మంకీ జాక్ మనకు అనువైన పంట. ఏడాదంతా ఆకులతో పచ్చగా, నిలువుగా పెరుగుతుంది. దీని కలప విలువైనది. పరికరాలు తదితర వస్తువులు తయారీకి వాడుతారు. మంకీ జాక్ పండు ఆరోగ్యకరమైనది.
ఇందులో పోషక విలువలతో పాటు ఔషధ విలువలు కూడా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న ఈ కాలంలో ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతిలో ఈ చెట్లను సాగు చేస్తూ.. ఈ చెట్లు అందించే పాక్షిక నీడలో ఇతర స్వల్పకాలిక పంటలు పండించుకోవచ్చు. వ్యవసాయానికి సుస్థిరత చేకూర్చటానికి మంకీ జాక్ చెట్లు ఎంతగానో దోహదపడతాయి. కలప కోసం పెంచే రైతుకు పండ్లు కూడా ఇస్తుంది.
మంకీ జాక్‌ను బాదల్, దెఫల్, దావ్ లేదా లకూచ తదితర పేర్లతో పిలుస్తారు. ఆగ్రోఫారెస్ట్రీకి ఎంతగానో ఉపయోగపడే ఈ జాతి చెట్లు విస్మరణకు గురయ్యాయి. ఇకనైనా దృష్టి కేంద్రీకరించాల్సిన దీర్ఘకాలిక పంట ఇది. మంకీ జాక్ చెట్లు
పర్యావరణరంగా, ఆర్థికపరంగానే కాక పోషకాహార స్థాయిని పెంపొందించడానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మంకీ జాక్ బొటానికల్ నేమ్ ఆర్టోకార్పస్ లకుచ (Artocarpus Lacucha) పనస, మల్బరీ కూడా ఇదే కుటుంబానికి చెందినవి. అందుకే మంకీ జాక్ పండు ఆకారం, దానిలో తొనలు, గింజలు పనసను పోలి ఉంటాయి. కాకపోతే కొంచెం చిన్నవి. భారత్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మయన్మార్‌లోని కొన్ని ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సైతం చక్కగా పెరిగే బహుళ ప్రయోజనకారి మంకీ జాక్ చెట్టు. నిటారుగా పెరిగే చెట్టు ఇది. అంతర పంటలతో కూడిన తోటల్లో ప్రధాన వృక్ష జాతిగా మంకీ జాక్ చెట్లను పెంచుకోవచ్చు.
పర్యావరణపరమైన సమతుల్యతను కాపాడే అనేక ప్రయోజనాలు అందించటం మంకీ జాక్ చెట్ల ప్రత్యేకత. నిటారుగా 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని ఆకులు పెద్దగా, గట్టిగా ఉంటాయి. కొన్నిప్రాంతాల్లోఈ చెట్ల ఆకులు ఏడాదికి ఒకసారి రాలిపోతాయి. దీని పండ్లు మెత్తగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చగా, పండినప్పుడు పసుపు రంగులోకి మారతాయి. ఈ చెట్టు బెరడు ముదురు రంగులో ఉంటాయి. దీని పూలు సువానతో తేనెటీగలను ఆకర్షిస్తూ పరపరాగ సంపర్కానికి దోహదపడుతూ ఉంటాయి. ఇన్ని ప్రత్యేకతలు, ప్రయోజనాలు ఉన్నప్పటికీ మంకీ జాక్ చెట్ల పెంపకం పెద్దగా కనపడక΄ోవటం విశేషం. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడో ఒక్కచోట తప్ప ఈ చెట్లు కనిపించవు. (ఉద్యోగం వదిలేసి మరీ ‘మునగ’ సాగు : జీవితాన్ని మార్చేసింది!)
పండ్లు తినొచ్చు.. పచ్చడి పెట్టుకోవచ్చు..
మంకీ జాక్ కొత్త వాతావరణ పరిస్థితులకు, భిన్నమైన నేలలకు ఇట్టే అలవాటు పడిపోతుంది. ఏ ప్రాంతంలోనైనా ఇతర పంటలతో కలిపి సాగు చేయటానికి అనువైన జాతి ఇది. పండ్లు, పశుగ్రాసం, కలప, ఔషధ గుణాలు, సహజ రంగుగా వాడటానికి ఉపయోగపడే బెరడు వంటి ఉపయోగాలున్నాయి.
మంకీ జాక్ పండును నేరుగా తినొచ్చు. పచ్చళ్లు, సాస్‌లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. ఈ పండ్ల గుజ్జు తింటే కాలేయ జబ్బులు తగ్గిపోతాయట. యాంటీఆక్సిడెంట్లతో పాటు కాలేయాన్ని రక్షించే గుణాలు పుష్కలంగా ఉండటం దీని ప్రత్యేకత. వయోభారం వల్ల చర్మం ముడతలు పడటం వంటి సమస్యల్ని దూరం చేసే చికిత్సల్లో దీన్ని వాడుతున్నారు. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ థెరపీలో వాడుతున్నారు. జార్కండ్ వంటి చోట్ల గిరిజనుల సంప్రదాయ వైద్యంలో మంకీ జాక్‌ను ఉపయోగిస్తున్నారు.
మంకీ జాక్ చెట్టు ఆకుల్లో ప్రొటీన్ అత్యధికంగా 28.6% ఉంటుంది. అందువల్ల ఈ ఆకులు పశువులకు అత్యంత విలువైన గ్రాసం అని చెప్పచ్చు. కాబట్టి పొడి పశువులపాల ఉత్పత్తిని పెంపొందించడానికి మంకీ జాక్ చెట్టు ఆకులు బాగా ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఎండా కాలంలో ఇతర పచ్చి మేత అందుబాటులో లేని పరిస్థితుల్లో ఈ చెట్ల ఆకులు చక్కని పచ్చిమేతగా ఉపయోగపడతాయి. దీని బెరడు నుంచి వచ్చే జిగురు ఉపయోగకరం. అన్నిటికీ మించి దీని కలప ఎంత గట్టిగా ఉంటుందంటే చెద పురుగులు కూడా ఏమీ చేయలేవు. అందువల్ల కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ తయారీలో దీని చెక్కను వాడుతున్నారు. పడవలు, నౌకల తయారీలో, నిర్మాణ రంగంలో కూడా ఈ కలపను ఉపయోగిస్తున్నారు.
పర్యావరణ, పౌష్టికాహార ప్రయోజనాలు
మంకీ జాక్ చెట్లు సుస్థిర వ్యవసాయ పద్ధతులకు అనేక విధాలుగా దోహదపడతాయి. భూసారాన్ని పెంపొందించటం, గాలికి వర్షానికి మట్టి కొట్టుకు΄ోకుండా కాపాడటం, జీవవైవిధ్యాన్ని పెంపొందించడానికి ఈ చెట్లు దోహదపడతాయి. వేడిని, గాలిలో తేమను తట్టుకొని పెరుగుతాయి. తరచూ కరువు బారిన పడే నిస్సారమైన భూముల్లో సైతం ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నీడ సానుకూల సూక్ష్మ వాతావరణాన్ని కలిగిస్తుంది కాబట్టి అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.
ఇక పోషకాల సంగతికి వస్తే.. మంకీ జాక్ పండ్లు, ఆకులు పోషకాల గనులే. పండ్ల గుజ్జులో డయటరీ ఫైబర్, పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. విత్తనాలు, జిగురులో యాంటీఆక్సిడెంట్లు దండిగా ఉన్నాయి. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణశక్తి ఇనుమడిస్తుంది. నాచురల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఎజెంట్‌గా పనిచేస్తుంది. ఈ గుణగణాలు మనుషులకు, పశువులకు ఆరోగ్యాన్నందిస్తాయి. తద్వారా పశువుల ఉత్పాదకత పెరుగుతుంది.
పండ్ల ధర కిలో రూ. 175
మంకీ జాక్ చెట్లు వర్షాధార వ్యవసాయం చేసే చిన్న,సన్నకారు రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చుతాయి. ఒక చెట్టు ఆకుల నుంచి 200 కిలోల పచ్చి మేతను పొందవచ్చని, ఆ మేరకు పొడి పశువుల పోషణ ఖర్చు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పచ్చి ఆకులు క్వింటాలు రూ. 300 విలువ చేస్తాయి. పండ్లు కిలో రూ. 175 పలుకుతామంటున్నారు.
చీడపీడలను తట్టుకునే స్వభావం కలిగిన ఈ చెట్లను పెంచటం చాలా సులభం. దీని కలప, పండ్ల ద్వారా కూడా ఇంకా ఆదాయం సమకూరుతుంది. మంకీ జాక్ చెట్లు రాల్చే ఆకులు భూమిని సారవంతం చేస్తాయి. అంటే రైతులు రసాయనాలపై ఆధారపడటం తగ్గుతుంది. అంతర పంటలకు అనువైన తోటల్లో పెంచడానికి మంకీ జాక్ చెట్లు ఎంతో అనువైనవి.
భూతాపోన్నతితో వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కలిగే అతివృష్టి, అనావృష్టిని తట్టుకునే స్వభావం, నిస్సారమైన భూముల్లోనూ పెరిగే స్వభావం ఈ చెట్లకు ఉండటం రైతులకు ఎంతో ఉపయోగపడే విషయం. ఒక్క మాటలో చెప్పాలంటే, మంకీ జాక్ చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తే గ్రామీణాభివృద్ధికి, పేదరికాన్ని పారదోలటానికి, పశుగ్రాసం కొరతను తీర్చడానికి, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంపొందించడానికి బహువిధాలుగా ఉపయోగ పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment