీవ్రమైన ఆహారపు అలవాట్లు, భూమిని తవ్వి బొరియలు చేసే అలవాట్ల వల్ల నీటి మొక్కల పెరుగుదలను, నీటి ప్రవాహదారులు మారిపోతున్నాయి. జలచరాల ఆవాసాలు చెల్లాచెదురవుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్థానిక జాతులను ఇవి చెలకట్టనియ్యట్లేదు.  

దుష్ప్రభావాలు
విదేశీ జాతుల క్యాట్‌ఫిష్‌ల వల్ల చేపల రైతులు.. చెరువులు, సరస్సులు, జలాశయాల్లో చేపలపై ఆధారపడి జీవించే మత్స్యకారుల ఆదాయాలు తీవ్రంగా దెబ్బతింటాయి. మనోల్లాసం కోసం చేపలు పట్టడం వంటి వ్యాపకాల ద్వారా ఆదాయం తగ్గిపోతోంది. ఆ విధంగా చెరువులు, సరస్సులు, నదుల్లో స్థానిక చేప జాతుల జీవవైవిధ్యం నశిస్తుంది. కొన్నిసార్లు ఈ జాతులు అంతరించిపోనూవచ్చు. ఈ నష్టం ఆహార చక్రాల్లో, పర్యావరణ వ్యవస్థ అందించే సేవల్లో ప్రతికూల మార్పులు చోటుచేసుకొని, మొత్తంగా పర్యావరణ వ్యవస్థ గొలుసుకట్టు దుష్ప్రభావాలకు లోనవుతోంది.

వీటి సంతతిని నియంత్రించడం లేదా నిర్మూలించడం అంత సులభసాధ్యమైన పని కాదు సరికదా, ఖరీదైనది కూడా. వీటి నిర్మూలనకు రసాయనాలు ప్రయోగించటం లేదా ఏరివేయటం వంటి సాంప్రదాయ నిర్వహణ పద్ధతుల వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అంతేకాదు, ఈ పనుల వల్ల పర్యావరణానికి అనుకోని రీతిలో హాని జరగొచ్చు. చెరువులు, జలాశయాలు, సరస్సుల్లో విధ్వంసక విదేశీ జాతుల చేపల జాడను ఈ–డిఎన్‌ఎ విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి గుర్తించటం,  పర్యవేక్షించడం, వాటి సంతతిని అంచనా వేయడం వంటి పనులు చేయొచ్చు.

ఈ విషయంలో సీసీఎంబీలోని జీవజాతులు అంతరించిపోకుండా సంరక్షించే ‘లకోన్స్‌’ విభాగం సహాయపడుతుంది. విదేశీ క్యాట్‌ఫిష్‌ జాతుల వల్ల ఉన్న ప్రమాదాల గురించి స్థానికులకు, ఆక్వా రైతులకు అవగాహన కల్పించడానికి ‘లకోన్స్‌’ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. విదేశీ చేప జాతుల డేటాబేస్‌ను ఏర్పాటు చేసే వీలుంది. దేశవ్యాప్తంగా సమర్థవంతమైన పరిష్కారాలు వెతికేందుకు పరిశోధకులు, రైతుల మధ్య లకోన్స్‌ అనుసంధానం చేస్తుంది. విదేశీ జాతుల ఉనికిని క్షేత్రస్థాయిలో ముందస్తుగా గుర్తించే పరీక్షను అభివృద్ధి చేయడంలో ‘లకోన్స్‌’ సహాయపడుతుంది. మత్స్య శాఖ అధికారులకు, స్థానిక ఆక్వా రైతులకు శిక్షణ ఇవ్వటానికి కూడా ‘లకోన్స్‌’ సహాయపడుతుంది.    

జిల్లా స్థాయిలో నిఘా అవసరం
చేపలు ఇతర జలచరాలకు సంబంధించిన చట్టాల్లోని నిబంధనలను స్థానిక ప్రభుత్వ యంత్రాంగాలు అమలు చేయాలి. ఆక్వా చెరువులను తనిఖీ చేయటం (అక్రమ చెరువులను అరికట్టడం), విదేశీ చేప జాతుల ముప్పుపై  అవగాహన కలిగించేలా ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, జిల్లా స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం అవసరం. మత్స్య శాఖ పరిశోధనా సంస్థల సహకారంతో విదేశీ చేప జాతులను అరికట్టే పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. ఈ పద్ధతులను అనుసరించే రైతులు, మత్స్యకారులకు ప్రోత్సాహకాలను అందించవచ్చు.

కొర్రమీను,క్యాట్‌ఫిష్‌ తేడా ఇదొక్కటే

కొర్రమీనుకు క్యాట్ ఫిష్‌కు మధ్య చిన్న తేడా మాత్రమే ఉంటుంది. చూడటానికి రెండింటిలో ఒకటే తేడా.. ఈ క్యాట్ ఫిష్‌కు పొడగాటి మీసాలుంటాయి. నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అంతే, మిగిలిన అంతా సేమ్ టు సేమ్.చేపల్లో బాగా డిమాండ్‌ ఉండే కొర్రమీనును పోలి ఉండే ఈ చేపలను మీసాలు పీకేసి కొర్రమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో కోరమీను రూ.700 నుంచి రూ.1000 వరకు పలుకుతుంది. క్యాట్‌ ఫిష్‌ను కిలో రూ.150లకే యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయనే వైద్యులు, డైటిషియన్ల సూచనలతో చాలా మంది చేపలను తమ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. అయితే పెద్ద పెద్ద నగరాల్లో దుకాణాల్లోనే కాకుండా సాధారణ, స్టార్‌ హోటళ్లలో కొర్రమీను పేరుతో క్యాట్‌ ఫిష్‌ను విక్రయిస్తున్నారు. 

ఆఫ్రికన్‌/అమెరికన్‌ క్యాట్‌ఫిష్‌లను నియంత్రించాలి
మన దేశంలోని చేపల జాతులతో సంకరం చేసి కొత్త జాతులను అభివృద్ధి చేయడానికి పరిశోధనల నిమిత్తం ఆఫ్రికా, అమెరికా ఖండాల నుంచి క్యాట్‌ఫిష్‌లను కొన్ని దశాబ్దాల క్రితం మన దేశానికి తీసుకొచ్చారు. అయితే, కాలక్రమంలో అవి సహజ జలవనరుల్లోకి చేరిపోయి, ఇప్పుడు చేపల జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించాయి. వీటిని తింటే ఫలానా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పలేం. అయితే, ఆఫ్రికన్‌ / అమెరికన్‌ క్యాట్‌ఫిష్‌లు అత్యంత కలుషిత నీటి సరస్సుల్లో కూడా నిక్షేపంగా పెరుగుతాయి. కాబట్టి ఈ చేపలు అత్యంత కలుషితాలతో కూడి ఉంటాయి. ఇవి మన చేపల చెరువుల్లో, సరస్సులు, జలాశయాల్లో జీవవైవిధ్యానికి ముప్పుగా పరిణమించినందున వీటి పెరుగుదలను నిశితంగా గమనిస్తూ, శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించాల్సిన అవసరం ఉంది.∙ 


వినయ్‌ కె నందికూరి, సంచాలకులు, 
సిఎస్‌ఐఆర్‌–సిసిఎంబి, సికింద్రాబాద్‌director@ccmb.res.in

నిర్వహణ: పంతంగిరాంబాబు 
సాగుబడి డెస్క్‌ 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement