రోజూ రాబడే! | Vegetable cultivation are in daily profit | Sakshi
Sakshi News home page

రోజూ రాబడే!

Published Tue, Oct 8 2019 12:15 AM | Last Updated on Tue, Oct 8 2019 12:15 AM

Vegetable cultivation are in daily profit - Sakshi

రైతుకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. ప్రణాళికాబద్ధంగా దఫ దఫాలుగా వివిధ రకాల కూరగాయ పంటలను విత్తుకుంటూ ఉంటే.. ఏడాది పొడవునా, అన్ని సీజన్లలోనూ, ప్రతి రోజూ అనేక రకాల కూరగాయలు చేతికి అందివస్తాయి. రైతు కుటుంబం తినవచ్చు, అమ్ముకొని ఆదాయమూ పొందవచ్చు. అయితే, రైతుకు ఇందుకు కావల్సింది ఖచ్చితమైన ప్రణాళిక, తగిన నీటి వసతి. ఈ రెంటికీ క్రమశిక్షణ తోడైతే ఇక అరెకరం ఎర్ర నేల ఉన్న చిన్న రైతు కూడా నిశ్చింతగా రోజువారీగా ఆదాయం పొందవచ్చు. సేంద్రియ ఉత్పత్తుల వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాలపై నగర, పట్టణ  వాసుల్లోనే కాదు గ్రామీణుల్లోనూ అవగాహన అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రసాయనాలు దరిచేరనివ్వని రైతుల ఆదాయానికి ఢోకా ఉండబోదు. సేంద్రియ సేద్యంలో 15 ఏళ్ల అనుభవం గడించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్‌.ఎ.) నిపుణులు ‘నిరంతర సేంద్రియ కూరగాయల సాగు’పై అందించిన సమాచారం.. ‘సాగుబడి’ పాఠకుల కోసం!

కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుంచి తగిన ఆదాయం పొందాలంటే పంటను బట్టి విత్తిన/నాటిన దగ్గర నుంచి ఒక నెల నుంచి 4–5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. రైతులు సంవత్సరం పొడవునా ప్రణాళిక ప్రకారం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకుంటే రోజువారీగా ఆదాయం అందుతుంది. అంతేకాకుండా, పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. పైగా, తినటానికి కూరగాయలను వెతుక్కోవలసిన/ కొనుక్కోవాల్సిన అవసరమూ ఉండదు.

ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకే విధమైన నష్టం జరిగినా, ఒకటి రెండు పంట రకాలను నష్టపోయినా, మిగతా వాటి నుంచి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాక పురుగుమందుల విషాలు లేని ఆరోగ్యదాయకమైన సేంద్రియ తాజా కూరగాయలను గ్రామస్థాయిలోనే వినియోగదారులకు అనుదినం అందుబాటులో ఉంచవచ్చు. అర ఎకరం ఎర్ర భూమిలో నీటి వసతి, పందిరి కలిగి ఉండి, ఆసక్తి కలిగిన రైతులు శిక్షణ పొంది సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో నిరంతర కూరగాయల సాగు ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయవచ్చు.

సంవత్సరం పొడవునా కూరగాయల సాగు ప్రయోజనాలు:
► కూరగాయలను గ్రామస్థాయిలో ప్రతిరోజూ అమ్మకానికి అందుబాటులో ఉంచగలగడం.
► రైతుకు ప్రతి రోజూ ఆదాయం పొందగలగడం.
► అధిక ఉత్పత్తితోపాటు మంచి నాణ్యమైన సేంద్రియ కూరగాయలను సాగు చేయటం.
► పురుగులు, తెగుళ్ల ఉధృతిని సేంద్రియ పద్ధతుల్లో అదుపులో ఉంచగలగటం.
► పంట ఉత్పత్తిలో, మార్కెటింగ్‌లో కష్టనష్టాలను తగ్గించడం. ఉన్న అరెకరంలో ఒకేరకమైన పంట పండించడం వల్ల సాగు, మార్కెటింగ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఒక సీజన్‌లో అధిక ధర పలికిన పంటకు తర్వాత సీజన్‌లో అతి తక్కువ ధర పలికే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే.. అనేక రకాల కూరగాయలను, అన్ని సీజన్లలోనూ దఫాల వారీగా విత్తుకుంటూ/నాటుకుంటూ ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి వచ్చేలా చూసుకోవడమే ఉత్తమం.


