Home Crop
-
ఇంటి పంటల పూజారి!
మనసుంటే మార్గం లేకపోదు. ఇంటి పంటలకు మనసులో చోటిస్తే చాలు.. మనకున్న అతికొద్ది చోటులోనూ పచ్చని కూరల వనాన్నే పెంచవచ్చు అనడానికి ఈ రేకుల మిద్దె తోటే ప్రత్యక్ష సాక్ష్యం! పక్కా భవనాల్లో ఉంటున్న వారు కూడా ఇంటి పైన కుండీలు, మడులు పెట్టి మొక్కలు పెంచాలంటే శ్లాబ్ దెబ్బతింటుందేమో అని సందేహ పడి తటపటాయిస్తున్న రోజులివి. అయితే, పదేళ్ల క్రితం నుంచే రేకుల ఇంటిపైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఓ యువ పూజారి. కరోనా లాక్డౌన్ ఎండా కాలంలో కూడా బయటకు వెళ్లి కొనకుండా పూర్తిగా తన ఇంటిపంటలే సరిపోయాయని అంటున్నారు. అతని పేరు పుట్టా ప్రవీణ్‌కుమార్. సికింద్రాబాద్‌లోనే పుట్టి పెరిగాడు. తన తల్లి కృష్ణవేణికి ఇంటి చుట్టూ మొక్కలు పెంచటం అంటే మహాఇష్టం. అలా చిన్నప్పటి నుంచే ప్రవీణ్‌కు సేంద్రియ ఇంటిపంటల సాగుపై ఆసక్తి కలిగింది. తల్లి మర ణించిన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. బన్సీలాల్‌పేట్ డివిజన్ బోయిగూడ ప్రాంతంలో శ్రీధనలక్ష్మీ ఉప్పలమ్మ ఆలయంలో ప్రవీణ్ పూజారిగా పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. అల్ల నేరేడు చెట్టు కింద ఈ గుడి ఉంటుంది. గుడిలో భాగంగానే (ఇనుప కమ్ముల మీద వేసిన) సిమెంటు రేకుల షెడ్డు ఉంది. దాని విస్తీర్ణం 60 గజాలు ఉంటుంది. ఆ రేకుల ఇంటిపైన పిట్టగోడల మీద ఒడుపుగా ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. రేకులకు ఇబ్బందేమీ లేదా అంటే.. పదేళ్ల క్రితం నుంచే తాను ఇలా కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని వండుకు తింటున్నానని, ఎప్పుడూ ఏ ఇబ్బందీ రాలేదని ప్రవీణ్ తెలిపారు. పూలు, వంటింటి వ్యర్థాలకు ఆవు పేడ కలిపి తానే ఎరువు తయారు చేసుకొని వాడుతున్నారు. రేకుల ఇల్లు కాబట్టి చూట్టూతా పిట్ట గోడపైనే మడులు, కుండీలు, బాటిల్స్ పెట్టి సాగు చేస్తున్నారు. దూరం నుంచి చూస్తే చిన్న స్థలమే కదా అనిపిస్తుంది. కానీ, చిన్న కవర్లు, ట్రేలు, కుండీలు, టబ్‌లలో అనేక రకాల ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తుండటం విశేషం. మడుల్లో కన్నా బాటిల్స్‌లోనే తక్కువ నీటితో సాగు చేయవచ్చని అనుభవపూర్వకంగా చెబుతున్నారు ప్రవీణ్. అమ్మ చెప్పిందని బొగ్గులను నెలకోసారి ఎరువుగా వేస్తున్నానన్నారు. బచ్చలికూర, పాలకూర, తోటకూర, గోంగూర ఉన్నాయి. చిక్కుడు, గుమ్మడి, బీర, సొర తీగలను కట్టెల పందిరికి పాకించారు. 60–70 టమాటా, 30 స్వీట్‌కార్న్, 15 బెండ, 15 వంగ మొక్కలతోపాటు ఉల్లి, పచ్చిమిర్చి మొక్కలు కూడా ప్రవీణ్ రేకుల మిద్దె తోటలో ఉన్నాయంటే ఆశ్చర్యం కలగకమానదు. పదులకొద్దీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌కు అడుగు కత్తిరించి మొక్కలు పెంచుతున్నారు. పంటల మార్పిడి తప్పకుండా పాటిస్తున్నారు. తాను తినగా మిగిలిన కూరగాయలను ఇతరులకు పంచిపెడుతున్నారు. గత ఏడాది ఈ బాటిల్స్‌లో 5 కిలోల వరి ధాన్యం కూడా పండించారు. ఆ ధాన్యాన్ని పూజా కార్యక్రమాల్లో వాడుకున్నానని తెలిపారు. డ్రాగన్ ఫ్రూట్, అంజీర గింజలు విత్తి నర్సరీ పెంచుతున్నారు. మొక్కల మీద, అమృతాహారం మీద, శ్రమైకజీవనం మీద ప్రవీణ్‌కు ఉన్న ప్రేమ అవ్యాజమైనది. ఇంతకన్నా ఆనందం ఏముంది? మొక్కలు పెంచటం నాకెంతో ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని కలిగిస్తుంది. ఇంటి పంటల మధ్య ఉంటే ఒత్తిడి పోతుంది. హాయిగా ఉంటుంది. ప్రతి రోజు రెండు గంటల సమాయాన్ని కేటాయిస్తున్నా. ఇతరత్రా ఏ పనుల్లోనూ ఈ ఆనందం లేదు. – పుట్టా ప్రవీణ్‌కుమార్ (86868 08194), బోయిగూడ, సికింద్రాబాద్ – ఇ.చంద్రశేఖర్, సాక్షి, బన్సీలాల్‌పేట్ (సికింద్రాబాద్) -
చెత్త చక్కని ఎరువై.. పచ్చని ఇంటిపంటలై..!
గుంటూరు నగరంలో తడి చెత్త, సేంద్రియ వ్యర్థాలపై గృహిణులు సమరం ప్రకటించారు. తడి చెత్త, వ్యర్థాలను మున్సిపల్ సిబ్బందికి ఇవ్వకుండా సేంద్రియ ఎరువు తయారు చేస్తూ.. సేంద్రియ ఎరువుతో ఎంచక్కా ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి ఆవరణలో కుండీలు, కవర్లు, కంటెయినర్లలో ఆకుకూరలు, కూరగాయలు, పూల మొక్కలను పెంచుతున్నారు. నగరపాలక సంస్థకు భారంగా మారిన చెత్త తరలింపు సమస్య పరిష్కారం కావడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేసే సేంద్రియ కూరగాయలు లభిస్తున్నాయి. పరిసరాలు పరిశుభ్రంగా ఉండి దోమలు, అంటు వ్యాధుల బెడద తగ్గుతోంది. గుంటూరు నగరంలోని 23,24,25,28 వార్డుల్లో గృహిణులు తమ ఇళ్ళల్లో వచ్చే తడి వ్యర్ధాలతో ఇంటి దగ్గరే కంపోస్టు తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ గుంటూరు సాధన కృషిలో భాగస్వాములవుతున్నారు. నగరపాలక సంస్థ, ఐటీసీ ‘బంగారు భవిష్యత్తు’ విభాగాల ఆధ్వర్యంలో నాలుగు వార్డుల్లో ఘన వ్యర్థాల నిర్వహణ పైలట్ ప్రాజెక్టు అమలును చేపట్టారు. ఇళ్లు, అపార్టుమెంట్లలో ఐటీసీ సిబ్బంది, వార్డు ఎన్విరాన్మెంటల్ సెక్రెటరీలు, వార్డు వలంటీర్లు ఎవరికి వారు ఇంట్లోనే వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారీపై అవగాహన కల్పించారు. 1,572 ఇళ్ళలో హోం కంపోస్టింగ్, ఇంటిపంటల సాగు ప్రారంభమైంది. కంపోస్టు తయారీ విధానం ఇలా.. నలుగురు కుటుంబ సభ్యులు ఉండే ఇంటికి కంపోస్టు తయారీకి 20 లీటర్ల ఖాళీ బక్కెట్ సరిపోతుంది. బక్కెట్ చుట్టూ రంధ్రాలు చేయాలి. బక్కెట్లో ఒక అంగుళం మేర కొబ్బరి పొట్టు వేయాలి. ప్రతి రోజూ వంట గదిలో పోగుపడే కూరగాయలు, ఆకుకూరల వ్యర్ధాలు, ముక్కలు, పండ్ల తొక్కలు, పూలు, టీ పొడిని ఈ కంపోస్టు బక్కెట్లో వేయాలి. తడి చెత్తను ఇందులో వేసిన ప్రతిసారీ పైన అంగుళం మందాన కొబ్బరి పొట్టును వేయాలి. ఇలా ప్రతి రోజూ చేస్తూ వారంలో రెండు సార్లు బక్కెట్లో కింది నుంచి పైకి కలియ తిప్పాలి. పది రోజుల తరువాత వేసిన వ్యర్ధాలు కుళ్లడం ప్రారంభమవుతుంది. 45 రోజులకు నాణ్యమైన రసాయనాలు లేని సారవంతమైన సేంద్రియ ఎరువు తయారవుతోంది. బక్కెట్లో ఒక్కోసారి పురుగులు కనిపించే అవకాశం ఉంటుంది. బక్కెట్లోని వ్యర్థాల్లో 40 శాతం తేమ ఉండేలా చేసుకోవడంతోపాటు, మార్కెట్లో లభ్యమయ్యే ద్రావణం వేస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది. వంటింటి నుంచి వెలువడే తడి చెత్త, వ్యర్థాలను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయడానికి అవసరమైన కొబ్బరి పొట్టును నగరపాలక సంస్థ ఉచితంగా ఇస్తుండడంతో గృహిణులు కంపోస్టు తయారీపై ఆసక్తి చూపుతున్నారు. వ్యర్థాల పునర్వినియోగంతో పాటు నగరవాసుల సేంద్రియ ఇంటిపంటల సాగుకు నగర పాలకుల ఊతం దొరకడం హర్షించదగిన పరిణామం. చెత్తకు కొత్త అర్థం ఇస్తున్నాం ఇంట్లో చెత్తను రోడ్లపై, కాలువల్లో పడేయకుండా హోంకంపోస్టు ద్వారా ఎరువుగా మార్చి చెత్తకు కొత్త అర్ధం ఇస్తున్నాం. జీఎంసీ, ఐటీసీ సహకారంతో మా ఇంట్లోనే నాణ్యమైన ఎరువు తయారు చేసుకుంటున్నాం. మా వీధుల్లో ఎవరూ చెత్త వేయడం లేదు. దోమలు, ఈగలు తగ్గాయి. – ఏలూరి విజయలక్ష్మి, వేమూరివారి వీధి, గుంటూరు వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం తడి వ్యర్ధాల నిర్వహణ ఇంట్లోనే జరుగుతోంది. ఇళ్ళల్లో చక్కని కిచెన్ గార్డెన్ పెంచడంతోపాటు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండి, దోమలు, అంటువ్యాధుల నివారణ జరుగుతోంది. ఐటీసీ సహకారంతో వార్డు వలంటీర్లు, వార్డు ఎన్విరాన్మెంట్ సెక్రటరీల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పెద్ద మొత్తంలో వ్యర్ధాలు ఉత్పత్తి చేసే కళ్యాణమండపాలు, హోటల్స్‌లో క్లస్టర్ కంపోస్టుల ఏర్పాటు జరుగుతోంది. ఇళ్లలోనే చెత్తతో కంపోస్టు చేయడం, కిచెన్ గార్డెన్ల సాగుపై నగర ప్రజలందరూ దృష్టి పెట్టాలి. స్వచ్ఛ సర్వేక్షన్ 2020లో నగరానికి ఉత్తమ ర్యాంకు సాధించాలి. – చల్లా అనురాధ, కమిషనర్, గుంటూరు నగరపాలక సంస్థ సొంత కంపోస్టుతో ఇంటిపంటలు సాగు చేస్తున్నాం మా ఇంటిలో చెత్తను బక్కెట్లో వేసి సేంద్రియ ఎరువుగా మార్చుతున్నాను. ఆ కంపోస్టును మొక్కలు, ఆకుకూరలకు ఎరువుగా వేస్తుంటే ఎంతో ఏపుగా, చక్కగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు లేకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించుకునేందుకు సేంద్రియ ఎరువును మేమే తయారు చేసుకొంటున్నాం. చెత్తను మున్సిపాలిటీ సిబ్బందికి ఇవ్వడం లేదు. – వేమూరి విశాలక్షి, ఏటీఅగ్రహారం, గుంటూరు కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం గుంటూరు నగరంలో తడి చెత్త, వ్యర్థాల నిర్వహణపై ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నాం. సేంద్రియ ఎరువు తయారీపై గృహిణులకు అవగాహన కల్పించాం. అందుకు అవసరమైన కొబ్బరి పొట్టును మేమే ఇస్తున్నాం. ఈ సేంద్రియ ఎరువుతో రసాయన మందులు వినియోగం లేకుండా, చక్కగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు కిచెన్ గార్డెన్లో పెంచుకోవచ్చు. నగర ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరించాలి. – ఐ.శామ్యూల్ ఆనందకుమార్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి, జిల్లా కలెక్టర్, గుంటూరు – ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు – గజ్జెల రాంగోపాల్‌రెడ్డి, స్టాప్ ఫొటోగ్రాఫర్, గుంటూరు -
ఒక ఇంటిపైన పచ్చధనం
కూరగాయలు, ఆకుకూరల సాగులో వాడే రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుష్ప్రభావం ఆరోగ్యంపై ఎంత ఎక్కువగా ఉంటున్నదీ తెలిసివస్తున్నకొద్దీ ఆర్గానిక్ ఆహారంపై ఆకర్షితులవుతున్న నగరవాసుల సంఖ్య పెరుగుతోంది. తమ ఇళ్లపైన ఖాళీల్లో కుండీలు, మడులు పెట్టుకొని, తమ తీరిక సమయాన్ని ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి గృహిణులు మొగ్గు చూపుతూ ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. గుంటూరు జెకేసీ కాలేజీరోడ్డులోని విజయపురి కాలనీకి చెందిన గృహిణి మున్నంగి హరిప్రియ ఈ కోవకు చెందిన వారే. శిక్షణ పొంది మరీ ఇంటిపంటలను విజయవంతంగా సాగు చేస్తూ మంచి దిగుబడులు పొందుతున్నారు. తాము తినటంతోపాటు ఇద్దరు కుమారు ల కుటుంబాలకూ సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను అందిస్తుండటం విశేషం. మూడు మడులు, మూడు వరలతోపాటు అనేక ప్లాస్టిక్ తొట్లలో రకరకాల మొక్కలు నాటారు. సేంద్రియ కూరగాయల సాగు సంతృప్తినివ్వడంతో పాటు, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆమె అనందం వ్యక్తం చేస్తున్నారు. నల్లమట్టిలో ఘనజీవామృతం, వర్మీ కంపోస్టు, ఇసుక, వేపపిండి, కొబ్బరి పొట్టు కలిపి మడులు, వరలు, ప్లాస్టిక్ తొట్లలో నింపి మొక్కలు విత్తినట్లు చెప్పారు. ఆవు పంచకం, పుల్ల మజ్జిగ, అల్లంవెల్లుల్లి ద్రావణం, బూడిద, పసుపు చల్లటం ద్వారా చీడపీడలను నివారిస్తున్నట్లు ఆమె వివరించారు. సొర, బీర, కాకర, అలసంద, పొట్ల వంటి పాదులతోపాటు.. టమోట, వంగ, బెండ, మిర్చి, తోటకూర, మెంతికూర, పాలకూర, బచ్చలి కూర పండించుకుంటున్నారు. కిచెన్ గార్డెన్లో సీతాకోకచిలుకలు, తేనెటీగలు తిరుగాడుతూ పరపరాగ సంపర్కం బాగా జరిగి మంచి దిగుబడులు రావాలంటే పూల మొక్కలను కూడా పెంచుకోవాలి. ఈ దృష్టితోనే హరిప్రియ గులాబి, మందార, పారిజాతం, సెంటుమల్లి, బోగన్‌విలా, గన్నేరు, నందివర్థనం, మల్లెలు, వంటి పూల మొక్కలను కూడా నాటారు. కూరగాయలు కొనే అవసరం లేకుండానే హాయిగా ఆరోగ్యదాయకమైన కూరలు తినగలుగుతున్నామన్నారు. తమ ఇద్దరు కుమారుల కుటుంబాలకు కూడా కూరగాయలు పంపుతున్నామని, పూలు కూడా కొనకుండా సరిపోతున్నాయన్నారు సంబరంగా. రోజుకు 2 గంటల పనితో సంతోషం! నాకు వ్యవసాయం అంటే మొదటి నుంచి మక్కువ. ప్రస్తుతంమార్కెట్‌లో అమ్ముతున్న కూరగాయల సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎక్కువగా వాడుతున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై కనిపిస్తున్నది. సేంద్రియ ఇంటిపంటల సాగులో శిక్షణ పొందిన తరువాత రూఫ్‌పైనే రూ. 50 వేల ఖర్చుతో మడులు, వరలతో తోట తయారు చేసుకున్నాను. విత్తనాలు తెచ్చుకొని నారు పోసి మొక్కలు నాటుతున్నాను. పూర్తి ఆర్గానిక్ పద్ధతిలో వీటిని పండిస్తున్నాను. వంటింటి వ్యర్థాలు, రాలిన ఆకులు, రెమ్మలతో నేనే వర్మీ కంపోస్టు తయారు చేసుకుంటున్నాను. గో పంచకం మా తమ్ముని దగ్గర నుంచి తెచ్చుకొంటున్నాను. తోటపనిలో రోజూ రెండు గంటలు పాదులు సరిచేసుకుంటూ, నీరు పెట్టుకుంటూ సంతోషంగా ఉన్నాను. తోట నాకు ఆరోగ్యంతోపాటు అనందాన్ని కూడా అందిస్తున్నది. నాకు తెలిసినంతలో ఇతరులకూ సలహాలు ఇస్తూ ఇంటిపంటల సాగును ప్రోత్సహిస్తున్నాను. – మున్నంగి హరిప్రియ (98493 46517), జెకేసీ కాలేజీ రోడ్డు, విజయపురి కాలనీ, గుంటూరు – ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో, గుంటూరు ఫొటోలు: గజ్జల రామగోపాలరెడ్డి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ -
ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటిపంటలతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఉద్యాన– పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్నారు. హైదరాబాద్ జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో తెలంగాణ ఉద్యానశాఖ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అర్బన్ఫార్మింగ్ అండ్ వర్టికల్ గార్డెనింగ్ మొదటి రాష్ట్రస్థాయి వర్క్‌షాప్‌లో ప్రభుత్వ సీఎస్ ఎస్కేజోషి, వ్యవసాయ ముఖ్యకార్యదర్శి పార్థసారథి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కూరగాయల డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి లేదన్నారు. దీన్ని చేరుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో కిచెన్‌గార్డెన్, వర్టికల్గార్డెన్ అర్బన్ఫార్మింగ్, ఇంటితోటల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రసాయనాలతో పండించిన కూరగాయల్ని కొని తినే బదులు, ఇంట్లో పండించిన కూరగాయలు మేలన్నారు. ఆహార సమస్యల కారణంగా తలెత్తే వ్యాధులను ఇంటిపంటలతో అరికట్టవచ్చని సూచించారు. సీఎస్ ఎస్కే.జోషి మాట్లాడుతూ..గతంలో తాను వ్యవసాయశాఖలో పనిచేసినపు డు అనేక సదస్సులు నిర్వహించామని, కానీ రైతుల నుంచి ఇంతటి ఆదరణ ఎప్పుడూ చూడలేదన్నారు. సీఎస్ ఘెరావ్..ఉద్రిక్తత: సమావేశం ముగిసిన అనంతరం ఎస్కే జోషిని పాలీహౌస్ రైతులు చుట్టుముట్టి తమ బకాయిలు చెల్లించాలంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం పాలిహౌస్‌ల్లో వ్యవసాయం చేయాలని ఆశచూపి ఇప్పుడు రూ.80 లక్షల వరకు బకాయిలు ఎగ్గొట్టిందని ఆరోపించారు. నాలుగేళ్లుగా సచివాలయం, ఉద్యాన శాఖ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా..ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యానశాఖ డైరెక్టర్‌తోనూ రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో కోపోద్రిక్తుడైన వెంకట్రామ్రెడ్డి అసలు పాలీహౌస్ సాగును ఎవడు చేపట్టమన్నాడు? అంటూ మండిపడ్డారు. రైతులపై సీఎస్ అసహనం.. సీఎస్ కారుకి రైతులంతా అడ్డంగా వచ్చి కదలకపోవడంతో చాలాసేపు జోషి కారులోనే ఉండిపోయారు. దీంతో ఆయన అసహనానికి గురై వారిని మందలించారు. బిల్లులు చెల్లించేందుకు కృషిచేస్తానని సీఎస్ హామీనివ్వటంతో రైతులు ఆందోళన విరమించారు. -
ఆకుపచ్చని ఆహారాలయం!
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన కట్కూరి నారాయణరెడ్డి, స్వరూప దంపతులు విశ్రాంత జీవితంలో సొంత ఇంటిపైనే విషం లేని స్వచ్ఛమైన ఆకుపచ్చని ఇంటిపంటల ఆహారాలయాన్ని అపురూపంగా నిర్మించుకున్నారు. హన్మకొండ రాఘవేంద్రనగర్ కాలనీలో స్థిరపడిన నారాయణరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేశారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ఒక బిడ్డ హన్మకొండలోనే కాపురం ఉంటుండగా, మరో బిడ్డ బెంగళూరులో స్థిరపడ్డారు. నారపల్లికి చెందిన మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి స్ఫూర్తితో నారాయణరెడ్డి, స్వరూప దంపతులు తమ ఇంటిపై రెండేళ్ల క్రితం చక్కటి మిద్దెతోట నిర్మించుకున్నారు. తమ చేతులతో మనసుపెట్టి పండించుకున్న చక్కని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటూ ఆరోగ్యంగా ఉన్నారు. పాత ఎయిర్ కూలర్ డబ్బాను మూడు చిన్న మడులుగా మలచారు. 4 అడుగుల వెడల్పున అడుగు లోతుండే ఎత్తు మడులు ఇటుకలు, సిమెంటుతో నిర్మించారు. మట్టి గోడల రంగులోని మడులపై ముగ్గులతో ఆహ్లాదకరంగా శిల్పారామాన్ని తలపిస్తుండటం విశేషం. రఘోత్తమరెడ్డి రెండుసార్లు స్వయంగా వచ్చి తగిన సూచనలు ఇవ్వటం విశేషం. ప్రస్తుతం ఎరుపు, తెలుపు గుండ్రని వంగ మొక్కలు, ఎర్ర బెండ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు కాస్తున్నాయి. పాలకూర, బచ్చలికూర, ఉల్లిఆకు, మెంతికూర, కొత్తిమీర తదితర ఆకుకూరలు వారి ఇంట్లో అందరి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయి. టమాటా మొక్కలు, బోడకాకర, దొండ పాదులు పూత దశలో ఉన్నాయి. సొర, చిక్కుడు, చమ్మ(తమ్మ) కాయ పాదులను నేల మీద పెట్టి.. మిద్దె మీదకు పాకించారు. గ్రీన్ లాంగ్ వంగ నారు పోశారు. డ్రమ్ముల్లో సపోట, మామిడి మొక్కలను, ద్రాక్ష పాదును నాటారు. ఇంటిపక్కనే పెంచుకున్న బంగినపల్లి మామిడి చెట్టు కాచే పండ్లు పన్నెండేళ్లుగా తింటున్నారు. తమ ఇంటిపంటల ఆరోగ్య రహస్యం ప్రతి ఆకునూ ప్రతిరోజూ స్వయంగా తడిమి చూసుకుంటూ ఉండటమేనని స్వరూప అన్నారు. అవసరం మేరకు అడపాదడపా వర్మీకంపోస్టు వేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మిక్సీలో వేసి ఏరోజు కారోజు మొక్కలకు పోస్తుంటానని, నాలుగైదు రోజుల్లో మట్టిలో కలిసిపోతాయన్నారు. దీనివల్ల పంట మొక్కలు, పూల మొక్కలు బలంగా పెరుగుతున్నాయని తెలిపారు. వాడేసిన టీపొడి కూడా మడుల్లో వేస్తున్నారు. రోజూ సహజ ఇంటిపంటలు తింటూ చాలా ఆరోగ్యంగా ఉన్నామన్నారు. తన భర్తకు రెండుసార్లు బైపాస్ సర్జరీ అయ్యిందని స్వరూప తెలిపారు. రోజూ 3 గంటల పాటు పచ్చని ఇంటి పంటల మధ్య గడపడం వల్ల తగినంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటమే కాకుండా.. బీపీ లేకుండా.. మానసిక ప్రశాంతత లభిస్తున్నాయని స్వరూప, నారాయణరెడ్డి(98494 50629) సంతృప్తిగా చెప్పారు. కోతుల వల్ల గత ఏడాది ఇబ్బందులు పడ్డామని, ఇనుప జాలీని అమర్చుకోవడమే మేలని భావిస్తున్నామన్నారు. కట్కూరి నారాయణరెడ్డి మిద్దెతోటలో కాసిన కాయగూరలు, ఆకుకూరలు -
భూసారాన్ని బట్టే చీడపీడల బెడద!
రసాయనిక అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేసుకోవాలన్న ఆసక్తి గాఢంగా ఉండాలే గాని సొంతిల్లే అవసరం లేదు. క్వార్టర్లో నివాసం ఉంటున్నప్పటికీ ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవచ్చని రుజువు చేస్తున్నారు డా. వి. శ్రీనివాసరావు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన తన కుటుంబంతో క్యాంపస్ క్వార్టర్లో నివాసం ఉంటూ.. పెరటి స్థలంలో ఇంటిపంటలు పండించుకుంటున్నారు. గతంలో క్వార్టర్ పై అంతస్తులో ఉండగా టెర్రస్ మీద ఐదేళ్లపాటు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా తయారు చేసుకున్న జీవామృతం, ఘన జీవామృతంతో ఇంటిపంటలు సాగు చేసిన అనుభవం ఉంది. గత ఏడాది నుంచి పెరట్లో సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాటావుల మాగిన పేడ ఎరువు, మేకల ఎరువు సమపాళ్లలో కలిపి మొక్కలకు వేస్తున్నారు. వేసవిలోనే దగ్గర్లోని గ్రామానికి వెళ్లి రైతు నుంచే కొనుగోలు చేసి తెచ్చుకొని వాడుతున్నారు. అరటి గెల ఆయన పెరటి తోటకు దీపస్థంభంలా భాసిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆయన పెరటి తోటలో దొండ/బీర పాదులతోపాటు బెండ మొక్కలు, వంగ మొక్కలు, పుదీన ఉన్నాయి. వంగ మొక్కలకు వేసవికి ముందు 4–5 అంగుళాల ఎత్తున ప్రూనింగ్ చేశారు. కొత్త కొమ్మలకు ఇప్పుడు కాయలు వచ్చాయి. పుదీన, తోటకూర ఉంది. మృగశిర కార్తెతో పాటే రుతుపవనాలు పలుకరించిన తర్వాత వారం క్రితమే అనేక ఆకుకూరలు విత్తుకున్నారు.కూరగాయ మొక్కల విత్తనాల నారు పోసుకున్నారు. టెర్రస్ గార్డెన్లో కన్నా పెరటి తోటలో పంటలకు చీడపీడల బెడద తక్కువగా ఉన్నట్లు గమనించానని డా. శ్రీనివాసరావు తెలిపారు. భూమిలో సారం బాగుంటే చీడపీడల బెడద తక్కువగా ఉంటుందన్నారు. కట్టెల బొగ్గు పొడిని అప్పుడప్పుడూ మొక్కలపై చల్లుతుంటానన్నారు. వారానికోసారి లీటరు నీటికి 10–15 ఎం.ఎల్. నాటావు మూత్రాన్ని కలిపి పెరటి తోటలో పిచికారీ చేస్తున్నానని తెలిపారు. వచ్చే నెల నుంచి పూర్తిస్థాయిలో తమ పెరటి తోట కూరగాయలు, ఆకుకూరలనే తింటామని డా. శ్రీనివాసరావు(94922 93299) సంతోషంగా చెప్పారు. కొత్తిమీర, ఎరువును చూపుతున్న డా. శ్రీనివాసరావు -
నగరంలో రైతన్న ఫణివేణు!
విస్తారమైన పొలాల్లో అనేక దశాబ్దాలు వ్యవసాయం చేసిన ఒక సీనియర్ రైతు.. పిల్లల చదువుల నేపథ్యంలో నగరానికి తరలి వచ్చారు. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసిందేమీ ఉండేది కాదు. కాన, ఫణివేణు(49) విభిన్నమైన సిటీ ఫార్మర్‌గా, సర్వీస్ ప్రొవైడర్‌గా మారారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలానికి చెందిన జమలాపురపు ఫణివేణు అనేక దశాబ్దాలుగా అనువంశికంగా సంక్రమించిన 22 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. తమ పొలంలో యూకలిప్టస్ మొక్కలు నాటి.. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు. రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ ఇళ్లపైనే సాగు చేసుకోవడంపై నగరవాసులు అమితాసక్తిని కనపరుస్తుండడం.. అయితే నగరవాసులకు ఇంటిపంటల సాగులో సేవలందించే వ్యవస్థ శైశవదశలో ఉండడం ఫణివేణును ఆలోచింపజేసింది. కూరగాయలు తదితర ఆహార పంటల సాగులో తనకున్న అనుభవంతో నగరంలో ఇంటిపంటల సాగుదారులకు సర్వీస్ ప్రొవైడర్‌గా మారి తోడ్పాటునందించాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు. నగరవాసుల ఆసక్తి, ప్రత్యేక అవసరాల మేరకు మేడలపైన షేడ్‌నెట్ హౌస్‌లు నిర్మించడం.. కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేయించడం.. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు పాటించడం.. సేంద్రియ ఇంటిపంటల సాగులో సంతృప్తికరమైన దిగుబడిని రాబట్టేలా శ్రద్ధ తీసుకోవడం ఆయన ప్రత్యేకత. షేడ్‌నెట్ హౌస్‌లో పెరిగే మొక్కలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, దిగుబడి బాగుంటుందని ఆయన అంటారు. ఆసక్తితో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కల ద్వారా మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన విత్తనంతో నారు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఫణివేణు చెబుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలతో కూడా సేంద్రియ ఇంటిపంటల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్న ఆయన.. ఎల్.బి. నగర్లో సొంతంగా చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 8 టెర్రస్ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, వాటి బాగోగులు చూస్తున్నారు. షేడ్‌నెట్ నిర్మించుకొని 200 కుండీలు పెట్టుకుంటే పూర్వానుభవం లేకపోయినప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిశ్చింతగా పండించుకోవచ్చని అంటూ.. అందుకు నగరవాసులకు తోడ్పడడమే తన లక్ష్యమని ఫణివేణు(99088 79247) అంటున్నారు. అవసరమైన వారికి డ్రిప్, షేడ్‌నెట్‌లో నీటి తుంపర్లను వెదజల్లే ఫాగర్లను సైతం ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమతో ఖచ్చితమైన పంట దిగుబడిని పొందవచ్చంటున్న నగరంలో రైతన్న ఫణివేణుకు జేజేలు! -
మునగ చెట్లను గుబురుగా పెంచడం ఎలా?
► మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో – మునగ చెట్టును తప్పనిసరిగా పెంచుకోవాలి. ► తోటలో మునగ చెట్టు ఉంటే, ఒక కాయగూర – ఒక ఆకుకూర చెట్టు ఉన్నట్టు! ► కాయలనూ–ఆకునూ వినియోగించుకోవచ్చు. ► మునగ బహుళ ప్రయోజనకారి. సులభంగా పెరుగుతుంది. తొందరగా కాపునకు వస్తుంది. ► మునగ చెట్టును పెంచడంలో ఒక జాగ్రత్త తీసుకోవాలి. చెట్టును గుబురుగా పెంచాలి. ► ప్రతి అడుగు ఎత్తు పెరిగినప్పుడల్లా.. కొమ్మల చివరలను తుంచాలి. తుంచిన చోట, తిరిగి రెండు చివుళ్లు వస్తాయి. ► అలా ఎప్పుడూ చేస్తూ ఉండాలి! ► దానివల్ల చెట్టు ఎక్కువ కొమ్మలతో గుబురుగా పెరుగుతుంది. ఆకు కోసి కూర వండుకోవచ్చు. లేనట్లయితే, చెట్టు నిటారుగా పెరుగుతుంది. విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ► చిన్న మొక్కల పూతను కూడా తుంచెయ్యాలి. లేకపోతే చెట్టు ఎదగదు! ► మొక్క నాటిన లేదా విత్తనం వేసిన తర్వాత కనీసం, ఆరేడు నెలలు పూతను తుంచెయ్యడంవల్ల చెట్టు బలంగా ఎదుగుతుంది. అలా ఎదిగాక పూతను ఉంచాలి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు f:/Tummeti Raghothama Reddy 1. మునగ మొక్క సన్నగా, నిటారుగా పెరుగుతుంటుంది. 2.3. కొమ్మల చివరలను, లేత మొక్కల పూతను తుంచుతూ ఉంటే.. ఎక్కువ కొమ్మలు వస్తాయి. 4. గుబురుగా పెరిగిన మునగ మొక్క నుంచి ఆకును కోసుకోవచ్చు. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఆ ఇల్లు.. ఆహార పంటల పొదరిల్లు
ఆ ఇంటి మిద్దెపైకి వెళ్తే ఆకు కూరల పచ్చదనం స్వాగతం పలుకుతుంది. కాయగూరల మొక్కలు బోలెడు కబుర్లు చెబుతుంటాయి. రంగురంగుల పూలు పరిమళాలు వెదజల్లుతాయి. వెరసి ఆ ఇల్లు సేంద్రియ వనంగా, ఆహార పంటల పొదరిల్లుగా మారిపోయింది. ఆ సామ్రాజ్యానికి రారాణి.. తాడికొండ అనుపమ! విశాఖ నగరంలో శంకరమఠం ప్రాంత నివాసి అయిన అనుపమ తొలుత తన వంటగది సమీపంలో 10 కుండీల్లో ఆకుకూరలు పెంచారు. ఆ తర్వాత రెండేళ్ల నుంచి టెర్రస్‌పై కూరగాయల సాగు చేస్తున్నారు. భర్త టీవీ సుధాకర్ ప్రోత్సాహంతో ఆమె ఈ పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే ఈ రెండేళ్లుగా ఆకుకూరలు, కూరగాయలు కొనలేదట. ఆ ఇంట.. ప్రతి పంట.. అనుపమ ఇంటి టెర్రస్‌పై ప్రతి పంటా దర్శనమిస్తుంది. వంటగదిలో ఏర్పాటు చేసిన కుండీల్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకును పెంచుతున్నారు. కూరలకు అవసరమైన వాటిని ఆ కుండీల నుంచి తాజాగా తుంచి వంటలకు వినియోగిస్తున్నారు. అదే మాదిరిగా టెర్రస్‌పై తోటకూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, ముల్లంగి, ఉల్లికాడలు, మెంతికూర తదితర ఆకుకూరలను సాగు చేస్తున్నారు. అదే విధంగా దొండకాయలు, బెండకాయలు, వంకాయ, టమాటా, బీర, దోస, చిక్కుడు, సొరకాయ, మిరపకాయలు, అల్లం, మామిడి అల్లం, వెల్లుల్లి, మునగకాయలు, ఫ్రెంచ్బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలిఫ్లవర్, చిక్కుడు, మునగ, బీట్రూట్ మొదలైన కూరగాయలు పండిస్తున్నారు. మిర్చిలో నాలుగైదు రకాలు ఉన్నాయి. జామ, నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొక్కలను సైతం పెంచుతున్నారు. డ్రమ్ములు, సిమెంట్, ప్లాస్టిక్, మట్టి కుండీలతో పాటు ధర్మాకోల్ డబ్బాలు, వాటర్ క్యాన్లలోనూ మొక్కలు పెంచుతున్నారు. 10 మొక్కలతో ప్రారంభమైన ఆ ఇంటి పంట.. ఇప్పుడు 200కి పైగా మొక్కలకు చేరుకుంది.గోమూత్రం, ఆవు పేడను ఎరువుగా వినియోగిస్తున్నారు. వాడిపోయిన పూలు, రాలిన ఆకులు, కూరగాయ వ్యర్థాలను ఒక చోట చేర్చి, అందులో అప్పుడప్పుడూ మజ్జిగ చల్లుతూ 30 నుంచి 45 రోజుల్లో కంపోస్టు తయారు చేసుకొని, మొక్కలకు వాడుతున్నారు. పిల్లల కోసం లిటిల్ ఫార్మర్ కిట్ చిన్నారుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి లిటిల్ ఫార్మర్‌గా తీర్చిదిద్దాలని ఆమె సంకల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్‌ను సిద్ధం చేశారు. ఒక గ్రోబ్యాగ్, మట్టి మిశ్రమం, విత్తనాలతోపాటు.. విత్తనాలు వేశాక దశలవారీగా మొక్కల పెరుగుదలను పిల్లలు నమోదు చేసేందుకు యాక్టివిటీ షీట్, కలరింగ్ షీట్, సలాడ్ రెసిపీతో పాటు లిటిల్ ఫార్మర్ సర్టిఫికెట్ కూడా ఆ కిట్‌లో ఉంటాయి. అనుపమ రూపకల్పన చేసిన ‘లిటిల్ ఫార్మర్ కిట్’ -
ఇంటిపంటల రుచే వేరు!
జీవిత బీమా సంస్థ ఉద్యోగులైన మేడేపల్లి సాయిశ్రీ, అనంత్ దంపతులు తమ ఇంటిపైన రెండేళ్లుగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతోపాటు పూలమొక్కలను పెంచుకుంటున్నారు. హైదరాబాద్ గుడిమల్కా పూర్లోని జయనగర్ ఎల్.ఐ.సి. కాలనీలో రెండంతస్తుల సొంతిల్లు నిర్మించుకున్న తర్వాత టెర్రస్ కిచెన్ గార్డెనింగ్పై దృష్టిసారించారు. ఇంటిపంటల సాగుపై ముందస్తు ప్రణాళికతో టెర్రస్‌పైన లీక్ ప్రూఫింగ్ చేయించారు. ఐరన్ బెంచ్‌లు చేయించి, వాటిపై ఎత్తుల వారీగా కుండీలను అందంగా అమర్చారు. చిన్నసైజు సిల్పాలిన్ బ్యాగ్‌లలో టమాటా, కొత్తిమీర, పాలకూర సాగు చేస్తున్నారు. ఎర్రమట్టి, పశువుల ఎరువు కలిపి మొక్కలు పెట్టుకున్న తర్వాత అడపాదడపా కోకోపిట్, వర్మీకంపోస్టు వేస్తూ.. జీవామృతం కొనుగోలు చేసి, పది రెట్లు నీరు కలిపి మొక్కల పోషణకు ఉపయోగిస్తున్నారు. గతంలో ఇబ్బడిముబ్బడిగా పండిన తెల్ల వంకాయలు, పచ్చి మిరపకాయలను తమ సహోద్యోగులకు, తెలిసినవారికి కూడా పంచిపెట్టడం చాలా సంతోషాన్నిచ్చిందని వారు తెలిపారు. ఇంటి కూరగాయలు, ఆకుకూరలు ఆరోగ్యకరమైనవి కావడంతో పాటు.. వీటితో వండిన కూరలకు.. బయట కొన్న కూరగాయలతో వండిన కూరలకు రుచిలో స్పష్టమైన తేడా ఉందన్నారు. పిల్లలు సైతం ఈ తేడాను స్పష్టంగా గుర్తించగలరని వారన్నారు. ఎండలు ముదురుతున్నందున షేడ్‌నెట్ ఏర్పాటు చేసి.. మరింతగా ఆకుకూరల సాగుపై దృష్టిపెట్టనున్నామని సాయిశ్రీ(93480 28228) అన్నారు. -
ఆక్వాపోనిక్స్‌తో సత్ఫలితాలు!
ఇంటిపట్టున స్వల్ప ఖర్చుతో, వనరులు వృథా కాకుండా చేపలను సాగు చేయడం, చేపల విసర్జితాలు కలిసిన నీటిని కూరగాయలు, ఆకుకూర మొక్కలు పెరిగే కుండీలు, టబ్‌లకు అందించడాన్ని ఆక్వాపోనిక్స్ (రీ సర్యు్యలేటింగ్ ఆక్వాపోనిక్స్ సిస్టం– ఆర్.ఎ.ఎస్.) వ్యవస్థగా చెప్పొచ్చు. ఈ పద్ధతిలో మట్టిని వాడాల్సిన అవసరం లేదు. చేపలకు మేత వేస్తే చాలు. మొక్కలకు ఎరువులు వేయనక్కర లేదు. చేపల విసర్జితాలతో కూడిన నీరు సూక్ష్మ, స్థూల పోషకాలతో నిండి ఉంటుంది. ఈ నీటిని మొక్కల వేళ్లకు అందిస్తే.. అందులోని పోషకాలను గ్రహించి కూరగాయలు, ఆకుకూరలు చక్కగా పెరుగుతాయి. నత్రజనిని స్థిరీకరించే సూక్ష్మజీవులు అమ్మోనియాను నైట్రైట్‌గా, తదనంతరం నైట్రేటుగా మార్చి మొక్కలకు అందిస్తాయి. ఇందులో వాడే నీటిలో 90%, పోషకాలలో 100% వృథాపోకుండా ఉపయోగించడానికి అవకాశం ఉంది. తద్వారా పూర్తిగా సేంద్రియ చేపలు, ఆకుకూరలు, కూరగాయలను పండించుకోవచ్చని మహారాష్ట్ర పుణే జిల్లా పబల్‌లోని ‘విజ్ఞాన ఆశ్రమం’ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా కొత్త ఆలోచనతో ఈ ఆశ్రమానికి వచ్చే వ్యక్తికి తదనంతర పరిశోధనకు సహాయపడి.. ఆ పరిశోధనా ఫలితాల ద్వారా ఆ వ్యక్తి ఉపాధి పొందేలా తోడ్పాటునందించడం విజ్ఞాన ఆశ్రమం ప్రత్యేకత. గత 5 నెలలుగా ఆక్వాపోనిక్స్‌పై అధ్యయనం జరుగుతోంది. గత ఏడాది సెప్టెంబర్‌లో 2 గ్రాముల గ్రాస్ కార్ప్ చేప పిల్లలు వేస్తే.. 5 నెలల్లో 30–450 గ్రాముల వరకు బరువు పెరిగాయి. చేపలకు అజొల్లా/బెర్సీమ్‌తోపాటు నీటిలో తేలియాడే బలపాల మేతను (40:40:10 నిష్పత్తిలో) వేస్తున్నారు. 50 వేల లీటర్ల నీటి ట్యాంకులో వెయ్యి చేప పిల్లలు వేశారు. కొన్ని పిల్లలు తీసేస్తే చేపల పెరుగుదల మరింత బాగుంటుందని భావిస్తున్నారు. చేపల నీటితో టమాటాలు, కలబంద, పాలీహౌస్లో గులాబీలను సాగు చేస్తున్నారు. జూన్ నాటికి పూర్తి వివరాలు తెలుస్తాయని భావిస్తున్నారు. వివరాలకు.. Email: vigyanashramvideo@gmail.com -
వంటింటి తడి చెత్తతో కుండీల్లోనే కంపోస్టు!
అపార్ట్మెంట్లలో నివసించే కుటుంబం వంటింటి తడి చెత్తను బయట పారేయకుండా చేయగలగడం ఎలా? ఈ సమస్యకు సరైన పరిష్కారం వెదకగలిగితే నగరాలు, పట్టణాల్లో మున్సిపాలిటీ వాళ్లకు చెత్తకు సంబంధించి సగం యాతన/ఖర్చు తగ్గుతుంది. ఈ దిశగా ఓ యువకుడి అన్వేషణ చక్కని పరిష్కారాన్ని ఆవిష్కరించింది. బాల్కనీలో ఐదు కుండీలు పెట్టుకొని ఆకుకూరలు పెంచుతూ, ఆ కుండీల్లోని మట్టిలోనే ఒక మూలన చెత్త డబ్బాను ఏర్పాటు చేసుకొని వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసే(వార్మ్బిన్) పద్ధతిని అనుసరిస్తున్నారు. టేకూరు రవిశంకర్ స్వస్థలం నెల్లూరు రూరల్ మండలంలోని వెంకన్నపాలెం. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. రాజేంద్రనగర్ ఉప్పరపల్లిలో అపార్ట్మెంట్లో నివాసం. బాల్కనీలో 5 కుండీలను ఏర్పాటు చేసుకొని పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీరను సాగు చేసుకుంటూ సేంద్రియ ఆహారాన్ని తింటున్నారు. వంటింటి నుంచి వెలువడే తడి చెత్తను బాల్కనీలో వాసన ఇతరత్రా ఇబ్బందులూ లేకుండా కంపోస్టుగా మార్చడానికి రవిశంకర్ చేయని ప్రయత్నాల్లేవు.. చివరకు మొక్కలు పెరుగుతున్న కుండీల్లోనే.. వంటింటి వ్యర్థాలను కంపోస్టుగా మార్చే ఉపాయాన్ని ఆలోచించి, విజయవంతంగా ఆచరణలో పెట్టారు. నిశ్చింతగా కంపోస్టు తయారు చేసుకోవడం, ఆకుకూరలు పండించుకోవడం సజావుగానే సాగుతోంది. బాల్కనీలో 3 అడుగుల పిట్టగోడపైన గ్రిల్స్ బిగించి అక్కడ కుండీలను ఏర్పాటు చేశారు. 3 అడుగుల ఎత్తయిన కుండీలను తీసుకొని.. అందులో అర అడుగు ఎత్తు ఉండే ఖాళీ ప్లాస్టిక్ సీసా/డబ్బాను పెట్టారు. డబ్బా అడుగును పూర్తిగా కత్తిరించి తీసేశారు. దానికి చుట్టూతా చిన్నపాటి బెజ్జాలు చేశారు. దాన్ని కుండీలోని మట్టిలో ఒక అంగుళం పైకి కనపడే విధంగా పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆకుకూరలు పెరిగే కుండీలోనే వానపాములు కంపోస్టు తయారు చేసే డబ్బానొకదాన్ని(దీనికి ‘వార్మ్ బిన్’ అని పేరు పెట్టారు) ఏర్పాటు చేశారన్నమాట. రెండు రోజులకోసారి... ప్లాస్టిక్ డబ్బాలో అడుగున (బొమ్మలో చూపిన విధంగా) అడుగున ఒకటి, కొంచెం కంపోస్టు వేసి.. ఆపైన పండ్లు, కూరగాయల తొక్కలు వేసి, గుడ్డను కప్పుతారు. డబ్బాకు పైన మూతపెడతారు. కొద్ది రోజుల్లోనే వానపాముల సంఖ్య పెరిగి ఈ తడి చెత్తను తింటూ కంపోస్టుగా మారుస్తూ ఉంటాయి. రెండు రోజులకోసారి వంటింట్లో కూరగాయలు, పండ్లు వేసి, మూత పెడుతూ ఉంటే చాలు.. వానపాములు ఈ డబ్బా అడుగు నుంచి, పక్కన బెజ్జాలలో నుంచి కిందికీ పైకి తిరుగుతూ తడి చెత్తను తింటూ కంపోస్టుగా మారుస్తూ ఉంటాయి. ఈ క్రమంలో వెలువడే పోషక ద్రవం మొక్కల వేళ్లకు ఎప్పటికప్పుడు అందుతూ చక్కని పోషకాలను అందిస్తూ ఉంటుందంటున్నారు రవిశంకర్(97030 16820). -
ఈ టెర్రస్.. ఇంటిపంటల శిక్షణా కేంద్రం!
సింహాచలం అప్పన్న గోశాలకు కూత వేటు దూరంలో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని దారపాలెంలో సొంత ఇల్లు నిర్మించుకున్న దాట్ల వర్మ, శ్రీదేవి దంపతులు సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆదర్శవంతమైన కృషి చేస్తున్నారు. వర్మ ప్రస్తుతం విజయనగరం ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్లో టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సొంతిల్లు నిర్మించుకొని టెర్రస్ కిచెన్/మెడిసినల్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 150కి పైగా ఖాళీ రంగు డబ్బాలలో మొక్కలు పెంచుతున్నారు. ఇంటిపంటల జీవవైవిధ్యానికి నిదర్శనం: ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పూలమొక్కలతో పచ్చగా కళకళలాడే వారి టెర్రస్ గార్డెన్ జీవవైవిధ్యంతో సుసంపన్నంగా ఉంటుంది. ఘనజీవామృతం, జీవామృతం, పశువుల ఎరువు(గెత్తం), వర్మీకంపోస్టు, అవసరం మేరకు కషాయాలను వాడుతూ వర్మ దంపతులు మక్కువతో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి చుట్టూ నేలపైన, దగ్గర్లో తెలిసిన వారి ఖాళీ ఇంటి స్థలాల్లో కూరగాయలు, కందులు, పండ్ల మొక్కలను సాగు చేస్తూ.. పూర్తిగా ఇంటిపంటల ఆహారాన్నే తింటున్నారు. మేడపైన పుదీన, కొత్తిమీర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరలతోపాటు బీర, ఆనపకాయ, చిక్కుళ్లు, కంది,అరటి, వంకాయలు, బెండకాయలు, క్యాబేజి, టమోటా సాగు చేస్తున్నారు. ఇంటి చుట్టూ పెరట్లో పది రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. హైదరాబాద్‌లోని ఇంటిపంట సాగుదారులు ఏర్పాటు చేసుకున్న ఫేస్బుక్ బృందం స్ఫూర్తితో ప్రధానంగా విశాఖ ప్రాంత ఇంటిపంట సాగుదారులకు సహాయ పడటానికి కొత్తవలసకి చెందిన కర్రి రాంబాబుతో కలిసి ఫేస్బుక్లో రైతుమిత్ర పేరిట బృందాన్ని ప్రారంభించారు. ఇంటిపంటలపై అవగాహన: సేంద్రియ ఇంటిపంటల పెంపకంపై ఆసక్తి ఉన్న విశాఖనగరవాసులు సెలవు రోజుల్లో మా ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి అవగాహన కల్పించడంతోపాటు కొన్ని మొక్కలు, విత్తనాలను కూడా ఇస్తున్నామని వర్మ, శ్రీదేవి(98661 38129) తెలిపారు. సింహాచలం అప్పన్న ఆలయ గోశాలలో జీవామృతాన్ని తయారు చేయించి, మనిషికి 5 లీటర్ల చొప్పున ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. మరింత మందికి ఈ విధానాన్ని తెలియజేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెబుతున్నారు. – అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం, విశాఖ జిల్లా -
తీగజాతి కూరగాయల విత్తనాలు నాటుకునే సమయమిదే!
వేసవి ‘ఇంటిపంట’లపై తుమ్మేటి రఘోత్తమరెడ్డి సూచనలు జనవరి నెల చివరికొచ్చింది. చలి వెనకపట్టు పట్టింది. వేసవికాలంలో కూరగాయల కొరత లేకుండా ఉండాలంటే ఇప్పుడు తిరిగి విత్తనాలను నాటుకోవాలి. కొన్ని రకాలను మినహాయిస్తే, దాదాపు అన్ని రకాలను నాటుకోవచ్చు. మిర్చి, క్యాబేజి, క్యాలీఫ్లవర్, క్యారెట్, చిక్కుడు, టమాటా వంటివి ప్రధానంగా శీతాకాలపు పంటలు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీటిని వర్షాకాలంలో కూడా పండించొచ్చు. కానీ, వేసవి కాలంలో పండించటం కష్టం. తగిన నీడ ఏర్పాటు చేసినా, మిర్చి, టమాటాలలో పూత నిలవదు, కాపు రాదు! ఇప్పుడు వీటి జోలికి పోకపోవడమే మంచిది! చిక్కుడు మినహా అన్ని రకాల తీగజాతి కూరగాయల విత్తనాలను నాటుకోవచ్చు. బీర, సొర, కాకర, దోస, పొట్ల వంటివి నాటుకోవచ్చు. గుమ్మడి నాటకూడదు. బెండ, గోరుచిక్కుడు, వంగ, అలసంద వంటివి నాటుకోవచ్చు. ఇప్పుడు క్యాబేజి, క్యాలీఫ్లవర్ నారు దొరికితే నాటుకోవచ్చు. ఇప్పుడు నారు పోసి నాటుకోవాలంటే ఆలస్యం అవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా అన్ని రకాల విత్తనాలను, నార్లను నాటుకోవాలి. యథావిధిగా మట్టిలో తగినంత ఎరువు ఉన్నదీ లేనిదీ చూసుకోవాలి. నాలుగైదు రకాలను నాటి ఊరుకోకండి. వీలైనన్ని ఎక్కువ రకాలను నాటుకోవాలి. ఇరవై రకాలను నాటుకుంటే, అందులో కొన్ని పోయినా, మరికొన్ని కాస్తాయి! వాతావరణం మన చేతిలో ఉండదు. కొన్ని విషయాలలో మనం ఏమీ చెయ్యలేం, ముందు జాగ్రత్తలు తీసుకోవడం మినహా! అందుకని ఎక్కువ రకాలను నాటుకోవాలి (‘మిద్దె తోట – చీడ పీడలు’ వాట్సప్ గ్రూప్‌లో సభ్యులు కాదలచినవారు పేరు, వాట్సప్ నంబర్‌ను ఈ కింది నెంబర్‌కు మెసేజ్ చేయవచ్చు). – తుమ్మేటి రఘోత్తమరెడ్డి (90001 84107), సేంద్రియ ‘మిద్దె తోట’ల నిపుణుడు -
అబ్బురపరుస్తోన్న పెరటి పొట్ల
సాక్షి, రామిరెడ్డిపల్లి (నందిగామ): ఎటువంటి ఎరువులు వినియోగించనప్పటికీ ఓ ఇంటి పెరట్లో పొట్ల పాదు ఏకంగా 8 అడుగుల మేర కాయలను ఇస్తూ చూపరులను అబ్బురపరుస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పల్లెకంటి వెంకమ్మ తన ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పొట్ల విత్తనాలు నాటింది. ఆ పాదు ఇప్పటికే వందకు పైగా పొట్లకాయల దిగుబడినిచ్చింది. ప్రతి కాయ సుమారు 7 అడుగుల నుంచి 8 అడుగుల వరకు ఉండటం గమనార్హం. చెట్టుకు ఎలాంటి ఎరువులు, మందులు వినియోగించలేదని వెంకమ్మ చెప్పారు. పందిరికి పాముల వలె వేలాడుతున్న పొట్లకాయలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. -
సహజ పంటలకు సప్త సూత్రాలు!
‘సాక్షి’ ప్రారంభించిన ‘ఇంటిపంట’ కాలమ్ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మందిలో స్ఫూర్తిని రగిలించి ‘ఇంటిపంట’ల సాగుకు ఉపక్రమింపజేసింది. నివసించే ఇంటి వద్ద ఉన్న తక్కువ స్థలంలోనే కూరగాయలు, ఆకుకూరలు సేంద్రియ పద్ధతిలో పండించుకుంటూ ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. అటువంటి సహజాహార ప్రేమికుల్లో డా. వసంత శ్రీనివాసరావు(94922 93299- సాయంత్రం 7-8 గంటల మధ్య మాత్రమే) ఒకరు. కొత్తగా ఇంటిపంటల సాగు ప్రారంభించిన వారికి తరచూ ఎదురయ్యే సందేహాల నివృత్తి కోసం.. కొన్ని పద్ధతులు, సూచనలను స్వీయానుభవంతో ఆయన మీ ముందుంచుతున్నారు. 1జీవామృతం కావలసిన పదార్థాలు: తాజా(పది రోజుల్లోపు) నాటు ఆవు పేడ 2 కేజీలు, నాటు ఆవు పంచకం ఒకటిన్నర లీటర్లు, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) అర కేజీ, ఏదైనా పప్పుల(కంది/శనగ/మినుము/పెసర..) పిండి అర కేజీ, బాగా మగ్గిన అరటి పండ్లు 2 లేదా 3, చెట్ల కింద మట్టి 2 గుప్పిళ్లు, 30 - 35 లీటర్ల నీరు, 50 లీటర్ల డ్రమ్ము. తయారీ విధానం: పేడ, తురుముకున్న బెల్లం, పప్పుల పిండి, మట్టి, అరటి పండ్ల గుజ్జు.. వీటిని చేతితో బాగా కలపాలి. ఆ తరువాత ఈ మిశ్రమంలో ఆవు మూత్రం వేసి మళ్లీ కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 50 లీటర్లు పట్టే డ్రమ్ములో వేసుకొని 30 నుంచి 35 లీటర్ల నీటిని పోయాలి. ఇలా తయారు అయిన ద్రావణాన్ని నీడలో పెట్టుకోవాలి. ఇలా భద్రపరచుకున్న ద్రావణాన్ని ఉదయం, సాయంత్రం పూటల్లో వేప కర్రతో ఒక నిమిషం పాటు కుడి చేతివైపు తిప్పుతూ మొదట 3 రోజులు కలుపుకోవాలి. నాలుగో రోజు నుంచి వాడుకోవడానికి జీవామృతం మంచి బ్యాక్టీరియాతో తయారవుతుంది. వాడే విధానం: ఇలా తయారైన జీవామృతాన్ని 1:10 నిష్పత్తిలో మొక్కలు, చెట్ల పాదుల్లో పోయవచ్చు. వాటిపైన పిచికారీ చేయొచ్చు. ఇలా తయారుచేసుకున్న జీవామృతాన్ని 7-10 రోజుల్లోపు వినియోగించాలి. 2 ఘన జీవామృతం కావలసిన పదార్థాలు: తాజా ఆవు పేడ 2 కేజీలు, బెల్లం పావు కేజీ, ఏదైనా పప్పుల పిండి పావు కేజీ, ఆవు మూత్రం తగినంత (100 మిల్లీలీటర్లు మించకుండా). తయారీ విధానం: తురిమిన బెల్లం, పిండి, ఆవుపేడ.. ఈ మూడిటిని బల్లపరుపుగా పరచిన ప్లాస్టిక్ షీట్ లేదా గోనెసంచిపై వేసి చేతితో బాగా కలిపి.. ఉండలు తయారు చేసుకోవడానికి వీలుగా తగినంత ఆవు మూత్రం కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండల్లా చుట్టి, నీడలోనే ఆరబెట్టాలి. నీడలో పూర్తిగా ఎండిన ఈ ఉండల్ని పొడి చేసుకొని ఒక గోనె సంచిలో నిల్వ ఉంచి సంవత్సరమంతా వాడుకోవచ్చు. వాడే విధానం: ఘన జీవామృతాన్ని మొక్క మొదట్లో గుప్పెడు చొప్పున ప్రతి 10 నుంచి 15 రోజులకోసారి వేసుకోవాలి. ఇందులో నిద్రావస్థలో ఉండే మేలుచేసే సూక్ష్మజీవులు నీరు తగిలినప్పుడు మేలుకుంటాయి. వీటి ద్వారా మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. వేపకషాయం కావలసిన పదార్థాలు: తాజా వేపాకులు అర కేజీ, దేశీ ఆవు తాజా పేడ అర కేజీ, దేశీ ఆవు మూత్రం అర లీటరు. తయారీ విధానం: మెత్తగా నూరిన వేపాకు మిశ్రమానికి ఆవు పేడ, ఆవు మూత్రం చేతితో కలుపుకోవాలి. ఈ రకంగా కలుపుకున్న వేప కషాయాన్ని 3 రోజులు పులియబెట్టాలి. నాలుగో రోజున ఈ మిశ్రమాన్ని గుడ్డతో వడబోసి దాచుకోవాలి. 1:10 నిష్పత్తిలో వేప కషాయం, నీరు కలిపి ప్రతి పది నుంచి పదిహేను రోజులకొకసారి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. కీటకాల నివారిణి (మల్టీ పెస్ట్ కంట్రోలర్) కావలసిన పదార్థాలు: పావు కేజీ చొప్పున జిల్లేడు, మారేడు, వేప, కానుగ, ఉమ్మెత్త, సీతాఫలం, గన్నేరు ఆకులతోపాటు దేశీ ఆవు మూత్రం (డ్రమ్ములో వేసిన ఈ ఆకుల మిశ్రమం పూర్తిగా మునగడానికి) తగినంత. తయారీ విధానం: పైన చెప్పిన అన్ని రకాల ఆకులను మెత్తగా నూరుకొని.. ఏదైనా ఒక ప్లాస్టిక్ పాత్రలో పెట్టి ఆకుల మిశ్రమం పూర్తిగా మునిగే వరకు ఆవు మూత్రం పోయాలి. ఈ మిశ్రమాన్ని 15 రోజులు మురగబెట్టాలి. ఆ తర్వాత వడకట్టుకొని ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. కషాయాన్ని 1:30 నిష్పత్తిలో నీటిలో కలిపి మొక్కలపై పిచికారీ చేసుకోవాలి. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉన్నదైతే అంత ఎక్కువ ప్రభావశీలంగా పనిచేస్తుంది. ఎగ్ అమైనో యాసిడ్ (ముట్టగయం) కావలసిన పదార్థాలు: నాటు కోడిగుడ్లు 2 లేక 3, మూత ఉన్న గాజు సీసా(లీటరు ద్రవం పట్టే అంతది), నాటు కోడిగుడ్లు మునగడానికి కావలసినంత తాజా నిమ్మరసం, బెల్లం (సేంద్రియ బెల్లం ఉత్తమం) పావు కేజీ. తయారీ విధానం: గాజు సీసాలో నాటు కోడిగుడ్లను (పగలగొట్టకుండా, పెంకు తీయకుండా) ఉంచాలి. గుడ్లు మునిగేంత వరకు తాజా నిమ్మరసం పోయాలి. మూత గట్టిగా పెట్టి 18 రోజులు వేడి తగలని ప్రదేశంలో ఉంచు కోవాలి. 18వ రోజున దీనిలో తురిమిన బెల్లాన్ని వేసి బాగా కలిపి ఆ రోజు నుంచి మళ్లీ పది రోజుల వరకు వేడి తగలని నీడ ప్రదేశంలో భద్రపరచాలి. మొత్తం 28 రోజుల్లో పిచికారీకి సిద్ధమవుతుందన్నమాట. పిచికారీ విధానం: సిద్ధమైన ఎగ్ అమైనో యాసిడ్‌ను ఒక లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి మొక్కలపై పిచికారీ చేసు కోవాలి. పిచికారీలో మరోపద్ధతి: 900 మిల్లీలీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల జీవామృతం, 2 మిల్లీలీటర్ల ఎగ్ అమైనో యాసిడ్ కలిపి కూడా మొక్కలపై పిచికారీ చేసుకోవచ్చు. పూత పుష్కలంగా వస్తుంది. పూత రాలకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. బూడిద+ పసుపు మిశ్రమం కావలసిన పదార్థాలు: దేశీ/నాటు ఆవు పేడతో చేసిన పిడకలు, పసుపు తయారీ పద్ధతి: పిడకలను కాల్చి బూడిద చేసుకోవాలి. తర్వాత ఆ బూడిదను మట్టికుండలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న బూడిద తగినంత తీసుకొని.. అంతే పరిమాణంలో పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని తీగజాతి మొక్కలపై చల్లితే పూత రాలడం తగ్గుతుంది. ఆచ్ఛాదన (మల్చింగ్) కుండీల్లోని మట్టిని నిత్యం తేమగా ఉంచడానికి ఆచ్ఛాదన(మల్చింగ్) పద్ధతి బాగా సహకరిస్తుంది. ఈ ఆచ్ఛాదన ఎండిపోయిన ఆకులతోను, ఎండు వరిగడ్డితోను చేసుకోవచ్చు. ఈ ఆచ్ఛాదన 7 నుంచి 10 అంగుళాల మందాన వేయాలి. తద్వారా కుండీల్లో ఉన్న మట్టి తేమను పట్టి ఉంచగలుగుతుంది. మట్టిలో ఉన్న వానపాములు మట్టి పైభాగానికి రావడానికి అనువైన వాతావరణం అక్కడ ఏర్పడుతుంది. వాటితోపాటుగా కింది మట్టిలోని పోషకాలను మొక్కల వేళ్లకు అందుబాటులోకి తెస్తుంది. మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.