
తామరాపల్లి ప్రాంతంలో కూరగాయల పంటలు
సాక్షి, పాడేరు: ఏజెన్సీలో విస్తారంగా కూరగాయలు సాగు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కూరగాయల పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయి. కొద్దిపాటిగా ఉన్న నీటి నిల్వలతో మాలి జాతి గిరిజనులు రబీలో పలు రకాల కూరగాయల పంటలను సాగు చేస్తున్నారు. అయితే ఈ ఏడాది వేసవి ప్రారంభం నుంచి ఎండలు అధికమవడంతో లోతట్టు ప్రాంతాల్లోని నీటి నిల్వలు కూడా అడుగంటాయి. పంట కాల్వల్లో నీటి ప్రవాహం తగ్గిపోయింది. దీంతో రబీలో సాగవుతున్న పలు రకాల కూరగాయల పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెరువులు, కాల్వలు, చిన్న గెడ్డల్లో నీటి నిల్వలు పెరిగాయి. ఏజెన్సీలోని అరకులోయ మండలం పెదలబుడు, చినలబుడు, బస్కి, డుంబ్రిగుడ మండలం సొవ్వ, సాగర, హుకుంపేట మండలంలోని సంతారి, శోభకోట, తీగలవలస, రంగశీల, పాడేరు మండలంలోని గుత్తులపుట్టు, వనుగుపల్లి, ఇరడాపల్లి, కిండంగి, పెదబయలు మండలంలోని గలగండ, ముంచంగిపుట్టు మండలంలోని దోడిపుట్టు, చింతపల్లి మండలంలోని చౌడుపల్లి, లోతుగెడ్డ, లంబసింగి, తాజంగి, జి.కె.వీధి మండలంలోని దారకొండ, గుమ్మిరేవుల, మాలివలస, రింతాడ ప్రాంతాల్లో మాలి జాతి గిరిజనులు ఆకు కూరలతో పాటు పలు రకాల కూరగాయలను సాగు చేస్తున్నారు.
క్యారెట్, బీట్‌రూట్, క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాట, వంగ, బీన్స్‌తో పాటు పలురకాల మిర్చి, ఆకు కూరల పంటలన్నింటికి ఈ అకాల వర్షాలు ఊపిరి పోసినట్టయిందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు అధిక దిగుబడులకు కూడా ఈ వర్షాలు ఎంతో అనుకూలించాయి.
Comments
Please login to add a commentAdd a comment