Vegetable crops
-
ధరల దాడి
సాక్షి, అమరావతి: నిత్యావసరాలు వంటింటిని హడలెత్తిస్తున్నాయి. పొయ్యి వెలిగించకుండానే భగభగమంటున్నాయి. కందిపప్పు పట్టుకుంటే చేతులు కాలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, ఎండుమిర్చితో పాటు కూరగాయల వరకు రేట్లు మండిపోతున్నాయి. నిత్యావసరాల ధరల్లో జాతీయ సగటుతో పాటు దక్షిణాది సగటుతో పోలి్చనా ఆంధ్రప్రదేశ్‌లోనే ధరలు అధికంగా ఉండటం గమనార్హం. రెండేళ్ల క్రితంతో పోలిస్తే నిత్యావసరాల రేట్లు బాగా పెరిగాయి. బియ్యం (కామన్ రకం) 12 శాతం, పెసరపప్పు 54 శాతం, ఆటా 67%, కందిపప్పు 61 శాతం, పంచదార 15 శాతం, బంగాళదుంప 21 శాతం, ఉల్లిపాయాలు 87 శాతం, టమాటాలు 50 శాతం, పాలు 6 శాతం, ఉప్పు ధరలు 30 శాతానికిపైగా పెరగడంతో జనం జేబులు గుల్లవుతున్నాయి. ప్రతి నెలా బడ్జెట్ గాడి తప్పుతోంది.నాడు ఫోరి్టఫైడ్ గోధుమపిండిగోధుమ పిండి సగటున కిలో రూ.48 నుంచి రూ.70కిపైగా పలుకుతోంది. దేశ వ్యాప్తంగా తమిళనాడు తర్వాత ఏపీలోనే గోధుమ పిండి రేటు ఎక్కువగా ఉంది. గత ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫోరి్టఫైడ్ గోధుమ పిండిని కిలో ప్యాకెట్ల రూపంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూ.11కే అందించింది. బియ్యం బాబోయ్! గత కొన్నేళ్లుగా బియ్యం ధరలు వినియోగదారులను ఠారెత్తిస్తున్నాయి. 2019లో సాధారణ బియ్యం కిలో రూ.36 చొప్పున ఉండగా ఇప్పుడు కిలో రూ.55కిపైగా పలుకుతోంది. సూపర్ ఫైన్ బియ్యం రూ.65 – రూ.70కిపైగా ఎగబాకింది. బాస్మతి, దావత్ బియ్యం ఏకంగా కిలో రూ.230కిపైగా ఉంది. తాజాగా బియ్యం రేట్లు తొమ్మిది రాష్ట్రాల్లో కిలో రూ.50 దాటింది. అత్యధిక బియ్యం రేట్లలో ఏపీ 5వ స్థానంలో ఉంది. బియ్యం నిల్వలను నల్ల బజారుకు తరలించడంతో రేట్లు పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.ఈ ఖరీఫ్‌లో నాట్లు వేసిన తర్వాత కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇది దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో బియ్యాన్ని బ్లాక్ చేసి రేట్లు పెంచే ఆలోచనలో వ్యాపారులున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా బియ్యం నిల్వలపై పరిమితులు విధించకుండా అక్రమార్కులకు కొమ్ముకాస్తూ నామమాత్రంగా రూ.1, రూ.2 తగ్గించి వినియోగదారులుకు ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకుంటోంది. వరి అధికంగా పండే పంజాబ్‌లో కిలో బియ్యం రూ.39.58 మాత్రమే ఉండగా అన్నపూర్ణగా పేరొందిన ఏపీలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి.ఉడకని కందిపప్పు! రాష్ట్రంలో గత ఫిబ్రవరిలో కిలో రూ.163 చొప్పున ఉన్న కందిపప్పు ప్రస్తుతం రూ.180కిపైగా చేరుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటినా పీడీఎస్‌లో కందిపప్పు ఇవ్వకపోవడంతో బయట మార్కెట్లో వ్యాపారులు ధరలు పెంచేశారు. గోవా, అండమాన్ నికోబార్ దీవులు, మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే కందిపప్పు రేటు అధికంగా ఉంది. ధరల పెరుగుదలను నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది.తాజాగా రిటైల్ దుకాణాలు, రైతు బజార్లలో రూ.150కే ఇస్తామంటున్నా కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు రావడం లేదు. ‘‘కిలో రూ.160 ఉన్నప్పుడు కొన్న కందిపప్పును రెండు సార్లు కుక్కర్లో ఉడికించి మిక్సీలో తిప్పినా మెత్తగా కావడం లేదు. చేసేది లేక ప్యాకెట్ కందిపప్పు రూ.224 పెట్టి కొనుక్కెళ్లా. ఉడకని పప్పులు తక్కువ రేటుకు ఇచ్చినా ఏం చేసుకోవాలి? ఇది వినియోగదారులకు నష్టం కాదా?’’ అంటూ విజయవాడలోని ఓ సూపర్ మార్కెట్లో వినియోగదారుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూరగాయల కల్లోలం..రాష్ట్రంలో రెండు నెలల క్రితం అధిక వేడి కారణంగా కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో వాటి ధరలు 40 నుంచి 60 శాతం పెరిగాయి. రైతు బజార్లలో అన్నీ కిలో రూ.50 నుంచి రూ.80కి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అధిక వర్షాలు, వరదల కారణంగా పంటలకు నష్టం వాటిల్లుతోంది. దీంతో నిత్యావసరాలకు తోడు కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి. మార్కెట్లో కాకరకాయల ధర కిలో ఏకంగా రూ.70, క్యారెట్ ధర రూ.90 వరకు ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల కారణంగా టమాటా, ఉల్లి, పచి్చమిర్చి, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికం, అల్లం ధరలు పెరుగుతున్నాయి.ఏపీలోనే ద్రవ్యోల్బణం ఎక్కువ.. ధరల పెరుగుదల కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకున్నా ఏపీలో ద్రవ్యోల్బణం అమాంతం పెరుగుతోంది. జాతీయ సగటు 5.08 శాతంతో పోలిస్తే ఏపీలో ధరల పెరుగుదల సూచీ 5.87 శాతంతో భయపెడుతోంది. ధరల పెరుగుదల సూచీ ఒడిశాలో అత్యధికంగా 7.22 శాతం, దాద్రానగర్ హవేలీలో 6.49 శాతం, బిహార్‌లో 6.37 శాతం, కర్నాటకలో 5.98 శాతం తర్వాత ఏపీ ఐదో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణలో 5.49 శాతం, తమిళనాడులో 4.75 శాతం. కేరళలో 5.83 శాతం ద్రవ్యోల్బణం రేటు ఉంది. నిన్నటి రేట్లు ఇవాళ ఉండట్లేదు.. నిత్యావసరాల ధరలు చూస్తుంటే భయం వేస్తోంది. ఒకరోజు ఉన్న రేటు మరుసటి రోజు ఉండటం లేదు. ఊహించని విధంగా మారిపోతున్నాయి. కందిపప్పు కొనలేని పరిస్థితి. పోనీ కూరగాయలైనా వండుకుందామంటే ఏది చూసినా కిలో రూ.50, రూ.100 పలుకుతున్నాయి. ఆదాయానికి, ఖర్చులకు సంబంధం లేకుండా పోయింది. చివరకు చింతపండు రసం చేసుకోవాలన్నా రేట్లు చూస్తే కొనేలా లేవు. – అద్దంకి మౌనిక, పెదరావూరు, తెనాలి మండలంనలుగురికి సంతోషంగా వడ్డించలేం.. పప్పులు, ఉప్పుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వంటగదిలో కూర్చుని నలుగురికి ఆనందంగా వండిపెట్టే రోజులు ఇప్పట్లో రావేమో. ఏది కొనాలన్నా రేట్లు మండిపోతున్నాయి. సంపాదించే కొద్ది మొత్తంలో నిత్యావసరాలకే సగం ఖర్చయితే సామాన్యులు ఎలా బతకాలి? బియ్యం రేట్లు కూడా విపరీతంగా పెరుగుతుంటే ఇంకేం తినాలి? – యాదల అన్నపూర్ణ, తెనాలి -
పెద్దపల్లికి చెందిన యువరైతు అద్భుత ప్రతిభ..!
-
రకరకాల పంటలు పండిస్తూ మంచి ఆదాయం..!
-
సంప్రదాయ పంటల సాగు కంటే కూరగాయల సాగు మేలు..!
-
పెద్దగా పెట్టుబడి అవసరం లేని కూరగాయల సాగు ఎంతో మేలు
-
సేంద్రియ బాట పడుతున్న రైతులు
-
పండించిన కూరగాయలను మార్కెట్ చేసుకోవడం సులభమే
-
ప్రతిరోజూ పంట చేతికొచ్చేలా ప్రణాళిక ప్రకారం సాగు
-
భర్తల సంపాదనపైనే ఆధార పడకుండా సొంతంగా వ్యవసాయం
-
ఇలా చేస్తే ఆకుకూరల అధిక ఆదాయం
-
ఇలా కూరగాయల సాగు చేస్తే లాభాలే లాభాలు
-
కూరగాయలు ఎక్కువ దిగుబడికి సులువైన మార్గాలు ఇవే..!
-
వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తున్న రైతు .. నెలకు 50 వేలు ఆదాయం
-
కూరగాయల సాగు వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్న రైతులు
-
విస్తారంగా కూరగాయల సాగు
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కూరగాయల పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయి. కొద్దిపాటిగా ఉన్న నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఎండలు అధికమవడంతో లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలు కూడా అడుగంటాయి. పంట కాల్వల్లో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో రబీలో సాగవుతున్న పలు రకాల కూరగాయల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు, చిన్న గెడ్డల్లో నీటి నిల్వలు పెరిగాయి. ఏజెన్సీలోని అరకులోయ మండలం పెదలబుడు, చినలబుడు, బస్కి, డుంబ్రిగుడ మండలం సొవ్వ, సాగర, హుకుంపేట మండలంలోని సంతారి, శోభకోట, తీగలవలస, రంగశీల, పాడేరు మండలంలోని గుత్తులపుట్టు, వనుగుపల్లి, ఇరడాపల్లి, కిండంగి, పెదబయలు మండలంలోని గలగండ, ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు, చింతపల్లి మండలంలోని చౌడుపల్లి, లోతుగెడ్డ, లంబసింగి, తాజంగి, జి.కె.వీధి మండలంలోని దారకొండ, గుమ్మిరేవుల, మాలివలస, రింతాడ ప్రాంతాల్లో మాలి జాతి గిరిజనులు ఆకు కూరలతో పాటు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాట, వంగ, బీన్స్‌తో పాటు పలురకాల మిర్చి, ఆకు కూరల పంటలన్నింటికి ఈ అకాల వర్షాలు ఊపిరి పోసినట్టయిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అధిక దిగుబడులకు కూడా ఈ వర్షాలు ఎంతో అనుకూలించాయి. -
ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టం చేకూర్చాయి. ఈ వర్షాల వల్ల వేల హెక్టార్లలో సాగైన కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ కూరగాయల పంటలు నీటిలోనే ఉన్నాయి. ఫలితంగా కూరగాయల కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయి. నవీ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి రాష్ట్రం నలుమూలలతో పాటు సరిహద్దు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కూరగాయల లోడుతో ట్రక్కులు, టెంపోలు వస్తాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా కూరగాయల ధరలు 40 శాతం మేర పెరిగాయి. ఈ ధరలు మరో నెల, రెండు నెలల పాటు ఇలాగే ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు. చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు) నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్, లాక్డౌన్ ఆంక్షల కారణంగా వాహనాల రాకపోకలు అంతంత మాత్రమే ఉన్నాయి. కరోనా మహమ్మారికి భయపడి డ్రైవర్లు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అయితే, ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలను సడలించడంతో ఇప్పుడిప్పుడే జనజీవనం గాడిన పడుతోంది. ఇదేసమయంలో ఇప్పటివరకు స్థిరంగా ఉంటూ వచ్చిన కూరగాయల ధరలు గత రెండు, మూడు రోజులుగా ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో కురిసిన అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. రైతులు 30 టన్నుల కూరగాయలు పండించాల్సి ఉండగా, ప్రస్తుతం 13–15 టన్నుల మేర మాత్రమే సాగు చేస్తున్నారు. దీంతో వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌కు ప్రతీరోజు 600–650 ట్రక్కులు కూరగాయల లోడుతో రావాల్సి ఉండగా, గత కొద్దిరోజులుగా 500 ట్రక్కుల వరకు మాత్రమే వస్తున్నాయి. ఫలితంగా వాషిలోని ఏపీఎంసీ హోల్‌సేల్ మార్కెట్లో సరుకు కొరత ఏర్పడింది. దీని ప్రభావం కూరగాయల ధరలపై పడింది. ఇప్పటికే ముంబైలో ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీనికి కూరగాయలు ధరలు కూడా తోడు కావడంతో సామాన్య జనం ఆర్థిక అంచనాలు తారుమారయ్యాయి. మొన్నటి వరకు రూ. 20–25 ధర పలికిన కేజీ టమాటలు ఇప్పుడు రూ. 40 పలుకుతున్నాయి. బెండకాయలు కేజీ రూ. 45, కొత్తిమీర కట్ట రూ. 45, మెంతికూర కట్ట రూ. 30, చిక్కుడుకాయ కేజీ రూ. 50, క్యాప్సికం రూ. 40, గ్రీన్ పీ నట్ రూ. 100, ములక్కాడలు కేజీ రూ. 60 ధర పలుకుతున్నాయి. కాగా, కొద్దిరోజుల కిందటి వరకు టమాటకు గిట్టుబాటు ధర రాక రైతులు టమాట పంటను నడిరోడ్డుపై పోసి నిరసన తెలిపిన సంఘటనలు అనేకం జరిగాయి. కానీ, ఇప్పుడు టమాటలకు మంచి ధర పలుకుతుండటంతో రైతుల్లో మాత్రం ఆనందం వెల్లివిరుస్తోంది. -
ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, ఆదాయం!
ప్రకృతిని, శ్రమను నమ్ముకుంటే చిన్న కమతాలున్న రైతు కుటుంబాలు సైతం సుభిక్షంగా ఉంటాయనడానికి ప్రబల నిదర్శనం రజితారెడ్డి, రాజేందర్‌రెడ్డి రైతు దంపతులు. రసాయనాల్లేకుండా పంటలు పండించడం నికరాదాయం పెంచుకోవడం కోసం మాత్రమే కాదని.. కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికీ ఇదే రాజమార్గమని వీరి అనుభవం రుజువు చేస్తోంది. నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. కూరగాయ పంటలతో పాటు పాడిపై కూడా ఆధార పడుతూ నిరంతర ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వాకిటి రజితారెడ్డి, రాజేందర్‌రెడ్డి దంపతులది సాధారణ రైతు కుటుంబం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తమ్మలోనిభావి వారి స్వగ్రామం. ఏడో తరగతి వరకు చదువుకున్న వీరికి వ్యవసాయమే జీవనాధారం. నాలుగేళ్ల క్రితం వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ చీడపీడలు, ఎరువుల ఖర్చులతో కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో రజితారెడ్డి చొరవతో సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు. బంధువు ఒకరు సుభాష్ పాలేకర్ పుస్తకం తెచ్చి ఇచ్చిన తర్వాత దగ్గర్లోని ప్రకృతి వ్యవసాయదారుడు పిసాతి సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ స్ఫూర్తితో పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరై రజితారెడ్డి గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయలు వంటి ఆహార పంటలను సాగు చేస్తూ.. జీవామృతం, కషాయాలను స్వయంగా తామే తయారు చేసుకొని వాడుతూ.. తక్కువ ఖర్చుతోనే సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు డిగ్రీ చదువుతుండగా, మరొకరు ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇటు పాడి.. అటు పంట.. వీరికి 4 ఎకరాల సొంత భూమి ఉంది. ఈ ఏడాది ఎకరంలో వరి, అరెకరంలో టమాటా, అరెకరంలో సొర, బీర సాగు చేస్తున్నారు. పంటలతోపాటు పాడి పశువుల పెంపకంపై కూడా దృష్టిపెట్టడం విశేషం. వీరికి ప్రస్తుతం ఐదు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. రెండెకరాల్లో పశువులకు మేత సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 7–8 లీటర్ల పాలు లీటరు రూ. 38 చొప్పున విక్రయిస్తున్నారు. పశువుల పేడ దిబ్బపై ద్రవజీవామృతం చల్లితే.. నెల రోజుల్లో పశువుల ఎరువు మెత్తని ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును సాగుకు ముందు ఎకరానికి ఒకటి, రెండు ట్రాక్టర్లు వేస్తున్నారు. ఈ ఏడాది 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పాక్షికంగా సేంద్రియ పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు. సొంత ట్రాక్టరుతోనే రాజేందర్‌రెడ్డి తమ పొలాలను దున్నుకుంటారు. బీజామృతం, జీవామృతంతోపాటు వేపగింజల కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం వంటి కషాయాలను కూడా రజితారెడ్డి స్వయంగా తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. దంపతులు వ్యవసాయ పనులు స్వయంగా చేసుకోవడంతో ఖర్చు బాగా తగ్గింది. తమ ఆరోగ్యం, భూమి ఆరోగ్యం మెరుగవడమే కాక నికర ఆదాయం పెరిగిందని ఆమె తెలిపారు. నీటి గుంటతో వాన నీటి సంరక్షణ రజిత– రాజేందర్‌రెడ్డి తమ ఎర్ర నేలలో బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు సరిగ్గా కురవని ప్రాంతం కావడంతో వాననీటి సంరక్షణపై దృష్టి పెట్టారు. ఉపాధి హామీ పథకంలో నీటి కుంట తవ్వుకున్నారు. వాన నీరు తమ భూమిలో నుంచి బయటకు పోకుండా కట్టడి చేసుకున్నారు. దీని వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ బోర్లు బాగానే పోస్తున్నాయని రజితారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఎండాకాలం తర్వాత సరైన వర్షాలు పడకపోవడం వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని ఆమె తెలిపారు. ఉపాధి హామీ ప«థకం కింద వచ్చే జనవరిలో పంట భూమిలో వాలుకు అడ్డంగా 50 మీటర్లకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వించుకోవాలని అనుకుంటున్నామన్నారు. ఆరుతడి పద్ధతిలో వరిసాగు నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఎకరం భూమిలో ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేస్తున్నట్లు రజితారెడ్డి తెలిపారు. పొలాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కో రోజు ఒక్కో భాగానికి నీరు పెడుతున్నామన్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి తమ సొంత తెలంగాణ సోన రకం విత్తనాలు వినియోగిస్తారు. నారు 15–20 రోజుల వయసులో 20 లీటర్ల నీటి ట్యాంకుకు 30 ఎం.ఎల్. వేప గింజల కషాయం, లీటరు ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తారు. నాటేసిన తర్వాత 20 రోజులకోసారి కనీసం 4 సార్లు జీవామృతం బోరు నీటితోపాటు పారగడతారు. నెల లోపు వేపగింజల కషాయం చల్లుతారు. ఏవైనా తెగుళ్లు కనిపిస్తే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు. 15 రోజులకోసారి.. అమావాస్య, పౌర్ణమిలకు 3 రోజులు ముందు నుంచి.. వరుసగా రెండు, మూడు రోజుల పాటు పొలం గట్లపై సాయంత్ర వేళల్లో పిడకలతో మంటలు వేస్తారు. ఆ బూడిదను కూరగాయ పంటలపై చల్లుతారు. దీని వల్ల శత్రుపురుగులు నశించి, పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటున్నదని ఆమె తెలిపారు. 50% ఎక్కువగా నికరాదాయం రసాయనిక పద్ధతిలో వరి సాగు చేసిన రైతులతో పోల్చితే సాగు వ్యయం ఎకరానికి తమకు రూ. 5–6 వేలు తక్కువని, నికరాదాయం 50% ఎక్కువని రజితారెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా తమకు ఎకరానికి 35 బస్తాల ధాన్యం పండుతున్నదని, తామే మరపట్టించి బియ్యం అమ్ముతున్నామన్నారు. 15 క్వింటాళ్ల వరకు బియ్యం వస్తున్నాయన్నారు. క్వింటాలు సగటున రూ. 5 వేల చొప్పున రూ. 75 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నదన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ. 50–56 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందులోనూ, వారికి ఖర్చు కూడా తమకన్నా ఎక్కువ కావడంతో.. తమతో పోల్చితే వారికి నికరాదాయం తక్కువగా ఉంటుందన్నారు. కూరగాయల ధర కిలో రూ. 30‡ స్థానికంగా సేంద్రియ హోటల్ నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా టమాటా, సొర, బీర పంటలను ఎకరంలో సాగు చేస్తున్నామని రజితారెడ్డి తెలిపారు. మార్కెట్ ధర ఎట్లా ఉన్నా.. ఏ సీజన్లోనైనా సొర కాయలకు రూ. 10–12 చొప్పున, బీర, టమాటాలకు కిలోకు రూ. 30 ధర చెల్లిస్తున్నారన్నారు. అడవి పందుల బెడద ఉండటం వల్ల వేరుశనగ తాము సాగు చేయటం లేదని ఆమె వివరించారు. నీటి కొరత సమస్య వల్ల కూరగాయ పంటల్లో మంచి దిగుబడులు తీయలేకపోతున్నామని, తమకు మార్కెటింగ్ సమస్య లేదన్నారు. – ముత్యాల హన్మంతరెడ్డి, సాక్షి, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా కొందరు రైతులు అనుసరిస్తున్నారు! ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన నాలుగేళ్లలో మొదట మా కుటుంబం ఆరోగ్యం బాగుపడింది. రసాయనిక అవశేషాల్లేని ఆహారం తినటం వల్ల అంతకుముందున్న ఆరోగ్య సమస్యలు పోయాయి. భూసారం పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుతున్నామన్న సంతృప్తి ఉంది. వరిని అతి తక్కువ నీటితో ఆరుతడి పద్ధతిలో సాగు చేయగలుగుతున్నాం. ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు రెండు సార్లు అందుకోవడం సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి నలుగురైదుగురు రైతులు ఇంట్లో తాము తినడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించుకోవడం ప్రారంభించడం మరింత సంతోషంగా ఉంది. మా వంటి చిన్న, సన్నకారు సేంద్రియ రైతులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలను షరతులు లేకుండా ఇవ్వాలి. ప్రత్యేక రైతు బజార్లను ఏర్పాటు చేయాలి. – వాకిటి రజితారెడ్డి(99491 42122), తమ్మలోనిభావి, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా కషాయం తయారు చేస్తున్న రజిత రజిత పొలంలో బీర తోట వరి పొలాన్ని పరిశీలిస్తున్న రజిత డ్రిప్‌తో సాగవుతున్న టమాటా తోట -
వెజిటబుల్ హబ్.. విలవిల
కూరగాయల పంటలకు వర్షం దెబ్బ 2,570 హెక్టార్లలో మునిగిన పంటలు రూ.10 కోట్లకు పైగా నష్టం పరిహారం కోసం రైతుల ఎదురుచూపు గజ్వేల్: ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించిన జిల్లాను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కూరగాయల పంటలకు మున్నెన్నడూలేని నష్టాన్ని కలగజేశాయి. ఇప్పటివరకు 2,570 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. నష్టం రూ.10కోట్ల పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాపై ఆధార పడ్డ హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూర్, చంద్లాపూర్ తదితర మార్కెట్లకు గడ్డు రోజులు సంక్రమించనున్నాయి. ఒకప్పుడు కూరగాయలు పండించాలంటే రైతులు జంకే పరిస్థితి. జిల్లా అంతటా ఈ పరిస్థితి ఉండేది. ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకెళ్తే కనీసం రవాణా ఛార్జీలు సైతం గిట్టుబాటుకాని దుస్థితి. అన్ని చోట్లా దళారులు తిష్ట వేసి కారుచౌకగా ఉత్పత్తులను కొనుగోలు చేసి రైతులను నిలువు దోపిడీ చేసేవారు. ఫలితంగా కూరగాయల పంటలను అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేసి తమ సొంత అవసరాలకు మాత్రమే వాడుకునేవారు. గత ఎనిమిదేళ్లల్లో పరిస్థితులు పూర్తిగా మారాయి. కూరగాయల సాగు ప్రస్తుతం వాణిజ్యపంటలకు ధీటుగా సాగుతున్నది. జిల్లాలో ప్రస్తుతం 60వేల ఎకరాల్లో కూరగాయలు, మరో 20ఎకరాల్లో పండ్ల తోటలు సాగవుతున్నాయి. మెతుకుసీమగా పేరుగాంచిన జిల్లాలో వరి సాగు తగ్గి కూరగాయల సాగు పెరుగుతున్నదంటే అతిశయోక్తి కాదు. పందిరి విధానంలో బీర, కాకర, పొట్లకాయ, సోరకాయ, దొండ, సాధారణ విధానాల్లో టమాటా, ఆలుగడ్డ, బీర్నీస్, మిర్చి, బెండ తదితర రకాలతోపాటు, ఆకుకూరలు రైతులు సాగు చేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా అవసరాలకు కూరగాయలను అందించేందుకు పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ వ్యాపారంలోకి అడుగు పెట్టాయి. ఈ క్రమంలో కూరగాయలను సాగుచేస్తున్న ప్రాంతాలపై దృష్టి సారించి ఇక్కడ రైతుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఇందులో భాగంగానే గజ్వేల్ నియోజకవర్గంలో వంటిమామిడి గ్రామాన్ని కేంద్రంగా ఎంచుకొని ఇక్కడ రిలియన్స్ ఫ్రెష్, హెరిటేజ్, స్పెన్సర్స్, ఐటీసీ లాంటి మల్టీ నేషనల్ సంస్థలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం కూరగాయల సాగు ప్రాధాన్యత స్పష్టమవుతున్నది. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కే కాకుండా ఢిల్లీ, చంద్లాపూర్, బెంగళూర్ తదితర రాష్ట్రీయ మార్కెట్లకు కూడా కూరగాయలు ఎగుమతవుతుండటంతో ఈ ప్రాంతం ‘వెజిటబుల్ హబ్’గా ఆవిర్భవించింది. గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక, తొగుట, నంగునూరు, సిద్దిపేట, దుబ్బాక, చిన్నకోడూరు, చేగుంట, దౌల్తాబాద్, శివ్వంపేట, నర్సాపూర్, జిన్నారం, సంగారెడ్డి తదితర మండలాల్లో కూరగాయల సాగు భారీగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో కొన్ని రోజులుగా కరుస్తున్న భారీ వర్షాలు కూరగాయల రైతుల ఆశలు అడియాశలు చేశాయి. ఎక్కడికక్కడా పంటలు చేలల్లోనే కుళ్లిపోయాయి. ఫలితంగా ఉత్పత్తులు పడిపోయి ఒక్కసారిగా హైదరాబాద్ సహా ఇతర రాష్ర్టీయ మార్కెట్లకు ఎగుమతులు పడిపోయాయి. ఇదీ ఉదాహరణ గజ్వేల్ పట్టణానికి చెందిన ఏలేశ్వరం బాలయ్య తనకున్న కొద్దిపాటి విస్తీర్ణంలో సుమారు 15వేల పెట్టుబడి పెట్టి టమాటా సాగు చేశాడు. ఇప్పటివరకు ఒక్క కాయ కూడా తెంపలేదు. చేతికందే సమయంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు పంట పూర్తిగా దెబ్బతినేలా చేశాయి. దీంతో ఆ రైతు ఆందోళన చెందుతున్నాడు. నష్టంపై అంచనా వేస్తున్నాం జిల్లాలో కూరగాయల పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు 2,570 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తెలస్తోంది. నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రభుత్వానికి నివేదిస్తాం. - రామలక్ష్మి, ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ -
ధర దడ
- దళారుల చేతుల్లో మార్కెట్ - టమోటా, మిర్చి, కాకర, బీర రేట్లకు రెక్కలు - బహిరంగ మార్కెట్లో కేజీ రూ.30-60 సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్ల కింద సాగవుతున్న కూరగాయల పంటలు ఎండిపోతున్నాయి. నగరం చట్టుపక్క జిల్లాల్లో టమోటా సాగు చివరి దశకు చేరుకోవడంతో దిగుబడి తగ్గిపోయింది. దీన్ని సాకుగా చూపుతూ నగరంలో రిటైల్ వ్యాపారులు ఒక్కసారిగా వీటి ధరలు పెంచేశారు. ఏటా జూన్, జులై నెలల్లో ఎదురయ్యే కూరగాయల కొరతను ఆసరాగా చేసుకొని దళారులు ధరలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. హోల్‌సేల్‌తో సంబంధం లేకుండా తమ ఇష్టారీతిన రేట్లు పెంచి వినియోగదారుని దోచుకుంటున్నారు. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయలు కొందామన్నా... రూ.30-60 మధ్యలో ధర పలుకుతున్నాయి. స్థానికంగా కూరగాయల దిగుబడి తగ్గిపోవడంతో మదనపల్లి, బెంగళూరు, ప్రాంతాల నుంచి వచ్చే సరుకుపైనే నగరం ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా డిమాండ్-సరఫరాల మధ్య అంతరం ఏర్పడి... ఆ ప్రభావం ధరలపై పడుతోంది. టమోటా, మిర్చి, బెండ, బీర, చిక్కుడు, కాకర ధరలు సామాన్యుడికి అందనంతగా పైకి ఎగబాకాయి. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్న క్యాప్సికం, ఫ్రెంచి బీన్స్ ధరలు నిప్పు మీద ఉప్పులా చిటపటలాడుతున్నాయి. వీటి ధర కేజీ రూ.60-100 పలుకుతుండడం వాటి కొరతకు అద్దం పడుతోంది. బోయిన్పల్లి హోల్‌సేల్ మార్కెట్లో టమోటా ధర కేజీ రూ.20 పలుకగా... ఇదే సరుకును బహిరంగ మార్కెట్లో రూ.35కు విక్రయిస్తున్నారు. మిగతా కూరగాయల ధరలు కూడా 30-40శాతం పెంచేశారు. తగ్గిన సరఫరా... నగర అవసరాలకు నిత్యం 45-50 వేల క్వింటాళ్ల కూరగాయలు కావాల్సి ఉంది. ప్రస్తుతం 30-35% మేర సరఫరా తగ్గినట్లు తెలుస్తోంది. ధరలకు కళ్లెం వేయాల్సిన మార్కెటింగ్ శాఖ మాత్రం ఏటా ఈ పెరుగుదల సర్వసాధారణమే అంటూ చోద్యం చూస్తోంది. ఈ సీజన్లో ఎక్కడా సమృద్ధిగా కూరగాయలు దొరకవు గనుక తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జూన్‌లో వర్షాలు కురిస్తే కొత్తపంట వేస్తారు. దిగుబడికి 45-65రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నందున మరో రెండు నెలల వరకు కూరగాయల ధరలు అస్థిరంగానే ఉండొచ్చనివారు చెబుతున్నారు. ట‘మోత’ టమోటా ధర సామాన్యుడికి అందనంటోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కేజీ టమోటా రూ.30 పలుకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కొద్ది రోజుల కిందటి వరకు కిలో రూ.14కు లభించిన టమోటా ఇప్పుడు రైతుబజార్లోనే రూ.23కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్లో కేజీ రూ.20 పలికిన టమోటాకు మంగళవారం బహిరంగ మార్కెట్లో రూ.30-35ల చొప్పున వసూలు చేశారు. స్థానికంగా ఈ పంట సాగు చివరి దశకు చే రుకోవడంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోయి ఆ ప్రభావం ధరలపై పడింది. నగర డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా కాకపోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు పెంచేశారు. నగరానికి రోజుకు 400 టన్నుల టమోటా అవసరం. ప్రస్తుతం సుమారు 250 టన్నులు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ కొరతే ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. గత పది రోజుల్లోనే ధరలు రెట్టింపవడంతో సామాన్యుడి కూరగాయల బడ్జెట్ తల్లకిందులైంది. బెంగళూరు, మదనపల్లి మార్కెట్లలోనే మంచి ధర లభిస్తుండటంతో నగరానికి సరఫరా తగ్గి, కొరత ఎదురైందని వ్యాపారులు చెబుతున్నారు. -
మక్క దక్కేనా?
ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచే వరుణుడు రైతులతో దోబూచులాడుతున్నాడు. అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలా మంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి కొందరు మొక్కజొన్న పంటలు వేశారు. ప్రస్తుతం చేలన్నీ పాలు పోసుకునే దశలో ఉన్నాయి. ఆరుతడి పంటలకు ప్రస్తుతం వాన చాలా అవసరం. కానీ వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంట చేతికి వస్తుందో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలు ప్రస్తుతం కాత దశలో ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు కురిస్తేనే కంకులు విత్తులు పట్టే అవకాశం ఉంది. కీలకమైన ఈ సమయంలో వరుణుడి జాడ లేక అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఎండలు మండి పోతుండడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమయంలో ఒక్క వాన పడితే చాలు తమ కష్టాలు గట్టెక్కుతాయని భావిస్తున్నారు. లేదంటే ఇన్నాళ్లూ పడిన కష్టం వృథా అవుతుందని వాపోతున్నారు. వర్షం పడాలని కోరుతూ ఆలయాలు, ప్రార్థన మందిరాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వానదేవుడు కరుణించాలని వేడుకుంటున్నారు. -
కూరగాయల సాగే మేలు
వర్గల్: వరికి బదులుగా కూరగాయ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని గజ్వేల్ డివిజన్ ఉద్యాన అధికారి చక్రపాణి అన్నారు. ‘గడా’ వ్యవసాయ విభాగం ఓఎస్డీ అశోక్ కుమార్‌తో కలిసి మండల పరిధిలోని అంబర్‌పేటలో బుధవారం ఉద్యాన రైతులతో సమావేశం నిర్వహించారు. కూరగాయల సాగు, వివిధ ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా కూరగాయలు సాగు చేస్తే తక్కువ నీరు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తోందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల సాధన కోసం పందిరి నిర్మాణాలు, మల్చింగ్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. బొప్పాయి, అరటి లాంటి ఉద్యాన పంటల సాగుతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వివరించారు. రైతులు సంఘంగా ఏర్పడి కూరగాయల సాగుకు ముందుకు వస్తే వేసవిలో ఉద్యాన క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. క్లస్టర్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. గడా ఓఎస్డీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు బతకాలి, వ్యవసాయం బాగుండాలంటే గ్రామానికి వచ్చే ప్రతి అధికారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులతో రైతులు మమేకం కావాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కేశవరెడ్డి, కిష్టారెడ్డి, కుమార్, వెంకటేష్, మాణిక్యం, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నిలువునా ముంచిన అకాల వర్షాలు
గండేడ్, న్యూస్‌లైన్: వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. ఈ వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో రైతుల పరిస్థితి మరింత దిగజారింది. వరి, కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటచేతికొచ్చే సమయానికి మామిడి కాయలు నేలరాలి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. శనివారం మండల పరిధిలోని గాధిర్యాల్, చౌదర్పల్లి, మంగంపేట్, మొకర్లాబాద్, మహమ్మదాబాద్, షేక్‌పల్లి, వెంకట్‌రెడ్డిపల్లి తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి వరిపంట నేలకొరిగి, విత్తనాలు రాలిపోయాయి. ఈ వారం వ్యవధిలో మూడు సార్లు వడగళ్ల వాన కురవడంతో వందలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. అంతేకాకుండా వందలాది క్వింటాళ్ల మామిడి కాయలు నేలరాలాయి. దీనికితోడు గాలివానతో కొన్ని గ్రామాల్లో స్తంభాలు నేలకొరిగి కరెంటు సరఫరా నిలిచిపోయింది. గాధిర్యాల్ గ్రామంలో పలు స్తంభాలు నెలకొరిగి నాలుగు రోజులు గడుస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కరెంటు లేక నీటి సరఫరా నిలిచిపోయి వరి దెబ్బతింటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు గాలివానతో దెబ్బతిన్నాయని, ప్రభుత్వం తమకు పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
వెజిట్రబుల్స్
అనంతపురం అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : రైతుల కష్టార్జితం దళారుల పాలవుతోంది. కూరగాయల పంటలకు గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు కుదేలవుతున్నారు. దళారులు, వ్యాపారులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. రైతులకు అతి తక్కువ ధర లభిస్తున్న సందర్భంలోనూ బహిరంగ మార్కెట్లో వినియోగదారులకు ధరాఘాతం తప్పడం లేదు. సంప్రదాయ పంటల వల్ల వరుస నష్టాలు చవిచూస్తుండడం, దీర్ఘకాలిక పండ్ల తోటల నుంచి ఆదాయం తగ్గిపోవడంతో ఇటీవలి కాలంలో రైతులు స్వల్పకాలిక పండ్ల తోటలతో పాటు కూరగాయల సాగుపై ఎక్కువగా దృష్టి సారించారు. ముఖ్యంగా మూడు నెలల్లోపు చేతికొచ్చే కూరగాయల పంటల ద్వారా తమ దశ తిరుగుతుందనే ఆశతో వాటిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 35 వేల ఎకరాల్లో టమాట, వంగ, బెండ, మిరప, కాకర, బీర తదితర కూరగాయల పంటలు సాగు చేశారు. అందులోనూ టమాట ఏకంగా 15 వేల ఎకరాలు, మిరప ఐదు వేలు, బెండ, వంగ లాంటి పంటలు రెండు వేల ఎకరాల చొప్పున వేశారు. టమాట సాగుకు ఎకరాకు సగటున రూ.35 వేల పెట్టుబడి పెట్టారు. కొందరైతే రూ.50 వేల దాకా పెట్టారు. మిరపకు రూ.50-60 వేలు, బెండ, వంగ పంటలకు రూ. 25-30 వేల వరకు ఖర్చు చేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ మొదటి పక్షం వరకు మార్కెట్లో ధరలు కొంత మెరుగ్గానే ఉన్నాయి. జిల్లాలో పండించిన నాణ్యమైన టమాటను కోలారు, మదనపల్లి, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేశారు. కొందరు జిల్లాలోనే మార్కెటింగ్ చేసుకున్నారు. కోలార్ మార్కెట్లో 15 కిలోల టమాట బాక్సు రూ.450 నుంచి రూ.500, మదనపల్లిలో 30 కిలోల బాక్సు రూ.950 నుంచి రూ.వెయ్యి దాకా ధర పలికాయి. అప్పట్లో రైతులకు కిలో టమాటపై రూ.30 దాకా గిట్టుబాటు అయింది. అదే సందర్భంలో వినియోగదారులు కిలో రూ.60తో కొనుగోలు చేశారు. రైతుకు దక్కింది రూ.30 మాత్రమే కాగా... మిగిలిన మొత్తం దళారులు, వ్యాపారుల పాలైంది. ఇదిలావుండగా... డిసెంబర్ రెండో వారం నుంచి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దళారులు, వ్యాపారులకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదు. వేలం పాడినందుకు 10 శాతం కమీషన్‌తో పాటు ఇతరత్రా ఆదాయం వారికి వచ్చేస్తోంది. ప్రస్తుతం 15 కిలోల బాక్సు రూ.10లోపు పలుకుతోంది. వంకాయల పరిస్థితి మరీ దారుణం. మిరప, బెండ లాంటి కూరగాయల ధరలూ తగ్గిపోయాయి. కానీ... వినియోగదారులకు వచ్చేసరికి కిలో టమాట రూ.5లకు పైగా పెట్టి కొంటున్నారు. ధర గిట్టుబాటు గాక చాలా మంది రైతులు టమాట, వంగ తోటలను పశువులు, గొర్రెలకు వదిలేస్తున్నారు. ఉపయోగం లేని ఉద్యానశాఖ ఎప్పుడు ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఏ పంట వేసుకుంటే గిట్టుబాటు ధర లభిస్తుంది, ఏ సమయంలో మంచి ధర ఉంటుంది... తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించడంలో ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు విఫలమవుతున్నారు. వారు పొలంబాట పట్టడం మరచిపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోంది. ఫలితంగా వేలకు వేలు పెట్టుబడులను నష్టపోతున్నారు. పండ్లతోటలకు మాదిరిగానే కూరగాయల పంటలకూ సరైన మార్కెటింగ్ సదుపాయం అందుబాటులోకి తెస్తే కొంతలో కొంతైనా మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే సరైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.