నారు నాణ్యతే రైతుకు రొక్కం! | Technical Visit to Centre Of Excellence, Jeedimetla, Telangana | Sakshi
Sakshi News home page

నారు నాణ్యతే రైతుకు రొక్కం!

Published Tue, Oct 31 2017 12:00 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Technical Visit to Centre Of Excellence, Jeedimetla, Telangana  - Sakshi

సాగు పద్ధతి ఏదైనప్పటికీ రైతు మంచి ఉత్పాదకత, అధిక నికరాదాయాన్ని ఆర్జించాలంటే.. విత్తనం.. ఆ విత్తనంతో తయారైన నారు కూడా అత్యంత ఆరోగ్యవంతంగా ఉండాలి. వైరస్‌ వంటి రుగ్మతల్లేని నారును సమకూర్చుకోవటం ప్రాథమిక అవసరం. ఈ అవసరాన్ని తీర్చే ఉదాత్త లక్ష్య సాధన కోసం తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారులో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానంతో ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌’ను నెలకొల్పింది. గత పది నెలలుగా లక్షలాది సంఖ్యలో పూలు, కూరగాయ పంటలకు సంబంధించి నాణ్యమైన నారును రైతులకు అందించింది. వందలాది మంది రైతులు, అధికారులు శిక్షణ పొందారు.  కూరగా యలు, పూల సాగులో ప్రపంచస్థాయి నైపుణ్యాన్ని రైతులకు అందిస్తున్న అరుదైన నైపుణ్య కేంద్రంపై ప్రత్యేక కథనం..  

తెలంగాణ ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారులో (జీడిమెట్ల గ్రామం పైపుల రోడ్డులో) పదెకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ‘సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌’ పది నెలలుగా ఉద్యాన రైతులకు విశిష్టమైన సేవలు అందిస్తున్నది. 8 పాలీహౌస్‌లు, 6 వాకింగ్‌ టన్నెల్స్, షేడ్‌నెట్‌ హౌస్‌లు ఉన్నాయి. వీటిలో జెర్బర, కార్నేషన్, ఆర్కిడ్స్‌ తదితర ఖరీదైన పూలు, క్యాప్సికం, టమాటో, కీరదోస, బ్రకోలి, చెర్రీ టమాటోలు, ఆకుకూరలను అత్యాధునిక రసాయనిక పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. కొన్ని పంటలను పురుగుమందులు చల్లకుండా సాగు చేస్తున్నారు.

నెలకు 12 లక్షల నారు సరఫరా
2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటైన స్వయం నియంత్రిత హరితగృహం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ప్లగ్లింగ్స్‌ నర్సరీ పద్ధతిలో చీడపీడలు, వైరస్‌ సోకకుండా అత్యాధునిక సదుపాయాల మధ్య నెల రోజులు పెంచిన నాణ్యమైన నారును రైతులకు అందిస్తున్నారు. రసాయనిక/సేంద్రియ పద్ధతుల్లో లేదా పాలీహౌస్‌లు/షేడ్‌నెట్‌ హౌస్‌లు, సాధారణ పొలాల్లో కూరగాయ పంటలు సాగు చేసే రైతులు ఈ నారును తీసుకెళ్తు్తన్నారు. నెలకు 12 లక్షల నారును అందించే సామర్థ్యం ఉంది. దీన్ని 15 లక్షలకు పెంచే సన్నాహాలు చేస్తున్నారు.

ముందే చెల్లించాలి
ఈ హైటెక్‌ ఆటోమేటెడ్‌ గ్రీన్‌హౌస్‌లో పెంచిన నారును రెండు పద్ధతుల్లో రైతులకు అందిస్తున్నారు. క్యాప్సికం, బంతి, టమాటో పంటలకు సంబంధించి అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను సాగు చేసే రైతులు ముందుగా విత్తనాలు తెచ్చి ఇచ్చి, మొక్కకు 60 పైసల చొప్పున సర్వీసు చార్జిగా చెల్లిస్తే.. నెల రోజులు పెంచిన రోగరహితమైన నాణ్యమైన నారును సరఫరా చేస్తారు. సేంద్రియ, రసాయనిక సేద్యం చేసే రైతులు ఎవరైనా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. సాధారణ రకాల నారు కావాలనుకునే రైతులు విత్తనాలు తెచ్చి ఇవ్వనవసరం లేదు. మొక్కకు 75 పైసల చొప్పున డబ్బు చెల్లించి తమకు కావాల్సిన రకం నారును నెల రోజుల తర్వాత నైపుణ్యాభివృద్ధి కేంద్రానికి వచ్చి తీసుకెళ్లవచ్చు. టమాటో, వంగ, పచ్చిమిరప, క్యాబేజి, కాలిఫ్లవర్, క్యాప్సికం, కాకర, బీర తదితర కూరగాయ పంటలకు సంబంధించిన మేలైన నారు మొక్కలను రైతులు పొందడానికి అవకాశం ఉంది. పాలీహౌస్‌లు, షేడ్‌నెట్‌ హౌస్‌లలోనే కాదు.. ఆరుబయట పొలాల్లో పంటలు సాగు చేసే రైతులు సైతం ఈ మొక్కలను వాడుతుండటం విశేషం.

వేస్ట్‌ డీకంపోజర్‌తో నులిపురుగులకు చెక్‌!
కేంద్ర వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న ఘజియాబాద్‌లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం రూపొందించిన వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణాన్ని నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో పంటలకు వాడుతున్నారు. ఈ కేంద్రంలో వంద మంది రైతులకు కూడా దీనిపై శిక్షణ ఇచ్చారు. మట్టి ద్వారా పంటలకు సోకే తెగుళ్లను ఇది నివారిస్తున్నదని, నులిపురుగుల (నెమటోడ్స్‌)ను ఇది నూటికి నూరు శాతం నివారిస్తుందని రాజ్‌కుమార్‌ తెలిపారు. వేరుకుళ్లు, బూజు తెగులును నిరోధిస్తుందని, వానపాముల వృద్ధికి అనువైన సూక్ష్మ వాతావరణం కల్పిస్తుందన్నారు. కూరగాయల బెడ్‌ తయారీలోనూ వేస్ట్‌ డీకంపోజర్‌ ద్రావణం ఉపకరిస్తోందన్నారు.

ఇంటిపంటల సాగుదారులకు చేదోడు
ఇళ్ల మీద సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకునే వారికి సైతం సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ సేవలందిస్తున్నది. మేడలపైన సిల్పాలిన్‌ బెడ్స్‌లో సేంద్రియ ఇంటిపంటల సాగు డెమోను ఈ కేంద్రం భవనం పైన ఏర్పాటు చేశారు. గార్డెనింగ్‌ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. క్యాప్సికం(మొక్క రూ.2), వంగ, టమాటో, క్యాబేజీ నారు(మొక్క రూ.2)ను, బంతి, చామంతి నారును విక్రయిస్తున్నారు. పనస, దొండ, బొప్పాయి (రెడ్‌లేడీ) మొక్కలను రూ. 20కి అమ్ముతున్నారు. కుండీలు, మట్టి+ఎరువు మిశ్రమాన్ని కూడా అందుబాటులో ఉంచారు.

గాలులను తట్టుకునే షేడ్‌నెట్‌ హౌస్‌!
తీవ్రమైన గాలులను సైతం తట్టుకొని నిలిచే కొత్త తరహా షేడ్‌నెట్‌ హౌస్‌ను బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్‌) రూపొందించింది. దీని పైకప్పు సమతలంగా ఉండదు. ఎగుడు, దిగుడుగా ఉంటుంది. మధ్యలో నుంచి గాలి, వెలుతురు పారాడుతూ ఉంటాయి. ఎండ ఏటవాలుగా దీని లోపలి మొక్కల పైకి ప్రసరిస్తూ ఉంటుంది. దీనికి 50% మోనో షేడ్‌నెట్‌ వాడటంతోపాటు, షేడ్‌నెట్‌ను ఫ్రేమ్‌కు క్లిప్పులతో అనుసంధానం చేయటం విశేషం. ఈ సరికొత్త షేడ్‌నెట్‌ హౌస్‌ను జీడిమెట్లలోని ఉద్యాన నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో ఏర్పాటు చేశారు. వేసవి పంటగా టమాటా సాగు చేయబోతున్నారు. దీంట్లో ఖరీఫ్, రబీ, వేసవి సీజన్లలో పంటలు సాగు చేయవచ్చు. టమాటా, క్యాప్సికం, పచ్చిమిర్చి, పుచ్చ, మస్క్‌మిలన్, వంగ, కొత్తిమీర తదితర పంటలను సాగు చేయవచ్చని, నర్సరీ పెంపకానికి కూడా ఇది అనువుగా ఉంటుందని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌చార్జ్‌ రాజ్‌కుమార్‌ ‘సాక్షి సాగుబడి’కి తెలిపారు. చ. మీ.కు రూ. 500 వరకు ఖర్చవుతుందన్నారు. మేడలపైన ఇంటిపంటల సాగుకూ ఇది అనువైనదే!

నాణ్యమైన కూరగాయ పంటల నారు రైతులకు ఇస్తాం!
కూరగాయలు, పూల సాగులో తెలంగాణ రైతులను రారాజులుగా తీర్చిదిద్దటమే మా లక్ష్యం. సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ద్వారా హైదరాబాద్‌ పరిసర జిల్లాల్లో ప్రారంభమైన పంటల కాలనీలలో కూరగాయ పంటల రైతులకు సబ్సిడీపై ఇప్పటికే 25 లక్షల నాణ్యమైన, వైరస్‌ రహిత నారును అందించాం. ప్రస్తుతం నెలకు 12 లక్షల నాణ్యమైన నారును ఉత్పత్తి చేస్తున్నాం. రైతుల నుంచి వస్తున్న డిమాండ్‌ దృష్ట్యా 15 లక్షలకు పెంచబోతున్నాం. మంచి కూరగాయ పంటల నారు కావాలనుకున్న రైతులు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. ముందుగా డబ్బు చెల్లించిన రైతులకు నెల రోజుల్లో నాణ్యమైన నారు అందిస్తున్నాం. సబ్సిడీపై నారు కావాల్సిన పంటల కాలనీల రైతులు అధికారుల ద్వారా లేఖ రాయించాలి.

– గాజుల రాజ్‌కుమార్, ఇన్‌చార్జ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్, ఉద్యాన శాఖ అదనపు సంచాలకులు coejeedimetlahyd@gmail.com
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌
ఫొటోలు: కె.రమేశ్, సీనియర్‌ ఫొటో జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement