vegetable cultivation
-
ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం
ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్‌లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్లో సాగు చేస్తున్నారు. బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్‌లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్ మ్యాట్ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.పండ్ల చెట్లు.. ఫైనాపిల్ కూడా..7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్ మొక్కలను కూడా పెంచుతున్నారు. మధురై నుంచి ఎర్రబెండ సీడ్ తెప్పించి నాటుకున్నారు.ఆన్లైన్, ఆఫ్‌లైన్ మార్కెటింగ్కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్లైన్ మార్కెటింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్సైట్ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్‌కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్ సదుపాయం కల్పించారు.రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్ నిర్వహించటంతో పాటు వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అమ్మకాలతో పాటు కలెక్టరేట్లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!సింగ్‌పూర్‌లో 2020 వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్వేర్ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్‌తో పాటు వెబ్సైట్ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.– యు. బాల భాస్కర శర్మ (62817 00553), సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్ ప్రకృతి రైతు, కర్నూలు– గవిని శ్రీనివాసులు, సాక్షి కర్నూలు (అగ్రికల్చర్) -
వెజి‘ట్రబుల్’ సాగు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల సాగు గణనీయంగా పడిపోయింది. డిమాండ్, సరఫరాలో అంతరం ఏటికేడు పెరుగుతోంది. అవసరమైన కూరగాయల్లో సగానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచే దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చులు, మధ్య దళారుల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. తాజావి కాకుండా నిల్వ కూరగాయలే జనానికి అందుతున్నాయి. కూరగాయల సాగులో సమస్యలు, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, పట్టణ ప్రాంతాలు విస్తరించడం, శివారు భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండటంతోపాటు సాగునీటి వసతి పెరిగి రైతులు వరి సాగువైపు దృష్టిపెట్టడం వంటివి కూరగాయల సాగు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయి. రిజర్వుబ్యాంక్ ఇటీవల విడుదల చేసిన హ్యాండ్‌బుక్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పదేళ్లలో 80శాతం తగ్గిపోయి.. రాష్ట్రంలో ఏటా 2 కోట్ల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. అందులో ఈసారి ఖరీఫ్‌లో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం 12.96 లక్షల ఎకరాలే. మిగతా అంతా వరి, పత్తి వంటి పంటలే. ఉద్యాన పంటల్లోనూ పండ్ల తోటలు 4 లక్షల ఎకరాల్లో, సుగంధ ద్రవ్యాల సాగు 3 లక్షల ఎకరాల్లో, ఆయిల్ పామ్ 2 లక్షల ఎకరాల్లో, ఆగ్రో ఫారెస్ట్రీ లక్ష ఎకరాల్లో, పూలు, ఇతర వాణిజ్యపర ఉద్యాన పంటలు కలిపి లక్షన్నర ఎకరాల్లో సాగయ్యాయి. రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల జనాభాకు అవసరమైన కూరగాయల సాగు జరుగుతున్నది కేవలం 1.13 లక్షల ఎకరాల్లో మాత్రమే. నిజానికి 2013–14లో తెలంగాణలో 5.46 లక్షల ఎకరాల్లో కూరగాయలు సాగుకాగా.. తర్వాతి నుంచి ఏటా తగ్గిపోతూ వచ్చింది. ఈసారి 1.13 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే పదేళ్లలో 4.33 లక్షల ఎకరాల మేర (80శాతం) కూరగాయల సాగు తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న నిల్వ కూరగాయలనే జనం వాడాల్సి వస్తోంది. కూరగాయల సాగులో రాష్ట్రం దేశంలో 15 స్థానానికి, ఉత్పత్తిలో 14వ స్థానానికి పడిపోవడం గమనార్హం. ఏటా 40 లక్షల టన్నులు అవసరం రాష్ట్ర జనాభా వినియోగం కోసం ఏటా 40 లక్షల మెట్రిక్ టన్నుల కూరగాయలు అవసరం. హార్టికల్చర్ విభాగం లెక్కల ప్రకారం 1.13 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కూరగాయలు 21 లక్షల టన్నులు మాత్రమే. ఇందులోనూ వంకాయ, టమాటాలను అవసరానికి మించి పండిస్తున్నారు. పచ్చి మిర్చితో పాటు బెండ, దొండ, ఉల్లి, బంగాళాదుంప, చిక్కుడు, పొట్లకాయ, సొరకాయ, బీరకాయ, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యారెట్‌తోపాటు పాలకూర, తోటకూర, కొత్తిమీర, పుదీనా వంటివి కూడా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా ఖర్చు కారణంగా రాష్ట్రంలో కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రోత్సాహకాలు, నిల్వ సదుపాయాలు లేక.. కూరగాయల సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, కోల్డ్ స్టోరేజీ సదుపాయాల కొరత, పండించిన కూరగాయలకు సరైన మార్కెట్ కల్పించకపోవడం వంటి సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. కూరగాయల విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలతోపాటు కూలీల ఖర్చులు పెరగడం, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం కూడా కూరగాయల సాగు పట్ల రైతులకు ఆసక్తి తగ్గడానికి కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన వరి, పత్తి, మొక్కజొన్న సాగు విస్తీర్ణం తెలంగాణలో కూరగాయల సాగు తగ్గిపోగా వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. భూగర్భ జలాలు, సాగునీటి సదుపాయాలు పెరగడం దీనికి కారణం. ఈ ఏడాది వానకాలం సీజన్లో వరి 66 లక్షల ఎకరాల్లో, పత్తి 44 లక్షల ఎకరాల్లో సాగవడం గమనార్హం. యాసంగిలోనూ 60 లక్షల ఎకరాల్లో వరి వేశారు. దీనితోపాటు మొక్కజొన్న, మిర్చి వంటి పంటల సాగు కూడా గణనీయంగా పెరుగుతోంది. కూరగాయల సాగు మరింతగా క్షీణిస్తోంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఖమ్మం పరిధిలో సీతారామ ప్రాజెక్టు వంటివి అందుబాటులోకి వచ్చాక... రాష్ట్రంలో వరితో పాటు కూరగాయల సాగు కూడా పెరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు భావించారు. కానీ దీనికి భిన్నంగా జరుగుతోంది. కూరగాయలు ఎక్కువగా పండించే.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో కూడా సాగు తగ్గుముఖం పడుతుండటం ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్‌లో తగ్గిన కూరగాయల వినియోగం హైదరాబాద్‌లో కూరగాయల వినియోగంపై జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ సంయుక్తంగా జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటున నెలకు ఒక్కొక్కరు 8.08 కిలోల కూరగాయలు(ఉల్లిపాయలతో కలిపి) వినియోగిస్తున్నట్లు తేలింది. అంటే రోజుకు 269 గ్రాములు అన్నమాట. దేశ సగటు కంటే ఇది 56 గ్రాములు తక్కువ. మన దేశ పరిస్థితుల మేరకు.. ప్రతి ఒక్కరూ రోజుకు 325 గ్రాముల కూరగాయలు తీసుకోవాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించడం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజుకు 2,006 టన్నులు అంటే నెలకు 60,182 టన్నులు, ఏడాదికి 7,22,186 టన్నుల కూరగాయలు అవసరమని అంచనా. కానీ ఏటా హైదరాబాద్‌కు 6 లక్షల టన్నుల కూరగాయలు మాత్రమే వస్తున్నట్టు అంచనా. ఇందులోనూ 80శాతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నవే. సరిపడా కూరగాయలు రాకపోవడం, ధరలు ఎక్కువగా ఉండటంతో వినియోగం తక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులు, కూలీల సమస్యతో.. మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలో కూరగాయలు, ఉద్యాన పంటల సాగు క్రమంగా తగ్గుతోంది. పెట్టుబడుల ఖర్చు, ఎక్కువ శ్రమ, పురుగు మందులు, ఎరువుల వాడకం ఎక్కువగా ఉండటం వల్ల రైతులు కూరగాయల సాగుకు ఆసక్తి చూపడం లేదు. కూలీల కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు నీటి లభ్యత పెరగడం, ప్రభుత్వం ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేస్తుండటంతో వరి పండించేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. – ప్రభాకర్‌రెడ్డి, కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, పాలెం, నాగర్‌కర్నూల్ జిల్లా కొత్తగా సాగు చేసేవారే లేరు పట్టణీకరణతో కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. కానీ కొత్తగా కూరగాయల సాగుకు ఎవరూ ముందుకు రావడం లేదు. నీటి లభ్యత, మద్దతు ధరతో కొనుగోళ్లతో రైతులంతా వరివైపు చూస్తున్నారు. – కె.వేణుగోపాల్, జిల్లా హార్టికల్చర్ అధికారి, మహబూబ్‌నగర్ కూరగాయల సాగు ఖర్చులు బాగా పెరిగాయి కూరగాయలకు చీడపీడల సమస్య ఎక్కువ. పురుగు మందులు, ఎరువులు, ఇతర సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. కొన్నిసార్లు పెట్టుబడి కూడా తిరిగిరాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీంతో క్రమంగా కూరగాయల సాగు తగ్గించుకుంటూ వస్తున్నాం. సూపర్ మార్కెట్లు పెరగడం, ఇతర ప్రాంతాల నుంచి టోకుగా తెప్పించుకుంటుండటంతో.. స్థానికంగా మార్కెటింగ్ సమస్య వస్తోంది. – ముత్యంరెడ్డి, రైతు, బుస్సపూర్, బాల్కొండ నియోజకవర్గం దళారీలే బాగుపడుతున్నారు.. మా గ్రామంలో ఇప్పుడు టమాటా పండిస్తున్నారు. నెల కింద టమాటా ఒక్క బాక్స్ (సుమారు 25 కిలోలు) 500 రూపాయలకు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.200 కూడా రావడం లేదు. టమాటాలను నిల్వ చేసుకునే సదుపాయం లేదు. దళారీలు ఎంతకు అడిగితే అంతకు అమ్మడం తప్ప ఏం చేయలేం. రైతులు, వినియోగదారులు ఇద్దరికీ నష్టమే. దళారీలు బాగుపడుతున్నారు. విత్తనాల నుంచి మార్కెట్లో అమ్ముకునేదాకా నష్టం కలుగుతున్నప్పుడు కూరగాయల సాగు నుంచి వేరే పంటల వైపు వెళ్లక ఏం చేస్తాం? – మొగుళ్లపల్లి వెంకటరెడ్డి, ముట్పూర్, కొందుర్గు మండలం, రంగారెడ్డి జిల్లా లాభాలపై గ్యారంటీ లేదు కూరగాయలు పండిస్తే పెట్టిన పెట్టుబడికి అదనంగా వచ్చే లాభాలపై ఎలాంటి గ్యారంటీ లేదు. ఒకవైపు వాతావరణ పరిస్థితులు. మరోవైపు చీడపీడల బెడద. అన్నీ తట్టుకొని సాగుచేసినా.. మహారాష్ట్ర నుంచి దిగుబడి అవుతున్న కూరగాయలతో పోటీపడలేకపోతున్నాం. మొన్నటి వరకు మంచి ధర పలికిన టమాటా, కొత్తిమీర ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. దిగుబడి వస్తున్న సమయంలో ధర తగ్గిపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. – సాతాళే విజయ్‌కుమార్, కూరగాయల రైతు, గుడిహత్నూర్నిలకడైన ధర లేక ఇబ్బంది అవుతోందికూరగాయలకు మార్కెట్లో నిలకడైన ధర లేకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోంది. దగ్గరలో మార్కెట్ అందుబాటు లేక రవాణా, ఇతర ఖర్చులు పెరుగుతున్నాయి. హార్టికల్చర్ శాఖ నుంచి ఎలాంటి సబ్సిడీలు కూడా అందడం లేదు. అందుకే ప్రస్తుతం కూరగాయలు సాగు చేయడం లేదు. – లింగారెడ్డి. రైతు, రెంజర్ల -
చీడపీడల నివారణకు బట్టలు ఉతికే సర్ఫ్ వాడకం..!
-
పెద్దపల్లికి చెందిన యువరైతు అద్భుత ప్రతిభ..!
-
సంపద కేంద్రంలో ప్రకృతి వనం
కంకిపాడు(పెనమలూరు): అది చెత్త నుంచి సంపద తయారు చేసే కేంద్రం. నిన్నటి వరకూ ప్రజలకు అంత వరకే తెలుసు. ప్రస్తుతం ప్రకృతి విధానంలో కూరగాయల మొక్కల సాగు జరుగుతోంది. ఎరువులు, పురుగు మందులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా సంపద కేంద్రాన్ని తీర్చిదిద్దేందుకు కంకిపాడు పంచాయతీ పాలకవర్గం పాటుపడుతూ స్థానిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. మండల కేంద్రమైన కంకిపాడులో గత పాలకపక్షం హయాంలో చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని నిర్మించారు. ఈ పాలకపక్షం అధికారం చేపట్టాక సంపద వృద్ధి, ఆదాయ వనరుల పెంపుపై దృష్టి సారించింది. ప్రస్తుతం వర్మికంపోస్టు, పొడి చెత్త విక్రయాలు సాగిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం సంపద కేంద్రంలో ఉన్న ఖాళీ స్థలంలోనూ సంపద సృస్టించేందుకు పంచాయతీ పాలకవర్గం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఐదు నెలల క్రితం సంపద కేంద్రం ప్రాంగణంలో వృథాగా ఉన్న స్థలాన్ని బాగుచేయించారు. ఆ ప్రాంతంలో వర్మీకంపోస్టు, మట్టి కలిపి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేశారు. వంగ, బెండ, గోరు చిక్కుడు, టమాటా, మిర్చి మొక్కలు నాటారు. తీగజాతికి చెందిన సొర, బీర, కాకర, పొట్లను కూడా సాగుచేస్తున్నారు. వీటికి పందిరి అవసరం లేకుండా ప్రాంగణంలో కొంచెం ఎత్తు మాత్రమే ఉన్న చెట్లకు పాదులను పాకిస్తున్నారు. తోటకూర, పాలకూర, గోంగూర నారుపోసి సంరక్షించారు. అరటి, జామ, దానిమ్మ, పనస, మామిడి, ఉసిరి వంటి పండ్ల జాతి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు తెగుళ్లు, పురు గుల బారిన పడకుండా నిత్యం పంచాయతీ సిబ్బంది సంరక్షిస్తున్నారు. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు, మంచి ఫలసాయం లభించేందుకు ఎప్పటికప్పుడు వర్మికంపోస్టు, సేంద్రీయ ఎరువును మొక్కలకు అందిస్తున్నారు. ఆదాయం పెంపు దిశగా.. ఇప్పటికే చెత్త నుంచి సంపద కేంద్రం నుంచి వర్మీ కంపోస్టు, పొడి చెత్త విక్రయాలు జరుగుతు న్నాయి. వీటి తోపాటుగా అన్ని సీజన్లలో ప్రకృతి విధానంలో కూరగాయ మొక్కలను పెంచి వాటి ఉత్పత్తులను విక్రయించటం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించేందుకు పంచాయతీ చర్యలు తీసుకుంది. వర్మీకంపోస్టు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు ఆర్గానిక్ కూరగాయలకు ఆసక్తి చూపుతారు. అదే ఉద్దేశంతో ప్రకృతి విధానాన్ని సంపద కేంద్రంలో అమలు చేస్తోంది. ఆర్గానిక్ ఉత్పత్తులకు డిమాండ్ ప్రస్తుతం ఆర్గానిక్ ఉత్పత్తులను మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆరోగ్యంపై అవగాహన, శ్రద్ధ పెరిగాయి. ఆర్గానిక్ పద్ధతిలో పెరిగిన కూరగాయలను భుజించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే కారణంతో ఆర్గానిక్ పద్ధతిలో సాగుచేసిన కూరగాయలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావా లని నిర్ణయించుకున్నాం. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో వృథాగా ఉన్న ఖాళీ స్థలాన్ని మొక్కల పెంపకానికి వినియోగి స్తున్నాం. కేంద్రం ప్రాంగణం మొత్తం కూరగాయలు, ఆకుకూరలు పెంచి విక్రయించటం ద్వారా పంచాయతీకి కూడా ఆదాయం సమకూరుతుంది. – రాచూరి చిరంజీవి, ఉప సర్పంచ్, కంకిపాడు -
రకరకాల పంటలు పండిస్తూ మంచి ఆదాయం..!
-
సంప్రదాయ పంటల సాగు కంటే కూరగాయల సాగు మేలు..!
-
పెద్దగా పెట్టుబడి అవసరం లేని కూరగాయల సాగు ఎంతో మేలు
-
కూరగాయల సాగుతో అద్భుతాలు సృష్టిస్తున్న రైతు సోదరులు
-
సేంద్రియ బాట పడుతున్న రైతులు
-
రైతుల సంఘటితంగా కూరగాయల సాగు
-
కూరగాయల సాగు లాభదాయకం
-
పండించిన కూరగాయలను మార్కెట్ చేసుకోవడం సులభమే
-
పంటకు మంచి ధర దక్కేలా మార్కెట్ లో నేరుగా విక్రయం
-
ప్రతిరోజూ పంట చేతికొచ్చేలా ప్రణాళిక ప్రకారం సాగు
-
భర్తల సంపాదనపైనే ఆధార పడకుండా సొంతంగా వ్యవసాయం
-
మెట్ట ప్రాంతంలో లాభసాటిగా బెండకాయ సాగు..
-
ఇలా చేస్తే ఆకుకూరల అధిక ఆదాయం
-
కూరగాయల సాగుతో ఇద్దరు పిల్లల్ని డాక్టర్స్ ని చేసిన దంపతులు
-
ఇలా కూరగాయల సాగు చేస్తే లాభాలే లాభాలు
-
కూరగాయల ధరలు ఎందుకు ఆకాశాన్ని తాకుతున్నాయి?
-
తక్కువ పెట్టుబడితో రెండు చేతులా సంపాదిస్తున్న రైతు
-
బీర సాగుకి ముందు భూమిని ఇలా చేస్తే దిగుబడే దిగుబడి..
-
కూరగాయలు ఎక్కువ దిగుబడికి సులువైన మార్గాలు ఇవే..!
-
అవును... మిద్దెలపై డబ్బులు కాస్తాయి!
ఆరోజు మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని ఇంటికి తీసుకువచ్చింది కేరళలోని కొట్టాయంకు చెందిన రెమాదేవి. కూరగాయలను కడుగుతున్నప్పుడు ఒకరకమైన రసాయనాల వాసన వచ్చింది. ఆ సమయంలో పిల్లలు, వారి భవిష్యత్ గుర్తుకు వచ్చింది. అదే సమయంలో తాను ఒక నిర్ణయం తీసుకుంది... ‘ఇంటికి అవసరమైన కూరగాయలు ఇంటిదగ్గరే పండించుకుంటాను’ అలా మిద్దెతోటకు శ్రీకారం చుట్టింది రెమాదేవి. అమ్మమ్మ రంగంలోకి దిగింది. సేంద్రియ వ్యవసాయంలో అమ్మమ్మది అందెవేసిన చేయి. ఆమె సలహాలు, సూచనలతో మిద్దెతోట పచ్చగా ఊపిరిపోసుకుంది. కొంత కాలానికి...ఇంటి అవసరాలకు పోగా మిగిలిన కూరగాయలను అమ్మడం మొదలుపెట్టారు. తమకు ఉన్న మరో రెండు ఇండ్లలోనూ మిద్దెతోట మొదలుపెట్టింది రెమాదేవి. అలా ఆదాయం పెరుగుతూ పోయింది. మిద్దెతోటపై ఆసక్తి ఉన్న వాళ్లు రెమాను రకరకాల సలహాలు అడిగేవారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ‘రెమాస్ టెర్రస్ గార్డెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. ‘మిద్దెతోటకు పెద్దగా ఖర్చు అక్కర్లేదు’ అని చెబుతూ ఆ తోటపెంపకానికి సంబంధించిన ఎన్నో విషయాలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు చెబుతుంది. వంటగది వ్యర్థాలతో మనకు కావల్సిన ఎరువులు ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోల ద్వారా చూపుతుంది. దీంతో పాటు సోషల్ మీడియా ఫార్మింగ్ గ్రూప్స్ ద్వారా విత్తనాలు అమ్ముతుంది రెమాదేవి. కేవలం విత్తనాల అమ్మకం ద్వారానే నెలకు 60,000 రూపాయల ఆదాయం ఆర్జిస్తుంది. రెమాదేవిని అనుసరించి ఎంతోమంది మిద్దెతోటలను మొదలుపెట్టి రసాయన–రహిత కూరగాయలను పండించడమే కాదు, తగిన ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. మంచి విషయమే కదా! -
Sagubadi: సోరకాయ. ఎకరానికి 6 వేల ఖర్చు.. నెలలో 50 వేల వరకు ఆదాయం!
షాబాద్/రంగారెడ్డి: కూరగాయల సాగులో రైతులు ఆధునిక పద్ధతులు పాటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. శాశ్వత పందిళ్లు, బిందు సేద్యం, మల్చింగ్, స్ప్రింక్లర్ల ప్రాముఖ్యతపై ఉద్యానశాఖ అధికారులు అవగాహన కల్పించడంతో ఆ పద్ధతిలో పంటలు పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రభుత్వం పందిరిసాగు ద్వారా కూరగాయలు పండించే రైతులకు ఎకరానికి రూ.లక్ష వరకు సబ్సిడీ అందిచడంతో చాలామంది ముందుకు వస్తున్నారు. కాకర, బీర, దొండ, సోరకాయ విత్తనాలు నాటిన కొద్ది రోజులకే పంట చేతికి వస్తోంది. మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో పెట్టుబడి పోను మంచి లాభాలు వస్తున్నాయి. దిగుబడి.. రాబడి జిల్లాలో అత్యధికంగా షాబాద్, మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, షాద్‌నగర్, మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని రైతులు పందిరి సాగు ద్వారా కూరగాయలు పండిస్తున్నారు. బీర, చిక్కుడు ఎకరానికి 25 వేల పెట్టుబడి.. రాబడి 1.55 లక్షలు ఏడాదిలో రెండుసార్లు సోరకాయ దిగుబడి వస్తోంది. ఎకరానికి రూ.6 వేల వరకు ఖర్చు కాగా, సుమారు 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తోంది. మార్కెట్లో కిలో రూ.20–25 చొప్పున ధర పలుకుతోంది. నెలలో రూ.50వేల వరకు ఆదాయం వస్తోంది. బీర, చిక్కుడు పంటలకు ఎకరానికి రూ.25వేల వరకు పెట్టుబడి ఖర్చు కాగా, రూ.1.55 లక్షల వరకు రాబడి వస్తోంది. తక్కువ పెట్టుబడితో.. జిల్లాలోని ఆయా మండలాల్లో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు 1,500 ఎకరాల్లో పందిరి సాగు ద్వారా వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి రూ.లక్ష చొప్పున 250 మంది రైతులకు.. 550 ఎకరాల వరకు సబ్సిడీ అందించింది. ఏడాది పొడవునా కూరగాయలను సాగు చేస్తూ తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను పొందుతున్నామని రైతులు చెబుతున్నారు. లాభదాయకం.. కూరగాయలను నేల కంటే పందిరి సాగు విధానంలో పండిస్తేనే లాభదాయకంగా ఉంటుంది. వర్షాలు ఎక్కువగా కురిసినా పంట నాణ్యతగానే ఉంటుంది. ఎకరంలో పందిరి సాగులో కూరగాయలు పండిస్తున్నా. ఏడాదికి రూ.లక్ష వరకు ఆదాయం వస్తోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇవ్వడం బాగుంది. – అమృత్‌రావు, రైతు, సర్ధార్‌నగర్ అవగాహన కల్పిస్తున్నాం పందిరి సాగుపై ఆయా ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను సూచిస్తున్నాం. ప్రభుత్వం సబ్సిడీ సైతం అందిస్తోంది. దీంతో చాలా మంది రైతులు పందిరి సాగు విధానానికి ఆసక్తి చూపుతున్నారు. కాకర, బీర, సోర, దొండ పంటలను సాగు చేస్తున్నారు. – సునందారాణి, జిల్లా ఉద్యానశాఖ అధికారి చదవండి: Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. Sagubadi: కాసుల పంట డ్రాగన్! ఎకరాకు 8 లక్షల వరకు పెట్టుబడి! రెండో ఏడాదే అధికాదాయం.. 50 లక్షలకు పైగా! -
పనిలో ఉంటే మనసూ బాగుంటుంది
స్త్రీలకు రిటైర్మెంట్ వయసు వస్తే వారు మనుమల, మనమరాళ్ల బాగోగుల్లో పడాల్సి వస్తుంది. లేదా కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ఉంటూ టీవీ చూస్తూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. ‘కాని అలా ఉంటే బోర్. ఏదైనా ప్రయోజనకరమైన పని చేస్తే సంతోషంగా ఉంటుంది... మనసూ బాగుంటుంది’ అంటుంది అనంతలక్ష్మి. రిటైర్ అయ్యాక రైతుగా కూడా మారిన ఆమె పచ్చని పరిసరాల్లో ఉంటూ తనూ ఒక చెట్టులా నీడను పంచుతోంది. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామానికి చెందిన కొమ్మినేని అనంతలక్ష్మి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా చేరి, సూపర్వైజర్గా తన సర్వీసునంతా గ్రామీణ ప్రాంతాల్లోనే చేసి రిటైర్ అయ్యింది. ఇద్దరు పిల్లలు. జీవితం చక్కగా ఒక ఒడ్డుకు చేరింది. ఇక ఏ పనీ చేయకుండా ఆమె కాలక్షేపం చేయవచ్చు. కాని ఆమె అలా ఉండలేకపోయింది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఏర్పడ్డ అనుబంధాలు వదులుకోలేకపోయింది. వారి కోసం పని చేస్తూనే ఉండాలని అనుకుంది. కష్టమనుకుంటే కుదరదు ‘ఎ.ఎన్.ఎమ్‌గా ఉద్యోగం అంటే పల్లె పల్లె తిరగాలి. నా పరిధిలో నాలుగూళ్లు ఉండేవి. వైద్య పరంగా ఎవరెలా ఉన్నారో కనుక్కుంటూ రోజంతా తిరుగుతూనే ఉండేదాన్ని’ అంటుంది అనంతలక్ష్మి. ‘ఆ రోజుల్లో కుటుంబ అవసరాలు తీరాలంటే నేనూ ఉద్యోగం చేయక తప్పని పరిస్థితులు. పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లని వెంటేసుకుని ఊరూరు తిరిగిన రోజులూ ఉన్నాయి. కష్టం అనుకుంటే ఏ పనీ చేయలేం. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, మనకంటూ సొంత పని అంటూ ఉండాలి. ఎవరి మీదా ఆధారపడకూడదనే మనస్తత్వం నాది. ఎఎన్ఎమ్ నుంచి సూపర్వైజర్గా చేసి, రిటైర్ అయ్యాను’ అంటుందామె. ప్రయత్నాలు ఫలవంతం ‘పిల్లలిద్దరూ జీవితంలో స్థిరపడ్డారు. ఉద్యోగంలో రిటైర్మెంట్ వచ్చింది. పాతికేళ్లకు పైగా విధులు నిర్వర్తించిన దాన్ని. ఒక్కసారిగా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే ఇబ్బందిగానే అనిపించింది. కొన్ని రోజులు ఏం చేయాలో అర్థం కాలేదు. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో కొద్దిపాటి పొలం ఉంది. రోజూ కాసేపు పొలం వద్దకు వెళ్లేదాన్ని. కూరగాయల సాగు, పండ్ల మొక్కలను నాటడం వంటి పనులు చేయడం మొదలుపెట్టాను. పల్లెలూ, పంటపొలాల్లో తిరుగుతున్నప్పుడు నా దృష్టి రైతులు చేసే పని మీద ఉండేది. నాకు తెలియకుండానే గమనింపు కూడా పెరిగింది. నేను కూరగాయలు, పండ్ల మొక్కల పెంపకం మొదలుపెట్టినప్పుడు నాకు మరో కొత్త జీవితం మొదలైనట్టనిపించింది. రెండేళ్లుగా వ్యవసాయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలితమివ్వడం మొదలుపెట్టాయి. ఇంటికి వాడుకోగా, మిగిలిన వాటిని అవసరమైనవారికి ఇస్తూ వస్తున్నాను’ అందామె. మరవని సేవ.. ‘విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్య సేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. ఊళ్లోనే వైద్య అవసరాలలో ఉన్నవారిని గమనించి, అవగాహన కల్పిస్తుంటాను. పొలంలో పండిన కూరగాయలు, పండ్లు రోడ్డు మీద ఓ వైపుగా పెట్టేస్తాను. అవసరమైన వాళ్లు ఆగి తీసుకెళుతుంటారు. కొందరు డబ్బిచ్చి తీసుకెళుతుంటారు. వీటితోపాటు ఈ మధ్య రెండు ఆవులతో పశు పోషణ కూడా మొదలుపెట్టాను. మట్టి పనిలో సంతోషాన్ని, నలుగురికి మేలు చేయడంలో సంతృప్తిని పొందుతున్నాను. పనిలో ఉంటే మనసూ బాగుంటుంది. ఆ పనిని నలుగురు మెచ్చుకుంటే మరింత ఉత్సాహం వస్తుంది. మలివయసులో నలుగురికి మేలు చేసే పనులను ఎంచుకుంటే జీవితంలో ఏ చీకూ చింత లేకుండా గడిచిపోతుందని నా జీవితమే నాకు నేర్పించింది’ అని వివరించింది అనంతలక్ష్మి. విశ్రాంత జీవనం వచ్చింది కదా అని చేసిన పనిని మర్చిపోలేం. అలాగే గ్రామాలవాళ్లు కూడా మర్చిపోరు. వారికి అవసరమైన వైద్యసేవలు అడుగుతూ ఉంటారు. నాకు అందరూ తెలుసు కాబట్టి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటుంటాను. వైద్యపరమైన ఏ చిన్న అవసరం వచ్చినా ముందుంటాను. – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
పుస్తకమే కాదు పొలము కూడా వారికి పాఠాలు చెబుతుంది!
పాదాలకు అంటుకున్న మట్టి అక్కడ పాఠాలు చెబుతుంది. అరచేతికి పూసుకున్న బురద అక్షరమై వికసిస్తుంది. పుస్తకమే కాదు పొలము, హలము కూడా వారికి చదువు చెబుతుంది. పిల్లలంతా పట్టభద్రులై వ్యవసాయానికి దూరమైపోతున్న కాలంలో.. విద్యార్థి నికార్సయిన రైతుగా మారే అపురూప అవకాశం ఆ కోర్సు కల్పిస్తుంది. మట్టికి మనిషికి ఉన్న బాంధవ్యాన్ని అపూర్వ రీతిలో వివరిస్తుంది. సిలబస్, పరీక్షలతో పాటు పంట, మార్కెటింగ్‌లు కూడా ప్రత్యక్షంగా నేర్పుతుంది. ఆ చదువు ఎలా ‘సాగు’తుందంటే..? శ్రీకాకుళం రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ కళాశాల శ్రీకాకుళం జిల్లా నైరాలో విద్యార్థులు అన్నదాతలుగా మారుతున్నారు. పట్టాలు పొందే నాటికి మట్టిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈఎల్పీ అనే ప్రొగ్రాంను అనుసరిస్తున్నారు. ఈఎల్పీ అంటే ఎక్స్‌పీరియన్సల్ లెర్నింగ్ ప్రొగ్రాం. అనుభవం ద్వారా నైపుణ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్ ఇయర్ విద్యార్థులు పంటలు పండిస్తున్నారు. దీనికి కావాల్సిన పెట్టుబడిని కాలేజీ యాజమాన్యమే అందిస్తుంది. ఇందులో రాబడి తీసుకురాగలిగితే 75 శాతం విద్యార్థులే తీసుకోవచ్చు. మిగిలిన డబ్బు ప్రాజెక్టు, గైడ్‌కు వెళ్తుంది. పంటలే కాదు వర్మీకంపోస్ట్, వర్మీటెక్, విత్తనోత్పత్తి, కూరగాయల పెంపకం, జీవ శిలీంద్రాలు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు పూలు, పుచ్చకాయలు యూనిట్లు నెలకొల్పి వాటిని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఈ కాలేజీలో పండించిన పంటలను దగ్గరలో గల పరిశోధన కేంద్రాలకు, రైతులకు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నారు. ప్రధానంగా వర్మీకంపోస్ట్, వర్మీటెక్ యూనిట్ల ద్వారా జీవన ఎరువులను తయారు చేసి రైతులకు, వినియోగదారులకు తక్కువ ధరకే ఈ కళాశాల నుంచి విక్రయిస్తున్నారు. వర్మీ కంపోస్టు.. ఎండిన ఆకులు, ఎండిన గడ్డి, కూరగాయల చెత్త, పశువుల గెత్తంతో దీన్ని తయారు చేస్తారు. దీన్ని కాలేజీ విద్యార్థులు తయారు చేసి కిలో రూ.12 చొప్పున అమ్ముతున్నారు. ఇందులో రెండో రకం వర్మీ వాస్ కూడా ఉంది. వానపాములు విడుదల చేసే సిలోమిక్ ఫ్లూయిడ్‌ను వర్మీవాస్గా వాడుతుంటారు. లీటర్ బాటిల్ రూ.100 చొప్పున విక్రయిస్తారు. పుట్టగొడుగులు.. పుట్టగొడుగు తయారీ, సంరక్షణ, ఎరువుతో పాటు మార్కెటింగ్‌పై కూడా విద్యార్థులకు క్షణ్ణంగా వివరిస్తున్నారు. ఈ విధానాల ద్వారా విద్యార్థులు సొంతంగా పుట్టగొడుగు సాగు చేసి మార్కెట్‌కు కేజీ రూ.220 చొప్పున అమ్ముతున్నారు. పుచ్చకాయలు.. నైరా కాలేజీలో 60 సెంట్లు విస్తీర్ణంలో పుచ్చకాయలు, 10 సెంట్లు విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలను విద్యార్థులు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చినప్పుడు విద్యార్థులు స్వయంగా రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముతుంటారు. పుచ్చకాయలకైతే పెట్టుబడి రూ.20వేలు పెడితే లాభం రూ.80వేలకు పైగా వస్తోంది. వీటిని కూడా విద్యార్థులే రోడ్డుకు ఇరువైపులా నించుని విక్రయిస్తున్నారు. విత్తనాలు కూడా.. ఇక్కడి విద్యార్థులు పంటలే కాదు నువ్వులు, పెసలు, ఉలవలు, రాగులు, కందులు, వరి విత్తనాలను తయారు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. విత్తనాలను కృషి విజ్ఞాన కేంద్రాలకు, రైతు భరోసా కేంద్రాలకు, రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తారు. కిలో రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.200 వరకూ అమ్ముతారు. పెట్టుబడి ఇస్తాం.. రకరకాల పంటలు పండించేందుకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యం కేవలం పెట్టుబడి మాత్రమే అందిస్తుంది. పండిన పంటలో 75 శాతం విద్యార్థులే తీసుకుంటారు. ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఆరు నెలలు ఇలా శిక్షణ ఉంటుంది. – సురేష్‌కుమార్, అసోసియేట్ డీన్, నైరా రైతులతో మమేకం అగ్రి బీఎస్సీ నాలుగేళ్ల కోర్సు. ఆఖరి ఏడాది ఆరు నెలల్లో మేము రైతులతో మమేకమవుతాం. పండించిన పంటను అమ్ముతాం కూడా. గ్రామాల్లో తిరిగి రైతులతో మమేకమవుతూ కొత్త పద్ధతులు కూడా నేర్పుతున్నారు. – మహమ్మద్ అబ్దుల్ రఫీ, అగ్రి బీఎస్సీ ఫైనల్ ఇయర్ -
వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయల సాగు.. లక్షల్లో ఆదాయం
వరి నాటేసేటప్పుడు కూలీల కొరత.. పాలుపోసుకునే దశలో చీడపీడల బెడద.. కోసేటప్పుడు హార్వెస్టర్ చార్జీల మోత.. చేతికందే సమయంలో అకాల వర్షాలు.. అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాల్లో అష్టకష్టాలు.. ఇకపై యాసంగిలో ధాన్యం కొనబోమని తేల్చి చెబుతున్న ప్రభుత్వాలు.. ఈ పరిస్థితులను అధిగమించేందుకు వరి సాగు చేస్తున్న పలువురు రైతులు ఇప్పటికే లాభాలనిచ్చే ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లడమే కాకుండా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉండడంతో అమ్మడం కూడా సులభంగా ఉంటోంది. ఉమ్మడి జిల్లాలో కూరగాయల పంటలతో లాభాలు ఆర్జిస్తున్న రైతుల విజయగాథపై ప్రత్యేక కథనం.. ఆలు సాగుతో ఆదర్శంగా.. ఆలుగడ్డ పంట సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సల్లోల్ల నారాయణరెడ్డి. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండలం కుప్పనగర్‌కు చెందిన ఈ రైతు తనకున్న మూడు ఎకరాలతో పాటు, మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మొత్తం తొమ్మిది ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. 3నెలల్లో పంట చేతికి.. ఏటా దసరా పండగకు కాస్త అటూఇటుగా రైతులు ఆలుగడ్డ పంట వేసుకుంటారు. ప్రస్తుతం ఈ పంట పూత దశలో ఉంది. మూడు నెలల్లో ఈ పంట పూర్తిస్థాయిలో చేతికందుతుంది. కొందరు రైతులు 65 నుంచి 70 రోజుల్లోనే తవ్వుకుంటారు. మూడు నెలల వరకు ఆగితే ఎక్కువ దిగుబడి వస్తుంది. ఏటా జనవరిలో ఆలుగడ్డ తవ్వకాలు ప్రారంభమవుతాయి. బోయిన్పల్లి మార్కెట్లో విక్రయం రైతులు ఎక్కువగా ఈ పంటను హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తారు. బోయిన్పల్లి మార్కెట్లో విక్రయిస్తుంటారు. హోల్‌సేల్ మార్కెట్లో ఆలుగడ్డకు క్వింటాల్‌కు కనీసం రూ.వెయ్యి నుంచి రూ.1,500 వరకు ధర ఉంటుంది. ప్రస్తుతం ఆలుగడ్డకు రూ.రెండు వేల వరకు ధర పలుకుతోంది. మార్కెట్లో ధర బాగుంటే సాగు వ్యయం పోగా, ఎకరానికి సగటున రూ.40 వేల వరకు చేతికందుతుందని రైతులు పేర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో సుమారు 3,200 ఎకరాల్లో ఆలుగడ్డ పంట సాగవుతోందని ఉద్యానవన శాఖాధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా సాగు చేస్తున్నా వరితో లాభంలేదని చెరకు వేసిన.. అడవిపందుల బెడదతో అదీ మానుకున్నా.. నాలుగేళ్లుగా ఆలుగడ్డ సాగుచేస్తున్నా. మార్కెట్లో రేటు బాగుంటే లాభాలు మంచిగుంటయి. గతేడాది ఆలుగడ్డ ధర కొంత తక్కువగా ఉండే. అంతకు ముందు మంచి ధర వచ్చింది. – సల్లోల్ల నారాయణరెడ్డి, ఆలుగడ్డ రైతు గెర్కిన్.. కాసుల పంట గెర్కిన్ పంట సాగు కాసుల వర్షం కురిపిస్తోంది. దోసకాయల మాదిరిగా ఉండే ఈ పంట.. మనకు కొత్త. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఇప్పగూడెనికి చెందిన రైతు కె.యాదవరెడ్డి ఈ పంట సాగుచేస్తూ లాభాలను గడిస్తున్నారు. అంతకుముందు వరి, ఇతర పంటలు వేసిన ఆయన అప్పుల పాలై.. వ్యవసాయ శాఖ ప్రోత్సాహంతో 1.2 ఎకరాల్లో గెర్కిన్ పంట వేశారు. వ్యవసాయ శాఖ గ్లోబల్ గ్రీన్ కంపెనీ సహకారంతో గెర్కిన్ విత్తనాలను ఇప్పించింది. గెర్కిన్ కాయలు పంట కాలం 75 రోజులు. పంట కాలం ముగిసే నాటికి 23 కోతలతో కాయలను తెంచాల్సి ఉంటుంది. గ్లోబల్ గ్రీన్ కంపెనీ వారే నేరుగా రైతుల దగ్గరి నుంచి కోనుగోలుచేసి వారికి డబ్బులను బ్యాంక్ ఖాతాలో జమచేస్తున్నారు. యాదవరెడ్డి మొత్తం 1.2 ఎకరాల విస్తీర్ణంలో వేసిన గెర్కిన్ కాయలను విక్రయించగా రూ.2,33,926 వచ్చాయి. పంట ప్రారంభం నుంచి కోసే వరకు పెట్టుబడి రూ.85,500 వరకు అయ్యింది. రైతుకు ఖర్చులన్నీ పోను రూ.1,48,426 నికర ఆదాయం వచ్చింది. ఈ పంటను యాసంగిలో సాగు చేసు కోవచ్చని అధికారులు చెబుతున్నారు. గెర్కిన్ కాయలు చూసేందుకు కీరాదోసకాయల్లా ఉంటాయి. వీటిని ఇతర దేశాల్లో స్నాక్స్‌గా అధికంగా వినియోగిస్తుం డడంతో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం మనదగ్గర ఇవి వినియోగంలో లేవు. లాభాలు కురిపిస్తున్న కూరగాయల సాగు కూరగాయల సాగు ఎప్పుడూ లాభదాయకమే. అందులోనూ ఆధునిక పద్ధతిలో సాగు చేస్తే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మమ్మద్నగర్కు చెందిన మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి అన్నదమ్ములు.. తమకున్న ఐదెకరాలతో పాటు మరో 13 ఎకరాలు కౌలుకు తీసుకుని గతంలో వరి సాగుచేసే వారు. పంట చేతికొచ్చేదంతా దైవాధీనంగా మారడంతో 18 ఎకరాల్లో బీర, కాకర, టమాట పంటల సాగు ప్రారంభించారు. పదెకరాల్లో బీర సాగును పందిరి, డ్రిప్, మల్చింగ్ పద్ధతిలో సాగుచేస్తున్నారు. పందిరి ఒకసారి ఏర్పాటుచేస్తే 20 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. అలాగే కాకర పంటను 4 ఎకరాల్లో సాగు చేశారు. మరో 4 ఎకరాలలో 15 రోజుల క్రితమే టమాట వేశారు. బీర, కాకర సాగు ఖర్చులు ►బీర సాగుకు ఎకరాకు రూ.లక్ష ఖర్చు ఉంటుంది. ►నాలుగు నెలల్లో బీర ఎకరాకు 20 నుంచి 22 టన్నుల దిగుబడి వస్తుంది. ►మార్కెట్లో హాల్‌సేల్ ధర కిలోకు ప్రస్తుతం రూ.25 నుంచి రూ.30 పలుకుతోంది. దీంతో ఎకరాకు రూ. 4 లక్షల ఆదాయం వస్తోంది. ►పెట్టుబడి రూ.లక్ష పోను ఎకరంలో నాలుగు నెలల కాలంలో రూ.3 లక్షల ఆదాయం మిగులుతుందని చెబుతున్నారు. ►ఇక కాకరకు ఎకరానికి పెట్టుబడి రూ. 50 వేలు ఖర్చు కాగా పెట్టుబడిపోను రూ.60వేల నుంచి 70 వేలు మిగులుతుంది. ఏడాదికి 3 పంటలు వస్తాయి. -
దిగుబడి బాగున్నా.. దిగిరాని ధరలు
కడప అగ్రికల్చర్: కూరగాయల దిగుబడులు బాగున్నా ధరలు దిగిరావడం లేదు. చిన్న హోటళ్ల వారు ఈ ధరలను చూసి కూరలను తయారు చేయడం తగ్గించారు. పచ్చళ్లను వండి పార్శిల్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు కిలో రూ.10–15లోపే ఉన్న కూరగాయల ధరలు రూ.30 నుంచి 60కి ఎగబాకాయి. దీంతో వినియోగదారులు వాపోతున్నారు. జిల్లాలో పంటల సాగు పెరిగినా ధరలు మాత్రం తగ్గడం లేదని వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రంలో కాస్త తక్కువగా ఉన్నా ఇతర ప్రాంతాల్లో మాత్రం అధికంగా ఉంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రల్లో వరదల కారణంగా పంట దెబ్బతినడంతో అక్కడికి కూరగాయలను తరలిస్తుండడంతో మార్కెట్ కొరత కారణంగా తగ్గుతున్నాయని వ్యాపారులు సమర్ధించుకుంటున్నారు. పంటల సాగు పెరిగినా ధరలు ఎందుకు తగ్గడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. కిలో రూ.10–15 ఉన్న టమాట ధర కూడా రూ.30లకు చేరింది. మార్కెట్లో వ్యాపారులు దళారుల మాయాజాలం...: జిల్లాలో రోజుకు 5 నుంచి 6 టన్నుల కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని ఉద్యానశాఖ అధికారుల అంచనా. మార్కెట్లో కొరతను సాకుగా చూపుతూ ధరలు పెంచి వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రవాణా, ఇతర ఖర్చులు పోయినా ధరలు బాగా ఉండడంతో అక్కడికి తరలించడంతో ఆదాయం ఉంటోందని వ్యాపారులు అంటున్నారు. కూరగాయల సాగు విస్తీర్ణం హెక్టార్లలో : 4,000 జిల్లాకు అవసరమైన కూరగాయలు : 10.80 టన్నులు ప్రస్తుతం వినియోగిస్తున్నవి : 6 టన్నులు జిల్లాలో కొరత : 5 టన్నులు -
కొరత లేకుండా కూరగాయలు
సాక్షి, అమరావతి: కూరగాయల కొరత రాకుండా ఉద్యాన శాఖ.. వేసవి సాగు (ముందస్తు ఖరీఫ్) ప్రణాళికను ఖరారు చేసింది. ఇప్పటి నుంచే కూరగాయల సాగును చేపడితే ఆగస్టు నుంచి ఎటువంటి కొరత ఉండబోదని రైతులకు సూచించింది. ఇదే సమయంలో రైతులకు ఏయే రాయితీలు ఇవ్వచ్చో ప్రణాళిక సిద్ధం చేసింది. ఉద్యాన శాఖ అంచనా ప్రకారం.. రాష్ట్రంలో 2,50,689 హెక్టార్లలో ఏడాది పొడవునా ఆకు కూరలు కాకుండా సుమారు 22 రకాల కూరగాయలు సాగవుతాయి. 77,71,620 టన్నుల ఉత్పత్తి వస్తుంది. ఈ సీజన్ (మార్చి నుంచి జూలై వరకు)లో 8,21,650 టన్నుల ఉత్పత్తి వస్తుందని అంచనా కాగా అందులో ఇప్పటికే 3,75,461 టన్నులు అమ్ముడ య్యాయి. జూలై చివరిలోగా మిగతా 4,46,189 టన్నులు వస్తాయి. ఉత్పత్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగానే జూలై నుంచి కూరగాయల ధరలు పెరుగు తాయి. ఆగస్టు నుంచి కూరగాయల కొరత లేకుండా చూ డాలంటే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సాగు చేపట్టాలి. రైతులకు ఉద్యాన శాఖ సూచనలు ► నీటి వసతి, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ ఉన్న రైతులు తీగజాతి కూరగా యల సాగును తక్షణమే చేపట్టాలి. ► ప్రస్తుత అంచనా ప్రకారం.. సుమారు 36 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపా రుదల వ్యవస్థ ఉంది. మల్చింగ్ (మొక్కల చుట్టూ ప్లాస్టిక్ లేదా పాలిథీన్ కవర్లతో కప్పిఉంచడాన్ని మల్చింగ్ అంటారు) పద్ధతిన కూరల సాగును చేపడితే మంచి లాభాలూ పొందొచ్చు. ► నీటి వసతి ఉన్న రైతులు తమ పొలాల్లో బెండ, వంగ, దోస జాతి కూరలు, బీర, సొర, చిక్కుడు, కాకర, ఆకుకూరల్ని ప్రణాళికా బద్ధంగా సాగు చేయాలి. ► తాత్కాలిక పందిళ్లతో కూరగాయల్ని సాగు చేసే రైతులు ప్రస్తుతం చిక్కుడు, పొట్ల వేయాలి. ► పర్మినెంట్ పందిళ్లు ఉండే రైతులు దొండ, బీర, కాకర, సొర, ఇతర తీగ జాతి కూరగాయల్ని సాగు చేయాలి. ► కాగా, ఇప్పటికే ఉత్తరాంధ్ర, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని వేల హెక్టార్లలో కూరగాయల సాగు చేపట్టారు. ► హైబ్రీడ్ కూరగాయల్ని సాగు చేసే రైతులకు ఉద్యాన శాఖ రాయితీ ఇస్తుంది. ► రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కేవీవై) కింద 50 శాతం సబ్సిడీతో కూరగాయల విత్తనాలను పంపిణీ చేస్తారు. ► పాలీ హౌసులు, షేడ్ నెట్స్ ఉన్న రైతులకు నాణ్యమైన మొక్కలను సరఫరా చేస్తారు. కరోనాతో విపత్కర పరిస్థితులు ఉండటం వల్ల ఉచితంగా మొక్కలు ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. దీనిపై ఉద్యాన శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ► పర్మినెంట్ పందిళ్లు ఉన్న రైతులకు 50 శాతం సబ్సిడీపై కాకర, బీర, సొర లాంటి కూర జాతి విత్తనాలను సరఫరా చేయాల్సి ఉంది. ► రైతు భరోసా కేంద్రాల వద్ద కూరగాయల విత్తనాలను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ► ఆర్కేవీవై కింద ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాల్సిందిగా ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌధురి ప్రభుత్వానికి నివేదించారు. ► రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రైతులకు అవగాహన కల్పిస్తూ అధిక ఆదా యం వచ్చే పంటల్ని సాగు చేయించాలి. -
16న సేంద్రియ కూరగాయల సాగుపై శిక్షణ
సేంద్రియ వ్యవసాయ విధానంలో కూరగాయలు, ఆకుకూరల సాగుపై ఫిబ్రవరి 16 (ఆదివారం)న గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ డా. వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజాకృష్ణారెడ్డి, సేంద్రియ రైతు శివనాగమల్లేశ్వరరావు(గుంటూరు జిల్లా) ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255 సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై 5 రోజుల శిక్షణ సుస్థిర వ్యవసాయ కేంద్రం(సి.ఎస్.ఎ.), గ్రామీణ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సేంద్రియ ఆహారోత్పత్తుల వ్యాపార నిబంధనలపై ఫిబ్రవరి 17 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు సి.ఎస్.ఎ. ఈడీ డా. జీవీ రామాంజనేయులు తెలిపారు. వివరాలకు: 85006 83300 -
రోజూ రాబడే!
రైతుకు ప్రతి రోజూ ఆదాయాన్నిచ్చే పంటలు కూరగాయలు. ప్రణాళికాబద్ధంగా దఫ దఫాలుగా వివిధ రకాల కూరగాయ పంటలను విత్తుకుంటూ ఉంటే.. ఏడాది పొడవునా, అన్ని సీజన్లలోనూ, ప్రతి రోజూ అనేక రకాల కూరగాయలు చేతికి అందివస్తాయి. రైతు కుటుంబం తినవచ్చు, అమ్ముకొని ఆదాయమూ పొందవచ్చు. అయితే, రైతుకు ఇందుకు కావల్సింది ఖచ్చితమైన ప్రణాళిక, తగిన నీటి వసతి. ఈ రెంటికీ క్రమశిక్షణ తోడైతే ఇక అరెకరం ఎర్ర నేల ఉన్న చిన్న రైతు కూడా నిశ్చింతగా రోజువారీగా ఆదాయం పొందవచ్చు. సేంద్రియ ఉత్పత్తుల వల్ల ఒనగూడే ఆరోగ్య ప్రయోజనాలపై నగర, పట్టణ వాసుల్లోనే కాదు గ్రామీణుల్లోనూ అవగాహన అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో రసాయనాలు దరిచేరనివ్వని రైతుల ఆదాయానికి ఢోకా ఉండబోదు. సేంద్రియ సేద్యంలో 15 ఏళ్ల అనుభవం గడించిన సుస్థిర వ్యవసాయ కేంద్రం (సి.ఎస్.ఎ.) నిపుణులు ‘నిరంతర సేంద్రియ కూరగాయల సాగు’పై అందించిన సమాచారం.. ‘సాగుబడి’ పాఠకుల కోసం! కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఆ పంట నుంచి తగిన ఆదాయం పొందాలంటే పంటను బట్టి విత్తిన/నాటిన దగ్గర నుంచి ఒక నెల నుంచి 4–5 నెలలు పడుతుంది. ఈ లోగా దానికి కావలసిన పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సి వస్తున్నది. రైతులు సంవత్సరం పొడవునా ప్రణాళిక ప్రకారం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకుంటే రోజువారీగా ఆదాయం అందుతుంది. అంతేకాకుండా, పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. పైగా, తినటానికి కూరగాయలను వెతుక్కోవలసిన/ కొనుక్కోవాల్సిన అవసరమూ ఉండదు. ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా, ఇంకే విధమైన నష్టం జరిగినా, ఒకటి రెండు పంట రకాలను నష్టపోయినా, మిగతా వాటి నుంచి ఎంతో కొంత ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాక పురుగుమందుల విషాలు లేని ఆరోగ్యదాయకమైన సేంద్రియ తాజా కూరగాయలను గ్రామస్థాయిలోనే వినియోగదారులకు అనుదినం అందుబాటులో ఉంచవచ్చు. అర ఎకరం ఎర్ర భూమిలో నీటి వసతి, పందిరి కలిగి ఉండి, ఆసక్తి కలిగిన రైతులు శిక్షణ పొంది సంవత్సరం పొడవునా సేంద్రియ పద్ధతిలో నిరంతర కూరగాయల సాగు ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయవచ్చు. సంవత్సరం పొడవునా కూరగాయల సాగు ప్రయోజనాలు: ► కూరగాయలను గ్రామస్థాయిలో ప్రతిరోజూ అమ్మకానికి అందుబాటులో ఉంచగలగడం. ► రైతుకు ప్రతి రోజూ ఆదాయం పొందగలగడం. ► అధిక ఉత్పత్తితోపాటు మంచి నాణ్యమైన సేంద్రియ కూరగాయలను సాగు చేయటం. ► పురుగులు, తెగుళ్ల ఉధృతిని సేంద్రియ పద్ధతుల్లో అదుపులో ఉంచగలగటం. ► పంట ఉత్పత్తిలో, మార్కెటింగ్‌లో కష్టనష్టాలను తగ్గించడం. ఉన్న అరెకరంలో ఒకేరకమైన పంట పండించడం వల్ల సాగు, మార్కెటింగ్‌లోనూ సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఒక సీజన్లో అధిక ధర పలికిన పంటకు తర్వాత సీజన్లో అతి తక్కువ ధర పలికే పరిస్థితి వస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే.. అనేక రకాల కూరగాయలను, అన్ని సీజన్లలోనూ దఫాల వారీగా విత్తుకుంటూ/నాటుకుంటూ ఏడాది పొడవునా కూరగాయల దిగుబడి వచ్చేలా చూసుకోవడమే ఉత్తమం. నేల తయారీ ► అనుకూలంగా ఉన్న సారవంతమైన భూమిని గుర్తించి, గుర్తులు పెట్టి, శుభ్రం చేసి ట్రాక్టర్‌తో గానీ, నాగలితో గానీ దున్నుకోవాలి. ► ఒక అడుగు లోతు వరకూ మట్టిని తవ్వి పూర్తిగా కలిసేలా కలియబెట్టాలి. ► అర ఎకరలో కూరగాయల సాగుకు బెడ్ల నిర్మాణం ► బెడ్ మేకర్‌తో మడులను తయారుచేసుకోవాలి. ► బెడ్ వెడల్పు 4 అడుగులు, ఎత్తు ఒక అడుగు ఉండాలి. రెండు బెడ్ల మధ్యలో 1.5 అడుగులు నడకదారిని ఏర్పాటు చేసుకోవాలి. ► 25 శాతం విస్తీర్ణంలో తీగ జాతి కూరగాయలు, 75% విస్తీర్ణంలో ఇతర కూరగాయలు పండించుకునే విధంగా సిద్ధం చేసుకోవాలి. ► స్థలం పొడవు, వెడల్పును బట్టి మడుల పొడవు నిర్ణయమవుతుంది. ► పొలం చుట్టూ 3 వరుసల సరిహద్దు పంటలుగా జొన్న లేదా సజ్జలను విత్తుకోవచ్చు. ఫలితంగా ఇరుగుపొరుగు పొలాలనుంచి రసం పీల్చే పురుగుల రాకను అడ్డుకోవచ్చు. ► మునగ, కూర అరటి, కరివేపాకు మొక్కలను వేసుకుంటే బహువార్షిక కూరగాయ పంటలను కూడా పండించి, అమ్ముకోవచ్చు. వీటి మధ్య 9 అడుగుల దూరం పాటించాలి. ► జామ, నిమ్మ, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను(దూరం 18 అడుగులు) నాటుకోవాలి. మడి తయారు చేసుకోవడానికి కావలసిన వస్తువులు అర ఎకరంలో కూరగాయలు సాగు చేయడానికి దాదాపుగా 2 టన్నుల పశువుల పేడ లేదా వర్మీకంపోస్టు లేదా గొర్రెల ఎరువు మొదలైనవి దుక్కిలో వేసి కలియదున్నుకోవాలి. జీవన ఎరువుల(ట్రైకోడర్మా విరిడి, పి.ఎస్.బి., సూడో మోనాస్)ను అర ఎకరానికి ఒక కేజీ చొప్పున 50 కేజీల పశువుల పేడ కలిపి చల్లడం ద్వారా తెగుళ్లను అరికట్టవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి 100 లీటర్ల జీవామృతం లేదా అమృత జలం పిచికారీ చేయాలి. సూటి రకాల విత్తనాలు మేలు సూటిరకాల కూరగాయ విత్తనాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాల దగ్గర, సికింద్రాబాద్‌లో తార్నాకలోని సహజ ఆహారం ఆర్గానిక్ స్టోర్స్(85007 83300)లో లభిస్తాయి. సూటి రకాలు తెగుళ్లు, చీడపీడల బెడదను తట్టుకుంటాయి. విత్తనాలు, మొక్కలు నాటడంలో మెలకువలు బెండ, చిక్కుడు, గోరు చిక్కుడు పంటలను నేరుగా విత్తుకోవాలి. ఆకుకూర విత్తనాలను ఇసుకలో కలిపి వెదజల్లుకోవాలి. టమాటో, వంగ, మిరప పంటల విత్తనాలతో నారు పెంచుకొని నాటుకోవాలి. సాగునీటిని పొదుపుగా వాడుకోవాలి. డ్రిప్ ద్వారా లేదా స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందించాలి. రైతులు తమ గ్రామంలో ఏయే రకాల కూరగాయలకు డిమాండ్ ఉంటుందో తెలుసుకొని ఆ రకాలను ఎంపిక చేసుకోవాలి. ఒక మడిలో ఒక పంట పూర్తయిన తర్వాత మళ్లీ అదే పంట వేయకూడదు. పంట మార్పిడి తప్పనిసరి. కూరగాయ మొక్కలను ఆశించే పురుగులు, తెగుళ్లు– నివారణ కూరగాయల సాగులో ముఖ్యంగా రసంపీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు, తెగుళ్లు ఆశిస్తాయి. వీటి నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పురుగులు, తెగుళ్లు సమస్యను గమనించిన వెంటనే తగు చర్యలు చేపట్టడం ద్వారా నష్ట తీవ్రతను తగ్గించవచ్చు. రసం పీల్చే పురుగులు: రసం పీల్చే పురుగులు మొక్క లేత భాగాల నుంచి రసం పీల్చుతాయి. ఇవి సోకితే ఆకులు పసుపు రంగుకు మారి ఆకు ముడత ఏర్పడుతుంది. ఆకులు వాడిపోతాయి. పచ్చదోమ, పేనుబంక, తెల్లదోమ మొదలైనవి ఆశించిన వెంటనే 50 లీటర్ల నీటిలో 2.5 కిలోల వేప పిండితో చేసిన కషాయం పిచికారీ చేసుకోవాలి. పసుపు, తెలుపు, నీలం రంగు జిగురు పూసిన పళ్లాలను అమర్చుకోవాలి. వేరు, కాండం కుళ్లు తెగులు నివారణకు 50 కిలోల వేపపిండిని ఒక కిలో ట్రైకోడర్మా విరిడిని, 50 కిలోల పశువుల పేడను కలుపుకొని చల్లుకోవాలి. ఆకులు తినే పురుగులు ఆకులు తినే పురుగుల వల్ల కూరగాయ మొక్కల ఆకులు, కాయలపై రంధ్రాలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకుల ఈనెలు మాత్రమే మిగులుతాయి. ఆకుమచ్చ తెగులు నివారణకు 5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల పశువుల మూత్రం, 5 లీటర్ల నీటిని కలిపి 5 రోజుల పాటు మురగబెట్టిన తరువాత 6వ రోజు 250 గ్రాముల ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. కాయ తొలిచే, మొవ్వు తొలిచే పురుగులను అరికట్టడం కోసం లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. శనగపచ్చ పురుగు నుంచి రక్షణకు పసుపు రంగు గల బంతిని ఎర పంటగా వేసుకోవాలి. కాండం కుళ్లు తెగులు: కాండం కుళ్లు తెగులు సోకితే మొక్కలు మొదళ్లలో కుళ్లి, ఒరిగిపోయి చనిపోతాయి. మొక్కలు నాటే ముందే వేప పిండిని మట్టిలో కలిపి ఆ తర్వాత మొక్కలను నాటుకుంటే ఈ తెగులు రాదు. ఆకులపై మచ్చలు, నివారణ: ఆకులపై మచ్చల తెగులు నివారణకు వేపకషాయం పిచికారీ చేయాలి. ఆకులపై బూడిదలా ఏర్పడటం (బూడిద తెగులు): బూడిద తెగులు నివారణకు 5 లీటర్ల పశువుల మూత్రం, 200 గ్రాముల ఇంగువ లేదా 5 శాతం మజ్జిగ పిచికారీ చేసుకోవాలి. గ్రామంలో రైతుకు ఉన్న అవకాశాలను బట్టి షాపు /రిక్షా/తోపుడు బండి/ ఎలక్ట్రిక్ ఆటో ఏర్పాటు చేసుకొని కూరగాయలను విక్రయించుకోవచ్చు. (సేంద్రియ సేద్యంపై సందేహాల నివృత్తికి సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్తలను 85007 83300 నంబరులో సంప్రదించవచ్చు) ఏయే కూరగాయలను ఎన్ని రోజుల వ్యవధిలో విత్తుకోవాలి? ► రెండు నుంచి మూడు రకాల ఆకుకూరలను వారానికి ఒకసారి విత్తుకోవాలి. ► టమాటో, వంగ లాంటివి రెండు నెలలకు ఒకసారి విత్తుకోవాలి. ► చిక్కుడు సీజన్లో ఒకటి లేదా రెండుసార్లు విత్తుకుంటే సరిపోతుంది. ► బీట్రూట్, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ రబీలో ఒకసారి మాత్రమే విత్తుకోవాలి. ► మిరప,బెండ మొదటసారి విత్తిన బెడ్ పూతకు రాగానే మరో బెడ్లో నాటుకోవాలి. సేంద్రియ కూరగాయల సాగుపై జనగామలో 5 రోజుల శిక్షణ అరెకరంలో సేంద్రియ కూరగాయలను ఏడాది పొడవునా సాగు చేస్తూ ప్రతి రోజూ ఆదాయం పొందే పద్ధతులను నేర్చుకొని, ఇతరులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రగాఢమైన ఆసక్తి కలిగిన వారికి సుస్థిర వ్యవసాయ కేంద్రం జనగామలోని తన రైతు శిక్షణా కేంద్రంలో 5 రోజుల పాటు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. వివరాలకు.. డా. జి. రాజశేఖర్ –83329 45368 -
ఒకటికి పది పంటలు!
ప్రతాప్ వృత్తిరీత్యా న్యాయవాది. రసాయన ఎరువులతో పండించిన పంట తినడం వల్ల మానవాళి మనుగడకు ఏర్పడుతున్న ముప్పును గుర్తించారు. అందుకే సేంద్రియ సాగును తన ప్రవృత్తిగా ఎంచుకున్నారు. ప్రతాప్ ప్రకృతి వ్యవసాయం చేస్తూ విషతుల్యమైన ఆహార పదార్థాల బారి నుంచి తన కుటుంబాన్ని, సమాజాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారు. తనకున్న పదెకరాల వ్యవసాయ క్షేత్రాన్ని పూర్తిగా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా తీర్చిదిద్దారు. మంచిర్యాల జిల్లా కేంద్ర శివారులోని హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో ఆయన క్షేత్రం ఉంది. వరి, మొక్కజొన్న, సజ్జలతోపాటు దాదాపు 50 రకాల పండ్ల మొక్కలు, పప్పుదినుసులు, కూరగాయలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ ప్రకృతివ్యవసాయ సూత్రాలు, ‘సాక్షి సాగుబడి’ కథనాల స్ఫూర్తితో గత ఏడేళ్లుగా పంటల సాగు చేస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ఎకరన్నర విస్తీర్ణంలో మామిడి బత్తాయి (మొసంబి), సంత్ర, సపోట, ఆపిల్ బెర్, దానిమ్మ, అంజీర, సీతాఫలం, జామ, అరటి, బొప్పాయి తదితర పండ్ల తోటలు... ఎకరన్నరలో చిరుధాన్యాలు... ఎకరన్నరలో వరి... ఎకరన్నరలో పప్పుదినుసులు... రెండు ఎకరాల్లో కూరగాయల పందిళ్లు... రెండు ఎకరాల్లో వాణిజ్య పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో.. పది ఎకరాల నల్లరేగడి భూమిలో పూర్తి సొంత వనరులతో తయారు చేసుకునే సహజ ఎరువులు వాడుతూ ప్రతాప్ వ్యవసాయం చేస్తున్నారు. రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదెను పెంచుతున్నారు. పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నారు. పచ్చిరొట్ట ఎరువులను వాడుతూ మంచి దిగుడులు సాధిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో మెళకువలను ఇతర రైతులకు తెలియజెప్పేందుకు ప్రతి జూన్ నెలలో రైతులకు తన సేంద్రియ క్షేత్రంలో ప్రదర్శన ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నారు. రసాయన ఎరువులతో ఇటు మనుషులకు తినే తిండిలో, అటు పండించే పంట భూమికి నష్టాలు వాటిల్లుతాయని విడమరుస్తున్నారు. కూరగాయల సాగులో దిగుబడి రెట్టింపు భూమిని పైపైన దున్ని మాగిన ఆవు పేడను వేస్తారు. ఎకరా పొలాన్ని మడులుగా విభిజించి, ఒక్కో మడిలో ఒక్కో రకం కూరగాయ పంటను సాగు చేస్తున్నారు. దేశవాళీ వంగడాలతో పాటు సంకర రకాలను సాగు చేస్తున్నారు. బీజామృతంతో విత్తన శుద్ధి చేస్తారు. రెండు వారాలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని నీటి ద్వారా అందిస్తారు. చీడపీడల నివారణకు కషాయాలు వాడుతున్నారు. పురుగును గుడ్డుదశలోనే నివారించేందుకు నీమాస్త్రం, వేప పిండి వాడుతున్నారు. అయినా పురుగు ఆశిస్తే అగ్ని అస్త్రం ద్రావణం పిచికారీ చేస్తారు. లద్దె పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు. 20 లీటర్ల కషాయాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేస్తున్నారు. వారానికి రెండు కోతలు తెగుతున్నాయి. కిలో రూ.20 నుంచి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారు. కూరగాయల సాగుకు ఎకరాకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుండగా, రూ. 60 నుంచి రూ. 70 వేల వరకు నికరాదాయం లభిస్తోంది. కూరగాయలు పండించిన చోట తర్వాత ఏడాది వరి పండిస్తున్నారు. వరి పండించిన చోట తర్వాత ఏడాది కూరగాయలు పండిస్తున్నారు. దీనివల్ల పంట దిగుబడులు బాగున్నాయని ప్రతాప్ చెబుతున్నారు. ప్రకృతి సేద్యం చేసిన తొలి నాళ్లతో పొల్చితే దిగుబడి రెండింతలైంది. అప్పట్లో కూరగాయలు వారానికో కోత తెగితే ఇప్పుడు రెండు కోతలు తెగుతున్నాయి. పూర్తి సొంతంగా తయారు చేసుకున్న ఎరువులతో సాగుచేయడంతో బియ్యం, పప్పుదినుసులు, కూరగాయలు, పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. సేంద్రియ పంటను మంచిర్యాలలో విక్రయిస్తున్నారు. కొంత మంది ఫోన్ ద్వారా సంప్రదించి సీజన్ల వారీగా కొనుగోలు చేస్తున్నారు. ఆదాయం అధికం.. ప్రతాప్ సాగు చేస్తున్న ఎకరం మామిడి తోటలో 60 చెట్లున్నాయి. 15ఏళ్లపాటు రసాయనిక సేద్యంలో ఉన్న తోటను ప్రకృతి సేద్యంలోకి మార్చారు. చెట్ల మధ్య ఎటు చూసినా 45 అడుగుల స్థలం ఉంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా లభిస్తుంది. తొలకరిలో చెట్టుకు ఐదులీటర్ల జీవామృతం పోస్తారు. 10 కిలోల ఆవుపేడ వేసి చెట్ల చుట్టూ దున్నుతున్నారు. పూతదశలో బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం పిచికారీ చేస్తారు. ఫిబ్రవరిలో పిందెదశలో, పురుగుదశలో మరోసారి పిచికారీ చేస్తారు. రసాయనిక సేద్యంలో వచ్చే దిగుబడిలో కంటే ఎక్కువగానే దీని ద్వారా దిగుబడి వస్తోంది. రసాయనిక ఎరువులు, పురుగుల మందులకు ఎకరాకు రూ. 20 వేల వరకు ఖర్చువుతుంది. ప్రకృతి సేద్యంలో రూ. 5 వేల నుంచి 8 వేలకు మించి ఉండదు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. చెట్లు బాగుంటే రసాయన సేద్యంలో కన్నా ప్రకృతి సేద్యంలో రెండురెట్లు అధికంగా దిగుబడి తీయవచ్చని ప్రతాప్ తెలిపారు. పాడికి దిగుల్లేదు.. ఎరువులూ కొనక్కర్లేదు! మా వ్యవసాయానికి రెండు ఆవులు, నాలుగు ఎద్దులు, ఒక గేదె పట్టుగొమ్మగా నిలుస్తున్నాయి. వీటికి పొలం నుంచే గడ్డి అందుతుంది. పాడికి దిగుల్లేదు. వీటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనాజీవామృతం, వర్మీ కంపోస్టు తయారు చేసి పంటలకు వేస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు కొనాల్సిన అవసరం లేకుండా పోయింది. రసాయన ఎరువుల పంటలతో భూ సారం దెబ్బతినడమే కాకుండా, ఆ పంటలు ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్నాయి. అందుకే ప్రకృతి సేద్యం చేస్తున్నా. నా క్షేత్రంలో జూన్‌లో రైతులకు శిక్షణ ఇస్తున్నా. జీవన ఎరువులు, పురుగుమందుల తయారీ లాబ్ పెట్టి రైతులకు స్వల్ప ధరకే ఇవ్వాలనుకుంటున్నా. ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి, మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే, రసాయనాల్లేని పంటలతో ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు. – కే వీ ప్రతాప్ (98499 89117), గుడిపేట, హాజీపూర్ మం., మంచిర్యాల జిల్లా నువ్వు చేను, పందిరి బీర తోట, వ్యవసాయ క్షేత్రంలో..ఆవుతో ప్రతాప్ –ఆది వెంకట రమణారావు, సాక్షి, మంచిర్యాల ఫొటో జర్నలిస్టు: Vð ల్లు నర్సయ్య -
చెరై.. ఆక్వాపోనిక్స్ గ్రామం!
కేరళలోని చెరై అనే తీరప్రాంత గ్రామం తొలి పూర్తి ఆక్వాపోనిక్ వ్యవసాయ గ్రామంగా మారిపోయింది. ఆ గ్రామంలోని ప్రతి ఇల్లూ సేంద్రియ కూరగాయలతోపాటు చేపలను కూడా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో సాగు చేసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం కొద్ది మంది ప్రారంభించిన ఆక్వాపోనిక్స్ సాగు తామర తంపరగా గ్రామం మొత్తానికీ పాకింది. పల్లిపురం సర్వీసు కో–ఆపరేటివ్ బ్యాంక్ (పి.ఎస్.సి.బి.) చొరవ తీసుకొని రసాయనాల్లేని ఆహారాన్ని ఎవరికి వారు పండించుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లను ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించింది. తొలుత కొద్ది మందితో ప్రారంభమైంది. ఒకర్ని చూసి మరొకరు ఇప్పుడు దాదాపు ఆ చిన్న ఊళ్లో ఉన్న 200 పైచిలుకు కుటుంబాలన్నీ చేపలు, కూరగాయలను రసాయనాల్లేకుండా పండించుకొని తింటున్నారు. ఆక్వాపోనిక్స్ అంటే? ఆక్వాకల్చర్+హైడ్రోపోనిక్స్ కలిస్తే ఆక్వాపోనిక్స్ అవుతుంది. చెరువులు, మడుల్లో చేపల పెంపకాన్ని ఆక్వాకల్చర్ అంటారు. మట్టితో సంబంధం లేకుండా నీటిలో కరిగే మినరల్ సప్లిమెంట్లతో టబ్‌లు, బక్కెట్లలో కూరగాయలు / పండ్ల మొక్కలు పెంచడాన్ని హైడ్రోపోనిక్స్ అంటారు. చేపలు పెరుగుతున్న టబ్‌లో నుంచి నీటిని కూరగాయలు, పండ్ల మొక్కలు పెరిగే కుండీలు, మడుల్లోకి నిరంతరం చిన్న విద్యుత్తు పంపు ద్వారా రీసర్క్యులేట్ చేస్తూ ఉంటారు. తవుడు, నూనె తీసిన వేరుశనగ / కొబ్బరి తెలగపిండిని చేపలకు ఆహారంగా వేస్తారు. మిగిలినపోయిన మేత, చేపల విసర్జితాలలోని పోషకాలతో కూడిన నీరు కూరగాయలు / పండ్ల మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గ్రోబాగ్స్, టబ్‌లు, కుండీల్లో రాతి చిప్స్‌ను పోసి వాటిలోనే కూరగాయలు, పండ్ల మొక్కలను నాటుతారు. ఈ టబ్‌లు, కుండీల పక్కనే ప్లాస్టిక్ షీట్లతో ఏర్పాటు చేసిన తొట్లలో చేపలు పెరుగుతూ ఉంటాయి. చేపల విసర్జితాలు మొక్కలకు ఆహారం అవుతుండగా.. మొక్కల వేళ్లు నీటిని శుద్ధి చేసి తిరిగి చేపలకు అందిస్తూ ఉండటం వల్ల పరస్పరాధారితంగా ఆక్వాపోనిక్స్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. నీటి వృథా లేకుండా, రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతుల్లో ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పెంచుకోవడానికి ఆక్వాపోనిక్స్ యూనిట్లు చెరై గ్రామ ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఖర్చు ఏడాదిలో తిరిగొస్తుంది! ‘మొదట్లో చాన్నాళ్లు బ్రతిమిలాడినా చాలా మంది రైతులు రుణం ఇస్తామన్నా ఆక్వాపోనిక్స్ యూనిట్లను తీసుకోలేదు. కొద్ది మందే తీసుకున్నారు. ఏర్పాటు చేసుకోవడానికి మొదట ఖర్చు బాగానే ఉంటుంది. అయితే, ఏడాదిలోనే ఆ ఖర్చు చేపలు, కూరగాయల రూపంలో తిరిగి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఒక్క గ్రామంలోనే 200 మందికిపై ఈ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు.’ అని కో–ఆపరేటివ్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు సత్యన మయ్యత్తిల్ అన్నారు. తొలిగా ఆక్వాపోనిక్స్ యూనిట్ పెట్టుకున్న రైతు శశిధరన్ చాలా సంతృప్తిగా ఉన్నారు. ‘14,000 లీటర్ల నీరు పట్టే చేపల ట్యాంకులో 1,500కు పైగా చేప పిల్లలను వేశాను. వందకు పైగా గ్రోబాగ్స్‌లో కూరగాయలు పెంచుకుంటున్నా. చేపలు, కూరగాయలు మా ఇంటిల్లపాదికీ సరిపోను అందుతున్నాయి..’ అన్నారాయన. రైతులే కాక దిలీప్ వంటి వ్యాపారులు, మాజీ అటవీ శాఖాధికారి కిషోర్ కుమార్ వంటి విశ్రాంత ఉద్యోగులు కూడా ఇళ్ల దగ్గర ఆక్వాపోనిక్స్ యూనిట్లు పెట్టుకున్నారు. అందువల్లనే చెరై గ్రామం సంపూర్ణ ఆక్వాపోనిక్స్ గ్రామంగా మారింది. నీటిని నిమిషం ఆగకుండా పంప్ చేయాల్సి ఉంటుంది. తక్కువ ఖర్చుతో నిరంతరాయంగా నీటిని రీసర్క్యులేట్ చేయడానికి సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కిషోర్ కుమార్ మిగతా వారికన్నా ఒక అడుగు ముందుకేయడం విశేషం. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) తోడ్పాటుతో పల్లిపురం సహకార బ్యాంకు తీసుకున్న చొరవే సేంద్రియ చేపలు, కూరగాయలను ఈ గ్రామస్తులందరూ పండించుకోగలుగుతున్నారు. ఏ విటమిన్ అధికంగా ఉండే ‘మోల’ / మెత్తళ్లు వంటి చిరు చేపలను ఈ పద్ధతుల్లో పెంచుకోవచ్చు. ఒక్కసారి పిల్లలను వేస్తే చాలు నిరంతరం తనంతట తానే సంతతిని పెంపొందించుకునే లక్షణం కలిగి ఉండటం ఈ చిరు చేపల ప్రత్యేకత. మనం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయలేమా? ఇంటిపట్టునే చేపలు, కూరగాయలు పండించుకుంటున్న మహిళ -
ఇంటి మీద 24 కూరగాయల పంట!
ఆ ఇంటి డాబాపైన 1,800 చదరపు అడుగుల వైశాల్యంలో 24 రకాల కూరగాయ మొక్కలు, రకారకాల దుంపల మొక్కలు, ఆకుకూరలతో, తీగలతో పచ్చదనం ఉట్టిపడే కూరగాయల చిట్టడవిలా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నది హైదరాబాద్ రామంతపూర్ న్యూగోకుల్నగర్లోని లీనానాయర్, గోపక్కుమార్ దంపతుల ఇల్లు. రసాయనిక ఎరువులతో, మురుగునీటిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలతో అనారోగ్యం పాలవుతామన్న భయంతో సొంతంగా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలనే ఈ దంపతులు తింటున్నారు. గ్రోబ్యాగ్స్, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో పాటు వారాంతపు సంతలు ముగిసిన తర్వాత వ్యాపారులు పడేసిన కూరగాయ వ్యర్థాలను సేకరించి కంపోస్టు తయారీకి ఉపయోగిస్తున్నారు. చుక్కకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, బచ్చలికూర, తోటకూరలతో పాటు ముల్లంగి, క్యారెట్, ఆలుగడ్డ, చామగడ్డ, మొరంగడ్డ, బీట్రూట్ తదితర దుంపలు కూడా పండిస్తున్నారు. చిక్కుడు, గోకర కాయ, బెండకాయ, బఠాణి, బీన్స్‌తోపాటు పొట్ల, సొర, కాకర కాయలతో పాటు నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను సైతం మేడమీద ఏడాది పొడవునా పండిస్తున్నారు. కొత్తిమీర, మెంతికూరతోపాటు పెసర, ఆవాలు తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను కూడా సాగు చేస్తున్నారు. అధికంగా కారం, రుచి కలిగిన పచ్చిమిర్చి రకాలను పండిస్తున్నారు. ఒక వంతు పశువుల పేడ, రెండింతల ఎర్రమట్టి, వర్మీకంపోస్ట్‌ను కలిపిన మట్టి మిశ్రమాన్ని ఇంటిపంటల సాగుకు వాడుతున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఇంటిపంటల సాగు, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడంలో కూడా లీనా నాయర్ శిక్షణ ఇస్తుండడం విశేషం. – మునుకుంట్ల అశోక్, సాక్షి, రామంతపూర్ ఇంటిపంటలతో శారీరక రుగ్మతలు పోయాయి వంటింటి వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసుకుంటూ.. కేవలం రూ.10ల ప్లాస్టిక్ కవర్లలో పెద్ద ఖర్చు లేకుండానే అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నాం. అధికంగా కూరగాయలు సాగయినప్పుడు ఆర్గానిక్ మార్కెట్లలో అమ్మి, ఆ డబ్బుతోనే విత్తనాలు కొంటున్నాం. సేంద్రియ ఇంటిపంటల కూరగాయలతో ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి. తరచుగా ఒళ్లు నొప్పులు, ఇతర రుగ్మతలతో బాధపడే నాకు ఈ కూరగాయలు తింటే అనూహ్యంగా, ఆరోగ్యంగా మారిపోయాను. స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు ఇంటిపంటలపై అవగాహన కల్గిస్తూ సేంద్రియ ఎరువుల తయారీలో కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు. – లీనా నాయర్ (98857 00644), రామంతపూర్, హైదరాబాద్ -
28న కొర్నెపాడులో రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ
గుంటూరు జిల్లా పుల్లడిగుంట కొర్నెపాడులో ఈ నెల 28(ఆదివారం)న రబీలో సేంద్రియ వరి, కూరగాయల సాగుపై రైతులు శివనాగమల్లేశ్వరరావు, మీసాల రామకృష్ణ, ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 0863–2286255 -
23న వరి, కూరగాయల సాగుపై శిక్షణ
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో ఈ నెల 23(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, కూరగాయల సాగుపై నాగర్‌కర్నూల్ జిల్లా రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, ఉద్యాన శాఖాధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. ఉచితంగా వేస్ట్ డీకంపోజర్‌ను పంపిణీ చేస్తారు. వివరాలకు.. 83675 35439, 0863–2286255 -
ఇంటి కంపోస్టు.. సొంత కూరగాయలు!
హైదరాబాద్ నగరంలో పుట్టిపెరిగిన ఈమని వెంకటకృష్ణ మెహదీపట్నం కాంతినగర్ కాలనీలోని తమ సొంత ఇంటి టెర్రస్‌పై సేంద్రియ ఇంటిపంటలు పండించుకుంటూ రసాయనిక అవశేషాల్లేని ఆకుకూరలు, కూరగాయలు తింటూ ఇంటిల్లి పాదీ ఆరోగ్యంగా ఉన్నారు. వెంకటకృష్ణ బీటెక్ అనంతరం అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేసి బహుళజాతి కంపెనీల్లో పనిచేసిన తర్వాత ఫ్రీలాన్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా ఉన్నారు. 7గురు పెద్దలు, ఇద్దరు పిల్లలున్న ఉమ్మడి కుటుంబం వారిది. 1500 ఎస్.ఎఫ్.టి. టెర్రస్‌పై 200 పైచిలుకు టబ్‌లు, గ్రోబాగ్స్‌లో ఇంటిపంటలు పండిస్తున్నారు. గత ఏడాదిగా ఆకుకూరలు కొనలేదు. 200 లీటర్ల ప్లాస్టిక్ పీపాలను కొనుగోలు చేసి మధ్యకు కత్తిరించిన వందకుపైగా టబ్‌లు.. అడుగు ఎత్తు–2 అడుగుల వెడల్పు ఉండే వాష్ టబ్స్.. అడుగు ఎత్తుండే గ్రోబాగ్స్ వాడుతున్నారు. వంటింటి వ్యర్థాలు, మొక్కల ఆకులు అలములతో సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టునే ఉపయోగిస్తున్నారు. ఏ టబ్‌లోనైనా.. కొబ్బరి పీచు+చెరకు గడల వ్యర్థాలను అడుగున 20% ఎత్తు మేరకు వేసి.. ఆ పైన 30% ఎర్రమట్టి వేసి.. ఆ పైన సొంతంగా తయారు చేసుకున్న కంపోస్టును 30% మేరకు వేస్తారు. తర్వాత అప్పుడప్పుడూ కొద్దికొద్దిగా కంపోస్టు వేసుకుంటూ.. ఇంటిపంటలు పోషకాల లోపం, చీడపీడలకు గురికాకుండా మంచి ఉత్పాదకతను సాధిస్తున్నారు. తోటకూర, పాలకూర, పొన్నగంటి, బచ్చలి, గోంగూరలతోపాటు వంగ, బీర, నేతిబీర, చిక్కుడు, గోరుచిక్కుడు, పిచ్చుకపొట్ల, పచ్చిమిరప, కంద.. సాగు చేస్తున్నారు. ప్రస్తుతానికి వారానికి 3 రోజులపాటు ఇంటి కూరగాయలనే తింటున్నారు. త్వరలో వారానికి 5 రోజులు సరిపోయే అంతగా ఇంటిపంటల సాంద్రతను పెంచామని అంటూ.. నూటికి నూరు శాతం వీటికే పరిమితం కావడం సాధ్యం కాదని వెంకటకృష్ణ(90001 03046) అభిప్రాయపడుతున్నారు. చెత్తను బయటపడేయకుండా కంపోస్టు తయారు చేసుకుంటూ.. సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను ఇంటిపైనే పండించుకుంటున్న వెంకటకృష్ణ కుటుంబానికి జేజేలు! వెంకటకృష్ణ -
కందకాలతో నీటి లభ్యత పెరిగింది!
కందకాలు తవ్వించుకోమని చెబితే వినిపించుకుని అనూహ్యమైన రీతిలో సాగు నీటి భద్రత సాధించిన సొంత భూముల రైతులు చాలా మంది కనిపిస్తున్నారు. అయితే, కౌలు రైతులు కూడా కందకాలు తవ్వించుకోవడం అరుదైన విషయం. రామిశెట్టి వెంకటేశ్వరరావు(95020 50975), డా. కంచర్ల ప్రవీణ్(87128 45501).. అనే మిత్రులు చాలా సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగాలు చేసి స్వదేశం వచ్చేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం షారాజిపేటలో 12 ఎకరాల భూమిని పదేళ్ల పాటు కౌలుకు తీసుకున్నారు. 3 బోర్లు వేస్తే 2 ఇంచుల నీళ్లు వచ్చాయి. అయితే, ఇసుకపాళ్లు ఎక్కువగా ఉన్న ఎర్ర నేల కావడంతో మంచి దిగుబడులు తీయాలంటే వాన నీటి సంరక్షణ ద్వారా సాగు నీటి భద్రత సాధించడం అతిముఖ్యమని భావించారు. గూగుల్ సెర్చ్ చేస్తే.. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం, సాక్షి ఆధ్వర్యంలో సాగు భూమిలో అంతటా కందకాలు తవ్వుకునే పద్ధతి గురించి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)ని సంప్రదించి.. 2017 మే/జూన్‌లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తవ్వించారు. పుష్కలంగా వర్షాలు పడడంతో అనేకసార్లు కందకాలు నిండాయి. ఆరు నెలల్లో భూగర్భ జలాలు బాగా పెరిగాయి. కలబంద+ఉల్లి, ఆపిల్ బెర్, చెరకు, మునగాకు, పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. ‘అంతకుముందు డ్రిప్ ద్వారా 3 వాల్వులకు సరిపోని నీటి ప్రెజర్, 6–7 వాల్వులకు పెరిగింది. పక్క తోటల వాళ్లను అడిగితే తమకు తేడా లేదన్నారు. అప్పుడు మాకు అర్థమైంది. కందకాలు తవ్వి వర్షపు నీటిని ఇంకింపజేయడం వల్లనే ప్రెజర్ రెట్టింపైంది. డ్రిప్ నీటి ప్రెజర్ ఈ ఎండాకాలంలో కూడా తగ్గలేదు..’ అని వెంకటేశ్వరరావు ఇటీవల ‘సాగుబడి’తో చెప్పారు. -
వేసవిలోనూ మేడపై పచ్చని కూరలు!
అతనో ఉపాధ్యాయుడు.. అయితేనేం, వ్యవసాయమంటే ఆసక్తి. ఆ ఆసక్తి తన ఇంటిపైనే కాయగూరలు, ఆకుకూరలు సాగు చేసేలా పురిగొల్పింది. దాంతో గడచిన నాలుగేళ్లగా వారంలో నాలుగు రోజులు చక్కని, రుచికరమైన, సొంతంగా పండించిన కూరలు తినగలుగుతున్నారు. ఆయన పేరు బిరుసు ఈశ్వరరావు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో సొంత ఇంటిలో ఈశ్వరరావు నివాసం ఉంటున్నారు. పాచిపెంట మండలంలోని పీ కోనవలస పాఠశాల ఉపాధ్యాయుడిగా భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. తన ఇంటిమేడపైన నాలుగేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేస్తూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. చుక్కకూర, తోటకూర, పాలకూర, మెంతికూర, గోంగూర, కొత్తిమీరతోపాటు వంగ, టమాట, ఆనప, ముల్లంగి తదితర పంటలు సాగు చేస్తున్నారు. మండు వేసవిలోనూ ఆయన మేడపైన పచ్చని కూరగాయల తోట కొనసాగుతోంది. ప్రత్యేక మడులు.. మట్టి కుండీలు.. రకరకాల మొక్కలను పెంచేందుకు వీలుగా ప్రత్యేకంగా ఇటుకలు, సిమెంటుతో మడులను కట్టించుకున్నారు. అడుగు ఎత్తున దిమ్మెలపైన సిమెంట్ పలకలతో మడులను నిర్మించారు. వీటిలో పశువుల గెత్తం(పశువుల ఎరువు), చెరువుమట్టిని కలిపి పోశారు. ఆకుకూరలు, ఆనప వంటి తీగజాతి కూరగాయ పాదులను వీటిల్లో సాగు చేస్తున్నారు. వంగ, టమాట తదితరాల కోసం పూల మొక్కల గోళాల (మట్టి కుండీలు, ప్లాస్టిక్ డబ్బాల)నే వినియోగిస్తున్నారు. ఇంటిపంటల కోసం విజయనగరం మార్కెట్లో విత్తనాలను కొనుగోలు చేస్తూ, ఇంటి అవసరాలను బట్టి, కొద్ది కొద్దిగా విత్తుకుంటారు. ప్రతీ 15 రోజుల వ్యవధిలో ఆకుకూరల విత్తులు విత్తుతూ.. ఆరోగ్యకరమైన కూరలకు ఏడాది పొడవునా లోటు లేకుండా చూసుకుంటున్నారు. మేలైన హైబ్రిడ్ రకాలనే ఎన్నుకుంటున్నాని ఈశ్వరరావు తెలిపారు. తెగుళ్లు పెద్దగా రావన్నారు. పురుగులు ఏవైనా కనిపిస్తే చేతులతో ఏరి పారేస్తున్నామన్నారు. ఇలా చేయాలనుకునే వారు వచ్చి అడిగితే.. మొదటి నుంచి చివరి వరకు ఎలా చేయాలో, ఏమి చేయాలో పూర్తిగా చెప్పడానికి ఈశ్వరరావు సంసిద్ధంగా ఉన్నారు. నాలుగేళ్లుగా పండించుకుంటున్నా.. నాకు చిన్నతనం నుండి వ్యవసాయమంటే ఆసక్తి. దాంతోనే మేడపై కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టాను. నాలుగేళ్లుగా క్రమం తప్పకుండా పెంచుతున్నాను. ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు, మంచి వ్యాపకం దొరుకుతోంది. రోజుకు 20 నిమిషాలు కేటాయిస్తే సరిపోతోంది. మండు వేసవిలో కూడా చాలా తక్కువ ఖర్చుతో ఆకుకూరల సాగు చేయగలుగుతున్నాను. – బిరుసు ఈశ్వరరావు (94411 71205), సాలూరు, విజయనగరం – కొల్లి రామకృష్ణ, సాక్షి, సాలూరు, విజయనగరం -
యూట్యూబ్ సేద్యం
తాము బాగుండాలి. భూమి బాగుండాలి. సమాజం అంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో యువ రైతు సోదరులు దండవేని నరేష్, సురేష్ నడుము బిగించారు. జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని అల్లీపూర్ వారి స్వగ్రామం. 12 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో తల్లిదండ్రులు తోటి రైతుల మాదిరిగానే విరివిగా రసాయనిక ఎరువులు వాడటంతో భూమి తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. దీనికి తోడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో నీళ్లు లేక పంటలు పండలేదు. దీంతో, ఇంటి అప్పులు వడ్డీలతో కలిపి రూ.16 లక్షలకు పెరిగాయి. డిగ్రీ చదివిన అన్న నరేష్ దుబాయ్ వెళ్లాడు. కానీ, రెండు, మూడేళ్ల తర్వాత స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. తమ్ముడు సురేష్ పదో తరగతి పూర్తి చేసి, రసాయన ఎరువులు వాడుతూ వ్యవసాయం చేస్తుండేవాడు. తదనంతరం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని, ఆ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల పొలాలను సందర్శించి అవగాహన పెంచుకున్నారు. దీనికి తోడు యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకొని ఆచరించడం మొదలుపెట్టారు. పిచ్చోడని ఇంట్లో వాళ్లే తిట్టారు..! ప్రకృతి సాగు పద్ధతిలో తొలి రెండేళ్లు అంతంతమాత్రంగానే పంట పండింది. ఆ ఏడాది పంటలకు ధరలు బాగున్నాయి. దీంతో, ఇంట్లోవాళ్లు ఇదేం పద్దతి, పంట కూడా రావడం లేదని, ఇద్దరు అన్నదమ్ములు పిచ్చోళ్లమాదిరిగా తయారయ్యారు అంటూ తిట్టారు. మా ఊరోళ్లు అయితే, ఈ పద్దతిలో మీరు వ్యవసాయం చేస్తే ఉన్న భూమి అమ్ముడు ఖాయం అంటూ ముఖం మీదే చెప్పడం చేసారు. అయినప్పటికి, మేము చేసే పనులను మేము చేసుకుంటూ పోయేవాళ్లం. గత రెండేళ్ల నుండి మిగత రైతులు పొలాలకు ఏదో ఒక జబ్బు వచ్చి పంట పోయేది. కానీ మా పొలంలో ఎప్పుడూ దెబ్బతినలేదు. ఇది చూసిన తర్వాత మా మీద నమ్మకం కుదిరి కుటుంబసభ్యులు సహకరించడం మొదలుపెట్టారు. పందిళ్ల కింద కూడా తోటలు.. గత నాలుగేళ్లుగా 2 ఎకరాలలో మామిడి, 4 ఎకరాలలో వరి, 2 ఎకరాలలో కూరగాయలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. మూడు ఆవుల మూత్రం, పేడతో ఘనజీవామృతం, జీవామృతం తయారు చేస్తున్నారు. తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, నీమాస్త్రం, దశపర్ణ కషాయం వాడతున్నారు.బీరకాయ, సొరకాయ, కాకర కాయలను పందిరి పద్దతిలో సాగు చేస్తున్నారు. ఆ పందిళ్ల కింద పాలకూర, తోటకూర, టమాట, బెండ, గోరు చిక్కుడు సాగు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ దుకాణం ఏర్పాటు చేసి మార్కెట్ రేటు కంటే 20 శాతం అదనపు ధరకు అమ్ముతున్నారు. బియ్యం, కందిపప్పు, శనగలు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, నువ్వులను కూడా విక్రయిస్తున్నారు. వాకింగ్ క్లబ్‌ల వద్ద కూడా రసాయన అవశేషాల్లేని తమ ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నారు. మట్టి ద్రావణం.. సీవీఆర్ పద్ధతిలో భూమి పై నుంచి సేకరించిన 7 కిలోల మట్టి, భూమి 2 అడుగుల లోతు నుంచి తీసిన 7 కిలోల మట్టిని 200 లీటర్ల నీటిలో కలపాలి. కొంత సేపటి తర్వాత, గుడ్డతో ఆ మట్టి ద్రావణాన్ని వడపోసి పంటలపై పిచికారీ చేస్తే, మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా తయారు చేసిన మట్టి ద్రావణాన్ని వరి, కూరగాయలు, పండ్ల తోటలకు పిచికారీ చేస్తున్నారు. ఫిష్ అమినోయాసిడ్ ద్రావణం: కిలో చేపల(పనికిరాని వ్యర్థాల)ను చిన్న ముక్కలు చేసి, వీటికి కిలో బెల్లం కలిపి డ్రమ్ములో మురగబెట్టాలి. ఉదయం, సాయంత్రం కలుపుతూ ఉండాలి. 15 రోజుల తర్వాత గుడ్డలో వడపోసి, వచ్చిన ద్రావణాన్ని కూరగాయలు, వరి పొలానికి పిచికారీ చేస్తున్నారు. మొక్కల పెరుగుదలకు ల్యాబ్ కుండలో బియ్యం కడిగిన నీరు ఒక లీటరుకు 3 లీటర్ల అవు పాలను కలిపి.. నాలుగు రోజుల పాటు చల్లని ప్రదేశంలో ఉంచాలి. దీనివల్ల పైన పెరుగు గడ్డలాగా పేరుకుంటుంది. దాన్ని తీసివేసి కింది ద్రావణాన్ని మొక్కలకు పిచికారీ చేస్తున్నారు. లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా(లాబ్) అంటారు. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కూరగాయల సాగు ఇలా.. ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన ఘనజీవామృతాన్ని ఎకరానికి వంద కిలోల చొప్పున దుక్కిలో చల్లారు. కూరగాయ çపంటలపై ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. నీమాస్త్రం, అగ్నిస్త్రం, దశపత్ర కషాయాలతో తెగుళ్లను నియంత్రించారు. మొక్కల పెరుగుదలకు ‘ల్యాబ్’ను ఉపయోగించడంతో కూరగాయలు ఏపుగా పెరుగుతున్నాయి. వరి పంట కోసం... వరి పొలం దుక్కిలో ఘనజీవామృతం వాడారు. ప్రతి 15 రోజుల కొకసారి జీవామృతాన్ని నీటితో కలిపి ఇస్తున్నారు. నెల రోజుల తర్వాత ఫిష్ అమినోయాసిడ్‌ను పిచికారీ చేశారు. మొక్కల పెరుగుదలకు చాలా ఉపయోగపడింది. మొగి పురుగు నివారణకు నీమాస్త్రం, అగ్నిస్త్రం వాడారు. వరి పొట్ట దశలో సీవీఆర్ పద్ధతిలో మట్టి ద్రావణంతో పాటు పుల్లటి మజ్జిగను పిచికారీ చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి. మామిడి పంటకు.. ప్రతి 20 రోజుల కొకసారి డ్రిప్ ద్వారా జీవామృతం ఇస్తున్నారు. పూత దశలో జీవామృతాన్ని పిచికారీ చేశారు. ముందస్తు జాగ్రత్తగా తెగుళ్లు, పురుగుల నివారణకు అగ్నిస్త్రం, దశపర్ణ కషాయం, వరి పిండి ద్రావణాన్ని పిచికారీ చేశారు. మామిడి చెట్ల మొదళ్ల దగ్గర తేమ త్వరగా ఆరిపోకుండా ఉండేందుకు పసుపు ఆకును ఆచ్ఛాదనగా వేశారు. పసుపు ఆకు తేమను కాపాడటంతో పాటు నెమ్మదిగా కుళ్లి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మా తోట వద్దకు వచ్చి చూడమంటాం! గతంలో రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడి చేతులు కాల్చుకున్నాం. మూడు ఆవులను కొనుగోలు చేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పండించిన కూరగాయలు, బియ్యం తదితర ఉత్పత్తులను నేరుగా జనం వద్దకే వెళ్లి అమ్ముకుంటున్నాం. రసాయనాలు వాడకుండా పండించినవేనా అన్న అనుమానం ఉంటే.. వచ్చి మా తోటను చూడండని చెబుతుంటాం. ప్రతి రైతూ కొద్ది భాగంలోనైనే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరించడం మొదలు పెట్టాలి. ఇది భూమికి, రైతుకు.. అందరికీ మంచిది. ఆరోగ్యకరమైన సమాజమే మా లక్ష్యం. – దండవేని నరేష్, సురేష్ (96409 63372) అల్లీపూర్, రాయికల్ మండలం, జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి అగ్రికల్చర్, జగిత్యాల, ఫొటో: ఏలేటి శైలేందర్ రెడ్డి -
కూరగాయల సాగు.. బహుబాగు!
ఎల్లారెడ్డిరూరల్(ఎల్లారెడ్డి) : కూరగాయల సాగులో అతివలు అద్భుతంగా రాణిస్తున్నారు. వరి, మొక్కజొన్న తదితర పంటలతో పాటు కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులు అవలంభిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతనందిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని దేవునిపల్లి, మల్లయపల్లి, మాచాపూర్ తదితర గ్రామాలలో మహిళలు కూరగాయల సాగులో తమదైన ముద్ర వేస్తున్నారు. సాధారణ పంటలతో పాటు రెండు, మూడు గుంటలలో కూరగాయలను పండించి అదనపు లాభాలు ఆర్జిస్తున్నారు. రెండెకరాల పొలం ఉన్న వారు అర ఎకరాన్ని కూరగాయల కోసమే కేటాయిస్తున్నారు. పాలకూర, తోటకూర, మెంతికూర, గంగవాయిల కూర, టమాట, వంకాయ, బెండకాయలు, కొత్తిమీర పండిస్తున్నారు. ఎండల నుంచి రక్షణకు.. వేసవి తీవ్రత దృష్ట్యా పంటలు ఎండిపోకుండా మహిళలు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎండ వేడిమికి కొత్తిమీర, పాలకూర తదితర పంటలు వాడి పోతున్నాయి. దీంతో గ్రీన్ నెట్లను ఏర్పాటు చేసి కూరగాయలను సాగు చేస్తున్నారు. దీంతో మొక్కలకు ఎండ తీవ్రత పెద్దగా తగలక పోవడంతో అధిక దిగుబడులు వస్తున్నాయి. ఒక్కో గుంటలో ఒక్కో రకం మహిళలు కేవలం ఒక రకమైన పంట కాకుండా అన్ని రకాల పంటలు పండిస్తున్నారు. సీజనల్‌గా డిమాండ్ ఉన్న కూరగాయలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఒక గుంటలో వంకాయ లు, మరో గుంటలో టమాట, కొత్తిమీర, పాలకూర, మెంతికూర ఇలా ఒక్కో గుంటలో ఒక్కో రకమైన పంటలను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. కొత్తిమీర కిలో రూ.వంద వేసవి తీవ్రత దృష్ట్యా మార్కెట్లో కొత్తిమీర సహా కూరగాయలకు అధికంగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కిలో కొత్తిమీర ధర రూ.150–200 దాకా పలుకుతోంది. వ్యాపారులు రైతుల నుంచి కొత్తిమీర కిలోకు రూ.100 చొప్పున ఖరీదు చేస్తున్నారు. మొన్నటివరకు రూ.20–30 ఉండగా, ప్రస్తుతం ధర పెరుగుతోంది. 40 రోజుల్లో చేతికి.. వ్యవసాయ పంటలు 90 రోజుల నుంచి 120 రోజులు పడుతుంది. కానీ కూరగాయలు 40 రోజుల్లో చేతికి వస్తుండడంతో మహిళలు కూరగాయల సాగుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అలాగే, ప్రతి రోజూ డబ్బులు చేతికొస్తాయి. తక్కువ వ్యవధిలో పంట చేతికందడం, రోజూ చేతికి డబ్బు వస్తుండడంతో మహిళలు కూరగాయల సాగుకే మొగ్గు చూపుతున్నారు. పైసల్ ఎక్కువొస్తాయ్ మిగిత పంటల కన్నా కాయగూరలు జల్ది చేతికొస్తాయ్. పైసల్ కూడా చేతిలో ఆడతాయి. అందుకే కూరగాయలు పండిస్తున్నాం. కొత్తిమీర, పాలకూర ఎండ తీవ్రతకు ఆడిపోతున్నాయి. దీంతో రూ.10 వేలు ఖర్చు చేసి గ్రీన్ నెట్లను ఏర్పాటు చేశాం. – స్వరూప, దేవునిపల్లిఎప్పుడూ పని ఉంటుంది వ్యవసాయ పంటలతో పాటు కూరగాయలను సాగు చేస్తున్నా. కాయగూరలు అమ్మితే అచ్చే పైసలతోటి ఇంటి ఖర్చులు ఎళ్లిపోతున్నాయి. చేతి నిండా పని ఉంటుంది. అట్లనే పైసల్ కూడా చేతి నిండా ఉంటాయి. తక్కువ టైంల ఎక్కువగా డబ్బులు అస్తాయ్. – సిద్దవ్వ, మల్లయపల్లి -
‘రెడ్ జోన్’లో గ్రీన్హౌస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్హౌస్ రైతుల వెతలు ఇవి. గ్రీన్హౌస్లో కూరగాయలు సాగుచేసిన రైతులంతా నష్టాల పాలై అప్పుల్లో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం గ్రీన్హౌస్ సాగుకు ప్రోత్సాహం కోసం 75 శాతం సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రీన్హౌస్ సాగుకు ఎకరానికి దాదాపు రూ.40 లక్షల వరకు ఖర్చయితే.. ప్రభుత్వమే రూ.30 లక్షలు భరిస్తుండగా, రైతులు రూ.10 లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,042 ఎకరాల్లో గ్రీన్హౌస్లకు అనుమతి ఇచ్చారు. అందులో 600 ఎకరాల్లో జరబెర, 150 ఎకరాల్లో గులాబీ, చామంతి తదితర పూల సాగు జరుగుతోంది. మిగతా 292 ఎకరాల్లో రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు. అయితే సరైన విత్తనాలు, సాంకేతిక అవగాహన కరువై నష్టాలపాలవుతున్నారు. పూలతో లాభాలు జరబెర వంటి పూల సాగుతో రైతులు లాభాలు పొందుతున్నారు. కూరగాయల సాగుతో మాత్రం చాలా చోట్ల నష్టాలే వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో అయితే పూల సాగులోనూ పెద్దగా లాభాలు రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. రైతులకు అవగాహన లేకపోవడం, అధికారుల నుంచి సహకారం లభించకపోవడం, వాతావరణంలో వచ్చే మార్పులను అంచనా వేసే పరిస్థితి లేకపోవడం తదితర కారణాల వల్ల రైతులు నష్టపోతున్నారు. ఉదాహరణకు చేవెళ్ల మండలం చెనుపల్లిలో ఒక రైతు సీజన్లో టమాటా సాగు చేశారు. కానీ ధర కిలో రెండు మూడు రూపాయలకు పడిపోవడంతో తీవ్రంగా నష్టాల పాలయ్యారు. ఏ సమయంలో ఏయే కూరగాయలు సాగు చేయాలన్న అవగాహన లేక ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. సూచనలతో లాభదాయకం అయితే పలు చోట్ల రైతులు స్వయంగా సొమ్ము ఖర్చు చేసుకుని.. శాస్త్రవేత్తల సూచనలతో లాభాలు పొందుతున్నారు. చేవెళ్ల మండలం చెనుపల్లిలో 45 గ్రీన్‌హౌస్‌ల సాగును పరిశీలించేందుకు నెలకోసారి పుణే నుంచి శాస్త్రవేత్త వస్తుంటారు. వచ్చినప్పుడల్లా ఒక్కో రైతు రూ.3 వేల చొప్పున రూ.1.35 లక్షలు ఆయనకు చెల్లించి.. తగిన సూచనలు పొందుతుంటారు. దీంతో అక్కడ గ్రీన్హౌస్ సాగు లాభదాయకంగా ఉంది. మిగతా చోట్ల ఈ పరిస్థితి లేదు. సాధారణ రైతులకు అవగాహన లేక, ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు లేక నష్టాలపాలవుతున్నారు. నెట్హౌస్లపై దృష్టి.. గ్రీన్ హౌస్‌లకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చయ్యే నెట్ హౌస్‌పై రైతులు దృష్టి సారిస్తున్నారు. దీనికి ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది. పంజాబ్, హరియాణాల్లో నెట్‌హౌస్ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కూరగాయల సాగుకు నెట్హౌస్లను ప్రోత్సహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రైతు పేరు నాగిరెడ్డి.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం లక్ష్మీపురం. రెండేళ్ల కింద ఎకరా విస్తీర్ణంలో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. రూ.10 లక్షలు అప్పుచేసి మార్జిన్ మనీగా ప్రభుత్వానికి చెల్లించారు. భూమిలో మట్టి మార్పు, ఎరువులు, విత్తనాలు, ఇతర ఖర్చులకు మరో రూ.5 లక్షలు ఖర్చుచేశారు. గ్రీన్హౌస్లో క్యాప్సికం, టమాటా సాగుచేశారు. కానీ దిగుబడులు సరిగా రాలేదు. సీజన్లో టమాటా బాగా పండినా ధర లేక నష్టం వాటిల్లింది. ఏడాదిగా గ్రీన్‌హౌస్‌ను ఖాళీగా ఉంచారు. ఇప్పుడా భూమిని అమ్మకానికి పెట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన ఈ రైతుపేరు రాజిరెడ్డి. రెండేళ్ల క్రితం మూడెకరాల్లో గ్రీన్హౌస్ సాగు మొదలుపెట్టారు. కీరా, క్యాప్సికం, టమాటా పంటలు వేశారు. టమాటా ఏపుగా పెరిగినా దిగుబడి రాలేదు. గతేడాది క్యాప్సికం వేసినా.. గ్రీన్హౌస్ నిర్మాణం దెబ్బతిని పంటకు నష్టం వాటిల్లిందని, వేసవిలో కీరా వేస్తే వైరస్ కారణంగా నష్టం వాటిల్లిందని ఆయన వాపోతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. ప్రత్యేక నిర్వహణ అవసరం గ్రీన్హౌస్లో కూరగాయలు సాగు చేయాలంటే ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రోజువారీగా పరిజ్ఞానం పెంచుకోవాలి. నిర్వహణ సరిగా లేకపోతే నష్టాలు తప్పవు. ఏ సీజన్లో ఏ పంటలు వేసుకోవాలన్న అవగాహన ఉండాలి. వర్షాకాలంలో ఆకుకూరలు, చలికాలంలో బెండ, బీర, కాకరకాయలు పండించాలి. క్యాప్సికం, కీరాలకు ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. మార్కెట్ సరళిని బట్టి పూల సాగు చేపట్టాలి.. – వెంకట్రామిరెడ్డి, ఉద్యానశాఖ కమిషనర్ -
ఆక్వాపోనిక్స్‌తో సత్ఫలితాలు!
ఇంటిపట్టున స్వల్ప ఖర్చుతో, వనరులు వృథా కాకుండా చేపలను సాగు చేయడం, చేపల విసర్జితాలు కలిసిన నీటిని కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెరిగే కుండీలు, టబ్‌లకు అందించడాన్ని ఆక్వాపోనిక్స్ (రీ సర్యు్యలేటింగ్ ఆక్వాపోనిక్స్ సిస్టం– ఆర్.ఎ.ఎస్.) వ్యవస్థగా చెప్పొచ్చు. ఈ పద్ధతిలో మట్టిని వాడాల్సిన అవసరం లేదు. చేపలకు మేత వేస్తే చాలు. మొక్కలకు ఎరువులు వేయనక్కర లేదు. చేపల విసర్జితాలతో కూడిన నీరు సూక్ష్మ, స్థూల పోషకాలతో నిండి ఉంటుంది. ఈ నీటిని మొక్కల వేళ్లకు అందిస్తే.. అందులోని పోషకాలను గ్రహించి కూరగాయలు, ఆకుకూరలు చక్కగా పెరుగుతాయి. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు అమ్మోనియాను నైట్రైట్‌గా, తదనంతరం నైట్రేటుగా మార్చి మొక్కలకు అందిస్తాయి. ఇందులో వాడే నీటిలో 90%, పోషకాలలో 100% వృథాపోకుండా ఉపయోగించడానికి అవకాశం ఉంది. తద్వారా పూర్తిగా సేంద్రియ చేపలు, ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవచ్చని మహారాష్ట్ర పుణే జిల్లా పబల్‌లోని ‘విజ్ఞాన ఆశ్రమం’ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కొత్త ఆలోచనతో ఈ ఆశ్రమానికి వచ్చే వ్యక్తికి తదనంతర పరిశోధనకు సహాయపడి.. ఆ పరిశోధనా ఫలితాల ద్వారా ఆ వ్యక్తి ఉపాధి పొందేలా తోడ్పాటునందించడం విజ్ఞాన ఆశ్రమం ప్రత్యేకత. గత 5 నెలలుగా ఆక్వాపోనిక్స్‌పై అధ్యయనం జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2 గ్రాముల గ్రాస్ కార్ప్ చేప పిల్లలు వేస్తే.. 5 నెలల్లో 30–450 గ్రాముల వరకు బరువు పెరిగాయి. చేపలకు అజొల్లా/బెర్సీమ్‌తోపాటు నీటిలో తేలియాడే బలపాల మేతను (40:40:10 నిష్పత్తిలో) వేస్తున్నారు. 50 వేల లీటర్ల నీటి ట్యాంకులో వెయ్యి చేప పిల్లలు వేశారు. కొన్ని పిల్లలు తీసేస్తే చేపల పెరుగుదల మరింత బాగుంటుందని భావిస్తున్నారు. చేపల నీటితో టమాటాలు, కలబంద, పాలీహౌస్లో గులాబీలను సాగు చేస్తున్నారు. జూన్ నాటికి పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. వివరాలకు.. Email: vigyanashramvideo@gmail.com -
ఉద్యోగం విడిచి ప్రకృతి సేద్యంలోకి..
ఆత్మసంతృప్తి నివ్వని పనిని, అది ఎంత ఎక్కువ ఆదాయాన్నిచ్చే పని అయినప్పటికీ, మనసు చంపుకొని కొనిసాగించడంలో అర్థం ఏముంది? వ్యవసాయ కుటుంబంలో పుట్టిన చండ్రా వెంకటేశ్వర్రావు మదిలో ఇదే ప్రశ్న మెదిలింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట ఆయన స్వగ్రామం. సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేశారు. ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కంపెనీలో ఉద్యోగంలో చేరి వివిధ రాష్ట్రాల్లో పనిచేశారు. వార్షిక ఆదాయం రూ.10 లక్షల వరకూ వస్తున్నప్పటికీ ఉద్యోగంలో పూర్తి సంతృప్తి లేదు. మనసంతా ప్రకృతి వ్యవసాయంపైనే ఉంది. రెండేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. డాక్టర్ చో హన్ క్యు, పాలేకర్ సేద్య పద్ధతుల్లో శిక్షణ తీసుకొని తన పొలంలో ప్రకృతి సేద్యం ప్రారంభించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘రసాయన ఎరువులకు అలవాటు పడిన భూముల్లో ప్రకృతి సాగు ప్రారంభిస్తే మొదటి సంవత్సరం ఇబ్బందులు తప్పలేదు. భూమిని సారవంతం చేసుకుంటూ ప్రస్తుతం మూడెకరాల్లో వరి, రెండున్నర ఎకరాల్లో చెరకు, మూడున్నర ఎకరాల్లో కాకర, బీర, సొర, దోసతో పాటు చిక్కుడు వంటి పందిరి జాతి కూరగాయలను సాగు చేస్తున్నా. దిగుబడులు సంతృప్తికరంగా ఉన్నాయి. నీటి నిల్వ కోసం 15 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన నీటి కుంటను ఏర్పాటు చేసుకున్నా. పొలంలో ఉన్న నాలుగు బోర్లను వాన నీటితో రీచార్జ్ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశా. పొలం ఎగువ భాగంలో చెక్ డ్యాం నిర్మించా. ఇంతవరకు నీటి సమస్య లేదు. గతంలో కంటే భూగర్భ జలమట్టం పెరిగింది. నాలుగు దేశీ ఆవులను కొనుగోలు చేసి వాటి మూత్రం, పేడతోనే మొత్తం 10 ఎకరాల పంటకు కావాల్సిన సహజ ఎరువులు, ద్రావణాలను తయారు చేసుకుంటున్నా. నత్రజని కోసం జీవామృతం, వర్మీవాష్ తయారు చేస్తున్నా. జీవామృతం వడకట్టడం కోసం తక్కువ ఖర్చుతో ఫిల్టర్ యూనిట్‌ను సొంతంగా తయారు చేశా. డ్రిప్ ద్వారా పంటలకు అందిస్తున్నాం. వాగుల్లో సేకరించిన గవ్వలు, కోడిగుడ్ల పెంకులను నానబెట్టి కాల్షియం కోసం ఎరువును తయారు చేస్తున్నా. పొటాష్ కోసం పొగాకు కాడల ద్రావణాన్ని పంటలకు అందిస్తున్నా. పూత దశలో ఫిష్ అమినో యాసిడ్ పిచికారీ చేయడం ద్వారా పంటల దిగుబడితో పాటు నాణ్యత పెరుగుతోంది. బియ్యం కడిగిన నీటితో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా తయారు చేస్తున్నా. వరి గడ్డి, చెత్త, కల్లం తుత్తడి, రోడ్డు వెంట ఉండే మొక్కలను తీసుకు వచ్చి ఆచ్ఛాదనగా వాడుతున్నా. మా పొలంలో సుగంధ సాంబ వరి రకం ఈత దశకు వచ్చింది. 5 అడుగులు పెరగడం విశేషం. రాష్ట్రం అంతటా వరిలో దోమపోటు, అగ్గితెగులు, ఆకుచుట్ట, సుడిదోమ వంటి తెగుళ్లతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. మా వరి పొలంలో తెగుళ్లు లేవు. గత సంవత్సరం తెలంగాణ సోన రకం వరి సాగు చేసి ఎకరాకు 25 బస్తాల ధాన్యం దిగుబడి సాధించా. బియ్యం పట్టించి కేజీ రూ.50కు నేరుగా వినియోగదారులకు అమ్మాను. చెరకు మొక్కల మధ్య అడుగు, సాళ్ల మధ్య 3 అడుగుల దూరంలో సాగు చేస్తున్నా. అధిక సంఖ్యలో పిలకలు వేసి ఏపుగా పెరుగుతోంది. వేసవి నాటికి చెరకు పక్వానికి వస్తుంది. జ్యూస్ సెంటర్లు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా..’ అని వెంకటేశ్వర్రావు వివరించారు. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వ్యవసాయంలో వాడుతున్నందున వాతావరణ సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. భూమి సారాన్ని కోల్పోయి పంటలు విపరీతమైన తెగుళ్ల బారిన పడుతున్నాయి. తమ ప్రాంత రైతులను ప్రకృతి సేద్యంపై చైతన్య పరిచేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్రావు (96521 11343) తెలిపారు. – మేకపోతుల వెంకటేశ్వర్లు, సాక్షి, కోదాడ రూరల్, సూర్యాపేట జిల్లా -
వేస్ట్ డీకంపోజర్’ ద్రావణం ఒక్కటి చాలు!
‘వేస్ట్ డీకంపోజర్’ ఆవిష్కర్త, ఎన్.సి.ఒ.ఎఫ్. డైరెక్టర్ డా. క్రిషన్ చంద్రతో ‘సాగుబడి’ ముఖాముఖి ‘సాక్షి సాగుబడి’ పేజీ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ‘వేస్ట్ డీకంపోజర్’ ద్రావణం గురించి తెలుసుకున్న వేలాది మంది రైతులు దీన్ని సంపూర్ణ సేంద్రియ ఎరువుగా, పురుగుల మందుగా అన్ని రకాల పంటలపై వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారని ‘వేస్ట్ డీకంపోజర్’ ఆవిష్కర్త, ఘజియాబాద్(ఉత్తరప్రదేశ్)లోని ఎన్.సి.ఒ.ఎఫ్. డైరెక్టర్ డా. క్రిషన్ చంద్ర వెల్లడించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన ‘సాగుబడి’ ప్రతినిధితో ప్రత్యేకంగా ముచ్చటించారు. తెలంగాణలోనే కనీసం 10 వేల మంది రైతులు వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని వాడుతున్నారని, తాము ఏ సమావేశానికి వెళ్లినా దీని ద్వారా పొందుతున్న సత్ఫలితాల గురించి రైతులు సంతోషంగా చెబుతున్నారని అన్నారు. అందువల్లనే డీకంపోజర్ సీసాలను హైదరాబాద్‌లో అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇది సేంద్రియ రైతులకు మాత్రమే కాకుండా రసాయనిక వ్యవసాయం చేసే రైతులకు కూడా ఉపయోగమేనంటూ.. దీన్ని ఉపయోగిస్తే రసాయనిక ఎరువుల వాడకాన్ని ఈ పంట కాలంలోనే 70 శాతం వరకు తగ్గించుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ 85 వేల మంది రైతుల ద్వారా వేస్ట్ డీకంపోజర్ ద్రావణంతో సేంద్రియ కూరగాయల సాగుకు ఉపక్రమిస్తున్నదని, ఇందుకు తమ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నామన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిది.. రైతులు కంపెనీల వద్ద కొనుగోలు చేయకుండా తమంతట తామే పొలంలో తయారు చేసుకొని వాడుకోదగిన ఇటువంటి బహుళ ప్రయోజనకారి అయిన ద్రావణం ప్రపంచంలో మరే దేశంలోనూ లేదని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. ప్రతిసారీ కంపెనీల నుంచి కొని వాడుకునే జీవన ఎరువు/పురుగుమందులే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేంద్రియ రైతులు పంటల సాగు క్రమంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం వెతకడమే లక్ష్యంగా.. 11 ఏళ్ల పాటు ప్రయోగాలు చేసి తాను ఈ డీకంపోజర్ ద్రావణాన్ని కనుగొన్నానన్నారు. రైతు రూ. 20తో కొంటే.. జీవితాంతం వాడుకోవచ్చన్నారు. ప్రతి 100 లీటర్ల నీటిలో కిలో బెల్లంతోపాటు ఒక డీకంపోజర్ బాటిల్లోని పొడిని కలుపుకోవాలని.. రోజుకోసారి కలియదిప్పుతూ ఉంటే 4 లేదా 5 రోజులకు ద్రావణం లేత గోధుమ రంగులోకి మారుతుందని, అప్పుడు వాడకానికి సిద్ధమైనట్టేనని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. రసాయనిక ఎరువులు అతిగా వాడిన భూముల్లో ఎకరానికి నీటి తడి ఇచ్చిన ప్రతిసారీ 400 లీటర్ల ద్రావణాన్ని సాగునీటిలో కలిపి పారించాలని, 6 నెలల తర్వాత నుంచి 200 లీటర్లు వాడితే సరిపోతుందన్నారు. మోతాదు ఎక్కువైనా నష్టమేమీ ఉండదన్నారు. 6 నెలలకు సేంద్రియ కర్బనం, సూక్ష్మపోషకాలు, ఈసీ విలువ, ఉదజని విలువ సానుకూలంగా మారతాయన్నారు. నెమటోడ్స్‌ను అరికడుతుంది.. 3 దఫాలు సాగునీటితోపాటు ఈ ద్రావణాన్ని ఇస్తే పంటల్లో నెమటోడ్స్ (నులిపురుగుల) సమస్యను అధిగమించవచ్చని డా. క్రిషన్ చంద్ర చెప్పారు. అంతేకాదు మట్టి ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా వచ్చే ఎటువంటి తెగుళ్లనైనా ఇది అరికడుతుందన్నారు. ఏ పంట మీదైనా 10 రోజులకోసారి పిచికారీ చేయాలన్నారు. 20 రోజులలోపు పంట అయితే 3 లీటర్ల ద్రావణాన్ని 7 లీటర్ల నీటిలో కలిపి చల్లాలని.. తర్వాతయితే ఈ ద్రావణాన్ని నీరు కలపకుండానే నేరుగా పిచికారీ చేయాలన్నారు. గుంటూరు, మహబూబ్‌నగర్, కరీంనగర్ తదితర జిల్లాల్లో రైతులు పత్తిలో వాడుతున్నారని, మిర్చిలో వైరస్ సమస్యను అధిగమించారని తెలిపారు. బయోగ్యాస్ తయారీలోనూ ఈ ద్రావణాన్ని వాడొచ్చన్నారు. బయోగ్యాస్ స్లర్రీపై దీన్ని చల్లితే 15 రోజుల్లో చక్కని ఎరువు తయారవుతుందన్నారు. వర్మీ కంపోస్టు బెడ్స్‌లో 70 శాతం తేమ ఉండేలా దీన్ని చల్లితే కేవలం 21 రోజుల్లో చక్కని వర్మీకంపోస్టు సిద్ధమవుతుందన్నారు. ప్రాంతీయ మండళ్ల ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్.. సేంద్రియ రైతులకు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం(పీజీఎస్) ద్వారా సేంద్రియ వ్యవసాయ ధృవీకరణ ఇవ్వడంతోపాటు.. సేంద్రియ వ్యవసాయోత్పత్తుల కొనుగోలుదారులతో రైతులను అనుసంధానం చేయడానికి దేశవ్యాప్తంగా కేంద్ర వ్యవసాయ శాఖ గుర్తింపు పొందిన 600 ప్రాంతీయ మండళ్లు పనిచేస్తున్నాయని డా. క్రిషన్ చంద్ర వివరించారు. ఇందులో 45 ప్రైవేటు ఏజెన్సీలన్నారు. ఒక ఏజెన్సీ హైదరాబాద్‌లో రైతు సేవా కేంద్రాన్ని తెరిచిందని, అక్కడ వేస్ట్ డీకంపోజర్ సీసాలను కూడా రైతులు కొనుగోలు చేయొచ్చన్నారు. పీజీఎస్ గుర్తింపు పొందిన సేంద్రియ రైతులు తమ సొంత గ్రామం, జిల్లా, రాష్ట్ర సంబంధిత ప్రత్యేక బ్రాండ్ల ద్వారా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చన్నారు. పీజీఎస్ గుర్తింపు పొందిన రైతులు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నారని, 30–40 శాతం వరకు అధికాదాయం పొందుతున్నారన్నారు. ప్రపంచ సేంద్రియ మహాసభ న్యూఢిల్లీలో నవంబర్‌లో తొలిసారి జరుగనుందని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. 111 దేశాల నుంచి సేంద్రియ రైతులు హాజరవుతున్నారని, భారతీయ సేంద్రియ ఉత్పత్తులకు అంతర్జాతీయ ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నామన్నారు. బీటీ పత్తి పంట వ్యర్థాలను కుళ్లబెట్టినప్పుడు అందులోని విషం ఎంతవరకు తగ్గుతున్నదనే అంశాన్ని పరిశీలించలేదన్నారు. ఇంటిపంటలకు, దోమల నిర్మూలనకూ వేస్ట్ డీకంపోజర్ ఉపయోగకరమే..! గుర్గావ్ వంటి చోట్ల ‘వేస్ట్ డీకంపోజర్’ ద్రావణాన్ని సేంద్రియ ఇంటిపంటల సాగులో విజయవంతంగా వాడుతున్నారని డా. క్రిషన్ చంద్ర తెలిపారు. ఈ ద్రావణం ఇంటి పట్టున వాడుకోవడానికి సురక్షితమైనదని తెలిపారు. చిన్న బక్కెట్లోకి కొంత వరకు ఈ ద్రావణం తీసుకొని.. అందులో రోజువారీ వంటింటి వ్యర్థాలను వేస్తూ ఉంటే.. 30 రోజుల్లో చక్కని పోషక ద్రావణం తయారవుతుందన్నారు. దీనికి నీరు కలపకుండా నేరుగా సేంద్రియ ఇంటిపంటలకు, మొక్కలకు ద్రవరూప ఎరువుగా, పురుగుమందుగా వాడొచ్చన్నారు. మురుగుకాలువల దుర్వాసనను ఈ ద్రావణం చల్లిన గంటలో పోగొడుతుందన్నారు. దోమలను, ఈగలను సైతం పారదోలుతుందన్నారు. మరుగుదొడ్డి సెప్టిక్ ట్యాంక్‌లో 5 లీటర్ల ద్రావణం పోస్తే ట్యాంకులో వ్యర్థాలు కుళ్లిపోతాయని, గ్యాస్ వల్ల ట్యాంకుకు పగుళ్లు రాకుండా ఉంటాయన్నారు. ఏడాది పాటు పీజీఎస్ సేవలు ఉచితం! హైదరాబాద్‌లోనే ‘వేస్ట్ డీకంపోజర్’ సీసాల విక్రయం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్) ద్వారా సేంద్రియ సర్టిఫికేషన్ పొంద దలచిన రైతులకు ఏడాది పాటు ఉచిత సేవలు అందిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ప్రాంతీయ మండలిగా గుర్తింపు పొందిన మార్క్ అగ్రి జెనెటిక్స్ ప్రై. లిమిటెడ్ డైరెక్టర్ పి. చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తమ వద్ద పేర్లు నమోదు చేయించుకున్న రైతులకు సేంద్రియ సేద్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు సొంత బ్రాండ్‌ను రూపొందించుకొని.. దేశ, విదేశీ మార్కెట్లలో తమ సేంద్రియ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తోడ్పడతామన్నారు. వేస్ట్ డీకంపోజర్ సీసాలను ఘజియాబాద్ నుంచి తెప్పించుకోనవసరం లేదని, హైదరాబాద్‌లోని తమ కార్యాలయం నుంచి రూ. 20లకు కొనుగోలు చేయవచ్చని ఆయన తెలిపారు. వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: మార్క్ ప్రోగ్రీన్ సేంద్రియ రైతుల సేవా కేంద్రం, 416/ఎ, బాబూఖాన్ ఎస్టేట్, బషీర్‌బాగ్, హైదరాబాద్–500001. 040– 23235858, 91009 80757. -
విద్యార్థుల ‘పంట’ పండింది!
► వీఎం హోం రెసిడెన్షియల్ స్కూల్ భూముల్లో కూరగాయల సాగు ► విద్యార్థులకు వారంలో రెండు రోజులు వాటితోనే భోజనం ► ఇటు ఆరోగ్యం.. అటు ఆదా.. ► హోం భూముల పరిరక్షణ కూడా.. ► సాంప్రదాయ పద్ధతుల్లో ఆరున్నర ఎకరాల్లో ఏడు రకాల పంటలు సాక్షి, హైదరాబాద్ : అదో రెసిడెన్షియల్ స్కూల్.. 650 మందికిపైగా పిల్లలు.. వారంలో రెండు రోజులు వారికి స్పెషల్.. స్కూల్ స్థలంలోనే సాంప్రదాయ పద్ధతిలో పండించిన తాజా కూరగాయలతో వారు భోజనం చేస్తారు.. కూరగాయలే కాదు.. చింతపండు దగ్గరి నుంచి కొత్తిమీర వరకూ అన్నీ స్కూల్ స్థలంలో పండినవే. ఎంతో మంది అనాథలు, తల్లిదండ్రులకు దూరమైన పిల్లలను ఆదుకుంటున్న విక్టోరియా మెమెరియల్ (వీఎం) హోం రెసిడెన్షియల్ పాఠశాల మరో ప్రత్యేకత ఇది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు ... వీఎం హోమ్ పాఠశాలలో ప్రస్తుతం 650 మంది పిల్లలు ఉన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా ఈ పాఠశాలను నిర్వహిస్తున్నా.. ఇందులో గురుకుల విద్యా లయాల సొసైటీ నిబంధనలను అమలు చేస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు మాంసాహారాన్ని అందిస్తుండగా.. మరో రెండు రోజుల పాటు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలనే వినియోగిస్తుండటం గమనార్హం. మిగతా రోజులు బయటి నుంచి తెచ్చిన కూరగాయలను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరగడంతో తాము పండిస్తున్న కూరగాయ లు వారంలో రెండు రోజులకు మాత్రమే సరిపోతున్నాయని ప్రిన్సిపాల్ వెంకట్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వీఎం హోమ్ ఆధ్వర్యంలోని తోటలో వంకాయ, బీరకాయ, బెండ, టమాటా, చిక్కుడు, కరివేపాకు, కొత్తమీర, పాలకూర తదితర పంటల్ని పండిస్తున్నారు. తాజాగా వర్షాకాలం నేపథ్యంలో మరిన్ని పంటలు వేయడానికి సిద్ధమవుతున్నారు. ఇక కూరగాయలు పండిస్తున్న స్థలం లోనే 42 పెద్ద చింత చెట్లు కూడా ఉన్నాయి. వాటి నుంచి వచ్చే చింతపండును కూడా హోం కోసం వినియోగిస్తున్నారు. ఒక బోరు.. రెండు ఎడ్లతో... ‘ఆరున్నర ఎకరాల తోటలో ఒకే బోరు ఉన్నా.. పుష్కలంగా నీళ్లున్నాయి. కూరగాయల పంటలకు అవి సరిపోతున్నాయి. టమాటా, బెండ, బీర, సొర, మిరప, వంకాయ తదితర ఒక్కో పంటను పావు ఎకరం స్థలంలో పండిస్తున్నాం. పాలకూర, కొత్తమీర, కరివేపాకు సైతం పండిస్తాం. వ్యవసాయ పని కోసం రెండు ఒంగోలు ఎడ్లను వినియోగిస్తున్నాం. అనాథ పిల్లలకు తాజా కూరగాయలు ఇస్తున్నామని తృప్తిగా ఉంటుంది..’’ – ముత్యాలు, వీఎం హోం తోట నిర్వాహకుడు సాంప్రదాయ పద్ధతిలో సాగు.. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో ఉన్న విక్టోరియా మెమోరియల్ హోమ్ ట్రస్టు పరిధిలో 73 ఎకరాల భూమి ఉంది. అందులో ఆరున్నర ఎకరాలు ఎన్టీఆర్ నగర్ సమీపంలో దూరంగా ఉంది. ఆ భూమిని పరిరక్షించేందుకు ప్రహరీగోడ నిర్మించిన ట్రస్టు.. అందులో పంటలు పండించాలన్న ఆలోచన చేసింది. నెలవారీ వేతనాలపై నలుగురు కూలీలను నియమించుకుని.. వివిధ రకాల కూరగాయలను సాంప్రదాయ విధానంలో సాగుచేస్తున్నారు. ఎరువులు వంటివి తక్కువగా వాడుతూ మంచి దిగుబడిని కూడా సాధిస్తుండటం గమనార్హం. వారిలో మా పిల్లలను చూసుకుంటున్నా.. ‘మా సొంతూరు నారాయణపురం మండలం పుట్టపాక. అక్కడ ఉపాధి లేకపోవడంతో హైదరాబాద్‌కు వలస వచ్చాం. నా ఒక్క కొడుకు కొన్నేళ్ల కింద ప్రమాదంలో చనిపోయాడు. దాంతో మానసికంగా బాగా కుంగిపోయిన. పొట్టకూటి కోసం ఇక్కడ కూలి పనిలో చేరా. జీతం తక్కువ అయినా అనాథ పిల్లల కోసం చేస్తున్నా. ఆ పిల్లల్లో నా కొడుకును చూసుకుంటున్నా..’’ – లక్ష్మమ్మ, తోటనిర్వాహకురాలు అటు రక్షణ.. ఇటు ఆదా. ‘‘వీఎం హోమ్‌కు ఉన్న భూముల్లో ఆరున్నర ఎకరాలు విడిగా, స్కూల్‌కు దూరంగా ఉంది. ఆ భూములు ఆక్రమణకు గురవుతాయనే ఉద్దేశంతో ప్రహరీ నిర్మించి, కూరగాయల సాగు చేపట్టాం. ఈ స్థలంలో ఉన్న నిజాం కాలం నాటి బావిలో ఇప్పటికీ నీళ్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. 15 ఏళ్లుగా పంటలు పండిస్తున్నాం. మధ్యలో కొంత కాలం వ్యవసాయం చేసేవారు దొరకక ఆపేసినా.. మళ్లీ ప్రారంభించాం. తాజా కూరగాయలతో పిల్లలతో కలసి మేం కూడా భోజనాలు చేస్తాం..’’ – వెంకట్‌రెడ్డి, వీఎం హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్. -
16న పండ్ల తోటలు, పాలీహౌస్‌లలో కూరగాయల ప్రకృతి సేద్యంపై శిక్షణ
రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 16న ప్రకృతిసేద్యంలో పండ్లతోటలు, పాలీహౌస్‌ల్లో కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ ఇస్తారు. పండ్ల తోటలు, పాలీహౌస్‌ల్లో కూరగాయల సాగుపై హైదరాబాద్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారు హరిబాబు, చీమకుర్తికి చెందిన శ్రీధర్ బాబు, ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, హేమంత్ రైతులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొంద దలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు. -
అదునుదాటినా..
కడప అగ్రికల్చర్ : తీవ్రవర్షాభావంతో జిల్లాలో కూరగాయల సాగు ప్రశ్నార్ధకంగా మారింది. భూగర్భజలాలు అడుగంటడంతో నర్సరీల యజమానులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కురిసిన జల్లులు వారిలో ఆశలు రేపాయి. దీంతో రైతులు కూరగాయల సాగుకు సిద్ధపడినా ఆగస్టు నెల మొదటి నుంచి చినుకు జాడలేకపోవడంతో కూరగాయ పంటలు సాగయ్యే పరిస్ధితులు కనిపించలేదు. జిల్లాలో సంబేపల్లె, చిన్నమండెం, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, వీరబల్లి, చక్రాయపేట, మైదుకూరు మండలాల్లో అత్యధికంగా ఖాజీపేట, బి.మఠం, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె, వేముల, పులివెందుల, ముద్దనూరు, దువ్వూరు మండలాల్లో తక్కువగా కూరగాయలు సాగుచేస్తారు. ఖరీఫ్ సీజన్లో జిల్లా ఉద్యానశాఖ–1,2 పరిధిలో టమాటా 16 వేల ఎకరాలు, మిరప 7వేలు, వంగ 6వేలు, ఉల్లి 12వేలు, కాకర400, బెండ 600, బీర 160, గోరుచిక్కుడు 90, అలపంద 80, బీన్స్ 70, అనప 45 ఎకరాల్లో సాగు చేస్తారు. బోరుబావుల కింద 22,445 ఎకరాలు, వర్షాధారంగా మరో 20వేల ఎకరాల్లో సాధారణ సాగు కావాల్సి ఉంది. అయితే జూన్ నెలల్లో కురిసిన అరకొర వర్షాలకు కేవలం అన్ని కూరగాయ పంటలు కలిపి జిల్లా వ్యాప్తంగా 2700 ఎకరాలకు మించి సాగు కాలేదు. జులైలో జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురవడంతో రైతులు అరకొరగా చేపట్టారు. జూన్‌లో 69.0 మిల్లీమీటర్లకుగాను 127 మి.మీ వర్షం పడింది. జులైలో 97 మి.మీటర్లు కురవాల్సి ఉండగా 120.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ నెల మొదటి నుంచి చినుకు జాడేలేదు. సాధారణంగా టమాటా, బెండ, మిరప, వంగ, బీర, కాకర, సొర, మటిక తదితర పంటలు వేసేవారు 25 రోజుల వయస్సున్న నారు మొక్కలను నాటుకోవాలని ఉద్యాన అధికారులు చెబుతున్నారు. అయితే నర్సరీల్లో రెండునెలల నుంచి పోసిన నార్లన్నీ ముదిరి పోవడంతో వాటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, గాలివీడు, సుండుపల్లె, చక్రాయపేట, పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె, వేంపల్లె, పులివెందుల, మైదుకూరు, దువ్వూరు, బద్వేలు, కలసపాడు, ఓబులవారిపల్లె, రాజంపేట తదితర మండలాల్లో మొత్తం 350కి పైగా నర్సరీలున్నాయి. వీటన్నింటిలోనూ నారు ముదిరిపోతోందని నిర్వహకులు వాపోతున్నారు. రెండేండ్ల కిందట ఖరీఫ్ సీజన్లో ఒక్కొక్క నర్సరీలో లక్షలాది రూపాయల వ్యాపారం చేసి లాభాలు ఆర్జించామని యజమానులు చెబుతున్నారు. అయితే గత,ఈ ఏడాది వర్షాభావంతో పోసిన నారును అడిగేనాధుడే లేడని అంటున్నారు.నర్సరీల్లో నారుపెంపకానికి విత్తనాలు, ఎరువులు, నారుపెంచే క్రేట్స్ కొనుగోలు చేశామని, తీరా నారు చేతికందుతున్న సమయంలో వానలు కురవకపోవడం, కొనుగోలు దారులు రాక పోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రతి ఏటా నారు నర్సరీకి గిరాకీ ఉండేది. ఈ ఏడాది జూన్ నెలలో వర్షాలు కురవడంతో ఇక ఇబ్బంది లేదను కున్నాను. నారును పెంచాను. అయితే దాదాపు 25 రోజులుగా వానలు పడక నర్సరీలో నారు పెరిగిపోయింది. రైతులు పంటల సాగుకు పూనుకోకపోవడంతో నారు ముదురుతోంది. ఏం చేయాలో అర్ధం కావడంలేదు. –వెంకటేశ్వర్లు, నర్సరీ నిర్వాహకుడు, చిన్నమండెం మండలం. వర్షాభావంతో ఆదాయం కోల్పోయా...: ఈ సీజన్లో నర్సరీ నుంచి నారు మొక్కలు బాగా అమ్ముడుపోతాయని ఆశించాను. రెండున్నర నెలలు అవుతున్నా ఇంతవరకు సరైన వర్షాలు పడలేదు. నర్సరీలో పూల మొక్కలు తప్ప ఇతర నారు ఎవరూ కొనుగోలు చేయడం లేదు. వర్షాభావంతో ఆదాయం కోల్పోయాను. –వి రామచంద్రారెడ్డి, నర్సరీ నిర్వహకులు, పెండ్లిమర్రి మండలం. -
కూరగాయలవైపే మొగ్గు
♦ పెరగనున్న సాగు విస్తీర్ణం కురుస్తున్న వర్షాలు ♦ సాగు వైపు చూపు 50 వేల హెక్టార్లకు చేరుకునే అవకాశం ♦ సబ్సిడీ విత్తనాలతో ప్రోత్సహిస్తున్న ఉద్యాన శాఖ సాక్షి, సంగారెడ్డి: ఈ ఏడాది కూరగాయల సాగు విస్తీర్ణం పెరగనుంది. గత రెండేళ్లు తీవ్ర వర్షాభావంతో జిల్లాలో కూరగాయల సాగు తగ్గుముఖం పట్టింది. వర్షాభావానికి తోడు ఎండ తీవ్రత కారణంగా భూగర్భ జలమట్టాలు పడిపోవడంతో పంట చేతికి రాక రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూరగాయల సాగుకు ఆసక్తిచూపుతున్నారు. వర్షాలు ఆశాజనకంగా ఉండటంతో ప్రస్తుత ఖరీఫ్‌లో కూరగాయలు సాధారణ విస్తీర్ణాన్ని అధిగమించి సాగయ్యే అవకాశాలున్నాయని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో 42 వేల హెక్టార్ల మేర కూరగాయలు సాగు చేస్తారు. గత ఏడాది ఖరీఫ్‌లో కేవలం 31,576 హెక్టార్లలో కూరగాయల సాగు చేశారు. కాగా ప్రస్తుత ఖరీఫ్‌లో 50 వేల హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశాలున్నాయి. ఖరీఫ్ ఆరంభంలో వర్షాలు కురవకపోవటంతో రైతులు అంతగా ఆసక్తి కనబర్చలేదు. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో గజ్వేల్, సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్, సిద్దిపేట, జిన్నారం ప్రాంతాల్లోని రైతులు కూరగాయల సాగును ప్రారంభించారు. నంగనూరు మండలంలో ఎక్కువగా మిర్చి సాగు చేస్తుండటగా, జిన్నారం, సంగారెడ్డి, గజ్వేల్, నర్సాపూర్ ప్రాంతాల్లో టమాటా, బెండ, బీర, సొరకాయ, పొట్లకాయ, కాకర, దొండ, పొట్లకాయ సాగును మొదలు పెట్టారు. రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసిన పక్షంలో కూరగాయలు సాగు పెరగడంతోపాటు బోరుబావుల కింద సైతం సాగు పెరిగే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే జహీరాబాద్ నియోజకవర్గంలోని రైతులు అల్లం సాగును ఆరంభించారు. ఈ నియోజవకర్గంలోని సుమారు మూడువేల ఎకరాల్లో అల్లం పంట సాగవుతోంది. ఇదిలావుంటే ఉద్యానశాఖ అధికారులు ఖరీఫ్‌లో కూరగాయల విత్తనాలు సబ్సిడీపై అందజేస్తున్నారు. గజ్వేల్‌లో అధికం.. జంటనగరాలకు సమీపంలో ఉండటంతో కూరగాయలకు డిమాండ్ పెరిగింది. గజ్వేల్ నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు కూరగాయలు సాగు చేస్తారు. గజ్వేల్‌ను వెజిటబుల్ హబ్‌గా మార్చటంతోపాటు రిలయన్స్, ఐటీసీ, హెరిటేజ్ వంటి సంస్థలు రైతుల నుంచి నేరుగా కూరగాయలను సేకరిస్తున్నాయి. పటాన్చెరు, సంగారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని రైతాంగం బోరుబావులు, ఆరుతడి పంటలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. గత ఖరీఫ్‌లో... గత ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 31,576 హెక్టార్లలో కూరగాయలు, 14,879 హెక్టార్లలో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ సాగైంది. కాగా ఈ ఏడాది 50 వేల హెక్టార్లలో కూరగాయలు మరో 15వేల హెక్టార్లలో పచ్చిమిర్చి, ఇతర పంటలు వేసే అవకాశాలున్నాయి. వర్షాలు కురుస్తుండటానికి తోడు కూరగాయల ధరలు ఆశాజనకంగా ఉంటాయని తెలుస్తోండటంతో రైతులు వీటిపై ఆసక్తిచూపుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 5 నుంచి 7వేల హెక్టార్లు, జహీరాబాద్‌లో 8వేల హెక్టార్లు, సంగారెడ్డిలో 7వేల హెక్టార్లు, పటాన్చెరులో 2వేల హెక్టార్లు, నర్సాపూర్‌లో 3వేల హెక్టార్లు, సిద్దిపేటలో 4వేలు, దుబ్బాకలో 2వేల హెక్టార్ల వరకు సాగు చేసే అవకాశాలున్నాయి. సబ్సిడీపై విత్తనాలు పంపిణీ.. ఈ ఖరీఫ్‌లో కూరగాయల సాగు పెరిగే అవకాశముంది. సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పచ్చి మిర్చి మినహా అన్ని కూరగాయల విత్తనాలను సబ్సిడీపై అందజేస్తోంది. కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసే రైతులకు ఎప్పటికప్పుడు అవసరైమన సూచనలిచ్చేందుకు ఉద్యానశాఖ అధికారులను అందుబాటులో ఉంచాం. - రామలక్ష్మి, డీడీ, ఉద్యానశాఖ -
మహిళా రైతు ఆత్మహ త్య
అప్పుల బాధ భరించలేక మహిళా రైతు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం అక్కిరెడ్డిపాలెం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నారపిన్ని కాసులమ్మ(45) తనకున్న 90 సెంట్ల(ఎకరానికి కొంచె తక్కువ) భూమిలో కూరగాయాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో పిల్లల పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులతో పాటు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు 10లక్షల వరకూ పెరిగి పోవడంతో.. వాటిని తీర్చే దారి కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు ఆమెను అనకాపల్లి ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. -
కూర ‘గాయాల’ సాగు
వరంగల్ : రైతులకు ఆర్థికంగా చేదోడుగా నిలిచిన కూరగాయల సాగు ఇప్పుడు భారంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతలు, పెట్టుబడి పెరగడంతో రైతులకు కనీస లాభదాయకంగా లేక ఈ సాగుకు దూరమవుతున్నారు. తక్కువ భూమి, మార్కెట్ అందుబాటులో ఉన్న నగర పరిసర గ్రామాల రైతుల్లో ఇప్పుడు కూరగాయ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. రోజువారీ ఆదాయం లభిస్తుందనే ఆశతో రెండు దశాబ్దాలుగా ఈ సాగును నమ్ముకున్న రైతులు క్రమంగా దూరమవుతున్నారు. కూరగాయల సాగు పూర్తిగా బోర్లు, బావులపైన్నే ఆధారపడి సాగుతోంది. వేళాపాలాలేని విద్యుత్‌కోతలు, భూగర్భ జలాల సమస్యతోపాటు పెట్టుబడికి తగిన గిట్టుబాటు లేక పోవడంతో రైతుల్లో క్రమంగా మోజు తగ్గింది. నిన్నమొన్నటి వరకు కూరగాయలపైనే ఆధారపడిన రైతులు సైతం క్రమంగా దూరమవుతున్నారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో కూరగాయల ఉత్పత్తి లేకపోవడం, దళారీల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ప్రజావసరాలు తీర్చేందుకు దూర ప్రాంతాల నుంచి కూరగాయాలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల రవాణా చార్జీల భారం, కమీషన్లు తడిసి మోపెడవుతున్నాయి. తగ్గిన సాగు ఖిలావరంగల్, కరీమాబాద్, న్యూశాయంపేట ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద విస్తీర్ణంలో సాగేది. నగరం చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హన్మకొండ, వర్ధన్నపేట, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, నర్సంపేట, ధర్మసాగర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో కూరగాయల సాగుపైనే ఆధారపడే వారు. ఎక్కడ చూసినా కూరగాయల తోటలే కన్పించేవి. చిన్న, సన్నకారు రైతులు తమకున్న తక్కువ భూమిలోనే సాగు చేసేవారు... ఇంటిల్లిపాది శ్రమించేవారు. వేలాది మంది ఇదే ప్రధాన ఆదాయంగా ఎంచుకునేవారు. సీజన్‌వారీగా అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలతో పాటు ఉల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పండించే వారు. వరంగల్ లక్ష్మీపురంలోని పెద్ద మార్కెట్ దగ్గర ఉండం, సానుకూల రవాణా వసతి కారణంగా కూరగాయల సాగు చేపట్టేవారు. రోజువారీ ఆదాయాన్ని తమ కుటుంబాల అభివృద్ధికి వినియోగించేవారు. ఇటీవల ఈ గ్రామాల్లో పరిస్థితి మారింది. ఈ సాగు లాభసాటిగా లేకపోవడంతో ఇతరత్రా పనులవైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయాల సాగుకు సస్యరక్షణ సమస్యలు అడ్డుగా నిలుస్తాయి. విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల ధరలు రెట్టింపు పెరిగాయి. ఇంతచేస్తే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్లో ధర లేకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలను ధరవచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఒక్కోసారి పంటను పెంటపాలు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారణంగా మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు వాణిజ్యపంటవైపు దృష్టిసారిస్తున్నారు. తగ్గిన దిగుబడులు వరంగల్ లక్ష్మీపురంలోని మార్కెట్లో 400 మంది హోల్‌సేల్, 600 మంది రిటైల్ వ్యాపారులు లావాదేవీలు సాగిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాపారం చేసే వారు సగం మాత్రమే ఉంటారు. మరో 200 మంది చిరువ్యాపారులు రోడ్డుపై అమ్మకాలు సాగిస్తున్నారు. రైతుల నుంచి కమీషన్ పద్ధతిలో సరుకులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 4శాతం నుంచి 6శాతం క మీషన్ వసూలు చేస్తున్నారు. మంచి సీజన్లో ఈ మార్కెట్‌కు ఆకుకూరలు, కూరగాయలు కలిపి 1200 నుంచి 1500 క్వింటాళ్ల సరుకు వచ్చేది. ప్రస్తుతం సరుకు రాక తగ్గుతోంది. ఈ కారణంగా ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి తోడు సరుకు చేతులు మారి వినియోగదారుడి వద్దకు చేరే సరికి ధర రెట్టింపవుతోంది. సీజన్లో రూ. 20 నుంచి 25లక్షల టర్నోవర్ ఉంటుంది. ప్రస్తుతం టర్నోవర్ తగ్గిపోయింది. పెరిగిన దిగుమతులు జిల్లా నుంచి కూరగాయల రాక తగ్గడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున రవాణాచార్జీలు, శ్రమ కలిసి ధర పెరుగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం, కర్నూలు, చింతామణి, ఆదిలాబాద్ జిల్లా ధనోరా, కరీంనగర్ రైతుబాజర్, సిద్ధిపేట, ఒంటిమామిడిపల్లి ప్రాంతాల నుంచి టమాట, బీరకాయ, పచ్చిమిర్చి, కందలు తీసుకొస్తున్నారు. రోజుకు ఈ ప్రాంతాల నుంచి 150 నుంచి 200 క్వింటాళ్ల టమాట దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా 20 శాతం సరుకు మాత్రమే వస్తున్నది. మిగిలిన ప్రాంతాల నుంచి 80శాతం దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా ధరలు పెరిగి జనం బేజారవుతున్నారు. ధరల భారం కూరగాయల ధరలు బాగా పెరిగాయి. మండుతున్న కూరగాయల ధరలతో పాటే సామాన్యుని గుండె మండుతోంది. చేతినిండా డబ్బు తీసుకపోయినా చేయి సంచి నిండని పరిస్థితి నెలకొంది. నగరంలోని లక్షలాది మందితో పాటు జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాలకు సైతం వరంగల్ ప్రధాన మార్కెట్ నుంచే వ్యాపారులు, వినియోగదారులు కొనుగోలు చేస్తారు. ఇక్కడ హోల్‌సేల్‌తో పాటు రిటేల్ వ్యాపారం సాగుతోంది. రైతుల చేతిలున్నపుడు ధర లభించడంలేదు. దళారీల పాత్ర వల్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. క్రమంగా సాగు తగ్గి ధరలు పెరుగుతున్నాయి. -
సేద్యమేవ జయతే!
మూడెకరాల్లో పంటలతో యేటా రూ.2.5 లక్షల ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చౌదర్పల్లి రైతు రాములు మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రాములుకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండు బోరుబావుల్లోని కొద్దిపాటి నీటితో ఇంటి అవసరాలకు సరిపోను వరి పండిస్తున్నాడు. మిగతా పొలంలో బిందుసేద్యంతో కూరగాయలు పండిస్తున్నాడు. అక్షర జ్ఞానం లేని రాములు వ్యవసాయాధికారుల సూచనలను కచ్చితంగా పాటిస్తుంటాడు. ఏయే సీజన్లలో ఆయా కూరగాయలు పండిస్తున్నాడు. నిత్యం 5 నుంచి 10 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ.250 వరకు కూలిడబ్బులు ఇస్తుంటాడు. దిగుబడులను సరూర్‌నగర్ రైతు బజారులో విక్రయిస్తుంటాడు. యేటా కూరగాయల విక్రయాలతో రూ.6 లక్షలు వస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు, కూలీల ఖర్చులుపోను రూ. 2.5 లక్షలు మిగులుబాటవుతోందని చెబుతున్నాడు రాములు. రైతు సదస్సులన్నీ రాములు పొలంలోనే.. బిందుసేద్యంతో పలు రకాల కూరగాయలు పండిస్తూ.. రాములు మంచి లాభాలు పొందుతుండడంతో మిగతా గ్రామాల రైతులకు సూచనలు, సలహాలు తెలియజేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తరచూ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ‘మేం చదువుకున్నవాళ్లమైనా నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని రాములుతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఏడాది క్రితం అప్పటి ఉద్యాన శాఖ కమిషనర్ రాణీకుముదిని.. రాములు కూరగాయల పంటలు చూసి అభినందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఉద్యానశాఖ అధికారులు కనకలక్ష్మి, యాదగిరి, వ్యవసాయాధికారులు కవిత, సందీప్‌కుమార్, లక్ష్మణ్ తదితరులు రాములును ఆదర్శంగా తీసుకుని కూరగాయలు సాగు చేసుకోవాలని మిగతా గ్రామాల రైతులకు సూచిస్తున్నారు. ఇటీవల రాములు వ్యవసాయ పొలంలో సదస్సుకు వచ్చిన మైక్రో ఇరిగేషన్ ఏపీడీ హరిప్రసాద్‌రెడ్డి ఆయనను అభినందించారు. నిత్యం 12 గంటలు శ్రమిస్తూ.. టమాటా, చిక్కుడు, బెండ, దోస, కీర, దొండ, కాకర, వంగ, బీర, మిర్చి, పొట్లకాయ, దోస, మునగ పంటలను రాములు సాగు చేస్తున్నాడు. నిత్యం 12 గంటల పాటు శ్రమించడంతో పాటు రోజూ సరూర్‌నగర్ రైతు బజారుకు వెళ్లి కూరగాయల విక్రయించడం, మళ్లీ మధ్యాహ్నం వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంటాడు. -
కూరగాయలపై కరువు ప్రభావం
మేడ్చల్ రూరల్: తీవ్ర వర్షాభావం కారణంగా కూరగాయల పంట సాగు తగ్గింది. దీంతో వాటి ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో లేకుండాపోతున్నాయి. ఇటీవల 10 రోజు లుగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఏ కూరగాయ చూసినా కిలోకు రూ.40 పలకడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. మేడ్చల్ మండల పరిసర ప్రాంతాల్లో వరి పంట సాగు తర్వాత అధికంగా కూరగాయల సాగు రైతులు చేపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవడంతో కూరగాయల పంట గణనీయంగా తగ్గింది. చెదురుమదురు వర్షాలకు అక్కడక్కడా వేసిన పంటలతో ఇన్ని రోజులు కూరగాయల దిగుబడి రావడం తో సాధారణ ధరలు పలికినా ప్రస్తుతం వాటి ధరలు పెరుగుతున్నాయి. కరువుతో భూగర్బ జలాలు అడుగంటాయి. బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. ఇప్పటికే వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోయి రైతులు విలపిస్తున్నారు. రబీలో వ్యవసాయ సాగు చేయాలంటేనే భయపడుతున్న రైతులు మిన్నకుండిపోవడంతో కూరగాయల సాగు తగ్గింది. ఈ ప్రభావం ఇప్పుడిప్పుడే వినియోగదారులపై పడుతోంది. రబీ ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే ముందు ముందు ఎలా ఉంటుందో అని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వర్షపాతం నమోదు గణనీయంగా తగ్గింది. ఈ సంవత్సరం మేడ్చల్ మండంలో జూన్ మాసం నుంచి అక్టోబర్ నెల చివరి వరకు 746.6 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికి బదులుగా కేవలం 425.8 మి.మీ. వర్షపాతం నమోదయ్యింది. ప్రతి కూరగాయ కిలో రూ. 40పైనే.. మేడ్చల్ మార్కెట్లో ప్రతి కూరగాయ రూ 40పైనే చేరుకున్నాయి. 10 రోజుల క్రితం రూ.20 నుంచి రూ.25 ఉన్న కూరగాయలు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం వీటి ధర రూ.40 కన్నా తక్కువ లేకుండా ఉండటంతో సామాన్యులు ఆందోళనకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. మేడ్చల్ మార్కెట్లో చిక్కుడు కిలో రూ.60, బీర, బీర్నిస్ రూ.45, బెండ, గోరుచిక్కుడు, దొండ, వంకాయ, కాకర, పచ్చిమిర్చి రూ.40 ధర పలుకుతున్నాయి. టమాటా మాత్రం 15 ఉండటంతో కాస్త ఊరట కలిగించే అవకాశం. రబీ ప్రారంభంలోనే కూరగాయ ధరలు పెరుగుతుండడంతో భవిష్యత్‌లో వీటి ధరలు ఏ విధంగా ఉంటాయోనని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. -
కూరగాయలతో లాభాల బాట
బాల్కొండ: మండలంలోని పలువురు రైతులు వాతావరణానికి అనుకూలంగా పంటమార్పు చేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుపై దృష్టి సారిస్తున్నారు. మండలంలోని బుస్సాపూర్ గ్రామ రైతులు పంట మార్పిడి చేసి కూరగాయలకు సాగు చేయుటకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన పంటలైన మొక్క జొన్న, సోయా, జొన్న, సజ్జ , పసుపు పంటలను అధిక మొత్తంలో సాగు చేయడం వల్ల డిమాండ్ తగ్గి రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదు. దీంతో రైతులు కూరగాయల వైపు మళ్లుతున్నారు. గేదే నిత్యం పాలిచ్చినట్లు కూరగాయల వలన రైతులకు నిత్యం డబ్బులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. అందకే ఎకరాల్లో వంకాయ, టమాట, కొతిమీర, పువ్వుగోబీ, గోబీగడ్డ , బెండకాయ, బీరకాయలను అధిక ంగా సాగు చేస్తున్నారు. అన్నివేళల పనికి వచ్చే మిరప సాగును కూడా పెంచారు, ఇలా పలు రకాల కూరగాయలను రైతులు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఆలుగడ్డను కూడా సాగు చేస్తున్నారు. పంట మార్పిడితోనే దిగుబడి పెరుగుతుందని అధికారులు సూచించడంతో రైతులు కూరగాయల సాగుబాట పట్టారు. బుస్సాపూర్‌లో ఓరైతు అరఎకరంలో గోబీ, అందులోనే అంతర్ పంటగా కొతిమీర సాగు చేశాడు. ఇలా రైతులు రకరకాల ప్రయోగాలను చేస్తు ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు పొందుతున్నారు. మార్కెట్లు అందుబాటులో లేక.. కూరగాయల విక్రయాలకు రైతులకు మార్కెట్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాల్కొండ మండలంలో కూరగాయలు సాగు చేసే రైతులు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లేదా ఆర్మూర్ సమీపంలో ఉన్న పెర్కిట్, అంకాపూర్ మార్కెట్లకు తీసుకెళ్లాలి. దీంతో రైతులకు రవాణా భారం అధికమవుతోంది. ప్రభుత్వం స్పందించి, స్థానికంగా మార్కెట్లు ఏర్పాటు చేసి, కూరగాయలను సాగు చేసే రైతులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. -
స్వర్ణముఖిపై భూ రాబందులు!
ఆక్రమిత భూముల్లో ఆకు కూరల సాగు యథేచ్ఛగా ఆక్రమణలు మురుగునీరే సాగునీరు వ్యాపిస్తున్న వ్యాధులు చోద్యం చూస్తున్న అధికారులు స్వర్ణముఖి. ఈ నది పవిత్రతకు మారుపేరు. కనుచూపు మేరా ఇసుక.. పవిత్ర జలం..ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిలేదు. మురుగు నీటికి, ఆక్రమణలకు నిలయంగా మారింది. కొందరు ఇసుకను సైతం చదునుచేసి పంటలు వేస్తున్నారు. వీటికి గృహాలు, హోటళ్లు, లాడ్జీల నుంచి వచ్చే మురుగునీటిని మళ్లిస్తున్నారు. ఇక్కడ పండించే ఆకు కూరలు చూసేందుకు పచ్చగా, ఏపుగానే ఉంటాయి. లోతుగా చూస్తే గానీ తెలియదు అది మురికినీటితో సాగు చేసిన పంట అని. ఇది తెలియక వినియోగదారులు కొనుగోలుచేసి ఆస్పత్రుల పాలువుతున్నారు. శ్రీకాళహస్తి టౌన్: శ్రీకాళహస్తి పట్టణానికి ఆనుకుని స్వర్ణముఖి నది ఉంది. ఒకప్పట్లో ఈ నది పవిత్రతకు మారుపేరుగా ఉండేది. ఇప్పుడు ఆక్రమణలకు నిలయంగా మారింది. నది సమీపంలో ఉన్న కొందరు యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. రామసేతు వంతెన వద్ద ఈ తంతు మరీ ఎక్కువ. నది కట్టకు ఆనుకుని ఉన్న ఇసుకను చదును చేసి సుమారు ఎకరా విస్తీర్ణాన్ని తమ అదుపులో ఉంచుకున్నారు. ఈ స్థలం చుట్టూ కంప నాటి ఎంచక్కా పంటలు వేస్తున్నారు. ఆకుకూరలే ప్రధాన పంటలు ఆక్రమిత స్థలంలో చిర్రాకు, తోటాకు, పుల్లగూర, పచ్చలకూర, కొత్తిమీర ఇలా రకరకాల ఆకుకూరలు సాగుచేస్తున్నారు. మురుగు నీటికారణంగా పంట ఏపుగా వస్తోంది. నెలకు రెండు పంటలు వేయవచ్చు. ఎండాకాలంలోనూ నీటి సమస్య ఉండదు. అడిగేవారు లేకపోవడంతో రోజురోజుకూ ఆక్రమణల జోరు పెరుగుతోంది. మార్కెట్ల నిండా ఇక్కడి పంటలే ఇక్కడ పండించే ఆకుకూరలు స్థానిక మార్కెట్‌కు, నాయుడుపేట, రేణిగుంట, ఏర్పేడు, మల్లారం, తిరుపతి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఆకు ఏపుగా పెరిగి నిగనిగ మెరవడంతో విని యోగదారులు భారీ ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. చిర్రాకు కట్ట రూ.7కుపైగా విక్రరుుస్తున్నట్టు తెలుస్తోంది. అన్‌సీజన్ లో రూ.పదికి పైనే. వ్యాధులు ఖాయం మురుగునీటి కారణంగా పండించే ఆకుకూరలు తినడం వల్ల వ్యాధులు సక్రమిస్తున్నారుు. టైఫాయిడ్, మలేరియూ, స్కిన్ అలర్జీ తదితర రోగాలు సోకుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఆస్పత్రికి వెళ్లితే కానీ అసలు విషయం తెలియడంలేదు. అక్కడి వైద్యులు ఆహా ర పదార్థాల వల్ల వ్యాధులు ప్రబలుతున్నట్టు చెబుతున్నారని పలువురు రోగులు అంటున్నారు. భూగర్భజలాలూ కలుషితం పట్టణం నుంచి వచ్చే మురుగు నీటిని చెంబేడు కాల్వకు మళ్లిస్తున్నారు. ఇందుకోసం స్వర్ణముఖి నదిలో పైప్లైన్లు ఏర్పాటు చేశారు. మరో వైపు రామసేతు వంతెన అవతల, ఇవతల మురుగునీరు నదిలోకి ప్రవహిస్తోంది. ఈ నీరు నదిలో ఏర్పాటు చేసిన బావుల చుట్టూ చేరుతోంది. ఫలితంగా భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికే మూడు బావులను మూసివేశారు. కొన్ని కాల్వల నుంచి వచ్చేనీటిని నదిలో ఆక్రమిత భూములకు మళ్లిస్తున్నారు. కళ్లెదుటే ఆక్రమణలు కనిపించినా స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
రైతన్న మేడెక్కిన ఇంటిపంట!
ఒకటికి నాలుగు ఆహార పంటలు పండించుకునే రైతు కుటుంబాలకు ఇంట్లో వండుకు తినడానికి కూరగాయలు, ఆకుకూరలకు కొదవ ఉండదు. అయితే, బహుళ పంటలు పండించుకునే అలవాటు చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయింది. పొలంలో ఒకటో, రెండో పంటలను మాత్రమే(అది కూడా వాణిజ్య పంటలు) సాగు చేస్తూ.. పండీ పండగానే అక్కడికక్కడే అమ్మి అప్పులు తీర్చే పరిస్థితులొచ్చాక.. ఇక ఇంటి అవసరాలకు పొలం నుంచి కూరగాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏడాది పొడవునా కొనుక్కొని తినాల్సిందే గదా! ఇప్పుడు చాలా రైతు కుటుంబాల దుస్థితి ఇదే. కూరగాయల ధరలు మండిపోతున్న దశలో భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తున్న దుర్గతిని అధిగమించేందుకు ఒక చిన్న రైతు కుటుంబం ముందడుగు వేసింది. - 150 డ్రమ్ముల్లో సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల సాగు - 3 కుటుంబాలకు చేదోడు మేడ మీద కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించుకునే అవసరం సెంటు పొలంలేని పట్నవాసులకే కాదు.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న తమ వంటి గ్రామీణ రైతు కుటుంబాలకు కూడా ఎంతగానో ఉందని చాటి చెబుతున్నారు యువ రైతు అన్నారం రవీందర్ గౌడ్(35), మౌనిక దంపతులు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గు మండల పరిధిలోని శ్రీరంగాపూర్ వీరి స్వగ్రామం. ఎస్సెస్సీ వరకు చదివి వ్యవసాయంలో స్థిరపడిన రవీందర్‌కు ఇద్దరు సోదరులున్నారు. వారి కుటుంబాలూ అదే గ్రామంలోనే కాపురం ఉంటున్నారు. తలా రెండెకరాల పొలం ఉంది. తన రెండెకరాల్లో బోరు కింద వరి, పత్తి వంటి పంటలు పండిస్తున్న ఆయన బోరు మెకానిక్ షాపు కూడా నిర్వహిస్తూ.. సొంత పక్కా భవనంలో నివసిస్తున్నాడు. ఈ ఏడాది వర్షం లేకపోవడంతో పత్తి వేయడం మానేసి.. రెండు కుంటల్లో వరి ఊడ్చాడు. ఇంటి ముందున్న పాత తొట్టిలో పడి మొలిచిన టమాటా మొక్క చాలా కాయలు కాసింది. ఇది రెండేళ్ల నాటి ముచ్చట. ఇంటి అవసరాల కోసం రెండు మూడు రోజులకోసారి రూ.50-100లు పెట్టి కూరగాయలు, ఆకుకూరలు కొనేవారు. మనం కొనడం ఎందుకు? మేడ మీద కొన్ని కుండీలు పెట్టుకొని సొంతంగా పండించు కోవచ్చు కదా? అన్న ఆలోచన వచ్చింది. ఆ క్షణంలోనే రవీందర్ మదిలో ఇంటిపంటకు బీజం పడింది. గత ఏడాది వర్షాకాలం ప్రారంభంకాగానే పూర్తిస్థాయిలో మేడ మీద ఇంటిపంటల సాగుకు శ్రీకారం చుట్టారు రవీందర్ దంపతులు. వారి మేడ మీద 150 చదరపు గజాల స్థలం ఉంది. వాడేసిన 50 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ములు 75 కొని తెచ్చాడు రవీందర్. ఒక్కో డ్రమ్మును సగానికి కోశాడు. 150 చిన్న డ్రమ్ములు సిద్ధమయ్యాయి. వాటికి అడుగున నీరు బయటకుపోవడానికి రెండు, మూడు చిల్లులు పెట్టాడు. మట్టి, పశువుల ఎరువును సమపాళ్లలో కలిపిన మట్టి మిశ్రమాన్ని నింపి.. షాద్‌నగర్‌లోని నర్సరీ నుంచి తెచ్చిన నారు, విత్తనాలు వేశారు. టమాటా, వంగ, మిర్చి మొక్కలు నాటారు. చెట్టుచిక్కుడు, సొర, బీర వంటి తీగజాతి గింజలు, తోటకూర, గోంగూర, కొత్తిమీర వంటి ఆకుకూరల గింజలు విత్తారు. ఒక్కో డ్రమ్ములో రెండు, మూడు చొప్పున వివిధ కూరగాయ మొక్కలు నాటాడు. పొలం కోసమని సబ్సిడీపై తెచ్చిన డ్రిప్ లేటరల్ పైపులు కొన్ని తెచ్చి ఏర్పాటు చేసి, మేడ మీదున్న నీటి ట్యాంకుకు అనుసంధానం చేశాడు. వాల్వు తిప్పగానే మొక్కలన్నిటికీ డ్రిప్ ద్వారా నీరందే ఏర్పాటు చేయడంతో పని తగ్గిపోయింది. సహజ కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవాలన్న ఆసక్తితో సేంద్రియ ఎరువుతో సాగు ప్రారంభించిన రవీందర్.. ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు నెలకోసారో, రెండు సార్లో వేప నూనెను తన భార్య పిచికారీ చేస్తుంటుందని చెప్పాడు. రోజూ పెద్దలూ పిల్లలూ టై కిచెన్ గార్డెన్‌ను పరిశీలిస్తూ.. కలుపు మొక్కలు కనిపిస్తే తీసేస్తుంటారు. అంతే.. చూస్తుండగానే మొక్కలు రసాయనిక అవశేషాల్లేని, తాజా ఆకుకూరలు, కూరగాయలు అందుబాటులోకి వచ్చాయి. ఆలుగడ్డలు తప్ప.. అప్పటి నుంచీ తమ కుటుంబంతోపాటు తన ఇద్దరు సోదరుల కుటుంబాలు కూడా ఆలుగడ్డల్లాంటివి తప్ప ఆకుకూరలు, కూరగాయలు కొనాల్సిన అవసరం రావడం లేదని రవీందర్ సంతోషంగా చెప్పాడు. కొద్ది నెలల క్రితం టమాటా కిలో రూ. 70లు అమ్మిన రోజుల్లో కూడా తమ మేడ మీద కోసినప్పుడల్లా నాలుగైదు కిలోల టమాటాలు వచ్చేవని చెప్పాడు. గత ఏడాది నాటిని మొక్కల్లో టమాటా కాపు అయిపోయింది. చెట్టు చిక్కుడు మొక్కలు కాపు అయిపోయిన తర్వాత కూడా మళ్లీ ఇప్పుడు చిగుళ్లు వచ్చి కాపుకొచ్చాయి. టమాటా, వంగ మొక్కలు మళ్లీ నాటారు. మేడ మీద మొక్కలుండడం వల్ల గత ఎండాకాలంలో ఇంట్లో ఉబ్బరం తక్కువగా ఉందని, చల్లగా ఉందని రవీందర్ తెలిపాడు. ఇంటిముంగల కూరగాయ మొక్కలు పెట్టుకోమని ఉద్యాన శాఖ వాళ్లు కిట్లు ఇచ్చినా గ్రామస్తులు పెద్దగా స్పందించని పరిస్థితు ల్లో రవీందర్ తన మేడ మీద భారీగా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు పండించడం స్థానికం గా చర్చనీయాంశమైంది. అయితే, కొందరు వివ రాలు అడిగి తెలుసుకున్నారే తప్ప ఇప్పటి వరకు ఎవరూ మొదలు పెట్టలేదని రవీందర్ చెప్పాడు. కొత్తదారి తొక్కేవాడెప్పుడూ ఒక్కడే కదా! - గుట్టల్ల బాలయ్య, కొందుర్గు, మహబూబ్‌నగర్‌జిల్లా రోజూ తాజా కూరగాయలు దొరుకుతున్నాయి.కూరగాయల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంటివద్దనే పెంచుకోవడం వల్ల రోజు తాజా కూరగాయలు దొరుకుతున్నాయి. ఖర్చూ పెద్దగా లేదు. ఆకుకూరలు, పూలమొక్కలను కూడా కుండీలలో పెంచుకుంటున్నాం. - అన్నారం మౌనిక, గృహిణి, శ్రీరంగాపూర్, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ ఈ పంటయ్యాక మట్టి మార్చేస్తా! ప్రస్తుత పంటయ్యేటప్పటికి మొక్కల వేళ్లు డ్రమ్ముల్లో మట్టి నిండా నిండిపోతాయి. పంట పూర్తయిన తర్వాత డ్రమ్ముల్లోని మట్టిని గుమ్మరించి.. కొత్త మట్టి + పశువుల ఎరువు కలిపి మళ్లీ నింపుతా. నిమ్మ, బత్తాయి మొక్కలు కూడా డ్రమ్ముల్లో వేద్దామనుకుంటున్నా.. - అన్నారం రవీందర్ గౌడ్ (93945 22416), రైతు, శ్రీరంగాపూర్, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ తక్కువ చోటుందా? మేడ మీదనో, పెరట్లోనో ఎండ తగిలే చోటు ఒకటి, రెండు గజాలకు మించి లేదు.. అయినా, సేంద్రియ ఆకుకూరలు సాగు చేయాలనుంది! అప్పుడేం చేయాలి? ఇలాంటి ప్రశ్నలో నుంచి పుట్టిందే ఈ ఆలోచన! పుస్తకాల రాక్ మాదిరిగా ఇలా ఆకుకూరల మడి(వర్టికల్ గార్డెన్)ను పెట్టుకుంటే సరి! ఇనుప రాక్ వంటి ఫ్రేమ్ చేయించి, దానికి అవసరం మేరకు షేడ్‌నెట్‌ను కుట్టి.. చిన్న ట్రేలలో ఆకుకూరలు పెంచుకోవచ్చు. మరీ ఎండ ఎక్కువ అవసరం అనుకున్న మొక్కలను పై అంతస్తులో వేసుకోవాలి. ఆకుకూరలను తరిగి సలాడ్సగా ఉపయోగించడం చాలా ఆరోగ్య దాయకం అని వైద్యులు చెబుతున్నారు. గ్రీన్ సలాడ్స్‌లోకి అవసరమైన మైక్రో గ్రీన్స్‌ను కూడా ఈ పద్ధతిలో ఎంచక్కా పెంచుకోవచ్చు. ఆకుకూర లేకాకుండా కొన్ని పప్పు ధాన్యాలు, నూనెగింజల రకాలను కూడా వత్తుగా మొలకెత్తించి రెండు అంగుళాలు ఎదిగిన మొక్కలను సలాడ్సలో వినియోగిస్తున్నారు. 3,4 అంగుళాల లోతుండి, వెడల్పుగా ఉండే ట్రేలను ఎంపిక చేసుకొని ఉపయోగించవచ్చు. కొబ్బరిపొట్టు, వర్మీ కంపోస్టు గానీ లేదా చివికిన పశువుల ఎరువు గానీ సమపాళ్లలోను, కొద్దిగా మట్టిని కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ట్రేలలో నింపి మైకోగ్రీన్స పెంచవచ్చు. అడపాదడపా జీవామతం, వర్మీవాష్, కంపోస్టు టీ, అమత్పానీ.. వీటిల్లో ఏది వీలైతే అది పిచికారీ చేసుకుంటే చాలు! కావాల్సిన ఎత్తులో కావల్సినన్ని అరలతో బోల్టు ల బిగింపు ద్వారా సులభంగా సిద్ధం చేసుకునే ఇనుప రాక్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇల్లు మారేటప్పుడైనా.. ఇప్పుడు అవసరం లేదనుకు న్పప్పుడైనా ఆ రాక్ల బోల్టులు విప్పేసి బస్తాలో కట్టేసి అటక మీద పెట్టేసుకునే వెసులుబాటు ఉంటుంది. -
‘సాఫ్ట్వేర్’ రైతు
మేడ్చల్ రూరల్: ఆయనో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలవారీ వేతనం వేలల్లోనే ఉంటుంది. అయినా జీవితంలో ఇంకా ఏదో సాధించాలనే తపన. చిన్నప్పటినుంచీ వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. ప్రజలకు సేంద్రియ ఎరువుల తో పండిన ఆకుకూరలు, కూరగాయలు అందించాలనే లక్ష్యం ఉండేది. ఇంకేముంది.. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యవసాయంపై దృష్టి సారించాడు. సేంద్రియ పద్ధతిలో కూరగాయల పంటలు పండిస్తున్నాడు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు జాన్ ఇజ్రాయిల్ రావూరి. మేడ్చల్‌కు చెందిన జాన్ ఏడాదిన్నర క్రితం మండలంలోని గిర్మాపూర్, మండమాదారం గ్రామాల్లో ఏడెకరాల భూమిని లీజ్‌కు తీసుకుని లాభసాటిగా సేంద్రియ వ్యవసాయ సాగు చేస్తున్నాడు. ఆవు పేడ, మూత్రం, ఆకు కషాయంతో తక్కువ పెట్టుబడి పెట్టి వ్యవసాయం మెలకువలు నేర్చుకుని, నలుగురికి మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. అంతే కాకుండా పండిన పంటలను తానే మార్కెట్లో నేరుగా వినియోగదారులకు విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నాడు. వ్యవసాయం వైపు దృష్టి సారించడానికి కారణాలేమిటి తదితర అంశాలు జాన్ ఇజ్రాయిల్ మాట ల్లోనే... సేంద్రియ వ్యవసాయమే ఉత్తమం.. వ్యవసాయంలో సేంద్రియ పంటలు రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయని తెలుసుకున్నా. మనమెందుకు ఇలాంటి వ్యవసాయం చేయకూడదనుకుని ఈ పద్ధతిలో సాగు చేపట్టాను. దీనికి తోడు ఒకే రకం పంటలు కాకుండా తక్కువ భూమిలో ఎక్కువ రకాల పంటలు వేస్తున్నాను. మన పూర్వీకులు సారవంతమైన భూమిలో పంటలు ఎలా పండించారో ఆ విధంగా మనం కూడా పంటలు పండించాలని జీవామృత ఎరువుతో పంటల సాగు చేపడుతున్నాను. ఆవు పేడ, మూత్రం, బెల్లం, శనగ పిండితో జీవామృతాన్ని తయారుచేసి ఎరువుగా ఉపయోగిస్తున్నాను. చెట్ల ఆకులను, జనుము, జీలుగను ఎరువుగా వాడుతున్నాను. నేరుగా వినియోగదారులకే విక్రయం.. పండించిన కూరగాయలను నేరుగా వినియోగదారుల ఇళ్లకు వె ళ్లి అందిస్తున్నాను. కొందరు రైతులు మార్కెట్ చేయడం తెలియక నష్టపోతున్నారు. నూతన పద్ధతితో కూరగాయల విక్రయాలు చేపట్టాలని ఒక కవరులో ఎనిమిది రకాల కూరగాయలు ఒక్కోటి అరకిలో చొప్పున, అయిదు రకాల ఆకు కూరలు 5 కట్టల చొప్పున ప్యాక్‌చేసి రూ.350కు వినియోగదారులకు చేరవేస్తున్నాను. ఈ పద్ధతి కోసం ఇతర రైతులకు ప్రోత్సాహం అందించి వారితో కొన్ని రకాల పంటలు వేయిస్తున్నాను. ఇలా ప్రతి రోజు వినియోగదారులకు ప్యాక్ చేసి ఇస్తున్నాను. వారంలో వంద మందికి అందించాలనే లక్ష్యం నెరవేర్చుకున్నాను. దీంతో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నాను. వ్యవసాయం చేసి పదిమందికి మంచి భోజనం అందించడంలో ఉన్న తృప్తి దేనిలోనూ ఉండదు. -
వంకాయ.. ఏడాదంతా దిగుబడే
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : వంకాయ.. కూరగాయల సాగులో ప్రధానమైనది. వంకాయ సాగులో చీడపీడలు నివారిస్తే ఏడాది పొడవుతునా దిగుబడి పొందవచ్చు. వంకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కొద్దిపాటి జాగ్రత్తలు వహిస్తే నాణ్యమైన పంట చేతికొస్తుంది. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి తెగుళ్లు నివారిస్తే మంచి ఆదాయం ఆర్జించవచ్చని ఆదిలాబాద్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సూచనలు, పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలు వివరించారు. మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలి మేలు రకాలైన వంకాయ విత్తనాలు ఎంపిక చేసుకోవాలి. సరైన పద్ధతిలో సాగు చేస్తే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు. దేశవాలీ రకాల్లో భాగ్యమతి, అర్కషీల్, అర్కకుసుమాకర్, హైబ్రీడ్ రకాలైన మహికో, రవయ్యా, సుఫల్ ఉన్నాయి. విత్తన రకాలను బట్టి దిగుబడులు వస్తాయి. భాగ్యమతి రకం : గుత్తికి మూడు నుంచి నాలుగు రకాలు ఉంటాయి. ఉదా రంగులో అండాకారంగా కాయలు ఉంటాయి. పంట కాల పరిమితి 140 నుంచి 160 రోజులు. ఇది నీటి ఎద్దడి బాగా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. హెక్టార్‌కు 30 నుంచి 35టన్నుల దిగుబడి వస్తుంది. అర్కషిల్ రకం : కాయలు మధ్యస్థంగా పొడవుగా ఆకర్షణీయమైన ముదురు ఉదా రంగులో ఉండి గింజలు తక్కువగా ఉంటాయి. కాలపరిమితి 110 రోజుల నుంచి 120 రోజులు. హెక్టారుకు 394 క్వింటాళ్లా వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అర్కకుసుమాకర్ రకం : కాయలు చిన్నవిగా వేలు ఆకారంలో, ఆకు పచ్చరంగులో ఉంటాయి. కాయలు ఐదు నుంచి ఏడు వరకు గుత్తులుగా కాస్తాయి. మొక్కకు 70 నుంచి 75 వరకు కాయలు దిగుబడిలు వస్తాయి. కాలపరిమితి 110 నుంచి 120 రోజులు. హెక్టార్‌కు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఎరువులు వాడే విధానం ఆఖరి దుక్కులో హెక్టార్‌కు 60 కిలోల పొటాష్ మరియు భాస్వరాన్ని ఇచ్చే ఎరువులు వేయాలి. హెక్టార్‌కు వంద కిలోల నత్రజని మూడు భాగాలుగా చేసి నాటిన సమయంలో, 30వ రోజు, 75 రోజున వేయాలి. ఎరువులు వేసిన సమయంలో కలుపు తీసి, గొప్పు తవ్వి మట్టిని సవరిస్తే పంట దిగుబడి పెరుగుతుంది. భూమిలో తేమను బట్టి, వేసవిలో 4 నుంచి 5 రోజులకు శీతాకాలంలో 7 నుంచి 10 రోజులకోసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. పురుగుల నివారణ చర్యలు.. పిండి పురుగులు : వీటి వల్ల మొక్కలు గిడసబారుతాయి. దీని నివారణకు మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పురుగు అశించిన రెమ్మలు, కాయలను ముందుగా తీసి నాశనం చేయాలి. రసం పీల్చు పురుగులు : ఇవి ఆకుల అడుగు భాగాన ఉండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు వడలి పసుపు రంగుకు మారి ఎండిపోతాయి. దీని నివారణకు డైమిథోయేట్ 30 శాతం ఇ.సి మందు రెండు మిల్లీలీటర్ల చొప్పున ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అక్షింతల పురుగు : ఇవి పెద్దపురుగులు, పిల్లపురుగు ఆకుల్లో పత్రహరితాన్ని తినేసి ఈనెలను మిగులుస్తాయి. ఆకు జల్లెడ మాదికిగా కనిపిస్తుంది. ఆకులు ఎండిపోయి మొక్కలు శక్తిహీనంగా ఉంటాయి. దీని నివారణకు 0.16 శాతం మలాథియాన్ 3 మిల్లీలీటర్లు గానీ.. 0.03 శాతం మిథైల్ పెరాథియాన్ ఒక మిల్లీలీటర్లు గానీ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వ మరియు కాయ తొలుచు పురుగు : చిరుమొవ్వ దశలో ఉన్నప్పుడు ఇవి ఆశించడం వల్ల మొక్కలు వంగిపోతాయి. కాపు దశలో కాయలను తొలిచి అంచెలంచెలుగా కాయ లోపలికి చేరుతాయి. దీని నివారణకు పురుగు ఆశించిన , వంగిన రెమ్మలను తీసివేసి 50 శాతం డబ్ల్యూపీ 2.5 గ్రాములు లీటరు నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. లేదా మోనోక్రోటోఫాస్ 1.25 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ మందు పిచికారీ చేసిన పది రోజుల తర్వాత కాయలు కోయాలి. తెగుళ్ల నివారణ.. ఆకుమూడు తెగులు : ఈ తెగులు సోకిన ఆకులపై అక్కడక్కడా గోధుమ రంగుతో కూడిన మచ్చలు కనిపిస్తాయి. ఉధృతంగా తెగులు సోకితే ఆకులు రాలిపోతాయి. ఈ తెగులు సోకిన కాయలు పసుపు(ముదురక) రంగులోకి పూర్తిగా మారకముందే ఎండిపోతాయి. దీని నివారణకు బ్లెటాక్స్ 3 గ్రాములు లీటరు నీటిలో లేదా 2.5 గ్రాములు జినేట్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వెర్రి తెగులు : తెగులు ఆశించిన ఆకులు పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. వీటి నివారణకు తెగులు సోకిన మొక్కలను పెరికి నాశనం చేయాలి. తెగులు వ్యాపింపజేసే చీడలను క్రిమిసంహారక మందులను ఉపయోగించి నివారించాలి. -
రైతన్న ఇంట.. సిరుల పంట
కూరగాయల సాగు రైతన్నలకు సిరులు కురిపిస్తోంది. తక్కువ పె ట్టుబడితో కచ్చితమైన లాభాలను తీసుకువస్తోంది. కావాల్సిందల్లా కష్టపడేతత్వం, మార్కెట్ చేసుకునే చాతుర్యం. మోతె గ్రామానికి చెందిన దాసరి గంగామణి, గంగారెడ్డి దంపతులు కూరగాయలు సాగు చేస్తూ వ్యవసాయం లాభసాటని నిరూపిస్తున్నారు. లింగంపేట : తక్కువ శ్రమ, తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలోనే కూరగాయలు చేతికి వస్తాయంటున్నారు యువరైతు గంగారెడ్డి. ఆయన కొన్నేళ్లుగా కూరగాయలు సాగు చేస్తున్నారు. వ్యవసాయ పనుల్లో ఆయనకు భార్య గంగామణి చేదోడువాదోడుగా ఉంటున్నారు. కూరగాయల సాగుతో సుమారు రెండు నెలల వ్యవధిలో రూ. 50 వేల లాభం పొందానని ఆయన పేర్కొన్నారు. కూరగాయల సాగు గురించి ఆయన మాటల్లోనే.. ‘‘నేను కొన్నేళ్లుగా కూరగాయల సాగునే నమ్ముకున్నాను. నాకున్న 30 గుంటల వ్యవసాయ భూమిలో కూరగాయలు సాగు చేస్తున్నాను. ఈ ఖరీఫ్ సీజన్లో మూడు నెలల క్రితం భూమిని రెండుసార్లు బాగా లోతుగా దున్నించాను. మట్టి పొడిపొడిగా అయ్యేలా దున్నడం వల్ల మొక్కల వేర్లు భూమిలోనికి వెళతాయి. మొక్క బలంగా పెరుగుతుంది. దుక్కిలో పశువుల పేడ, కోళ్ల ఎరువు చల్లాను. రెండు నెలల క్రితం కాకర, బీర, వంకాయ హైబ్రిడ్ విత్తనాలను విత్తాను. పది వరుసలలో వంకాయ, ఆ తర్వాత రెండు వరుసలలో కాకరకాయ, మళ్లీ పది వరుసలలో వంకాయ, ఆ తర్వాత ఒక వరుసలలో బీరకాయ విత్తనాలు వేశాను. ఇలా పొలం అంతా చేశాను. బీర, కాకరకాయలు తీగజాతికి చెందినవి. అందువల్ల వీటి కోసం మధ్యమధ్యలో పొడవైన కర్రలను పాతాను. వారానికోసారి నీటి తడి అందించాను. వంకాయ మొక్కలు మీటరు ఎత్తు పెరిగాయి. బీర, కాకర కాయలు తీగలు పారాయి. నెల రోజులనుంచి పంట చేతికి వస్తోంది. కామారెడ్డి, గాంధారి, లింగంపేట మార్కెట్లతోపాటు వార సంతలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. పెట్టుబడి వివరాలు భూమిని దున్నడానికి రూ. 2,500, విత్తనాలకు రూ. 1,500, ఎరువులకు రూ. 1,600, పురుగుల మందులకు రూ. 800, ఇతరత్రా రూ. 2 వేల వరకు ఖర్చయ్యాయి. దిగుబడులు.. కాకర కాయలను విక్రయించగా రూ. 18 వేలు, బీరకాయలను విక్రయించగా రూ. 16 వేలు, వంకాయలను విక్రయించగా రూ. 24 వేల ఆదాయం వచ్చింది. బీర, కాకర కాయలు మరో పదిహేను రోజుల వరకు కాస్తాయి. వంకాయ ఇంకా నెల వరకు కాస్తుంది’’ అని గంగారెడ్డి వివరించారు. పెట్టుబడులుపోను ఇప్పటికి రూ. 50 వేలవరకు మిగిలాయని పేర్కొన్నారు. -
మూడు ‘పూలు’.. ఆరు‘కాయలు’
- సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు - వానపాములు, కుళ్లిన పదార్థాలతో వర్మీకంపోస్టు తయారీ - అధిక దిగుబడి సాధిస్తున్న మోహన్‌రావుపేట యువరైతు రాజుకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో ఎకరంలో కూరగాయలు, రెండెకరల్లో మొక్కజొన్న, మిగిలిన రెండెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. ప్రభుత్వం అందించిన వర్మీ బెడ్స్, సబ్సిడీని ఉపయోగించుకుని స్వయంగా వర్మీకంపోస్టు ఎరువును తయారు చేసుకుంటూ పొలాన్ని సారవంతంగా మార్చుకుంటున్నాడు. పశువుల పేడ, కుళ్లిన పదార్థాలు పోగుచేసి వానపాములను పెంచి రెండు నెలలకోమారు టన్ను సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాడు. బెండ, వంకాయ సాగు ఎకరం భూమిలో 10 గుంటల్లో వంకాయ, మిగిలిన 30గుంటల్లో బెండ సాగు చేస్తున్నాడు. రెండు నెలలు బెండ, మరో రెండు నెలలు టమాట, ఆర్నెల్లు వంకాయ సాగుచేస్తానని, పంట మార్పిడి తప్పకుండా ఉంటుందంటున్నాడు రాజు. సేంద్రియ ఎరువులతో సాగు చేయడం ద్వారా కూరగాయలు తాజాగా ఉంటాయని, మార్కెట్లోనూ గిరాకీ అధికంగా ఉంటోందని పేర్కొంటున్నాడు. పండించిన కూరగాయలను కోరుట్ల, చుట్టూ పక్కల గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తానని, ప్రస్తుతం రేట్లు అధికంగా ఉండడంతో ఆదాయం భారీగానే వస్తోందని పేర్కొంటున్నాడు. ఈయన సిరిసిల్ల మండలం పెద్దబోనాలకు చెందిన కాశెట్టి శ్రీనివాస్. తనకున్న ఎకరం పొలంలో ఆరురకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. బీర, అనపుకాయ, బెండ, టమాట, వంకాయ, మిర్చి, అల్చింత పండిస్తున్నాడు. ఈ రకాలన్నీ 45 రోజుల నుంచే కోతకు వస్తున్నాయి. పెద్ద బోనాల సిరిసిల్లకు సమీపంలో ఉండడంతో రవాణాకు పెద్దగా ఇబ్బంది లేకుండాపోయింది శ్రీనివాస్‌కు. నిత్యం కూరగాయలను మార్కెట్‌కు తరలిస్తూ ఆదాయాన్ని పొందుతున్నాడు. కరువు పరిస్థితుల నేపథ్యంలో కుటుంబ అవసరాలు తీరుతున్నాయంటున్నాడీ రైతు. - సిరిసిల్ల -
‘ఇంటిపంట’ల ఉత్పాదకత 15 రెట్లెక్కువ!
పొలాల్లో కూరగాయల ఉత్పాదకత కన్నా ఇంటి పెరట్లో/భవనాలపైన కుండీలు, మడుల్లో సాగు చేసే కూరగాయల ఉత్పాదకత 15 రెట్లు ఎక్కువ. ప్రపంచ ఆహార సంస్థ(ఎఫ్ఏఓ) గణాంకాల ప్రకారం.. ఇంటిపట్టున చదరపు మీటరు విస్తీర్ణంలో ఏడాదికి 20 కిలోల ఆహారాన్ని పండించవచ్చు. ఎఫ్ఏఓ ఇంకా ఏమన్నదంటే.. - ఇంటిపంటల సాగు వల్ల దూరం నుంచి ఆహారోత్పత్తుల్ని పట్టణాలు, నగరాలకు తరలిం చాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు ఇంధనం ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. పోషక విలువలతో కూడిన తాజా సహజాహారం లభిస్తుంది. - కూరగాయల సాగు కాలం తక్కువ. కొన్ని రకాలైతే విత్తిన 60 రోజుల్లోనే దిగుబడినిస్తాయి. అందువల్లే పట్టణాలు, నగరాల్లో సాగుకు అనుకూలం. - ప్రపంచవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 80 కోట్ల మంది కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. పట్టణాల్లో నివసి స్తున్న అల్పాదా య వర్గాల ప్రజలు కూర గాయలు, ఆకు కూరలను తమ కున్న కొద్ది పాటి చోటు లో పండిం చుకుంటూ ఆహా రంపై ఖర్చును తగ్గించుకుం టున్నారు. - పట్టణాల పరిసరాల్లో సాగయ్యే కూరగాయలు, పండ్ల తోటల్లో ప్రతి వంద చదరపు మీటరుకు ఒకరికి చొప్పున ఉపాధి దొరుకుతుంది. ఫేస్బుక్, గూగుల్‌లో ‘ఇంటిపంట’! ‘ఇంటిపంట’లు సాగుచేసే వారి మధ్య స్నేహానికి ఫేస్బుక్, గూగుల్ గ్రూప్‌లు వారధిగా నిలుస్తున్నాయి. సమాచార మార్పిడికి, సలహాలకు, సంప్రదింపులకు ఇవి దోహదపడుతున్నాయి. ఫేస్బుక్లో INTIPANTA - Organic Kitchen/Terrace Gardening గ్రూప్ ఉంది. గూగుల్ గ్రూప్ అడ్రస్: https://groups.google.com/ forum/#!forum/intipanta intipanta@googlegroups.comకు మెయిల్ ఇస్తే ఇందులో వెంటనే సభ్యత్వం పొందొచ్చు. -
పొలాల పోలారం!
షాబాద్:ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ కూరగాయల సాగుకు పెట్టింది పేరుగా నిలుస్తోంది పోలారం గ్రామం. ఇక్కడ ఉన్న 15 కుటుంబాలూ వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్నాయి. టమాటా, వంకాయ, క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, పచ్చిమిర్చి, బెండ, గోకెర కాయ, చామగడ్డ, చిక్కుడుతో పాటు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నారు. డ్రిప్, స్ప్రింక్లర్ల సహాయంతో వ్యవసాయం చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. గుడ్డిమల్కాపూర్ మార్కెట్‌కు కూరగాయలను తీసుకువెళితే.. అక్కడి వ్యాపారులు ముందుగా పోలారం కూరగాయలనే కొనుగోలు చేస్తున్నారంటే ఇక్కడి పంట దిగుబడులకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. పదేళ్ల నుంచి కూరగాయలు, ఆకుకూరలు పంటలతో జీవనం గడుపుతున్నామని, తమ పిల్లలను చదివిస్తున్నామని రైతులు గర్వంగా చెబుతున్నారు. ఒకసారి పాలకూర పంటను వేస్తే నెలరోజుల వరకు నిత్యం 200 రూపాయలు సంపాదించుకుంటామని అంటున్నారు. మండలంలోని మాచన్‌పల్లి అనుబంధ గ్రామం పోలారంలోని ప్రతి రైతుకూ కచ్చితంగా 2 ఎకరాల భూమి ఉంది. బోర్లు వేసుకోవడంతో సాగునీటికి పెద్దగా ఇబ్బందులు తలెత్తడంలేదు. నివాస గృహాలకు పొలాలు సమీపంలోనే ఉండడం రైతులకు కలిసి వచ్చే అంశం. దీంతో కుటుంబ సభ్యులంతా పొలంలో పని చేస్తారు. చదువుకునే చిన్నారులు సెలవు రోజుల్లో పొలం పనుల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. సంప్రదాయ పంటలను సాగు చేసి నష్టపోవడం కన్నా కూరగాయల సాగుతోనే లాభాలు గడించవచ్చని ఒకరిని చూసి మరొకరు ఆయా పంటలను సాగు చేస్తున్నారు. పండించిన ఉత్పత్తులను శంషాబాద్, హైదరాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల మార్కెట్లకు తరలిస్తున్నారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
‘మన ఊరు-మన కూరగాయలు’పథ కం ప్రారంభం ఇళ్ల వద్ద పెంపకానికి తోడ్పాటు రాజేంద్రనగర్: కూరగాయల సాగును మరింత పెంచి, రైతుకు లాభాలు అందించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తోడ్పాటునందించనున్నాయి. నగరానికి 11 లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉండగా, కేవలం 3 లక్షల టన్నులే రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారు. మన ఊరు-మన కూరగాయలు పథకం ద్వారా నగరానికి మరిన్ని కూరగాయలను సరఫరా చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రైతులకు శిక్షణతో పాటు తోడ్పాటునందిస్తారు. బుధవారం యూనివర్సిటీలో 42 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఇళ్లలో సేద్యానికి... పొలాలతో పాటు ఇళ్లలోనూ కూరగాయలను పండిం చేందుకు వివిధ ప్రైవేట్ నర్సరీలు సేవలందిస్తున్నాయి. మొక్కలను పెంచి, వాటిని 35 పైసల నుంచి రూ.1.50 వరకు విక్రయిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా టమాటా, క్యాప్సికమ్, వంకాయ, కాకర, సొర, బొప్పాయి, బెండ తదితర కూరగాయలతో పాటు బంతిపూలు సైతం ఉన్నాయి. మొక్కలను పొలాలు, ఇళ్లలోని కుండీలలో సైతం పెంచవచ్చని నర్సరీ సిబ్బంది సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాగు గురించి వివరించడంతో పాటు స్వయంగా కంపెనీల సిబ్బందే పొలాలకు వెళ్లి, పంటల ను పరిశీలించేలా చూస్తున్నారు. తద్వారా నకిలీలను అరికట్టవచ్చని చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు ప్రస్తుతం సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది. దీంతో యూనివర్సిటీలోని సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కేంద్రం నుంచి రైతులతో పాటు నగరంలోని ఇళ్లలో పెంచే వారికీ వీటిని అందించనున్నారు. ఈ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటితో పాటు వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, సోలార్ పంప్సెట్లూ ఆకట్టుకుంటున్నాయి. -
కూరల రైతుకు ప్రోత్సాహం కరువు
నిరుపయోగంగా చెక్‌డ్యాంలు విత్తనాలు అందించని ఐటీడీఏ ఏటా తప్పని నష్టాలు అరకులోయ : మండలంలోని చినలబుడు పంచాయతీలోని గిరిజన రైతులకు కూరగాయల సాగు జీవనాధారం. ఈ పంచాయతీలో 14 గ్రామాలు ఉన్నాయి. సుమారు 600 మంది గిరిజన రైతులు ఉన్నారు. వీరిలో 400 మంది రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తుంటారు. పండించిన కూరగాయలను విశాఖ, విజయనగరం ప్రాంతాల్లోని రైతు బజార్లకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. ఏటా అతివృష్టి, అనావృష్టి పంటలను దెబ్బ తీస్తున్నా వీరు కూరగాయల సాగునే నమ్ముకున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాలు సమయానికి కురవకుండా ముఖం చాటేయ్యడంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. ఏడాదికి రెండుసార్లు పంటలు పండించుకుని తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబ పోషణ, పిల్లల చదువుకు వినియోగిస్తుంటారు. ఒక్కో రైతు తమకున్న రెండు, మూడు ఎకరాల్లోనే పలు కూరగాయలను సాగు చేస్తుంటారు. ఈ రైతుల కోసం పదిహేనేళ్ల క్రితం 16 చెక్ డ్యాంలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో మూడు చెక్‌డ్యాంలు మాత్రమే వినియోగంలో ఉన్నాయి. మిగిలిన చెక్‌డ్యాంలను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు ప్రభుత్వానికి, పాడేరు ఐటీడీఏ అధికారులకు గతంలో ఎన్నోమార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. వాతావరణం అనుకూలించి నీటి సదుపాయం కలిగితే ప్రతి రైతు ఏటా కూరగాయల సాగు ద్వారా రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ఆదాయం పొందుతున్నట్టు రైతులు తెలిపారు. గిరిజనులు పండించిన కూరగాయలు నేరుగా్గా విక్రయించుకోవడానికి విశాఖలోని ఎంవీపీ కాలనీలోని రైతు బజార్లో ఉచితంగా స్టాల్స్‌ను కూడా ప్రభుత్వం గిరిజన రైతులకు కేటాయించడంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. పదేళ్ల క్రితం ఈ పంచాయతీలోని కూరగాయ రైతులను ప్రోత్సాహిస్తూ సబ్సిడీపై విత్తనాలు కూడా పాడేరు ఐటీడీఏ సరఫరా చేసేది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వేరే ప్రత్యామ్నాయం లేక పోవడంతో ఒడిశా, విశాఖ, విజయనగరం వంటి ప్రాంతాలకు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేసుకుని వచ్చి సాగు చేస్తున్నారు. ఈ ఏడాది నష్టం తప్పదు చెక్‌డ్యాంలు ఎండిపోయాయి. వర్షం చాలా ఆలస్యమైంది. భూమి చదును చేసి, కూరగాయ నారలు సిద్ధం చేసి వర్షం కోసం ఎదురు చూస్తున్నాం. -కిల్లో మొద్దు, కూరగాయ సాగు రైతు, చినలబుడు ఐటీడీఏ చేయూత నివ్వాలి గతంలో ఐటీడీఏ సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేసేది. అయితే పదేళ్లుగా ఐటీడీఏ గిరిజన రైతులను పట్టించుకోవడం లేదు. నిత్యం కూరగాయలు సాగు చేసి బతుకుతున్నాం. సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసి రైతులకు కష్టకాలంలో ఆదుకుంటే బావుంటుంది. -బురిడి డొంబు, కూరగాయల సాగుదారుడు, చినలబుడు -
విదేశీ వంగడాల సందడి
అమెరికా కూరగాయల సాగుకు మన్యం అనుకూలం ప్రయోగాత్మకంగా ఎనిమిది రకాల పెంపకం దిగుబడి బాగుందన్న పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు కొండకోనలు పచ్చదనానికి నెలవులు.. హరిత సౌందర్యానికి నిలయాలు.. మన్యంలో ఏ మొక్కయినా ఏపుగా ఎదుగుతుంది. ఇక్కడి నేల, వాతావరణం అన్ని రకాల పంటలకు అనువుగా ఉంటాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా విదేశీ కూరగాయలకు ఏజెన్సీ ప్రాంతం అనుకూలమని స్పష్టమైంది. అందుకే ఇప్పుడిప్పుడే వీటి సాగు ఇక్కడ పెరుగుతోంది. ఇది విస్తారంగా జరిగితే గిరిజన రైతులకు మంచి ఆదాయం లభించే వీలుంది. చింతపల్లి, న్యూస్‌లైన్: విశాఖ మన్యంలో విదేశీ జాతుల కూరగాయలు ఏపుగా పెరగడానికి అనువైన వాతావరణం ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో మరోసారి రు జువైంది. ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన సాగులో ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నట్టు డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికాలో సాగవుతున్న వివిధ రకాల కూరగాయలను గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచగా, మంచి దిగుబడులు వచ్చాయని పరిశోధన స్థానం శాస్త్రవేత్త కె.చంద్రశేఖర రావు ఆదివారం విలేకరులకు తె లిపారు. ఎంతో ఆరోగ్యకరమైన విదేశీ కూరగాయలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని, వీటి ద్వారా గిరిజనులకు ఇబ్బడిముబ్బడిగా రాబడి వచ్చే వీలుందని చెప్పారు. కొద్ది పాటి సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులు చాలాకాలంగా దేశవాళీ కూరగాయలు సాగు చేస్తున్నారు. దిగుబడులు నానాటికీ తగ్గుతూ ఉండడంతో రసాయన ఎరువులను విపరీతంగా వాడుతున్నారు. కానీ వీటికి ఆదరణ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్త రకాల పంటలపై ఇక్కడి శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. శీతల వాతావరణం ఉన్న ఏజన్సీలో విదేశీ రకాలు బాగా పెరుగుతాయని గుర్తించారు. ఇక్కడి ప్రాంతాలకు అనువైన రకాలను హిమచల్ ప్రదేశ్‌లోని భారత వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి తెచ్చారు. అమెరికాలో అధికంగా సాగవుతున్న 8 రకాల వంగడాలను గత ఏడాది నవంబర్‌లో ఇక్కడ ప్రయోగాత్మకంగా పెంచడం మొదలెట్టారు. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని గుర్తించినట్టు చంద్రశేఖరరావు తెలిపారు. కొత్త రకాలు ఇవే అమెరికాలో ఎక్కువగా వినియోగించే అమెరికన్ క్యాబేజి, గ్రీన్ బేబీ లెట్యూస్, సెలరీ, స్పినాచ్, టర్నిప్, బ్రాకోలీ, గ్రీన్ మాజిక్, బ్రసెల్స్ స్ప్రౌట్స్, నూల్‌కోల్, రిజీ అనే ఆకుకూరలను పెంచేందుకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ రకాలు అధికంగా సాగవుతున్నాయి. సాగుపై అవగాహన కల్పిస్తాం గిరిజన రైతులకు విదేశీ కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తాం. రైతులు ముందుకు వస్తే వీటిని సాగు చేసేందుకు ప్రోత్సహిస్తాం. శాస్త్రీయ పద్ధతిపై అవగాహన కల్పిస్తాం - కె.చంద్రశేఖరరావు, ఉద్యాన శాస్త్రవేత్త, చింతపల్లి