తమ ఇంటిపైన మిద్దెతోటలో కాసిన కాయలను చూపుతున్న కట్కూరి నారాయణరెడ్డి, స్వరూప దంపతులు
వ్యవసాయ కుటుంబాల్లో పుట్టి పెరిగిన కట్కూరి నారాయణరెడ్డి, స్వరూప దంపతులు విశ్రాంత జీవితంలో సొంత ఇంటిపైనే విషం లేని స్వచ్ఛమైన ఆకుపచ్చని ఇంటిపంటల ఆహారాలయాన్ని అపురూపంగా నిర్మించుకున్నారు. హన్మకొండ రాఘవేంద్రనగర్ కాలనీలో స్థిరపడిన నారాయణరెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా ఉద్యోగ విరమణ చేశారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లయ్యాయి. ఒక బిడ్డ హన్మకొండలోనే కాపురం ఉంటుండగా, మరో బిడ్డ బెంగళూరులో స్థిరపడ్డారు.
నారపల్లికి చెందిన మిద్దె తోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి స్ఫూర్తితో నారాయణరెడ్డి, స్వరూప దంపతులు తమ ఇంటిపై రెండేళ్ల క్రితం చక్కటి మిద్దెతోట నిర్మించుకున్నారు. తమ చేతులతో మనసుపెట్టి పండించుకున్న చక్కని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తింటూ ఆరోగ్యంగా ఉన్నారు. పాత ఎయిర్ కూలర్ డబ్బాను మూడు చిన్న మడులుగా మలచారు. 4 అడుగుల వెడల్పున అడుగు లోతుండే ఎత్తు మడులు ఇటుకలు, సిమెంటుతో నిర్మించారు. మట్టి గోడల రంగులోని మడులపై ముగ్గులతో ఆహ్లాదకరంగా శిల్పారామాన్ని తలపిస్తుండటం విశేషం. రఘోత్తమరెడ్డి రెండుసార్లు స్వయంగా వచ్చి తగిన సూచనలు ఇవ్వటం విశేషం.
ప్రస్తుతం ఎరుపు, తెలుపు గుండ్రని వంగ మొక్కలు, ఎర్ర బెండ మొక్కలు, గోరుచిక్కుడు మొక్కలు కాస్తున్నాయి. పాలకూర, బచ్చలికూర, ఉల్లిఆకు, మెంతికూర, కొత్తిమీర తదితర ఆకుకూరలు వారి ఇంట్లో అందరి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్నాయి. టమాటా మొక్కలు, బోడకాకర, దొండ పాదులు పూత దశలో ఉన్నాయి. సొర, చిక్కుడు, చమ్మ(తమ్మ) కాయ పాదులను నేల మీద పెట్టి.. మిద్దె మీదకు పాకించారు. గ్రీన్ లాంగ్ వంగ నారు పోశారు. డ్రమ్ముల్లో సపోట, మామిడి మొక్కలను, ద్రాక్ష పాదును నాటారు. ఇంటిపక్కనే పెంచుకున్న బంగినపల్లి మామిడి చెట్టు కాచే పండ్లు పన్నెండేళ్లుగా తింటున్నారు.
తమ ఇంటిపంటల ఆరోగ్య రహస్యం ప్రతి ఆకునూ ప్రతిరోజూ స్వయంగా తడిమి చూసుకుంటూ ఉండటమేనని స్వరూప అన్నారు. అవసరం మేరకు అడపాదడపా వర్మీకంపోస్టు వేస్తున్నారు. వంటింటి వ్యర్థాలను మిక్సీలో వేసి ఏరోజు కారోజు మొక్కలకు పోస్తుంటానని, నాలుగైదు రోజుల్లో మట్టిలో కలిసిపోతాయన్నారు. దీనివల్ల పంట మొక్కలు, పూల మొక్కలు బలంగా పెరుగుతున్నాయని తెలిపారు. వాడేసిన టీపొడి కూడా మడుల్లో వేస్తున్నారు.
రోజూ సహజ ఇంటిపంటలు తింటూ చాలా ఆరోగ్యంగా ఉన్నామన్నారు. తన భర్తకు రెండుసార్లు బైపాస్ సర్జరీ అయ్యిందని స్వరూప తెలిపారు. రోజూ 3 గంటల పాటు పచ్చని ఇంటి పంటల మధ్య గడపడం వల్ల తగినంత స్వచ్ఛమైన ఆక్సిజన్ అందటమే కాకుండా.. బీపీ లేకుండా.. మానసిక ప్రశాంతత లభిస్తున్నాయని స్వరూప, నారాయణరెడ్డి(98494 50629) సంతృప్తిగా చెప్పారు. కోతుల వల్ల గత ఏడాది ఇబ్బందులు పడ్డామని, ఇనుప జాలీని అమర్చుకోవడమే మేలని భావిస్తున్నామన్నారు.
కట్కూరి నారాయణరెడ్డి మిద్దెతోటలో కాసిన కాయగూరలు, ఆకుకూరలు
Comments
Please login to add a commentAdd a comment