ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, ఆదాయం! | Health and income with Nature farming | Sakshi

ప్రకృతి సేద్యంతో ఆరోగ్యం, ఆదాయం!

Sep 11 2018 4:44 AM | Updated on Sep 27 2018 4:42 PM

Health and income with Nature farming - Sakshi

ఆనప తోటలో మహిళా రైతు రజిత

ప్రకృతిని, శ్రమను నమ్ముకుంటే చిన్న కమతాలున్న రైతు కుటుంబాలు సైతం సుభిక్షంగా ఉంటాయనడానికి ప్రబల నిదర్శనం రజితారెడ్డి, రాజేందర్‌రెడ్డి రైతు దంపతులు. రసాయనాల్లేకుండా పంటలు పండించడం నికరాదాయం పెంచుకోవడం కోసం మాత్రమే కాదని.. కుటుంబ ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికీ ఇదే రాజమార్గమని వీరి అనుభవం రుజువు చేస్తోంది. నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో వరిని ఆరుతడి పద్ధతిలో సాగు చేస్తున్నారు. కూరగాయ పంటలతో పాటు పాడిపై కూడా ఆధార పడుతూ నిరంతర ఆదాయం పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాకిటి రజితారెడ్డి, రాజేందర్‌రెడ్డి దంపతులది సాధారణ రైతు కుటుంబం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం తమ్మలోనిభావి వారి స్వగ్రామం. ఏడో తరగతి వరకు చదువుకున్న వీరికి వ్యవసాయమే జీవనాధారం. నాలుగేళ్ల క్రితం వరకు రసాయనిక వ్యవసాయం చేస్తూ చీడపీడలు, ఎరువుల ఖర్చులతో కుదేలయ్యారు. ఈ నేపథ్యంలో రజితారెడ్డి చొరవతో సొంత భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తున్నారు.

బంధువు ఒకరు సుభాష్‌ పాలేకర్‌ పుస్తకం తెచ్చి ఇచ్చిన తర్వాత దగ్గర్లోని ప్రకృతి వ్యవసాయదారుడు పిసాతి సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఆ స్ఫూర్తితో పాలేకర్‌ శిక్షణా తరగతులకు హాజరై రజితారెడ్డి గత నాలుగేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వరి, కూరగాయలు వంటి ఆహార పంటలను సాగు చేస్తూ.. జీవామృతం, కషాయాలను స్వయంగా తామే తయారు చేసుకొని వాడుతూ.. తక్కువ ఖర్చుతోనే సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరు డిగ్రీ చదువుతుండగా, మరొకరు ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్‌ డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నారు.

ఇటు పాడి.. అటు పంట..
వీరికి 4 ఎకరాల సొంత భూమి ఉంది. ఈ ఏడాది ఎకరంలో వరి, అరెకరంలో టమాటా, అరెకరంలో సొర, బీర సాగు చేస్తున్నారు. పంటలతోపాటు పాడి పశువుల పెంపకంపై కూడా దృష్టిపెట్టడం విశేషం. వీరికి ప్రస్తుతం ఐదు గేదెలు, ఒక ఆవు ఉన్నాయి. రెండెకరాల్లో పశువులకు మేత సాగు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 7–8 లీటర్ల పాలు లీటరు రూ. 38 చొప్పున విక్రయిస్తున్నారు. పశువుల పేడ దిబ్బపై ద్రవజీవామృతం చల్లితే.. నెల రోజుల్లో పశువుల ఎరువు మెత్తని ఎరువుగా మారుతుంది. ఆ ఎరువును సాగుకు ముందు ఎకరానికి ఒకటి, రెండు ట్రాక్టర్లు వేస్తున్నారు.

ఈ ఏడాది 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పాక్షికంగా సేంద్రియ పద్ధతిలో పత్తిని సాగు చేస్తున్నారు. సొంత ట్రాక్టరుతోనే రాజేందర్‌రెడ్డి తమ పొలాలను దున్నుకుంటారు. బీజామృతం, జీవామృతంతోపాటు వేపగింజల కషాయం, బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం వంటి కషాయాలను కూడా రజితారెడ్డి స్వయంగా తయారు చేసుకొని పంటలకు వాడుతున్నారు. దంపతులు వ్యవసాయ పనులు స్వయంగా చేసుకోవడంతో ఖర్చు బాగా తగ్గింది. తమ ఆరోగ్యం, భూమి ఆరోగ్యం మెరుగవడమే కాక నికర ఆదాయం పెరిగిందని ఆమె తెలిపారు.

నీటి గుంటతో వాన నీటి సంరక్షణ
రజిత– రాజేందర్‌రెడ్డి తమ ఎర్ర నేలలో బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వర్షాలు సరిగ్గా కురవని ప్రాంతం కావడంతో వాననీటి సంరక్షణపై దృష్టి పెట్టారు. ఉపాధి హామీ పథకంలో నీటి కుంట తవ్వుకున్నారు. వాన నీరు తమ భూమిలో నుంచి బయటకు పోకుండా కట్టడి చేసుకున్నారు. దీని వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం తమ బోర్లు బాగానే పోస్తున్నాయని రజితారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఎండాకాలం తర్వాత సరైన వర్షాలు పడకపోవడం వల్ల కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని ఆమె తెలిపారు. ఉపాధి హామీ ప«థకం కింద వచ్చే జనవరిలో పంట భూమిలో వాలుకు అడ్డంగా 50 మీటర్లకు ఒక వరుస చొప్పున కందకాలు తవ్వించుకోవాలని అనుకుంటున్నామన్నారు.

ఆరుతడి పద్ధతిలో వరిసాగు
నీటి వనరులు తక్కువగా ఉన్న నేపథ్యంలో.. ఎకరం భూమిలో ఆరుతడి పద్ధతిలో వరిని సాగు చేస్తున్నట్లు రజితారెడ్డి తెలిపారు. పొలాన్ని 3 భాగాలుగా చేసి ఒక్కో రోజు ఒక్కో భాగానికి నీరు పెడుతున్నామన్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేసి తమ సొంత తెలంగాణ సోన రకం విత్తనాలు వినియోగిస్తారు. నారు 15–20 రోజుల వయసులో 20 లీటర్ల నీటి ట్యాంకుకు 30 ఎం.ఎల్‌. వేప గింజల కషాయం, లీటరు ఆవు మూత్రం కలిపి పిచికారీ చేస్తారు. నాటేసిన తర్వాత 20 రోజులకోసారి కనీసం 4 సార్లు జీవామృతం బోరు నీటితోపాటు పారగడతారు. నెల లోపు వేపగింజల కషాయం చల్లుతారు. ఏవైనా తెగుళ్లు కనిపిస్తే బ్రహ్మాస్త్రం, అగ్ని అస్త్రం పిచికారీ చేస్తారు.

15 రోజులకోసారి.. అమావాస్య, పౌర్ణమిలకు 3 రోజులు ముందు నుంచి.. వరుసగా రెండు, మూడు రోజుల పాటు పొలం గట్లపై సాయంత్ర వేళల్లో పిడకలతో మంటలు వేస్తారు. ఆ బూడిదను కూరగాయ పంటలపై చల్లుతారు. దీని వల్ల శత్రుపురుగులు నశించి, పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటున్నదని ఆమె తెలిపారు.

50% ఎక్కువగా నికరాదాయం
రసాయనిక పద్ధతిలో వరి సాగు చేసిన రైతులతో పోల్చితే సాగు వ్యయం ఎకరానికి తమకు రూ. 5–6 వేలు తక్కువని, నికరాదాయం 50% ఎక్కువని రజితారెడ్డి తెలిపారు. గత మూడేళ్లుగా తమకు ఎకరానికి 35 బస్తాల ధాన్యం పండుతున్నదని, తామే మరపట్టించి బియ్యం అమ్ముతున్నామన్నారు. 15 క్వింటాళ్ల వరకు బియ్యం వస్తున్నాయన్నారు. క్వింటాలు సగటున రూ. 5 వేల చొప్పున రూ. 75 వేలకు తగ్గకుండా ఆదాయం వస్తున్నదన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి రూ. 50–56 వేల వరకు ఆదాయం వస్తుందన్నారు. అందులోనూ, వారికి ఖర్చు కూడా తమకన్నా ఎక్కువ కావడంతో.. తమతో పోల్చితే వారికి నికరాదాయం తక్కువగా ఉంటుందన్నారు.  

కూరగాయల ధర కిలో రూ. 30‡
స్థానికంగా సేంద్రియ హోటల్‌ నిర్వాహకుల అవసరాలకు అనుగుణంగా టమాటా, సొర, బీర పంటలను ఎకరంలో సాగు చేస్తున్నామని రజితారెడ్డి తెలిపారు. మార్కెట్‌ ధర ఎట్లా ఉన్నా.. ఏ సీజన్‌లోనైనా సొర కాయలకు రూ. 10–12 చొప్పున, బీర, టమాటాలకు కిలోకు రూ. 30 ధర చెల్లిస్తున్నారన్నారు. అడవి పందుల బెడద ఉండటం వల్ల వేరుశనగ తాము సాగు చేయటం లేదని ఆమె వివరించారు. నీటి కొరత సమస్య వల్ల కూరగాయ పంటల్లో మంచి దిగుబడులు తీయలేకపోతున్నామని, తమకు మార్కెటింగ్‌ సమస్య లేదన్నారు.
– ముత్యాల హన్మంతరెడ్డి, సాక్షి, చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా

కొందరు రైతులు అనుసరిస్తున్నారు!
ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన నాలుగేళ్లలో మొదట మా కుటుంబం ఆరోగ్యం బాగుపడింది. రసాయనిక అవశేషాల్లేని ఆహారం తినటం వల్ల అంతకుముందున్న ఆరోగ్య సమస్యలు పోయాయి. భూసారం పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుతున్నామన్న సంతృప్తి ఉంది. వరిని అతి తక్కువ నీటితో ఆరుతడి పద్ధతిలో సాగు చేయగలుగుతున్నాం. ఆరోగ్యదాయకమైన కూరగాయలు పండిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఉత్తమ రైతు అవార్డు రెండు సార్లు అందుకోవడం సంతోషంగా ఉంది. మమ్మల్ని చూసి నలుగురైదుగురు రైతులు ఇంట్లో తాము తినడానికి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు పండించుకోవడం ప్రారంభించడం మరింత సంతోషంగా ఉంది. మా వంటి చిన్న, సన్నకారు సేంద్రియ రైతులకు ప్రభుత్వం బ్యాంకు రుణాలను షరతులు లేకుండా ఇవ్వాలి. ప్రత్యేక రైతు బజార్లను ఏర్పాటు చేయాలి.

– వాకిటి రజితారెడ్డి(99491 42122), తమ్మలోనిభావి, చౌటుప్పల్‌ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా  
   

     కషాయం తయారు చేస్తున్న రజిత
   

 రజిత పొలంలో బీర తోట


     వరి పొలాన్ని పరిశీలిస్తున్న రజిత

  
  డ్రిప్‌తో సాగవుతున్న టమాటా తోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement