trenches in fields
-
కందకాల వల్ల నాలుగేళ్లుగా నీటి కొరత లేదు!
వైద్యనిపుణులైన డాక్టర్ పూర్ణచంద్రారెడ్డికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారం గ్రామపరిధిలో 7 ఎకరాల మామిడి తోట ఉంది. ఇది తొమ్మిదేళ్ల తోట. ఎర్రనేల. నీటి సదుపాయం కోసం 12 బోర్లు వేశారు. ఒక్క బోరే సక్సెస్ అయ్యింది. అందులోనూ వేసవి వచ్చిందంటే నీరు బాగా తగ్గిపోతుండేది. తోటను నిశ్చింతగా బతికించుకోవడం కోసం నీటి లభ్యత పెంచుకోవడానికి ఏం చేయొచ్చని ఆలోచిస్తుండగా నాలుగేళ్ల క్రితం ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా చేపట్టిన కందకాల ద్వారా ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి డాక్టర్ పూర్ణచంద్రారెడ్డికి తెలిసింది. సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించారు. వారు సూచించిన విధంగా వాలుకు అడ్డంగా మీటరు లోతు, మీటరు వెడల్పు, 25 మీటర్ల పొడవు మించకుండా కందకాలు తవ్వించారు. 5 మీటర్లు వదిలి అదే వరుసలో మరో కందకం.. అలా తోట అంతటా కందకాలు తవ్వించారు. అప్పటి నుంచీ నీటి కొరత సమస్యే లేదని డా. పూర్ణచంద్రారెడ్డి తెలిపారు. ‘మా ప్రాంతంలో ఈ సంవత్సరం పెద్దగా వర్షాలు పడలేదు. చుట్టు పక్కల పొలాల్లో బోర్లకు నీటి సమస్య వచ్చింది. మాకు మాత్రం ఇప్పుడు కూడా ఎటువంటి సమస్యా లేదు. నాలుగేళ్ల క్రితం తవ్వించిన కందకాల ప్రభావం వల్లనే బోరులో నీటికి కొరత లేకుండా ఉందని స్పష్టంగా అర్థం అవుతున్నది. ఈ నాలుగేళ్లలో ఎంత వర్షం కురిసినప్పుడు కూడా.. మా పొలంలో నుంచి చుక్క నీరు కూడా బయటకు పోకుండా ఈ కందకాల ద్వారా భూమిలోకి ఇంకిపోతున్నాయి. అందువల్లే నీటికి కొరత రాలేదని చెప్పగలను. వచ్చే వేసవిలో కూడా నీటి సమస్య ఉండబోదనే అనుకుంటున్నాం..’ అని ఆయన ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. తమ తోటకు మూడు వైపులా గోడ నిర్మించామని, మరో వైపు కందకాలు తవ్వామని.. వర్షపు నీరు బయటకు పోకుండా పూర్తిగా ఇంకుతుంటుందన్నారు. కందకాలు తవ్వుకుంటే రైతులకు చాలా మేలు జరుగుతుందన్నారు. వివరాలకు.. ప్రకాశ్– 97011 46234. -
కందకాల వల్లే పుష్కలంగా నీరు
మెదక్ జిల్లా శివంపేట్ మండలం రత్నాపూర్‌కు చెందిన పట్నూరి నింబాద్రిరావు గత వేసవిలో తన 9 ఎకరాల పొలంలో మామిడి, జామ, టేకు మొక్కలు నాటడానికి ముందు బోరు వేయించారు. నీరు పడింది. కానీ, నీరు చాలా తక్కువగా పోస్తోంది. భవిష్యత్తులో నీటి ఎద్దడి వస్తుందని భయపడిన దశలో ‘సాక్షి’ ద్వారా కందకాల ద్వారా నీటి భద్రత సాధించవచ్చని నింబాద్రిరావు తెలుసుకున్నారు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074)లను సంప్రదించి.. వారి సలహా మేరకు కందకాలు తవ్వించారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా గత మేలో కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన వారంలోనే తొలి వర్షం పడి, కందకాలు నిండాయి. ఆ తర్వాత వర్షాలకు కందకాలు ఐదారు సార్లు నిండాయి. రెండు వర్షాల తర్వాత బోరు 70 అడుగుల్లోనే నీరు అందుబాటులోకి వచ్చేంతగా భూగర్భ జలాలు పెరిగాయి. బోరు ఒకటిన్నర ఇంచుల నీరు పోస్తోంది. ఇటీవల కాలంలో మా ప్రాంతంలో భూగర్భ జల మట్టం బాగా తగ్గిపోయింది. కొందరి బోర్లు నీటి కొరత వల్ల ఆగి ఆగి పోస్తున్నాయి. కానీ, మా బోరు నిరంతరాయంగా ఇంచున్నర నీరు పోస్తోంది. ఇదంతా కందకాల వల్ల భూమిలోకి వర్షం నీరు ఇంకడమే కారణమని తాను భావిస్తున్నానని నింబాద్రిరావు (95150 21387) తెలిపారు. -
కందకాలు తవ్వితే చెట్లు పచ్చబడ్డాయి
కోనేరు సురేశ్‌బాబు విజయనగరం జిల్లా ఆలూరు మండలం కందుల పదం గ్రామపరిధిలో 13 ఎకరాల్లో పామాయిల్ తోటను పదిహేనేళ్లుగా సాగు చేస్తున్నారు. పామాయిల్ చెట్టుకు రోజుకు 200 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. వెంగళ్రావు సాగర్ డ్యామ్ దగ్గర్లోనే సురేశ్‌బాబు వ్యవసాయ క్షేత్రం ఉంటుంది. గుడ్డవాగు ద్వారా వచ్చే బ్యాక్ వాటర్ అందుబాటులో ఉండటం వల్ల బోర్ పుష్కలంగా నీరు పోస్తూ ఉంటుంది. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు కరెంటు ఉన్న సమయంలో గతంలో డ్రిప్ ద్వారా అనుదినం నీరందించేవారు. అయితే, భూమి తేలిక నేల కాకపోయినప్పటికీ ఎత్తుపల్లాలుగా ఉండటం వల్ల కొన్ని చోట్ల చెట్లకు సరిగ్గా నీరందక ఇబ్బందులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో కందకాలు తీయిస్తే ఎక్కడి వర్షపు నీరు అక్కడే ఇంకి, వేసవిలోనూ చెట్లకు, దిగుబడికి ఇబ్బంది లేకుండా ఉంటుందన్న భావనతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను సంప్రదించి గత మేలో కందకాలు తీయించారు. పామాయిల్ చెట్ల మధ్య 9 మీటర్ల దూరం ఉంటుంది. చెట్లకు సమాన దూరంలో మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. కందకాలు తవ్విన తర్వాత డ్రిప్ వాడటం మానేశారు. కందకాల ద్వారానే బోరు నీటిని పారిస్తున్నారు. పామాయిల్ చెట్ల మట్టలను కందకాల్లో వేశారు. అవి క్రమంగా కుళ్లి సేంద్రియ ఎరువుగా మారుతున్నాయి. నీటికి కొరత లేకపోయినా ముందు చూపుతో సురేశ్‌బాబు వాన నీటి సంరక్షణ కోసం కందకాలు తవ్వించడం విశేషం. కందకాలు తవ్విన తర్వాత చెట్లు మరింత పచ్చగా, కళగా ఉంటున్నాయని ఆయన గుర్తించారు. ఇరుగు పొరుగు రైతులు కూడా ఈ మార్పును గుర్తించారని ఆయన తెలిపారు. భూమిలో తేమ ఉంటుంది కాబట్టి, ఎండాకాలంలో నీరు వెనకా ముందు అయినాæచెట్లకు ఇబ్బందేమీ ఉండబోదని సురేశ్‌బాబు (97017 50189) ఆశాభావంతో ఉన్నారు. -
కందకాలుంటే భయం అక్కర్లేదు!
నాలుగేళ్ల క్రితం నుంచి విస్తృతంగా కందకాలు తవ్వుతున్నందు వల్ల తమ ఉద్యాన తోట భూమిలో నీటి తేమ పుష్కలంగా ఉందని, వచ్చే ఫిబ్రవరి నెల వరకూ ప్రత్యేకంగా నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని కె. చైతన్య రెడ్డి ‘సాగుబడి’తో చెప్పారు. భువనగిరి యాదాద్రి జిల్లా భువనగిరి మండలం వడపర్తి గ్రామ పరిధిలో ఆయనకు 40 ఎకరాల ఉద్యాన తోట ఉంది. ఇది ప్రధానంగా మామిడి తోట అయినప్పటికీ శ్రీగంధం, ఎర్రచంద్రనం, కొబ్బరి సహా కొన్ని సంవత్సరాల క్రితమే మొత్తం లక్ష మొక్కలు నాటటం విశేషం. గతంలో తీవ్ర నీటి కొరత ఏర్పడిన నేపథ్యంలో బయటి నుంచి నీటి ట్యాంకులు తెచ్చి పోయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009), వర్కింగ్ ప్రెసిడెంట్ జి. దామో దర్‌రెడ్డి(94407 02029)లను సంప్రదించి 4 ఏళ్ల క్రితం మొదటి విడత కందకాలు తవ్వారు. తర్వాత ప్రతి ఏటా ఖాళీ ఉన్న చోటల్లో కందకాలు తవ్వుతూనే ఉన్నారు. ఆ కందకాలలో ఆకులు అలములు వేయడం, అవి కుళ్లి కంపోస్టుగా మారిన తర్వాత కొత్తగా కొన్ని పండ్ల జాతుల మొక్కలు నాటడం.. దగ్గర్లో మళ్లీ కందకాలు తవ్వటం విశేషం. కందకాల్లో కంపోస్టుపై నాటిన మొక్కల వేళ్లు భూమి లోతుల్లోకి సులువుగా చొచ్చుకెళ్తున్నాయని, తద్వారా చెట్లు ఆరోగ్యదాయకంగా పెరగడంతోపాటు.. వాన నీరు కూడా సమర్థవంతంగా భూమిలోకి ఇంకుతున్నదని, తద్వారా లోపలి మట్టిపొరల్లోనూ నీటి తేమ నిల్వ ఉంటున్నదని చైతన్య రెడ్డి తెలిపారు. ఒక్క వానతోనే బోర్చు రీచార్జ్ ఈ ఖరీఫ్ సీజన్లో చాలా రోజుల వరకు తమ తోట వద్ద సరైన వర్షం పడలేదని, 20 రోజుల క్రితం కురిసిన ఒక్క వానతోనే కందకాల ద్వారా బోర్లు రీచార్జ్ అయ్యాయని తెలిపారు. తమ తోటకు 3 వైపులా ఎత్తయిన ప్రదేశాలుండటం వల్ల వర్షపు నీరు భారీగా తమ తోటలోకి వస్తుందని, కందకాలు విస్తృతంగా తవ్వడం వల్ల ఆ నీరు బయటకు పోకుండా ఎక్కడికక్కడే ఇంకుతున్నదన్నారు. మీటరు లోతు, మీటరు వెడల్పున వాలుకు అడ్డంగా కందకాలు తవ్వడం వల్ల ఎక్కడి నీరు అక్కడే భూమిలోకి ఇంకి, మట్టిలో తేమ బాగా ఉందన్నారు. ఫిబ్రవరి వరకు నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మనం పైన అందించే నీరు లోపలి పొరలకు చేరదని, భూమి లోపలికి ఇంకిన నీటి తేమే తోటలను బెట్ట నుంచి రక్షిస్తుందన్నారు. రైతులు ఎవరి భూముల్లో వారు కందకాలు తవ్వుకుంటే నీటి వనరుల పరిరక్షణతోపాటు మన పొలంలోని విలువైన పైపొర మట్టి వానకు కొట్టుకుపోకుండా నిలబడుతుందని, లోపలి మట్టి పొరల్లోనూ నీటి తేమ చాలా కాలంపాటు ఉంటుందన్నారు. వర్షాకాలంలో కురిసిన వర్షపు నీటి తేమ ఫిబ్రవరి వరకు చెట్లను నిలబెడుతుందన్నారు. ఆ తర్వాత నీటిని అందిస్తే సరిపోతుందని చైతన్య రెడ్డి(95500 23456) వివరించారు. -
జూన్‌లో వర్షాలకు బోర్లు పూర్తిగా రీచార్జ్!
కందకాలు తవ్వించడం వల్ల ఈ ఏడాది జూన్‌లో కురిసిన 4, 5 వర్షాలకు భూగర్భ నీటి మట్టం బాగా పెరిగిందని, మూడు బోర్లూ పుష్కలంగా జలకళను సంతరించుకున్నాయని చింతా నరసింహరాజు చెప్పారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం అర్మాయిపేట గ్రామ పరిధిలో ఆయనకున్న 27 ఎకరాల నల్లరేగడి భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 2017 నవంబర్‌లో తీవ్ర సాగునీటి కొరత ఏర్పడింది. మూడు బోర్లుంటే.. ఒక బోరే ఒక మోస్తరుగా పోసేది. మిగతా రెండు దాదాపు ఎండిపోయాయి. నాలుగు రోజులకోసారి పది నిమిషాలు నీరొచ్చే దుస్థితిలో ఉండేవి. అటువంటి సంక్షోభ పరిస్థితుల్లో ‘సాక్షి’, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఆధ్వర్యంలో కందకాల ద్వారా ‘చేనుకిందే చెరువు’ సాధించుకోవచ్చంటూ నిర్వహిస్తున్న ప్రచారోద్యమం గురించి మిత్రుడు క్రాంతి ద్వారా రాజు తెలుసుకున్నారు. పొలం అంతటా 50 మీటర్లకు వాలుకు అడ్డంగా ఒక వరుసలో.. మీటరు లోతు, మీటరు వెడల్పున కందకాలు తీసుకుంటే.. ఎంతటి కరువు ప్రాంత మెట్ట పొలాల్లో అయినా సాగు నీటి కొరత ఉండదని తెలుసుకున్నారు. కందకాలు తవ్వడానికి ఖర్చు అవుతుంది కదా అని తొలుత సందేహించినా.. నీరు లేకపోతే భూములుండీ ఉపయోగం లేదన్న గ్రహింపుతో కందకాలు తవ్వించారు. తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ (ఇరిగేషన్) సంగెం చంద్రమౌళి (98495 66009), సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దామోదర్‌రెడ్డి (94407 02029)లను తమ పొలానికి ఆహ్వానించి, వారి ఉచిత సాంకేతిక సహకారంతో కందకాలు తవ్వించామని రాజు తెలిపారు. నల్లరేగడి నేల కావడంతో కందకాలలో అంత త్వరగా నీరు ఇంకదు. కందకాలు నిండగా పొంగిపొర్లి వెళ్లిపోయే నీటిని కూడా ఒడిసిపట్టుకోవడానికి మట్టికట్టతో కూడిన ఫాం పాండ్‌ను కూడా తవ్వించారు. కందకాలు, ఫాం పాండ్ తవ్వడానికి రూ. 2 లక్షల వరకు ఖర్చయిందన్నారు. గత ఏడాది నవంబర్ తర్వాత కురిసిన వర్షాలతోపాటు ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలకు 4, 5 సార్లు కందకాలు పూర్తిగా నిండాయి. జూలైలో వర్షం పడలేదు. ఆగస్టులో వర్షాలకు రెండు, మూడు సార్లు కందకాలు నిండాయి. దీంతో భూగర్భ నీటి మట్టం బాగా పెరిగి, మూడు బోర్లూ పుష్కలంగా నీటిని అందిస్తున్నాయి. ఫాం పాండ్ దగ్గరలో ఉన్న బోరు పూర్తి సామర్థ్యంతో నీటిని అందిస్తున్నదని రాజు ‘సాగుబడి’కి వివరించారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో కందులు (అంతరపంటలుగా మినుము, పెసలు, కొర్రలు), 5 ఎకరాల్లో తెలంగాణ సన్నాలు వరి పంట వేసినట్లు తెలిపారు. కొంత ఖర్చు అయినప్పటికీ, కందకాల ప్రభావం అద్భుతంగా ఉందని నరసింహరాజు (90084 12947) ఆనందంగా తెలిపారు. నీటి భద్రత రావటంతో పంటలకు ఇబ్బంది లేకుండా ఉందన్నారు. నీటికి ఇబ్బంది లేకుండా ఉండాలనుకునే రైతులు కందకాల ఆవశ్యకతను గుర్తించాలని సూచించారు. -
రెండేళ్లుగా కరువున్నా నీటికొరత లేదు!
తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి ప్రాంతం రెండున్నరేళ్ల క్రితం తీవ్ర కరువు కోరల్లో చిక్కుకున్నది. ఆ జిల్లా ఉదయంపులి గ్రామంలో సేంద్రియ రైతు కె.జయచంద్రన్కు చెందిన 200 ఎకరాల సర్టిఫైడ్ సేంద్రియ (బయోడైనమిక్) వ్యవసాయ క్షేత్రంలో అప్పట్లో తీవ్ర నీటికొరత ఏర్పడింది. ఆ దశలో గుంటూరుకు చెందిన తన మిత్రుడు, సేంద్రియ రైతు ప్రకాశ్‌రెడ్డి సలహా మేరకు.. జయచంద్రన్ తన ఉద్యాన తోటల మధ్యలో వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. అప్పుడు కందకాలు తవ్వటం వల్ల గత రెండు సంవత్సరాలుగా పెద్దగా వర్షాలు లేకపోయినా.. తోటల సాగుకు ఎటువంటి నీటి కొరతా లేకుండా సజావుగా దిగుబడులను అందుకోగలుగుతున్నానని జయచంద్రన్ ‘సాగుబడి’తో చెప్పారు. 200 వ్యవసాయ క్షేత్రంలో 5–6 ఎకరాలకు ఒక క్లస్టర్‌గా విభజించుకున్న జయచంద్రన్.. వేర్వేరు క్లస్టర్లలో ఉసిరి, మామిడి, కొబ్బరి, సపోట, బొప్పాయి, నిమ్మ, అరటి, మునగ తోటలను బయోడైనమిక్ సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీటితోపాటు 5 నుంచి 25 సంవత్సరాల్లో కోతకు వచ్చే అనేక జాతుల కలప చెట్లను వేలాదిగా పెంచుతున్నారు. వీటికి బిందు సేద్యం ద్వారా నీరందిస్తున్నారు. క్లస్టర్ల మధ్యలో మట్టి కట్టల వెంట 9 అడుగుల వెడల్పు, 6–7 అడుగుల లోతున కందకాలు తవ్వించారు. కందకాలలో ప్రతి వంద మీటర్లకు ఒక చోట చెక్ వాల్స్ నిర్మించారు. స్వల్ప ఖర్చుతో నిర్మించిన కందకాల ద్వారా వాన నీరంతా భూమిలోకి ఇంకడం వల్ల 27 బోర్లు, 6 పెద్ద వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. గత రెండేళ్లుగా నీటి కొరత సమస్యే లేదని జయచంద్రన్(96772 20020) తెలిపారు. సాక్షి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం సంయుక్తంగా ‘చేను కిందే చెరువు’ పేరిట ఐదేళ్ల క్రితం నుంచి నిర్వహిస్తున్న ప్రచారోద్యమ స్ఫూర్తితోనే తన మిత్రుడు జయచంద్రన్కు కందకాల గురించి సూచించానని ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. -
పడావు భూముల్లో పచ్చని పంటలు!
సాగునీటికి వసతి లేని ప్రాంతం.. నీరు లేక భూములు బంజరుగా మారడం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన పాల్వాయి సత్యనారాయణ రెడ్డిని కలవరపరచింది. ఎలాగైనా తమ భూములను పంటలకు ఆలవాలంగా మార్చాలని, పచ్చదనాన్ని నింపుకోవాలన్న తపనతో అన్వేషించగా.. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకునూ ఒడిసిపట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదని తోచింది. అయితే, అందుబాటులో ఉన్న అనేక పద్ధతుల్లో దేన్ని అనుసరించాలో అంతుపట్టలేదు. తన కుటుంబానికి చెందిన 50 ఎకరాలకు నీటి భద్రత సాధించుకోవడానికి తక్కువ ఖర్చులో చక్కని ఫలితాన్నిచ్చే నీటి సంరక్షణ పద్ధతి ఏమిటో తేల్చుకోవడం కష్టంగా తోచింది. ఆ దశలో ‘సాక్షి’తో కలసి తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి(99638 19074 ), సంగెం చంద్రమౌళి(98495 66009) ఆధ్వర్యంలో సాగుతున్న ‘చేను కిందే చెరువు’ ప్రచారోద్యమం గురించి తెలిసింది. వారి తోడ్పాటుతో 2016 జూన్‌లో ఎకరానికి కేవలం రూ. రెండు వేల ఖర్చుతో వాలుకు అడ్డంగా ప్రతి 50 మీటర్లకు ఒక చోట 3 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతున సత్యనారాయణ రెడ్డి తమ కుటుంబానికి చెందిన 50 ఎకరాల్లో కందకాలు తీయించారు. కందకాలు తవ్వి మట్టి కట్టలు పోయించారు. వాలును బట్టి 3–4, 5–6 ఎకరాల భూమిని ఒక యూనిట్‌గా విభజించి వాలుకు అడ్డంగా 3 అడుగుల, 3 అడుగుల వెడల్పున.. ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. కందకాలు తవ్వించి, మట్టికట్టలు పోయించారు. కందకాలు తవ్వించిన తర్వాత రెండేళ్లలో సాధారణ వర్షాలతోపాటు అకాల వర్షాలకు భారీగా వర్షపాతం నమోదైంది. ఆకాశం నుండి పడే ప్రతి చినుకు కందకాలలోకి చేరి ఇంకిపోవడంతో భూగర్భ నీటి మట్టం పెరిగింది. ప్రస్తుతం ఈ భూముల్లోని పత్తి పంట, ఇతర తోటలు ఆకుపచ్చగా కళకళలాడుతున్నాయి. వర్షాకాలంలో రెండు, మూడు వారాలు వర్షం పడకపోయినా పంటలకు ఢోకా లేదన్న భరోసాతో సత్యనారాయణ రెడ్డి ముందుకు సాగుతుండడం తోటి రైతులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. వర్షాలకు పడిన నీరు ఎక్కడికక్కడ ఆ కందకాల ద్వారా ఇంకి భూమి పొరల్లో నిల్వ ఉంటుంది. ఆ విధంగా భూమి పొరల్లోకి చేరిన నీరే.. వర్షాలు మొహం చాటేసిన సమయంలో పత్తి పంటకు, యూకలిప్టస్, టేకు తదితర తోటల్లో భూమికి నిమ్మునిస్తుంది. ఇటీవల వర్షాలు లేకపోయినా ఈ భూముల్లో వేసిన పత్తి ఏపుగా పెరిగింది. ఇదే భూమికి దగ్గర్లోని రైతు భూమిలో పత్తి పంట కళతప్పింది. కందకాలు తవ్వుకొని పత్తి సాగు చేస్తున్నందున ఎకరాకు 20 క్వింటాళ్ళకు పైగానే పత్తి దిగుబడి వస్తున్నదని సత్యనారాయణ రెడ్డి చెప్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో పత్తి దిగుబడి బాగుందన్నారు.తనకున్న 50 ఎకరాలలో ఏడెకరాల్లో టేకు మొక్కలు , ఇతరత్రా మొక్కలు పెంచుతున్నారు. అడవులను పెంచే భూమి చుట్టూ కందకాలు తీయడం మూలంగా మొక్కలు పచ్చగా, ఏపుగా పెరుగుతూ ఆహ్లాదాన్నిస్తున్నాయి. సాగులోకి తేవాలనే.. మూడున్నర ఏళ్ళ క్రితం మా భూములన్నీ పడావు పడి ఉండేవి. అసలు ఎందుకు సాగులోకి తేలేకపోతున్నామన్న బాధ ఉండేది. అప్పట్లోనే విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి శ్యాం ప్రసాద్ రెడ్డి పరిచయమయ్యారు. మెట్ట భూముల్లో కూడా కందకాలతో నీటి భద్రత పొందవచ్చని, కందకాలు తవ్వించమని సలహా ఇచ్చారు. వారు చెప్పినట్లు కందకాలు, ఇంకుడు గుంతలు తవ్వించా. అంతకుముందు వర్షం పడినా భూమిలోకి అంతగా ఇంకకుండా వరద వెళ్లిపోయేది. ఇప్పుడు ఎక్కడిదక్కడే ఇంకుతోంది. దీని వల్ల బోర్లలో, బావుల్లో నీటి మట్టం పెరుగుతోంది. ఆనాడు పడావుగా ఉన్న భూములు నేడు పచ్చగా కనిపిస్తుంటే ఆనందంగా ఉంది. దిగుబడి పెరగడంతో మా భూములకు కౌలుదారుల నుంచి డిమాండ్ కూడా పెరిగింది. ప్రతి రైతు తమ భూమిలో కందకాలు తీయించుకోవాలి. – పాల్వాయి సత్యనారాయణ రెడ్డి(98666 13645), బంగారి గడ్డ, చండూర్ మండలం, నల్లగొండ జిల్లా – మునుకుంట్ల గాలయ్య, సాక్షి, చండూర్, నల్లగొండ జిల్లా -
ఎండిన బోరు, బావిలో పుష్కలంగా నీరు!
వాన నీటిని కందకాల ద్వారా నేలతల్లికి తాపితే.. ఎండిన బోర్లు, బావులు వెంటనే జలకళను సంతరించుకుంటాయనడానికి యువ సేంద్రియ రైతు మార్తి శ్యాంప్రసాద్‌రెడ్డికి కలిగిన తాజా అనుభవమే ప్రబల నిదర్శనంగా చెప్పొచ్చు. ఎనిమిదిన్నరేళ్లు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేసి.. వ్యవసాయంపై మక్కువతో తిరిగి వచ్చేసిన శ్యాంప్రసాద్‌రెడ్డి ఏడాది క్రితం నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం గజ్జెనవారిగూడెంలో 20 ఎకరాల ఎర్రగరప నేలను కొనుగోలు చేశారు. గతేడాది 4 ఎకరాల్లో శ్రీవరి, 16 ఎకరాల్లో చిరుధాన్యాలు, దేశీ పుచ్చ (విత్తనం కోసం) సాగు చేశారు. పొలంలో రెండు బోర్లు, బావి ఉన్నాయి. అయితే, ఈ ఎండాకాలంలో ఒక బోరుతోపాటు బావి కూడా ఎండిపోయింది. గత ఏడాది అధిక వర్షపాతం నమోదైనా.. ఈ వేసవిలో బోరు, బావి ఎండిపోయాయి. ఈ దశలో తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి (99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి (98495 66009)లను సంప్రదించి.. వారి సూచనల మేరకు గత నెలలో కందకాలు తవ్వించారు. తూర్పు నుంచి పడమరకు ఏటవాలుగా ఉన్న ఈ భూమిలోకి పై నుంచి కూడా వాన నీటి వరద వస్తూ ఉంటుంది. వాన నీటిని పూర్తిగా భూమిలోకి ఇంకింపజేసుకోవాలన్న లక్ష్యంతో పొలంలో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో కందకాలు తవ్వించారు. నెల తిరగక ముందే 4 పెద్ద వర్షాలు పడ్డాయి. వారమంతా వర్షం కురిసింది. కురిసిన 2–3 గంటల్లోనే కందకాల ద్వారా భూమి లోపలికి ఇంకిందని శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. వర్షాలు కురిసిన వెంటనే బోరు, బావి తిరిగి జలకళను సంతరించుకున్నాయని ఆయన సంతోషంగా చెప్పారు. బోరు రెండించుల నీరు పోస్తున్నదని, 7హెచ్.పి. మోటారుకు రోజుకు ఐదారు గంటలు బావి నీరు అందుతున్నాయన్నారు. ప్రస్తుతం 4 ఎకరాల్లో డ్రమ్ సీడర్‌తో వరి విత్తటానికి దమ్ము చేస్తున్నామని, మిగతా 16 ఎకరాల్లో సిరిధాన్యాలు సాగు చేస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో వర్షం కురిస్తే పైనుంచి కూడా వచ్చే వరద వల్ల పడమర భాగంలో భూమి కోసుకుపోయేదని, మట్టి కట్ట వేసినా ప్రయోజనం లేకుండా పోయిన పరిస్థితుల్లో కందకాలు తవ్వటం వల్ల చుక్క నీరు, పిడికెడు మట్టి కూడా బయటకు కొట్టుకుపోలేదన్నారు. ఇంకో 2–3 వానలు పడితే ఈ ఏడాది సాగునీటికి ఇబ్బంది ఉండబోదన్నారు. వర్షాలకు ముందు కందకాలు తవ్వటం వల్ల కొద్ది రోజుల్లోనే బోరు, బావి జలకళను సంతరించుకోవడం సంతోషకరమని యువ రైతు శ్యాంప్రసాద్‌రెడ్డి (84640 76429) తెలిపారు. మార్తి శ్యాంప్రసాద్ రెడ్డి -
తక్కువ ఖర్చు.. వెంటనే నీటి భద్రత!
మెట్ట భూముల్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు మీటరు వెడల్పున.. కందకాలు తవ్వుకోవడం వల్ల.. అతి తక్కువ ఖర్చు (ఎకరానికి రూ. 2–3 వేల)తో తవ్విన కొద్ది నెలల్లోనే సాగు నీటి భద్రత సాధించవచ్చని నల్లగొండ మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ప్రిన్సిపల్ పాలవరపు భగవంతరెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు చిన్న రైతుల మెట్ట భూముల్లో కందకాలు తవ్విస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు. నల్లగొండకు 5 కి.మీ. దూరంలోని తమ 13 ఎకరాల ఎర్ర భూమిలో తవ్విన రెండు బోర్లకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను 2016 జూన్‌లో భగవంతరెడ్డి సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. 13 ఎకరాలకు కలిపి రూ. 30 వేలకన్నా తక్కువే ఖర్చయింది. 2016 వర్షాకాలంలో కందకాలు 4,5 సార్లు నిండాయి. కందకాలు తవ్విన 3,4 నెలల్లోనే భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని భగవంతరెడ్డి తెలిపారు. 2017 వర్షాకాలంలో కూడా కందకాలు 2,3 సార్లు నిండాయి. దీంతో ఎండాకాలం కూడా నీరు పుష్కలంగా ఉండటంతో నిశ్చింతగా కూరగాయ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పక్కన పొలంలో వరి సాగు చేస్తున్న రైతుల బోర్లలో నీరు రాక పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రెండు నెలల పాటు తమ బోర్ల నుంచే నీటిని ఉచితంగా ఇచ్చామని, ఆ రైతుకు మంచి దిగుబడి రావడం తమకూ సంతోషాన్నిచ్చిందని వివరించారు. ఈ ఏడాది తమ ఇరుగు పొరుగు రైతుల బోర్లలో కూడా నీటి లభ్యత పెరిగిందని ఆయన సంతోషంగా చెప్పారు. ఇది తమ పొలంలో తవ్విన కందకాల వల్ల భూగర్భంలోకి ఇంకిన వర్షపు నీటి వల్లనే సాధ్యపడిందన్నది నూటికి నూరు శాతం వాస్తవమన్నారు. అయితే, రైతులకు కందకాలతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన లోపించిందని, చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించడం చాలా అవసరమని భగవంతరెడ్డి(94404 05082) సూచిస్తున్నారు. భగవంతరెడ్డి -
పొలాల్లో కందకాలే రైతుకు రక్ష
సందర్భం దేశంలో ఎక్కడ విన్నా రైతన్నల ఆత్మహత్యలే. ఏ పొద్దు పేపర్ చూసినా అన్నదాతల బలవన్మర ణాలే. వర్షాభావ పరిస్థి తులే రైతుల ఆత్మహత్య లకు ముఖ్యకారణం. వర్ష పాతం కరువైన నేపథ్యం లోనే రైతులు లోతుగా బోర్లను వేయడానికి విపరీతంగా ధనం వెచ్చించి అప్పుల బారినపడుతున్నారు. వర్షాలు పడక, బోర్లలో, బావుల్లో నీరు అందక, పంట ఎండిపోయే దశలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆత్మహ త్యలే శరణ్యం అనుకుని నిండుప్రాణాలను బలిపె ట్టుకుని ఆలుబిడ్డల బతుకులను అగాధంలోకి నెట్టే స్తున్నారు. ఈ పరిస్థితుల్లో చనిపోయిన రైతు కుటుం బాలకు పరిహారం చెల్లించి బాధ్యత నెరవేర్చుకు న్నట్లు ప్రభుత్వాలు భావించడం సరికాదు. ఎన్ని ప్రాజెక్టులు చేపట్టినా యింకా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయన్న సంగ తిని ప్రభుత్వాలు మర్చిపోరాదు. ప్రాజెక్టుల వల్ల కొద్ది ప్రాంతాల రైతులకే మేలు కలిగి మిగతా ప్రాం త రైతులు దారుణంగా నష్టపోతున్నారు. కనుక అన్ని ప్రాంతాల రైతులకూ ఉపశమనం కలిగించే పథకాలను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉంది. రైతు పొలంలోనే వాననీటి సంరక్షణ చేపట్టి భూగర్భజలాలను అభివృద్ధి చేసుకోవడమే ఉత్తమ మార్గమని వాన నీటి సంరక్షణ పథకాలు, వాటి ఫలి తాలబట్టి తెలుస్తోంది. అంటే పొలం కిందనే చెరు వును (భూగర్భంలో) ఏర్పర్చుకుని, అవసరమైన నీటిని మాత్రమే బావులు లేదా బోర్ల ద్వారా వాడు కుని పంటలు పండించుకోవచ్చు. వాన నీటి సంరక్షణ పనులను ప్రభుత్వం కూడా చేపట్టి చెక్ డ్యాములను కడుతోంది. చెరువు లను పునరుద్ధరిస్తోంది. కానీ వాటివల్ల వాటి పరిధి లోని లేదా సమీపంలోని కొంతమంది రైతులకే ప్రయోజనం కలుగుతోంది. కాబట్టి రైతులందరికీ ప్రయోజనం కలగాలంటే, ప్రధానంగా రెండు చర్యలు చేపట్టాలి. 1. రైతులందరి పొలాల్లో, చేలలో వాన నీటి సంరక్షణ చర్యలను చేపట్టవలసి ఉంది. వాన నీటి సంరక్షణ చర్యలన్నింటిలో అత్యంత చవ కైనది, అత్యంత ఫలప్రదమైనది. సమతల కందకాల తవ్వకమే. కందకాలు తవ్వడానికి ఎకరాకు రూ.3 వేలు చాలు. దీనివల్ల రైతు పొలంలో పడిన వర్షపు నీరు పూర్తిగా పొలంలోనే ఇంకిపోయి చేనుకిందే చెరువు ఏర్పడి బోర్లు, బావులు పుష్కలంగా సాగు నీటిని అందించి, పంటలు మెండుగా పండి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండదు. 2. వాన నీటిని సంరక్షించడమే కాకుండా భూగర్భంలో లభ్య మయ్యే నీటికి అనువైన పంటలను పండించుకుంటే ఆత్మహత్యలు చేసుకునే విపత్కర పరిస్థితులు రైతు లకు దాపురించవు. అంటే నీటి బడ్జెట్‌ను తయారు చేసుకుని పంటలు పండించుకొవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సేద్యయో గ్యమైన ప్రతి ఎకరా చేనుకు వాననీటి సంరక్షణ కలిగించాలంటే ఒక్కో రాష్ట్రానికి, కేవలం 3 నుంచి 4 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. ఈ ఖర్చు ప్రభుత్వాలకు పెద్ద లెక్క కాదు. ఒక్క ఏడాదిలోనే ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఏడాది కురిసే వాన నీటిని మొత్తం ఒడిసిపట్టి ఒకే ఏడు రెండు ఆరుతడి పంటలు పండింపచేసి, రాష్ట్రాలను సస్యశ్యామలం చేయవచ్చు. ప్రభుత్వాలు ఇకనైనా వాన నీటి సంరక్షణ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్య తనివ్వాలి. అతివృష్టి కాలంలో వరదలను ఆపి పంట లను రక్షించేది, అనావృష్టి కాలంలో సరిపడా సాగు నీటిని అందించగలిగింది ఒక్క వాన నీటి సంరక్షణ పథకమే. అందుచేత ప్రభుత్వాలు, పాలకులు మీన మేషాలు లెక్కించకుండా తక్షణమే ప్రతి రైతు చేలో కందకాలు తవ్వించి ఎండిన బోర్లకు, బావులకు సరి పోను నీరు అందేటట్టు చేసి, ప్రతి రైతూ పంటలు నిశ్చింతగా పండించుకునేటట్లు చేయాలి. లక్షల కోట్లు ఖర్చు పెట్టి కట్టే ప్రాజెక్టులు చాలా కాలానికి గాని పూర్తి కావటం లేదు. ఈ వాన నీటి సంరక్షణ వల్ల ఇంచుమించు ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనం చేకూరుతుంది. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు పొలంలో వాననీటి సంరక్షణ కోసం యుద్ధ ప్రాతిపదికన సమతల కందకాలు తవ్వే కార్యక్రమా లను చేపట్టి భవిష్యత్తులో రైతుల ఆత్మహత్యలను అరికట్టాలి. రైతే దేశానికి వెన్నెముక. రైతు శ్రేయస్సే దేశ శ్రేయస్సు, రైతు సౌభాగ్యమే దేశ సౌభాగ్యం. - సంగెం చంద్రమౌళి వ్యాసకర్త అధ్యక్షులు తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల వే దిక. మొబైల్ 9849566009