city farmer
-
అపార్ట్‌మెంట్‌పైనే ‘అమృత్’ పంటలు!
ఈ నెల 5న ప్రపంచ భూముల దినోత్సవం సందర్భంగా రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పంటలు పండించుకుంటూనే భూసారాన్ని పెంపొందించుకుంటున్న అన్నదాతలతోపాటు.. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న డాక్టర్ మేధా శ్రీంగార్‌పురే అనే సిటీ ఫార్మర్కు కూడా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేద్దాం.. ఎందుకంటే.. పంట భూములకు దూరంగా కాంక్రీటు అరణ్యంలో నివాసం ఉంటున్న ఆమె తమ వంటింటి వ్యర్థాలను, చెరకు పిప్పిని ఉపయోగించి తమ అపార్ట్మెంటు మేడ పైనే ఆమె ‘అమృత్ మిట్టి’ని తయారు చేస్తున్నారు. అత్యంత సారవంతమైన అమృత్ మిట్టితో అద్భుత పోషక విలువలున్న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను అనేక ఏళ్లుగా పండించుకొని తింటూ ఆరోగ్యంగా, మహానగర జీవులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నారు. ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌పై చెత్త భారాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడుతున్నారు. అంతేకాదు, ఆవు పేడ – మూత్రంలతో ద్రవ రూప ఎరువు ‘అమృత్ జల్’ను తయారు చేసుకొని వాడుతూ అమృతాహారాన్ని పండించుకుంటున్నారు. కూరగాయలు.. పండ్లు.. ముంబై నగరంలోని మాజ్గవ్ టెర్రస్ అనే సొసైటీలోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో దంత వైద్యురాలు మేధా శ్రీంగార్‌పురే రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఆమె తమ అపార్ట్మెంట్ భవనం టెర్రస్‌పైనే సిటీ ఫార్మింగ్ చేస్తున్నారు. తన ఇంట్లోని కిటికీలతోపాటు ముఖ్యంగా టెర్రస్‌ను 150 నుంచి 200 రకాల మొక్కలతో నందనవనంగా మార్చారు. ప్రస్తుతం పండ్లలో జామపండ్లు, సీతఫలం, చెర్రీ పండ్లు, బత్తాయి పండ్లు ఇలా అనేక రకాల పండ్ల చెట్లతోపాటు ఆకు కూరలు, సీజనల్ కూరగాయలు, దొండకాయలు, బెండకాయలు, వంకాయలు, మునగకాయలు, పలు రకాల మిరపకాయలు, పుష్పాలు ఇలా అనేక రకాలు ఆమె ఇంటిపంటల్లో కనిపిస్తున్నాయి. ఇతర భవనాల టెర్రస్లపైనా... మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీలో అన్ని భవనాలూ నాలుగు అంతస్తులవే ఉన్నాయి. డా. మేధా ఉండే భవనం టెర్రస్‌పై ఇంటిపంటల సాగులో మంచి ఫలితాలు కన్పించడంతో ఇతర భవనాల వారు కూడా వారి వారి టెర్రస్లపైనా మొక్కలు నాటేందుకు ఆసక్తిచూపారు. రసాయనాలు లేకుండా పండే కూరగాయలను తింటే ఎంతో రుచితోపాటు మాటల్లో చెప్పలేని ఆరోగ్యం, ఆనందం కలుగుతున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. శని, ఆదివారాలలో 4 గంటల సమయం కేటాయిస్తున్నా. ఇదంతా చేయడానికి శ్రద్ధ చాలా అవసరం అంటారు డా. మేధా. అపార్ట్మెంట్లో అందరి అనుమతితోనే.. వంటింటి వ్యర్థాలతో తయారు చేసిన సహజ సేంద్రియ ఎరువు ‘అమృత మిట్టి’ మా ఇంట్లో చాలా పోగైంది. దీన్ని ఏమి చేయాలని ఆలోచించగా టెర్రస్‌పై కూరగాయ మొక్కలు పెంచవచ్చన్న ఆలోచన వచ్చింది. అంతే భవనంలోని అన్ని అంతస్తులలో నివసించే వారిని సంప్రదించి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నా. సొసైటీ బాధ్యులతో చర్చలు జరిపి అన్ని అనుమతులు పొంది టెర్రస్‌పై అయిదేళ్ల కిందట సేంద్రియ పంటలు పెంచడం ప్రారంభించా. ఆ కొత్తలోనే అర్బన్ లీవ్స్ ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో పాల్గొని అనేక మెళకువలు తెలుసుకున్నా. అర్బన్ లీవ్స్‌కు వాలంటీర్‌గా సేవలందించడంతో అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలిసివచ్చాయి. దీంతో రెండేళ్లలోనే టెర్రస్‌పై పెంచిన మొక్కలు చక్కని దిగుబడినివ్వటం ప్రారంభమైంది. . – డా. మేధా శ్రీంగార్‌పురే (98695 48090), మాజ్‌గావ్ టెర్రస్ సొసైటీ, ముంబై ముంబైలో అర్బన్ లీవ్స్ సంస్థ టెర్రస్‌పై నెలకొల్పిన ఒక కమ్యూనిటీ గార్డెన్ – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై -
నగరంలో రైతన్న ఫణివేణు!
విస్తారమైన పొలాల్లో అనేక దశాబ్దాలు వ్యవసాయం చేసిన ఒక సీనియర్ రైతు.. పిల్లల చదువుల నేపథ్యంలో నగరానికి తరలి వచ్చారు. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసిందేమీ ఉండేది కాదు. కాన, ఫణివేణు(49) విభిన్నమైన సిటీ ఫార్మర్‌గా, సర్వీస్ ప్రొవైడర్‌గా మారారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలానికి చెందిన జమలాపురపు ఫణివేణు అనేక దశాబ్దాలుగా అనువంశికంగా సంక్రమించిన 22 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. తమ పొలంలో యూకలిప్టస్ మొక్కలు నాటి.. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు. రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ ఇళ్లపైనే సాగు చేసుకోవడంపై నగరవాసులు అమితాసక్తిని కనపరుస్తుండడం.. అయితే నగరవాసులకు ఇంటిపంటల సాగులో సేవలందించే వ్యవస్థ శైశవదశలో ఉండడం ఫణివేణును ఆలోచింపజేసింది. కూరగాయలు తదితర ఆహార పంటల సాగులో తనకున్న అనుభవంతో నగరంలో ఇంటిపంటల సాగుదారులకు సర్వీస్ ప్రొవైడర్‌గా మారి తోడ్పాటునందించాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు. నగరవాసుల ఆసక్తి, ప్రత్యేక అవసరాల మేరకు మేడలపైన షేడ్‌నెట్ హౌస్‌లు నిర్మించడం.. కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేయించడం.. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు పాటించడం.. సేంద్రియ ఇంటిపంటల సాగులో సంతృప్తికరమైన దిగుబడిని రాబట్టేలా శ్రద్ధ తీసుకోవడం ఆయన ప్రత్యేకత. షేడ్‌నెట్ హౌస్‌లో పెరిగే మొక్కలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, దిగుబడి బాగుంటుందని ఆయన అంటారు. ఆసక్తితో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కల ద్వారా మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన విత్తనంతో నారు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఫణివేణు చెబుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలతో కూడా సేంద్రియ ఇంటిపంటల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్న ఆయన.. ఎల్.బి. నగర్లో సొంతంగా చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 8 టెర్రస్ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, వాటి బాగోగులు చూస్తున్నారు. షేడ్‌నెట్ నిర్మించుకొని 200 కుండీలు పెట్టుకుంటే పూర్వానుభవం లేకపోయినప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిశ్చింతగా పండించుకోవచ్చని అంటూ.. అందుకు నగరవాసులకు తోడ్పడడమే తన లక్ష్యమని ఫణివేణు(99088 79247) అంటున్నారు. అవసరమైన వారికి డ్రిప్, షేడ్‌నెట్‌లో నీటి తుంపర్లను వెదజల్లే ఫాగర్లను సైతం ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమతో ఖచ్చితమైన పంట దిగుబడిని పొందవచ్చంటున్న నగరంలో రైతన్న ఫణివేణుకు జేజేలు! -
ఇంటి మట్టికి వందనాలు!
ఈయన పేరు చతుర్వేదుల తారకం. విశ్రాంత అధ్యాపకుడు. అంతేకాదు.. ఇప్పుడాయన ‘సిటీ ఫార్మర్’ కూడా! కిక్కిరిసిన కాంక్రీటు అరణ్యంలో నివసిస్తూ కూడా నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కల్యాణ్‌నగర్-1లో సొంత అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ.. మేడ మీదే సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. తన కిచెన్ గార్డెన్‌కు అవసరమైన నల్లబంగారాన్ని (కంపోస్టును) తానే తయారు చేసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలు, పూజకు వాడిన పూలు, రాలిన ఆకులు.. ఎండిన కొమ్మలు, రెమ్మలు.. వీటన్నిటినీ కలిపి కంపోస్టుగా మార్చుతున్నారు. చెత్తను బయట పారేసి మున్సిపాలిటీపై భారం వేయకపోవటం విశేషం. మేడపైన పాలిథిన్ బ్యాగ్‌లలో ఏరోబిక్ పద్ధతిలో, వంటింట్లో ఏరోబిక్ పద్ధతిలో కంపోస్టు తయారు చేసుకుంటున్నారు. పాలిథిన్ బ్యాగ్‌లలో చెత్తను 4 అంగుళాల మందాన పొరలు పొరలుగా వేస్తూ మధ్యలో బొకాషి ఎంజైమ్ పొడిని చల్లుతున్నారు. నెలలో కంపోస్టు తయారవుతుందని, 3 నెలల్లో స్వచ్ఛమైన ‘మట్టి’ తయారవుతుందంటున్నారాయన. కేవలం ఈ మట్టినే మడులు, కుండీల్లో వాడుతున్నానన్నారు. ఈ విధంగా సకల పోషకాలున్న మట్టిని నగరంలో మేడపైనే స్వయంగా తయారు చేసుకోవడం.. ఆ మట్టితోనే ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు పండించడం తనకెంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తోందంటారాయన. బోలెడు మాటలు చెప్పేకన్నా.. ఇటువంటి ‘ఆకుపచ్చని’ పనొకటి ఇంటిపట్టునే ఉన్న వనరులతో చేయడం ఎంతో మేలు కదూ..! తారకం(99890 16150) మాస్టారూ.. ‘వరల్డ్ సాయిల్ వీక్’ సందర్భంగా అందుకోండి ‘ఇంటిపంట’ల వందనాలు!! - ఇంటిపంట డెస్క్