
భారీ సోలార్ డ్రయ్యర్‌ను తానే రూపొందించుకున్న రైతు
గులాబీ పూలు, మునగ ఆకులను ఆరబెట్టి విక్రయిస్తూ అధికాదాయం పొందుతున్న వైనం
పూలను కష్టపడి పండించటంతోనే సరిపోదు. మార్కెట్‌లో గిరాకీ తగ్గినప్పుడు.. పండించిన పంటను రూపం మార్చి అమ్మగలిగితే మంచి ఆదాయం పొందవచ్చని నిరూపిస్తున్నారు అభ్యుదయ రైతు గాదె రాజశేఖర్. అందుకోసం 2.5 టన్నుల పంటను ఆరబెట్టగల పెద్ద సోలార్ డ్రయ్యర్‌ను తానే సొంతంగా రూపొందించుకున్నారు. అందులో గులాబీ తదితర రకాల పూల రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని గండిగూడ వద్ద గల తన 8 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో మిశ్రమ పంటలు సాగు చేస్తున్నారు. సోలార్ డ్రయ్యర్‌ను వినియోగిస్తూ గులాబీ రేకులు, మునగ ఆకులను ఆరబెట్టి మార్కెట్ చేస్తున్నారు. ఆరబెట్టిన ఈ గులాబీ రేకులను పాన్‌మసాలాలో, స్వీట్ల తయారీలో వాడుతున్నారు. ఆరబెట్టిన మునగ ఆకుల పొడిని అనేక ఉత్పత్తుల్లో వినియోగిస్తున్నందున మార్కెట్‌లో గిరాకీ ఉందని చెబుతున్నారు.
దేశవాళీ గులాబీ రేకులతో..
రెండు ఎకరాల్లో దేశవాళీ పింక్ సెంటెడ్ గులాబీ తోటను రాజశేఖర్ సాగు చేస్తున్నారు. ఈ పూల రేకులను సోలార డ్రయ్యర్‌లో ఆరబెడుతున్నారు. తాను పండించిన పూలే కాకుండా, మార్కెట్‌లో ఈ రకమైన పూల ధర కిలో రూ.20 లోపు ఉన్నప్పుడు ఇతర రైతుల నుంచి కొనుగోలు చేసి, వాటిని కూడా తన డ్రయ్యర్‌లో ఆరబెడుతున్నారు.
పది కిలోల గులాబీ రేకులను ఆరబెడితే కిలో ఎండు పూల రేకులు తయారవుతాయి. వీటిని కిలో రూ.600 చొప్పున విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. సోలార్ డ్రయ్యర్‌లో చామంతి, మందార, శంకపుష్పం, మల్లెపూలను కూడా ఆరబెట్టి మార్కెట్ చేసుకోవచ్చని ఆయన చెబుతున్నారు.
మునగ ఆకులతో..
వ్యవసాయ క్షేత్రంలో 8 ఎకరాల్లో ఇతర పంటల మధ్యన మిశ్రమ పంటగా సాగు చేసిన మునగ చెట్ల నుంచి సేకరించిన ఆకును ఆరబెట్టి, పొడి చేసి ఆయన అమ్ముతున్నారు. ఏపుగా పెరిగిన మునగ చెట్ల కొమ్మలను కత్తిరించినప్పుడు వాటి ఆకులను వృథాగా పారేయకుండా డ్రయర్‌లో ఆరబెట్టి పొడిగా మార్చుతున్నారు. ఇరవై కిలోల ఆకును ఆరబెడితే కిలో పౌడర్ తయారవుతుంది. దీన్ని కిలో రూ.800 వరకు అమ్ముకోవచ్చని చెబుతున్నారు.
– బూరుగు ప్రభాకర్‌రెడ్డి,
శంషాబాద్ రూరల్, రంగారెడ్డి జిల్లా
సొంత ఆలోచన
ఏడాది కిందట రాజశేఖర్ ఓ కంపెనీ నుంచి చిన్న సైజు సోలార్ డ్రయ్యర్‌ను కొనుగోలు చేశారు. అందులో 350 కిలోల పూల రేకులను, ఆకులను ఆరబెట్టవచ్చు. అయితే, అది తన అవసరాలకు సరిపోలేదు. వ్యవసాయ క్షేత్రంలో వినియోగంలో లేని ఇనుప పైపులతో మూడు నెలల కిందట సొంత ఆలోచనతో పెద్ద సైజు సోలార్ డ్రయ్యర్‌ను తానే నిర్మించుకున్నారు.
60 అడుగుల పొడవు, 22 అడుగుల పొడవుతో 10 అడుగుల ఎత్తు ఉండేలా దీన్ని రూపొందించారు. ఇందుకు 2ఎంఎం మందం ఉన్న అక్రాలిక్ షీట్‌ను వాడారు. దీని లోపలి నుంచి తేమతో కూడిన గాలిని బయటకు పంపేందుకు చుట్టూ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. ఒకేసారి 2,500 కిలోల ఆకులు లేదా పూల రేకులను ఆరబెట్టవచ్చని ఆయన తెలిపారు. విద్యుత్తుతో నడిచే డ్రయ్యర్ కంటే సోలార్ డ్రయ్యర్ నిర్వహణ సులువుగా ఉందన్నారు.
సోలార్ డ్రయ్యర్ లోపలి ఉష్ణోగ్రత బయటికంటే 8 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలుంటే ఆకులు, పూల రేకులను ఆరబెట్టడానికి ఒక రోజు సమయం చాలు. ఉష్ణోగ్రత తక్కువగా ఉంటే మరింత ఎక్కువ సమయం పడుతుంది. మునగాకు పొడిని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించే ఆలోచన ఉందని రాజశేఖర్ (99123 33444) అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment