సింహాచలం అప్పన్న గోశాలకు కూత వేటు దూరంలో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని దారపాలెంలో సొంత ఇల్లు నిర్మించుకున్న దాట్ల వర్మ, శ్రీదేవి దంపతులు సేంద్రియ ఇంటిపంటల సాగులో ఆదర్శవంతమైన కృషి చేస్తున్నారు. వర్మ ప్రస్తుతం విజయనగరం ఆర్ అండ్ బి డిపార్ట్‌మెంట్‌లో టెక్నికల్ అధికారిగా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సొంతిల్లు నిర్మించుకొని టెర్రస్ కిచెన్/మెడిసినల్ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. 150కి పైగా ఖాళీ రంగు డబ్బాలలో మొక్కలు పెంచుతున్నారు.
ఇంటిపంటల జీవవైవిధ్యానికి నిదర్శనం: ఆకుకూరలు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పూలమొక్కలతో పచ్చగా కళకళలాడే వారి టెర్రస్ గార్డెన్ జీవవైవిధ్యంతో సుసంపన్నంగా ఉంటుంది. ఘనజీవామృతం, జీవామృతం, పశువుల ఎరువు(గెత్తం), వర్మీకంపోస్టు, అవసరం మేరకు కషాయాలను వాడుతూ వర్మ దంపతులు మక్కువతో ఇంటిపంటలు సాగు చేస్తున్నారు. ఇంటి చుట్టూ నేలపైన, దగ్గర్లో తెలిసిన వారి ఖాళీ ఇంటి స్థలాల్లో కూరగాయలు, కందులు, పండ్ల మొక్కలను సాగు చేస్తూ.. పూర్తిగా ఇంటిపంటల ఆహారాన్నే తింటున్నారు.
మేడపైన పుదీన, కొత్తిమీర, తోటకూర, పాలకూర తదితర ఆకుకూరలతోపాటు బీర, ఆనపకాయ, చిక్కుళ్లు, కంది,అరటి, వంకాయలు, బెండకాయలు, క్యాబేజి, టమోటా సాగు చేస్తున్నారు. ఇంటి చుట్టూ పెరట్లో పది రకాల పండ్ల చెట్లను పెంచుతున్నారు. హైదరాబాద్‌లోని ఇంటిపంట సాగుదారులు ఏర్పాటు చేసుకున్న ఫేస్‌బుక్ బృందం స్ఫూర్తితో ప్రధానంగా విశాఖ ప్రాంత ఇంటిపంట సాగుదారులకు సహాయ పడటానికి కొత్తవలసకి చెందిన కర్రి రాంబాబుతో కలిసి ఫేస్‌బుక్‌లో రైతుమిత్ర పేరిట బృందాన్ని ప్రారంభించారు.
ఇంటిపంటలపై అవగాహన:
సేంద్రియ ఇంటిపంటల పెంపకంపై ఆసక్తి ఉన్న విశాఖనగరవాసులు సెలవు రోజుల్లో మా ఇంటిని సందర్శిస్తూ ఉంటారు. వారికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చి అవగాహన కల్పించడంతోపాటు కొన్ని మొక్కలు, విత్తనాలను కూడా ఇస్తున్నామని వర్మ, శ్రీదేవి(98661 38129) తెలిపారు. సింహాచలం అప్పన్న ఆలయ గోశాలలో జీవామృతాన్ని తయారు చేయించి, మనిషికి 5 లీటర్ల చొప్పున ఉచితంగా పంపిణీ చేయిస్తున్నారు. మరింత మందికి ఈ విధానాన్ని తెలియజేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెబుతున్నారు.
– అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం, విశాఖ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment