
వరి పొలంలోనే చుట్టూ కందకం తీసి చేపల పెంపకం
కందకం తవ్విన మట్టితో వెడల్పుగా గట్లు.. ఆ గట్లపై కూరగాయలు, పండ్ల చెట్లు..
సమీకృత ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎకరానికి రూ. లక్ష ఆదాయం
ఆదర్శవంతంగా యువ రైతు వెంకటేష్ సేద్యం
మాగాణి చేను అనగానే మనకు ఒక్క వరి పంట (Paddy) మాత్రమే మదిలో మెదులుతుంది. అయితే, మాగాణి పొలంలో వరి పంటతో పాటు కూరగాయ పంటలు, చేపల సాగు (aquaculture) కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించుకునే సరికొత్త సమీకృత సేద్య నమూనా ఇది.
కాకినాడ జిల్లా (Kakinada District) పిఠాపురం మండలం పి.రాయవరం గ్రామానికి చెందిన యువ రైతు కరుపురెడ్డి వెంకటేష్ నమూనా క్షేత్రం ఇందుకు ఒక ఉదాహరణ. 1.20 ఎకరాల భూమిలో వరితో పాటు అనేక రకాల కూరగాయ పంటలు, కందకంలో చేపల సాగు దర్శనమిస్తాయి. ఏడాదికి ఎకరం వరి సాగులో సాధారణంగా రూ. 40 వేల ఆదాయం వస్తుంది. అయితే, సమీకృత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వెంకటేష్ రూ. లక్షకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 26 జిల్లాల ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఈయన వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ పొందుతున్నారు. ఇతర రాష్ట్రాల రైతులకు సైతం ఆదర్శంగా నిలిచారు.
ఎకరానికి రూ. లక్ష ఆదాయం
వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం విసీర్ణం ఎకరం 20 సెంట్లు. కాగా, చుట్టూతా విశాలమైన గట్టు 55 సెంట్లలో, గట్టు పక్కనే చుట్టూతా 20 సెంట్లలో తవ్విన కందకంలో చేపల పెంపకం, మధ్యలో మిగిలిన 45 సెంట్ల విస్తీర్ణంలో వరి పంట పండిస్తున్నారు. మాగాణిలో ఒకే పంటగా వరి సాగు చేస్తే ఎకరానికి మహా అయితే రూ.40 వేల ఆదాయం వస్తుంది.
దీనికి భిన్నంగా తన పొలంలో గట్టు మీద పండ్ల చెట్లు, కూరగాయ పంటలు, ఆకు కూరలు.. గట్టు పక్కనే తవ్విన కందకం (లేదా కాలువ)లో చేపలు పెంచుతున్నారు. మధ్యలోని పొలంలో వరి సాగు చేస్తున్నారు. ఈ విధంగా సమీకృత ప్రకృతి సేద్యం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ.లక్ష ఆదాయం సంపాదిస్తున్నారు. మాగాణి పొలాల్లో కూడా వరి తప్ప వేరే పండదు అనే అపోహను వదిలిపెట్టి పలు రకాల పంటలు పండించుకోవటం ద్వారా ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలో ఈ సమీకృతి ప్రకృతి సేద్య నమూనా తెలియజెప్తోంది. వెంకటేష్ వ్యవసాయ క్షేత్రం రైతులకు, ఇతర సిబ్బందికి రాష్ట్ర స్థాయి శిక్షణ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుండటం విశేషం.
– విఎస్‌విఎస్ వరప్రసాద్, సాక్షి, పిఠాపురం
ఇతర రైతులకు ఆదర్శం
యువ రైతు వెంకటేష్ సమీకృత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరితో పాటు చేపలు, కూరగాయ పంటల సాగుపై ఆసక్తి చూపటంతో శిక్షణ ఇచ్చాం. ఆచరణలో పెట్టి, మంచి ఫలితాలు సాదించి ఇతర రైతులకు ఆదర్శంగా నిలిచారు. ఆయన పొలాన్నే రైతులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రదర్శన క్షేత్రంగా వినియోగిస్తున్నాం.
– ఎలియాజర్ (94416 56083), జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి, కాకినాడ
రెండేళ్లలోనే మంచి ఫలితాలు
నాకున్న 1.2 ఎకరాల పొలంలో గతంలో వరి మాత్రమే సాగు చేసే వాడిని. ఏడాదికి పెట్టుబడి పోను అతి కష్టం మీద రూ. 40 వేల వరకు ఆదాయం వచ్చేది. ఆ దశలో 2020లో మా జిల్లాలో చేపట్టిన పకృతి వ్యవసాయం చేయాలనిపించి ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లాప్రాజెక్టు మేనేజర్ ఎలియాజర్‌ను సంప్రదించాను. ఆయన నా ఆసక్తిని గమనించి దుర్గాడ రైతు గుండ్ర శివ చక్రం ద్వారా నాకు సమీకృత సాగుపై శిక్షణ ఇప్పించారు.
సార్వా వరి కోసిన తర్వాత, అదేవిధంగా దాళ్వా పంట కోసిన తర్వాత నేలను సారవంతం చేసే 20 రకాల పచ్చిరొట్ట పంటలను పెంచి, కలిదున్నేస్తున్నా. దీని వల్ల భూమి సారవంతమవుతోంది. ఎద్దులతోనే దుక్కి, దమ్ము చేస్తాం. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలు వాడుతున్నాం. రెండేళ్లలోనే మంచి ఫలితాలు వచ్చాయి. మా కుటుంబానికి వాడుకోగా మిగిలిన కూరగాయల ఇతరులకు ఇస్తున్నాం. బొచ్చె, కొర్రమీను వంటి చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం వస్తోంది. రసాయనాలు వాడకుండా పెంచటం వల్ల మా పంటలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంతృప్తికరంగా ఆదాయం పొందటంతో పాటు రైతుల శిక్షణ కేంద్రంగా మా పొలం మారినందుకు చాలా సంతోషంగా ఉంది.
– కరుపురెడ్డి వెంకటేష్ (63024 19274),
పి.రాయవరం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment