ఆచ్ఛాదనతో అధిక దిగుబడి! | Subhash Sharma: Profits in cotton and Kandi Cultivation | Sakshi
Sakshi News home page

ఆచ్ఛాదనతో అధిక దిగుబడి!

Published Wed, Jan 29 2025 1:35 AM | Last Updated on Wed, Jan 29 2025 1:35 AM

Subhash Sharma: Profits in cotton and Kandi Cultivation

పత్తి, కంది సాళ్ల మధ్యలో ఆచ్ఛాదన కోసం పచ్చిరొట్ట సాగు

ఆచ్ఛాదన వల్ల అధిక దిగుబడితోపాటు అనేక ప్రయోజనాలు 

ఎకరాకు పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడి పొందుతున్న సుభాష్‌ శర్మ

సుభాష్‌ శర్మ(Subhash Sharma) కృషిపై 2018లో, హారిమన్‌ శర్మ విశేష కృషి గురించి 2017లోనే ‘సాక్షి సాగుబడి’లో కథనాలు ప్రచురించాం. ఈ ఏడాది వీరు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా ఆ కథనాలను పునర్ముద్రిస్తున్నాం.

మహారాష్ట్ర.. విదర్భ.. యవత్‌మాల్‌.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాతూ అక్కడ ఉన్నారు. రసాయనాలను 
త్యజించి, నేల తల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్‌ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. 

అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్‌ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పోలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించే
వినూత్న పద్ధతిని ఆయన దీర్ఘకాలంగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్‌ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు..

సుభాష్‌ శర్మకు 66 ఏళ్లు. వ్యవసాయంలో 46 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన ప్రజ్ఞతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్‌మాల్‌ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్‌ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 

1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దరశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న    3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పోలంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాది పోడవునా ఏవో కొన్ని రకాల పంటలు సాగు చేస్తుంటారు.

పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట పంటల సాగు
పత్తి లేదా కంది సాగులో సుభాష్‌ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10            

అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పంటలు పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసే రైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్‌ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. 

పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్‌ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి.

పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు..
1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనంతో పాటు భూసారం పెరుగుతుంది. 

2. పోలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపోర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 

3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శతృపురుగుల చొప్పున పెరుగుతుంటాయి. మిత్రపురుగులు శతృపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్‌ శర్మ తెలిపారు. సూరజ్‌ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 

4.  భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి లేక రెండు తడులు ఇస్తున్నామని సుభాష్‌ శర్మ వివరించారు. ఒక పంట కాలంలో పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట తదుపరి పంట కాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ.. విత్తిన ప్రతిసారీ పంట మార్పిడి చేస్తారు.

పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడి
పత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్‌ (సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్‌ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు సుభాష్‌ శర్మ. 

అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు.            (సుభాష్‌ శర్మతో 94228 69620 హిందీలో మాట్లాడవచ్చు)

ఆచ్ఛాదనలోని శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి
పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి దీనిలో దాగి ఉన్న శాస్త్రీయతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పోరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్‌ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్ర

ఆచ్ఛాదన వల్ల అనేక ప్రయోజనాలు
పంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్ట పంటలను పెంచటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్‌ శర్మ అంటారు. పోలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. ఆ పంటలను కోసి, అక్కడే ఆచ్ఛాదనగా వేస్తే నేలలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్క సాళ్లలో ఉన్న ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement