
కూరగాయ మొక్కల నర్సరీలో సిటీ ఫార్మర్ ఫణివేణు
విస్తారమైన పొలాల్లో అనేక దశాబ్దాలు వ్యవసాయం చేసిన ఒక సీనియర్ రైతు.. పిల్లల చదువుల నేపథ్యంలో నగరానికి తరలి వచ్చారు. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసిందేమీ ఉండేది కాదు. కాన, ఫణివేణు(49) విభిన్నమైన సిటీ ఫార్మర్‌గా, సర్వీస్ ప్రొవైడర్‌గా మారారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలానికి చెందిన జమలాపురపు ఫణివేణు అనేక దశాబ్దాలుగా అనువంశికంగా సంక్రమించిన 22 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. తమ పొలంలో యూకలిప్టస్ మొక్కలు నాటి.. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు.
రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ ఇళ్లపైనే సాగు చేసుకోవడంపై నగరవాసులు అమితాసక్తిని కనపరుస్తుండడం.. అయితే నగరవాసులకు ఇంటిపంటల సాగులో సేవలందించే వ్యవస్థ శైశవదశలో ఉండడం ఫణివేణును ఆలోచింపజేసింది. కూరగాయలు తదితర ఆహార పంటల సాగులో తనకున్న అనుభవంతో నగరంలో ఇంటిపంటల సాగుదారులకు సర్వీస్ ప్రొవైడర్‌గా మారి తోడ్పాటునందించాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు.
నగరవాసుల ఆసక్తి, ప్రత్యేక అవసరాల మేరకు మేడలపైన షేడ్‌నెట్ హౌస్‌లు నిర్మించడం.. కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేయించడం.. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు పాటించడం.. సేంద్రియ ఇంటిపంటల సాగులో సంతృప్తికరమైన దిగుబడిని రాబట్టేలా శ్రద్ధ తీసుకోవడం ఆయన ప్రత్యేకత. షేడ్‌నెట్ హౌస్‌లో పెరిగే మొక్కలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, దిగుబడి బాగుంటుందని ఆయన అంటారు.
ఆసక్తితో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కల ద్వారా మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన విత్తనంతో నారు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఫణివేణు చెబుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలతో కూడా సేంద్రియ ఇంటిపంటల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్న ఆయన.. ఎల్.బి. నగర్‌లో సొంతంగా చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 8 టెర్రస్ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, వాటి బాగోగులు చూస్తున్నారు.
షేడ్‌నెట్ నిర్మించుకొని 200 కుండీలు పెట్టుకుంటే పూర్వానుభవం లేకపోయినప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిశ్చింతగా పండించుకోవచ్చని అంటూ.. అందుకు నగరవాసులకు తోడ్పడడమే తన లక్ష్యమని ఫణివేణు(99088 79247) అంటున్నారు. అవసరమైన వారికి డ్రిప్, షేడ్‌నెట్‌లో నీటి తుంపర్లను వెదజల్లే ఫాగర్లను సైతం ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమతో ఖచ్చితమైన పంట దిగుబడిని పొందవచ్చంటున్న నగరంలో రైతన్న ఫణివేణుకు జేజేలు!