ఇంటిపట్టున స్వల్ప ఖర్చుతో, వనరులు వృథా కాకుండా చేపలను సాగు చేయడం, చేపల విసర్జితాలు కలిసిన నీటిని కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెరిగే కుండీలు, టబ్‌లకు అందించడాన్ని ఆక్వాపోనిక్స్ (రీ సర్యు్యలేటింగ్ ఆక్వాపోనిక్స్ సిస్టం– ఆర్.ఎ.ఎస్.) వ్యవస్థగా చెప్పొచ్చు. ఈ పద్ధతిలో మట్టిని వాడాల్సిన అవసరం లేదు. చేపలకు మేత వేస్తే చాలు. మొక్కలకు ఎరువులు వేయనక్కర లేదు. చేపల విసర్జితాలతో కూడిన నీరు సూక్ష్మ, స్థూల పోషకాలతో నిండి ఉంటుంది.
ఈ నీటిని మొక్కల వేళ్లకు అందిస్తే.. అందులోని పోషకాలను గ్రహించి కూరగాయలు, ఆకుకూరలు చక్కగా పెరుగుతాయి. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు అమ్మోనియాను నైట్రైట్‌గా, తదనంతరం నైట్రేటుగా మార్చి మొక్కలకు అందిస్తాయి. ఇందులో వాడే నీటిలో 90%, పోషకాలలో 100% వృథాపోకుండా ఉపయోగించడానికి అవకాశం ఉంది. తద్వారా పూర్తిగా సేంద్రియ చేపలు, ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవచ్చని మహారాష్ట్ర పుణే జిల్లా పబల్‌లోని ‘విజ్ఞాన ఆశ్రమం’ నిపుణులు చెబుతున్నారు.
ఏదైనా కొత్త ఆలోచనతో ఈ ఆశ్రమానికి వచ్చే వ్యక్తికి తదనంతర పరిశోధనకు సహాయపడి.. ఆ పరిశోధనా ఫలితాల ద్వారా ఆ వ్యక్తి ఉపాధి పొందేలా తోడ్పాటునందించడం విజ్ఞాన ఆశ్రమం ప్రత్యేకత. గత 5 నెలలుగా ఆక్వాపోనిక్స్‌పై అధ్యయనం జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2 గ్రాముల గ్రాస్ కార్ప్ చేప పిల్లలు వేస్తే.. 5 నెలల్లో 30–450 గ్రాముల వరకు బరువు పెరిగాయి. చేపలకు అజొల్లా/బెర్సీమ్‌తోపాటు నీటిలో తేలియాడే బలపాల మేతను (40:40:10 నిష్పత్తిలో) వేస్తున్నారు. 50 వేల లీటర్ల నీటి ట్యాంకులో వెయ్యి చేప పిల్లలు వేశారు. కొన్ని పిల్లలు తీసేస్తే చేపల పెరుగుదల మరింత బాగుంటుందని భావిస్తున్నారు. చేపల నీటితో టమాటాలు, కలబంద, పాలీహౌస్‌లో గులాబీలను సాగు చేస్తున్నారు. జూన్ నాటికి పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. వివరాలకు.. Email: vigyanashramvideo@gmail.com
Comments
Please login to add a commentAdd a comment