హెల్దీ సంచోక్స్‌ : లాభాలు అన్నీ ఇన్నీ కావు! | Interesting facts about Crunchy and Healthy Sunchokes | Sakshi
Sakshi News home page

హెల్దీ సంచోక్స్‌ : లాభాలు అన్నీ ఇన్నీ కావు!

Published Wed, Oct 30 2024 10:40 AM | Last Updated on Wed, Oct 30 2024 12:46 PM

Interesting facts about Crunchy and Healthy Sunchokes

సంచోక్స్‌.. ఎన్నో ఔషధ గుణాలున్న దుంప పంట. దీనికి మరో పేరు జెరూసలెం ఆర్టిచోక్‌ (హెలియాంతస్‌ ట్యూబరోసస్‌) అని దీనికి మరో పేరుంది. ఆస్టెరాసియా కుటుంబం. ఇది ఒకసారి నాటితే చాలా ఏళ్లపాటు పెరుగుతుంది. కానీ, పసుపు మాదిరిగా వార్షిక పంట మాదిరిగా కూడా పెంచుతుంటారు. ఉత్తర అమెరికా దీని పుట్టిల్లు. జెరూసలెం ఆర్టిచోక్‌ అనే పేరు ఉన్నప్పటికీ ఇది జెరూసలెంలో పుట్టిన పంట కాదు. ఆర్టిచోక్‌ అని ఉన్నప్పటికీ ఇది నిజమైన ఆర్టిచోక్‌ కాదు. వాడుకలో అలా పేర్లు వచ్చాయంతే. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది బతికేస్తుంది.  పోషక విలువలు, చీడపీడలను బాగా తట్టుకునే స్వభావం ఉండటం వంటి గుణగణాల వల్ల మెడిటరేనియన్, ఆ పరిసర  ప్రాంతాల్లో దీన్ని సాగు చేయటం   ప్రారంభమైంది. ఇప్పుడు అమెరికా, కెనడా, బల్గేరియా, రష్యా సహా అనేక ఐరోపాదేశాల్లో ఇది సాగవుతోంది. మన దేశంలోనూ మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా సాగవుతున్నదని చెబుతున్నారు.

 

సంచోక్స్‌ దుంపలు రకరకాల రంగులు..
సంచోక్స్‌ మొక్క చూడటానికి  పొద్దు తిరుగుడు మొక్క మాదిరిగా ఉంటుంది. 5–8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని దుంప బంగాళదుంప మాదిరిగా తినటానికి అనువుగా కండగలిగి ఉంటుంది. సంచోక్స్‌ దుంపలు తెలుపు నుంచి పసుపు వరకు, ఎరుపు నుంచి నీలం వరకు అనేక రంగుల్లో ఉంటాయి. దుంప బరువు 80–120 గ్రాముల బరువు, 75 సెం.మీ. పొడవు ఉంటుంది. పూలు చిన్నగా పసుపు రంగులో ఉంటాయి. ఆకులపై నూగు ఉంటుంది. సంచోక్స్‌ మొక్క వేగంగా పెరుగుతుంది. అధిక దిగుబడినిచ్చే శక్తి దీనికి ఉంది. 

మంచును కూడా తట్టుకుంటుంది. ఎరువులు కొంచెం వేసినా చాలు, వేయకపోయినా పండుతుంది. కరువును తట్టుకుంటుంది. చౌడు నేలల్లోనూ పెరుగుతుంది. 4.4 నుంచి 8.6 పిహెచ్‌ను తట్టుకుంటుంది. ఉష్ణోగ్రత తక్కువున్నా ఎక్కువున్నా బతికి దిగుబడినిస్తుంది. ఇసుక దువ్వ నేలలు, సారంవతం కాని భూముల్లోనూ పెరుగుతుంది. 18–26 డిగ్రీల సెల్షియస్‌ ఉష్ణోగ్రత దీనికి నప్పుతుంది. ఫిబ్రవరి – మార్చి లేదా సెప్టెంబర్‌ – అక్టోబర్‌లలో విత్తుకోవచ్చు. మొక్క వడపడిపోయిన తర్వాత విత్తిన 5 నెలలకు దుంపలు తవ్వుకోవచ్చు. జెరూసలెం ఆర్టిచోక్‌ దుంపలు హెక్టారుకు 15 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపలపై పొర పల్చగా ఉంటుంది. కాబట్టి, జాగ్రత్తగా తవ్వితీయాలి. 

జెరూసలెం ఆర్టిచోక్‌ దుంపలు, మొక్క అంతటినీ, ముఖ్యంగా ఆకులను ఔషధాల తయారీలో వినియోగించటం అనాదిగా ఉందనటానికి ఆధారాలున్నాయి. వాపు, నొప్పి, ఎముకలు కట్టుకోవటానికి, చర్మ గాయాలకు మందుగా ఇది పనిచేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహాన్ని, ఊబకాయాన్ని తగ్గించే గుణం కూడా ఉంది. మలబద్ధకాన్ని పోగొట్టటం, జీవక్రియను పెంపొందించటం, కేన్సర్‌ నిరోధకంగా పనిచేయటం వంటి అనేక అద్భుత ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. 

బీపీ, కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గించటంలోనూ ఉపకరిస్తుంది. అండర్సన్, గ్రీవ్స్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తల చెప్పిందేమంటే.. జెరూసలెం ఆర్టిచోక్‌ డి–లాక్టిక్‌ యాసిడ్‌ రూపంలో లాక్టిక్‌ యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని నిర్థారణైంది. అంటే, పారిశ్రామిక ఉత్పత్తుల్లో దీన్ని ఉపయోగించుకోవడానికి ఎంతో అవకాశం ఉందన్నమాట. రోటనారోధక వ్యవస్థ లోపాలు, దీర్ఘకాలిక నిస్తత్తువ, గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు, రొమ్ము కేన్సర్, మలబద్ధకం, పేను తదితర వ్యాధులు, రుగ్మతల నివారిణిగా పనిచేస్తుందని చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని ప్రేరేపించటం, దేహం లో నుంచి కలుషితాలను బయటకు పంపటంలో దోహదకారిగా ఉంటుంది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దుంపల ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. 

జెరూసలెం ఆర్టిచోక్‌ దుంపలను చెరకు, మొక్కజొన్న మాదిరిగా జీవ ఇంధనాల తయారీలోనూ వాడుకోవచ్చట. హెక్టారు  పొలంలో పండే దుంపలతో 1500–11,000 లీటర్ల ఇథనాల్‌ తయారు చేయొచ్చు.                 

భార లోహాలను సంగ్రహిస్తుంది..
జెరూసలెం ఆర్టిచోక్‌ మొక్క భార లోహాలను సంగ్రహించే స్వభావం కలిగి ఉందని పరిశోధకులు గుర్తించారు. జనావాసాల నుంచి వెలువడే మురుగు నీటిలో నుంచి, నేలలో నుంచి భార లోహాలను సంగ్రహించడానికి ఈ మొక్కలను ఉపయోగించ వచ్చని చెబుతున్నారు. అల్బిక్‌ రకం జెరూసలెం ఆర్టిచోక్‌ మొక్కల్లో ఈ గుణం ఎక్కువగా ఉందట. దీని మొక్కల చొప్ప పశువులకు మొక్కజొన్న చొప్ప సైలేజీకి బదులు వాడొచ్చు. భూసారం తక్కువగా ఉన్న నేలల్లో ఆచ్ఛాదనగా పచ్చిరొట్ట పెంచటానికి, జీవ ఇంధనాల తయారీకి పచ్చిరొట్ట విస్తారంగా పెంచాలనుకుంటే కూడా జెరూసలెం ఆర్టిచోక్‌ దుంప పంట ఎంతో ఉపయోగ పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 

షుగర్‌ రోగులకు ఉపయోగకరం
టైప్‌ 2 షుగర్, ఊబకాయంతో బాధపడే వారిలో ఇన్సులిన్‌ను విడుదలకు దోహదపడే ఇనులిన్‌ను ఈ దుంప కలిగి ఉంది. ఫ్రక్టోజ్, ఓలిగోఫ్రక్టోస్‌ తదితర సుగర్స్‌ను నియంత్రించే గుణం జెరూసలెం ఆర్టిచోక్‌కు ఉంది. సాధారణంగా ఇనులిన్‌ను చికొరీ,జెరూసలెం ఆర్టిచోక్‌ నుంచి పారిశ్రామిక పద్ధతుల్లో వెలికితీస్తుంటారు. 

ఈ దుంపను సన్నగా తరిగి, వేడి నీటిలో మరిగించి ఇనులిన్‌ను వెలికితీసిన తర్వాత శుద్ధి చేస్తారు. ఈ ద్రవం నుంచి ఇనులిన్‌ పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అనేక ఆహారోత్పత్తులో వాడతారు. ఇటీవల కాలంలో ఈ పొడి, కాప్సూల్స్‌ రూపంలో  ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ దుంపల్లో ఉండే ఫ్రక్టోజును ఔషధాలు, ఫంక్షనల్‌ ఫుడ్స్‌లో స్వీట్‌నర్‌గా వాడుతున్నారు. ఫ్రక్టోజ్‌ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ (23) గ్లూకోజ్‌ (100) లేదా సుక్రోజ్‌ (65) కన్నా తక్కువ కాబట్టి డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు జెరూసలెం ఆర్టిచోక్‌ దుంపలు ఆరోగ్యదాయకమైన ఆహారంగా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి, మున్ముందు బాగా ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement