ఇంటి మట్టికి వందనాలు!
ఈయన పేరు చతుర్వేదుల తారకం. విశ్రాంత అధ్యాపకుడు. అంతేకాదు.. ఇప్పుడాయన ‘సిటీ ఫార్మర్’ కూడా! కిక్కిరిసిన కాంక్రీటు అరణ్యంలో నివసిస్తూ కూడా నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. హైదరాబాద్ నగరంలోని కల్యాణ్‌నగర్-1లో సొంత అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటూ.. మేడ మీదే సేంద్రియ పద్ధతుల్లో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలు సాగు చేస్తున్నారు. తన కిచెన్ గార్డెన్‌కు అవసరమైన నల్లబంగారాన్ని (కంపోస్టును) తానే తయారు చేసుకుంటున్నారు. వంటింటి వ్యర్థాలు, పూజకు వాడిన పూలు, రాలిన ఆకులు.. ఎండిన కొమ్మలు, రెమ్మలు.. వీటన్నిటినీ కలిపి కంపోస్టుగా మార్చుతున్నారు.
చెత్తను బయట పారేసి మున్సిపాలిటీపై భారం వేయకపోవటం విశేషం. మేడపైన పాలిథిన్ బ్యాగ్‌లలో ఏరోబిక్ పద్ధతిలో, వంటింట్లో ఏరోబిక్ పద్ధతిలో కంపోస్టు తయారు చేసుకుంటున్నారు. పాలిథిన్ బ్యాగ్‌లలో చెత్తను 4 అంగుళాల మందాన పొరలు పొరలుగా వేస్తూ మధ్యలో బొకాషి ఎంజైమ్ పొడిని చల్లుతున్నారు. నెలలో కంపోస్టు తయారవుతుందని, 3 నెలల్లో స్వచ్ఛమైన ‘మట్టి’ తయారవుతుందంటున్నారాయన. కేవలం ఈ మట్టినే మడులు, కుండీల్లో వాడుతున్నానన్నారు.
ఈ విధంగా సకల పోషకాలున్న మట్టిని నగరంలో మేడపైనే స్వయంగా తయారు చేసుకోవడం.. ఆ మట్టితోనే ఆరోగ్యదాయకమైన ఇంటిపంటలు పండించడం తనకెంతో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తోందంటారాయన. బోలెడు మాటలు చెప్పేకన్నా.. ఇటువంటి ‘ఆకుపచ్చని’ పనొకటి ఇంటిపట్టునే ఉన్న వనరులతో చేయడం ఎంతో మేలు కదూ..! తారకం(99890 16150) మాస్టారూ.. ‘వరల్డ్ సాయిల్ వీక్’ సందర్భంగా అందుకోండి ‘ఇంటిపంట’ల వందనాలు!!
- ఇంటిపంట డెస్క్