సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది.
ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది.
ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది.
ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి.
సాగులోకి తేవాలనే..
మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి.
– పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా
– మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment