పుట్టింది పనామా, పోషకాల నిరునామా | Star Apple a tropical fruit health benefits | Sakshi
Sakshi News home page

పుట్టింది పనామా, పోషకాల నిరునామా

Published Wed, Dec 25 2024 4:38 PM | Last Updated on Wed, Dec 25 2024 4:51 PM

Star Apple a tropical fruit health benefits

స్టార్‌ ఆపిల్‌! 

ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్‌ ఆపిల్‌’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్‌ మిల్క్‌ ఫ్రూట్‌ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్‌ ఫ్రూట్‌’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్‌ ఆపిల్‌ అని కూడా పిలుస్తారు. 

స్టార్‌ ఆపిల్‌ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్‌ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.

పుట్టిల్లు పనామా
స్టార్‌ ఆపిల్‌ మన వంటి ఉష్ణమండల  ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం.  పనామా దేశంలోని ఇస్థమస్‌ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్‌ అంటిల్లెస్, వెస్ట్‌ ఇండీస్‌కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్‌ ఆపిల్‌ విస్తరించని ఉష్ణమండల  ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. 

స్టార్‌ ఆపిల్‌ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్‌ ఆపిల్‌ ప్రధాన భాగంగా మారిపోయింది. 

మయన్‌ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్‌ ఆపిల్‌ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్‌ ఆపిల్‌ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.

మెక్సికో నుంచి పెరూ వరకు.. 
స్టార్‌ ఆపిల్‌ సెంట్రల్‌ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్‌ ఇండీస్‌లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్‌ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్‌ తీర  ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్‌ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్‌ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.

పోషకాలు పుష్కలం
స్టార్‌ ఆపిల్‌ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్‌ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల  ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్‌ సుగర్స్‌ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్‌ గ్లైకోసైడ్‌ లుకుమిన్, తదితర యాక్టివ్‌ కాంపౌండ్‌లు ఉన్నాయి. 

స్టార్‌ ఆపిల్‌లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్‌ గ్లైకోసైడ్స్‌ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్‌ కాన్‌స్టిట్యుయెంట్స్‌ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్‌ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్‌ యాసిడ్, ట్రైటెర్‌పినాయిడ్స్‌ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్‌ ఉన్నాయి. 

అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్‌ కలిగి ఉండటం వల్ల స్టార్‌ ఆపిల్‌కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్‌ కాంపౌండ్‌కు అత్యధిక యాంటీఆక్సిడెంట్‌ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

గోళాకార పండ్లు
ఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్‌ షేప్‌లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్‌లో ఉంటాయి. 

ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్‌ ఆపిల్‌ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. 

ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్‌ ఆపిల్‌ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన.  

3–5 ఏళ్లకు కాపు ప్రారంభం
క్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్‌ ఆపిల్‌ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్‌ చాలా త్వరగా సెట్‌ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్‌ ఇండీస్‌లో ఏప్రిల్‌–మే మధ్యన స్టార్‌ ఆపిల్స్‌ పుష్కలంగా మార్కెట్‌లోకి వస్తాయి. స్టార్‌ ఆపిల్‌ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్‌లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.

అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావు
స్టార్‌ ఫ్రూట్‌ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్‌ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్‌ స్టార్‌ ఫ్రూట్‌ గుజ్జును ఐస్‌క్రీమ్‌లు, షర్బత్‌లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement