Eucalyptus plant
-
మీది బాత్రూమా? యాక్ రూమా? ఈ జాగ్రత్తలు లేకపోతే అతిథులు పారిపోతారు మరి!
చాలామందికి ఒంటి మీద ఉన్నంత శ్రద్ధ పాదాల మీద ఉండదు. అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచి వస్తువులను అందంగా అమర్చుకోవడంలో ఉన్న తీరిక, ఓపిక బాత్రూమ్కి వచ్చేసరికి ఉండవు. అయితే బాత్రూమ్ శుభ్రంగా లేకపోతే బెడ్రూమ్, డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, హాలు ఎంత నీట్‌గా ఉన్నా ప్రయోజనం లేదు. అందుకని ఇంటి శుభ్రత ఎంత ముఖ్యమో, బాత్రూమ్ శుభ్రత కూడా అంతే ముఖ్యం. ఇంతకీ బాత్రూమ్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో తెలుసుకుందామా మరి! సాధారణంగా మనకి ఎన్నో పనులు ఉంటాయి. వాటిలో పడిపోయి మనం బాత్రూమ్ని శుభ్రం చేయడం మరిచిపోతాం. మిగిలిన రూమ్లన్నిటికన్నా బాత్రూమ్ తొందరగా ఖరాబవుతుంది. అందుకని వీలైనప్పుడల్లా బాత్రూంని శుభ్రం చేయడం పట్ల శ్రద్ధ పెట్టడం అవసరం. ఎప్పుడు వీలుంటే అప్పుడు బాత్రూంని శుభ్రం చేయడం ఎంతో అవసరం. కానీ కుదిరినప్పుడు కాస్త ఓపిక చేసుకుని క్లీన్ చేసుకుంటూ ఉంటే దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంటుంది బాత్రూమ్. చెత్తాచెదారం లేకుండా బాత్రూంని శుభ్రంగా ఉంచాలన్నా, దుర్వాసన లేకుండా ఉండాలన్నా, ముందుగా బాత్రూమ్లో చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం అవసరం. బాత్రూమ్లో పేరుకుపోయే చెత్తాచెదారం ఏమిటా అనుకుంటున్నారా... ఖాళీ అయిపోయిన షాంపూ ప్యాకెట్లు, సబ్బు కవర్లు, రేజర్ బ్లేడ్లు వంటివి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం మరచిపోకండి. ఇలా చేస్తేనే బాత్రూమ్ని నీట్‌గా ఉంచుకునేందుకు వీలవుతుంది. కనుక ఈసారి నుండి తప్పనిసరిగా ఇలా అనుసరించండి. ఎయిర్ ఫ్రెష్నర్/ డిఫ్యూజర్ వాడకం బాత్రూమ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలంటే బాత్రూమ్లో ఒక చిన్న డిఫ్యూజర్ ఉంచాలి. దీనివల్ల బాత్రూమ్ నుంచి మంచి వాసన వస్తుంటుంది. ఈ చిన్న డిఫ్యూజర్‌ని సింకు వెనక పెడితే, ఈ డిఫ్యూజర్ మంచి వాసన వెలువడేట్లు చేస్తుంది. డిఫ్యూజర్ పెట్టుకునే వీలు లేనివారు ఎయిర్ ఫ్రెష్‌నర్‌ను బాత్రూమ్లో పెట్టడం వల్ల కూడా మంచి వాసన వస్తుంది. మీరు మీ బాత్రూంలో మీకు నచ్చిన చోట వీటిని పెట్టొచ్చు. తడిసిన తువ్వాళ్లు వద్దు కొంతమంది ఒళ్లు తుడుచుకుని తడీపొడీ టవల్‌ను బాత్రూమ్లోనే పడేసి వస్తుంటారు. అలాగే అండర్వేర్లు, బనీన్లు కూడా బాత్రూమ్లోనే వదిలేస్తుంటారు. నిజానికి మాసిన బట్టల కన్నా తడిబట్టల నుంచి, తడీపొడి బట్టల నుంచి దుర్వాసన ఎక్కువగా వస్తూ ఉంటుంది. తడి బట్టలు కానీ మాసిన బట్టలు కానీ బాత్రూంలో ఉంచడం వల్ల దుర్వాసన వస్తుంటుంది కాబట్టి వాటిని తొలగిస్తూ ఉండండి. సబ్బులు మంచి సువాసన వచ్చే సబ్బుల్ని బాత్రూంలో పెట్టడం వల్ల మంచి వాసన వస్తుంది. కాబట్టి వీటిని ఎంపిక చేసుకుని బాత్రూంలో పెట్టండి ఇది కూడా మీ బాత్రూమ్ని బాగా ఉంచడానికి సహాయ పడుతుంది. టాయిలెట్ ట్యాంక్‌లో డిటర్జెంట్ లాండ్రీ డిటర్జెంట్‌ని మీరు మీ టాయిలెట్ ట్యాంక్‌లో వేయొచ్చు ఇది కూడా మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఫ్లష్ చేసినప్పుడు సెంటెడ్ వాటర్ వస్తాయి. హెర్బ్స్ వాడకం బాత్రూంలో హెర్బ్స్ ఉపయోగించడం మంచి ఐడియా. పైగా ఇవి ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు. మన బడ్జెట్లోనే వీటిని మనం బాత్రూంలో తెచ్చి పెట్టొచ్చు. లావెండర్ లేదా మింట్ని బాత్రూంలో పెట్టవచ్చు. దీనివల్ల మంచి వాసన వస్తుంది. లేదంటే ఎండిపోయిన యూకలిప్టస్‌ని బాత్రూమ్లో హ్యాంగ్ చేసి ఉంచితే చాలు... దుర్గంధాన్ని వదలగొట్టి మంచి వాసన వచ్చేలా చేస్తుంది. ఈ చిట్కాలను అనుసరిస్తే మీరు మీ బాత్రూమ్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. హాయిగా కూనిరాగాలు తీసుకోవచ్చు. లేదంటే అతిథులు ఎవరైనా వస్తే యాక్ అని వాంతి చేసుకుని పారిపోతారు జాగ్రత్త! చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. -
పడావు భూముల్లో పచ్చని పంటలు!
సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది. ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది. ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి. సాగులోకి తేవాలనే.. మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి. – పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా – మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా -
నగరంలో రైతన్న ఫణివేణు!
విస్తారమైన పొలాల్లో అనేక దశాబ్దాలు వ్యవసాయం చేసిన ఒక సీనియర్ రైతు.. పిల్లల చదువుల నేపథ్యంలో నగరానికి తరలి వచ్చారు. అంతవరకే అయితే పెద్దగా చెప్పుకోవలసిందేమీ ఉండేది కాదు. కాన, ఫణివేణు(49) విభిన్నమైన సిటీ ఫార్మర్‌గా, సర్వీస్ ప్రొవైడర్‌గా మారారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలానికి చెందిన జమలాపురపు ఫణివేణు అనేక దశాబ్దాలుగా అనువంశికంగా సంక్రమించిన 22 ఎకరాల భూమిలో వ్యవసాయం చేశారు. తమ పొలంలో యూకలిప్టస్ మొక్కలు నాటి.. పిల్లల చదువుల కోసం హైదరాబాద్ నగరానికి మకాం మార్చారు. రసాయనిక అవశేషాల్లేని సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను తమ ఇళ్లపైనే సాగు చేసుకోవడంపై నగరవాసులు అమితాసక్తిని కనపరుస్తుండడం.. అయితే నగరవాసులకు ఇంటిపంటల సాగులో సేవలందించే వ్యవస్థ శైశవదశలో ఉండడం ఫణివేణును ఆలోచింపజేసింది. కూరగాయలు తదితర ఆహార పంటల సాగులో తనకున్న అనుభవంతో నగరంలో ఇంటిపంటల సాగుదారులకు సర్వీస్ ప్రొవైడర్‌గా మారి తోడ్పాటునందించాలని కొద్ది నెలల క్రితం నిర్ణయించుకున్నారు. నగరవాసుల ఆసక్తి, ప్రత్యేక అవసరాల మేరకు మేడలపైన షేడ్‌నెట్ హౌస్‌లు నిర్మించడం.. కుండీలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలను ఏర్పాటు చేయించడం.. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు పాటించడం.. సేంద్రియ ఇంటిపంటల సాగులో సంతృప్తికరమైన దిగుబడిని రాబట్టేలా శ్రద్ధ తీసుకోవడం ఆయన ప్రత్యేకత. షేడ్‌నెట్ హౌస్‌లో పెరిగే మొక్కలకు చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని, దిగుబడి బాగుంటుందని ఆయన అంటారు. ఆసక్తితో పెంచుకునే కూరగాయలు, పండ్ల మొక్కల ద్వారా మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన విత్తనంతో నారు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని ఫణివేణు చెబుతున్నారు. హైబ్రిడ్ విత్తనాలతో కూడా సేంద్రియ ఇంటిపంటల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చంటున్న ఆయన.. ఎల్.బి. నగర్లో సొంతంగా చిన్న నర్సరీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి 8 టెర్రస్ కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేసి, వాటి బాగోగులు చూస్తున్నారు. షేడ్‌నెట్ నిర్మించుకొని 200 కుండీలు పెట్టుకుంటే పూర్వానుభవం లేకపోయినప్పటికీ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను నిశ్చింతగా పండించుకోవచ్చని అంటూ.. అందుకు నగరవాసులకు తోడ్పడడమే తన లక్ష్యమని ఫణివేణు(99088 79247) అంటున్నారు. అవసరమైన వారికి డ్రిప్, షేడ్‌నెట్‌లో నీటి తుంపర్లను వెదజల్లే ఫాగర్లను సైతం ఏర్పాటు చేసుకోవడం ద్వారా తక్కువ శ్రమతో ఖచ్చితమైన పంట దిగుబడిని పొందవచ్చంటున్న నగరంలో రైతన్న ఫణివేణుకు జేజేలు! -
‘అరణ్య’రోదన
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: అడవులను నరకడమే కాకుండా ప్లాంటేషన్ ద్వారా పెంచిన చెట్లను సైతం అక్రమార్కులు వదలటం లేదు. రామాయంపేట ఫారెస్టు రేంజ్‌లోని బ్యాతోల్ అటవీ పరిధి హవేళిఘణపూర్ తండా ప్రాంతంలో గల అడవిలో 15 ఏళ్ల క్రితం వేలాది రూపాయలను వెచ్చించి సుమారు 25 ఎకరాల్లో నీలగిరి మొక్కలను నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. అయితే ఈ చెట్లపై అక్రమార్కుల కన్ను పడింది. దీంతో ఎవరికీ వారుగా ప్లాంటేషన్‌కు వెళ్లి చెట్లను దర్జాగా నరుకుతున్నారు. ఫలితంతా ప్లాంటేషన్ కనుమరుగవ ుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. అడవులు ఎలాగో కాపాడలేకపోతున్న అధికారులు కనీసం ప్లాంటేషన్ చేసిన చెట్లను సైతం అధికారులు రక్షించలేక పోతున్నారన్న విమర్శలున్నాయి. పర్యావరణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతియేటా కోట్లాది రూపాయలను విడుదల చేసి అడవుల అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. దీంతో అడవులతో పాటు ప్లాంటేషన్లు సైతం మాయమవుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.