నేల తయారీ
► అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమిని గుర్తించి, గుర్తులు పెట్టి, శుభ్రం చేసి ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నుకోవాలి.
► ఒక అడుగు లోతు వరకూ మట్టిని తవ్వి పూర్తిగా కలిసేలా కలియబెట్టాలి.
► అర ఎకరలో కూరగాయల సాగుకు బెడ్‌ల నిర్మాణం
► బెడ్‌ మేకర్‌తో మడులను తయారుచేసుకోవాలి.
► బెడ్‌ వెడల్పు 4 అడుగులు, ఎత్తు ఒక అడుగు ఉండాలి. రెండు బెడ్‌ల మధ్యలో 1.5 అడుగులు నడకదారిని ఏర్పాటు చేసుకోవాలి.
► 25 శాతం విస్తీర్ణంలో తీగ జాతి కూరగాయలు, 75% విస్తీర్ణంలో ఇతర కూరగాయలు పండించుకునే విధంగా సిద్ధం చేసుకోవాలి.
► స్థలం పొడవు, వెడల్పును బట్టి మడుల పొడవు నిర్ణయమవుతుంది.
► పొలం చుట్టూ 3 వరుసల సరిహద్దు పంటలుగా జొన్న లేదా సజ్జలను విత్తుకోవచ్చు. ఫలితంగా ఇరుగుపొరుగు పొలాలనుంచి రసం పీల్చే పురుగుల రాకను అడ్డుకోవచ్చు.
► మునగ, కూర అరటి, కరివేపాకు మొక్కలను వేసుకుంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా పండించి, అమ్ముకోవచ్చు. వీటి మధ్య 9 అడుగుల దూరం పాటించాలి.
► జామ, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను(దూరం 18 అడుగులు) నాటుకోవాలి.


మడి తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు
అర ఎకరంలో కూరగాయలు సాగు చేయడానికి దాదాపుగా 2 టన్నుల పశువుల పేడ లేదా వర్మీకంపోస్టు లేదా గొర్రెల ఎరువు మొదలైనవి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి.
జీవన ఎరువుల(ట్రైకోడర్మా విరిడి, పి.ఎస్‌.బి., సూడో మోనాస్‌)ను అర ఎకరానికి ఒక కేజీ చొప్పున 50 కేజీల పశువుల పేడ కలిపి చల్లడం ద్వారా తెగుళ్లను అరికట్టవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి 100 లీటర్ల జీవామృతం లేదా అమృత జలం పిచికారీ చేయాలి.

సూటి రకాల విత్తనాలు మేలు
సూటిరకాల కూరగాయ విత్తనాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాల దగ్గర, సికింద్రాబాద్‌లో తార్నాకలోని సహజ ఆహారం ఆర్గానిక్‌ స్టోర్స్‌(85007 83300)లో లభిస్తాయి. సూటి రకాలు తెగుళ్లు, చీడపీడల బెడదను తట్టుకుంటాయి.

విత్తనాలు, మొక్కలు నాటడంలో మెలకువలు
బెండ, చిక్కుడు, గోరు చిక్కుడు పంటలను నేరుగా విత్తుకోవాలి. ఆకుకూర విత్తనాలను ఇసుకలో కలిపి వెదజల్లుకోవాలి. టమాటో, వంగ, మిరప పంటల విత్తనాలతో నారు పెంచుకొని నాటుకోవాలి. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. డ్రిప్‌ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించాలి.
రైతులు తమ గ్రామంలో ఏయే రకాల కూరగాయలకు డిమాండ్‌ ఉంటుందో తెలుసుకొని ఆ రకాలను ఎంపిక చేసుకోవాలి. ఒక మడిలో ఒక పంట పూర్తయిన తర్వాత మళ్లీ అదే పంట వేయకూడదు. పంట మార్పిడి తప్పనిసరి.

కూరగాయ మొక్కలను ఆశించే పురుగులు, తెగుళ్లు– నివారణ
కూరగాయల సాగులో ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగులు, తెగుళ్లు సమస్యను గమనించిన వెంటనే తగు చర్యలు చేపట్టడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చు.

రసం పీల్చే పురుగులు: రసం పీల్చే పురుగులు మొక్క లేత భాగాల నుంచి రసం పీల్చుతాయి. ఇవి సోకితే ఆకులు పసుపు రంగుకు మారి ఆకు ముడత ఏర్పడుతుంది. ఆకులు వాడిపోతాయి. పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ మొదలైనవి ఆశించిన వెంటనే 50 లీటర్ల నీటిలో 2.5 కిలోల వేప పిండితో చేసిన కషాయం పిచికారీ చేసుకోవాలి. పసుపు, తెలుపు, నీలం రంగు జిగురు పూసిన పళ్లాలను అమర్చుకోవాలి.
వేరు, కాండం కుళ్లు తెగులు నివారణకు 50 కిలోల వేపపిండిని ఒక కిలో ట్రైకోడర్మా విరిడిని, 50 కిలోల పశువుల పేడను కలుపుకొని చల్లుకోవాలి.

ఆకులు తినే పురుగులు

ఆకులు తినే పురుగుల వల్ల కూరగాయ మొక్కల ఆకులు, కాయలపై రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకుల ఈనెలు మాత్రమే మిగులుతాయి.
ఆకుమచ్చ తెగులు నివారణకు 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 లీటర్ల నీటిని కలిపి 5 రోజుల పాటు మురగబెట్టిన తరువాత 6వ రోజు 250 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
కాయ తొలిచే, మొవ్వు తొలిచే పురుగులను అరికట్టడం కోసం లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. శనగపచ్చ పురుగు నుంచి రక్షణకు పసుపు రంగు గల బంతిని ఎర పంటగా వేసుకోవాలి.

కాండం కుళ్లు తెగులు: కాండం కుళ్లు తెగులు సోకితే మొక్కలు మొదళ్లలో కుళ్లి, ఒరిగిపోయి చనిపోతాయి. మొక్కలు నాటే ముందే వేప పిండిని మట్టిలో కలిపి ఆ తర్వాత మొక్కలను నాటుకుంటే ఈ తెగులు రాదు.

ఆకులపై మచ్చలు, నివారణ: ఆకులపై మచ్చల తెగులు నివారణకు వేపకషాయం పిచికారీ చేయాలి.

ఆకులపై బూడిదలా ఏర్పడటం (బూడిద తెగులు): బూడిద తెగులు నివారణకు 5 లీటర్ల పశువుల మూత్రం, 200 గ్రాముల ఇంగువ లేదా 5 శాతం మజ్జిగ పిచికారీ చేసుకోవాలి. గ్రామంలో రైతుకు ఉన్న అవకాశాలను బట్టి షాపు /రిక్షా/తోపుడు బండి/ ఎలక్ట్రిక్‌ ఆటో ఏర్పాటు చేసుకొని కూరగాయలను విక్రయించుకోవచ్చు.
(సేంద్రియ సేద్యంపై సందేహాల నివృత్తికి సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలను 85007 83300 నంబరులో సంప్రదించవచ్చు)

ఏయే కూరగాయలను ఎన్ని రోజుల వ్యవధిలో విత్తుకోవాలి?
► రెండు నుంచి మూడు రకాల ఆకుకూరలను వారానికి ఒకసారి విత్తుకోవాలి.
► టమాటో, వంగ లాంటివి రెండు నెలలకు ఒకసారి విత్తుకోవాలి.
► చిక్కుడు సీజన్‌లో ఒకటి లేదా రెండుసార్లు విత్తుకుంటే సరిపోతుంది.
► బీట్‌రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ రబీలో ఒకసారి మాత్రమే విత్తుకోవాలి.
► మిరప,బెండ మొదటసారి విత్తిన బెడ్‌ పూతకు రాగానే మరో బెడ్‌లో నాటుకోవాలి.



సేంద్రియ కూరగాయల సాగుపై జనగామలో 5 రోజుల శిక్షణ
అరెకరంలో సేంద్రియ కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తూ ప్రతి రోజూ ఆదాయం పొందే పద్ధతులను నేర్చుకొని, ఇతరులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రగాఢమైన ఆసక్తి కలిగిన వారికి సుస్థిర వ్యవసాయ కేంద్రం జనగామలోని తన రైతు శిక్షణా కేంద్రంలో 5 రోజుల పాటు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. వివరాలకు.. డా. జి. రాజశేఖర్‌ –83329 45368

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement